Eclipse effect | దర్శనాలకు ఈ రోజు సెలవు.. శ్రీవారికి సుదీర్ఘ విరామం..
x
తిరుమల ఆలయం మూసివేసిన టీటీడీ అధికారులు (ఫైల్)

Eclipse effect | దర్శనాలకు ఈ రోజు సెలవు.. శ్రీవారికి సుదీర్ఘ విరామం..

శ్రీకాళహస్తి మినహా అన్ని ఆలయాల మూత. టీటీడీ ఫొటోలు విడుదల చేయకపోవడం వెనుక ఆంతర్యం?


తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు టీటీడీ అనుబంధ ఆలయాలు ఉదయం తొమ్మిది గంటలకు మూసివేశారు. మధ్యాహ్నం 11 .౩౦ గంటల వరకు టీటీడీ నుంచి ఫొటోలు విడదుల చేయలేని పరిస్థితి. కారణం టీటీడీ పౌరసంబంధాల విభాగం అధికారులకే తెలియలేదు.

ఆలయాలకు నెలవుగా ఉన్న రాష్ట్రంలో చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మినహా,తిరుమల శ్రీవారితో పాటు దేవతా మూర్తులకు మంగళవారం సుదీర్ఘ విరామం లభించింది. ఒక విధంగా చెప్పాలంటే 11 గంటలపాటు దర్శనాలు ఉండవు.

రాత్రిళ్లు మాత్రమే చంద్రగ్రహణం కనిపిస్తుంది. ఈసారి గ్రహణ ప్రభావం దేశంలో పగటి పూల కావడం వల్ల ఉదయం తొమ్మిది గంటలకు తిరుమల శ్రీవారి ఆలయాన్ని మూసి వేశారు. తిరిగి రాత్రి 73.0 గంటలకు ఆలయ తలుపులు తెరుస్తారు. ఆలయ శుద్ధి అనంతరం రాత్రి 8.30 గంటల నుంచి యాత్రికులను శ్రీవెంకటేశ్వరస్వామి దర్శనానికి అనుమతిస్తామని టీటీడీ అధికారులు చెప్పారు. తిరుమలలో అన్నప్రసాద కేంద్రాలను కూడా టీటీడీ మూసి వేసింది.

ఫైల్ ఫొటో

"గ్రహణ ప్రభావానికి ముందే యాత్రికులకు ప్రత్యేకంగా ఆహార పొట్లాలు అందిచాం" అని టీటీడీ అదనపు ఈఓ సీహెచ్. వెంకయ్య చౌదరి చెప్పారు.

తిరుమలకు వెళ్లేందుకు ముఖద్వారంగా ఉన్న అలిపిరి తనిఖీ కేంద్రం బోసిపోయి కనిపించింది. నిత్యం వందలాది వాహనాలు తిరుమలకు వెళ్లడానికి భారీగా బారులుదీరుతుంటాయి. చంద్రగ్రహణం నేపథ్యంలో రాత్రి వరకు సర్వదర్శనాలు లేకపోవడం ఒక కారణం, వీఐపీ సిఫారసు లేఖలు తీసుకోని నేపథ్యంలో ప్రముఖుల తాకిడి కూడా కనిపించలేదు

గ్రహణ ప్రభావం ఎప్పుడంటే..

చంద్రగ్రహణానికి ఆరు గంటల ముందే తిరుమల శ్రీవారి ఆలయాన్ని మూసివేయడం ఆనవాయితీ.
"గ్రహణ ప్రభావం మంగళవారం మధ్యాహ్న 3.20 గంటలకు ప్రారంభం అవుతుంది. సాయంత్రం 6.47 గంటలకు బలహీనపడి గ్రహణం ముగుస్తుంది" అని టీటీడీ అధికారులు వెల్లడించారు.
తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు సోమవారం రాత్రి వరకు క్యూలో ఉన్న యాత్రికులను ఖాళీ చేయించడం తోపాటు ఆలయంలో కొన్ని కార్యక్రమాలు నిర్వహించడానికి వీలుగా ఆరుగంటల ముందు ఆలయం మూసి వేస్తారని ప్రధాన అర్చకులు చెప్పారు.

అనుబంధ ఆలయాల్లో

టీటీడీ అనుబంధ ఆలయాల ప్రధాన ద్వారాలు కూడా మూసి వేశారు. తిరుపతిలోని శ్రీగోవిందరాజస్వామి తిరుచానూరు పద్మావతీ అమ్మవారు, కల్యాణ వేంకటేశ్వరస్వామి, అప్పలాయగుంట వెంకటరమణ స్వామితో పాటు అనుబంధ ఆలయాలు మూసివేసినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.
"సాయంత్రం చంద్రగ్రహణం వీడిన తరువాత ఆలయాల్లో సంప్రోక్షణ తరువాత తిరిగి దర్శనాలు ప్రారంభం అవుతాయి" అని టీటీడీ అదనపు ఈఓ వెంకయ్య చౌదరి వివరించారు.

శ్రీకాళహస్తిలో కొనసాగుతున్న దర్శనాలు

చిత్తూరు జిల్లా శ్రీకాహస్తీశ్వరస్వామి ఆలయంలో మాత్రం స్వామి, అమ్మవార్ల దర్శనాలు యథావిధిగా సాగుతున్నాయి. ముక్కంటి క్షేత్రం రాహు, కేతువులకు నిలయం. దీంతో చంద్రగ్రహణ ప్రభావం ఉండదని ఆలయ అర్చకులు, ఈఓ బాపిరెడ్డి చెప్పారు. కాలదోషపూజలు నిర్వహించడం ద్వారా గ్రహణ సమయంలో కూడా ప్రత్యేక పూజలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేసినట్లు ఆయన చెప్పారు. దీంతో శ్రీకాళహస్తిలో మాత్రం యథావిధిగా యాత్రికులకు దర్శనాలు కల్పించడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు.

ఫొటోలు విడుదలతో జాప్యం..

తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు అనుబంధ ఆలయాలు కూడా మంగళవారం చంద్రగ్రహణం కావడం వల్ల మూసివేశారు. సాధారణంగా ఈ దృశ్యాలు చాలా అరుదైనవి. టీటీడీ అధికారులతో పాటు, ఆలయ అర్చకులు, అనువంశిక సన్నిధిగొల్లలు ఈ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు.
తిరుమలలోని శ్రీవారి ఆలయం వద్ద బంగారు వాకిలి, వెండి వాకిలి తోపాటు మహద్వారం వద్ద భారీ తలుపులు మూసివేయడం ద్వారా సీల్ వేస్తారు. ఆ తాళాల పెట్టే సన్నిధి గొల్ల, పెరజీయర్ మఠం ప్రతినిధులు వెలుపలికి వచ్చే దృశ్యాలు అరుదైనవి. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలు టీటీడీ సమాచార విభాగం నుంచి మధ్యాహ్నం 11. 3౦ గంటల వరకు విడుదల చేయడం వెనుక కారణం, సమస్య ఏమిటనేది తెలియలేదు. ఈ విషయం టీటీడీ చీఫ్ పీఆర్ఓ డాక్టర్ తలారి రవి దృష్టికి తీసుకుని వెళితేే. " విషయం ఏమిటో తెలుసుకుంటా" అని సమాధానం లభించింది.
Read More
Next Story