
కర్నూలు వద్ద తప్పిన మరో ప్రమాదం..
అదుపుతప్పిన బస్సు.. 29 మంది ప్రయాణికులు సురక్షిత్రం. జాతీయ రహదారులపై ఆగని ప్రమాద ఘంటికలు.
జాతీయ రహదారులపై ప్రమాద ఘంటికలు మోగుతూనే ఉన్నాయి. కర్నూలు నగర శివారులో మంగళవారం వేకువ జామున భారీ ప్రమాదం తప్పింది. 29 మంది ప్రయాణికులు ప్రాణాలతో బయటపడ్డారు. పుదుచ్చేరి నుంచి హైదరాబాద్ బయలుదేరిన కావేరి ట్రావెల్స్ ప్రైవేటు బస్సు అదుపుతప్పి డివైడర్ నుంచి దూసుకుని వెళ్ళింది. అదృష్టవశాత్తు ఆ సమయంలో ఎదురుగా వాహనాలు రాకపోవడంతో భారీ ప్రాణ నష్టం తప్పింది.
కర్నూలు సమీపంలోని జాతీయ రహదారులపై రెండేళ్లలో రెండు జాతీయ దారులపై జరిగన ప్రమాదాల్లో దాదాపు 1,100 మంది ప్రాణాలు కోల్పోయినట్లు రికార్డులు స్పష్టం చేస్తున్నాయి.
కర్నూలు వద్ద జాతీయ రహదారులు 40, 44 పై ప్రైవేటు బస్సుల వేగం వల్ల ప్రమాదాల జరుగుతున్నాయని విషయం అనేక సందర్భాల్లో బయటపడింది.
సంఘటన వివరాల్లోకి వెళితే..
పుదుచ్చేరి నుంచి హైదరాబాదుకు కావేరీ ట్రావెల్స్ బస్సు ప్రతిరోజు ప్రయాణిస్తుంది. సోమవారం సాయంత్రం 29 మంది ప్రయాణికులతో కావేరి ట్రావెల్స్ ప్రైవేట్ బస్సు హైదరాబాదుకు బయలుదేరింది. ఈ బస్సు చెన్నైకి వచ్చి అక్కడి నుంచి చిత్తూరు నగరంలోకి ప్రవేశిస్తుంది. ఆ తర్వాత పూతలపట్టు జాతీయ రహదారిపై నుంచి తిరుపతికి జాతీయ రహదారి 40 మీదుగా కర్నూలు నుంచి హైదరాబాదుకు వెళ్లడానికి మార్గాన్ని నిర్దేశించుకున్నారు. అంటే సుమారు 1600 కిలోమీటర్లు ఈ బస్సు ప్రయాణిస్తుంది.
కర్నూలు సమీపంలోని టిడ్కో గృహ నిర్మాణ సమయం లో ప్రయాణిస్తున్న కావేరి ట్రావెల్స్ బస్సు మంగళవారం వేకువజామున అదుపుతప్పింది. ఆ వేగానికి డివైడర్ ను ఢీకొట్టిన కావేరీ ట్రావెల్స్ బస్సు ఎదురుగా ఉన్న రోడ్డుపైకి దూసుకుపోయింది. ఆ సమయంలో ఎదురుగా ఎలాంటి వాహనాలు రాకపోవడం వల్లనే భారీ ప్రాణ నష్టం తప్పినట్లు పోలీసు వర్గాలు చెబుతున్నాయి.
ఈ ఘటనతో నిద్రమత్తులో ఉన్న ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ప్రమాదంలో ఎలాంటి నష్టం లేకపోవడంతో ప్రయాణికులను మరో బస్సులో వారి గమ్యస్థానాలకు పంపడానికి డ్రైవర్ ఏర్పాట్లు చేశారు. సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు.
ఇది రెండవ సంఘటన..
పుదుచ్చేరి నుంచి హైదరాబాదుకు బయలుదేరిన బస్సు గత సంవత్సరం కూడా చాగలమర్రి సమీపంలో కూడా ప్రమాదానికి గురైంది. హైదరాబాద్ కు చెందిన ప్రయాణికులు గాయపడ్డారు. అంతకుముందు.
2025 అక్టోబర్ 24వ తేదీ కర్నూలు సమీపంలోని చిన్నటేకూరు వద్ద జరిగిన వీ కాలేశ్వరి ట్రావెల్స్ బస్సు దగ్ధం పట్టణ సంచలనం రేకెత్తించింది. ఈ ఘటనలో 19 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు.
ఆ సమయంలో బస్సు గంటకు వంద కిలోమీటర్లకు పైగానే వేగంతో ప్రయాణిస్తున్నదని గుర్తించారు. ఈ ఘటన తర్వాత కర్నూలు వద్ద విడిపోయే జాతీయ రహదారి 44, 40 పై పోలీస్ రవాణా శాఖ అధికారులు తాత్కాలికంగా నిఘా ఉంచారు. డ్రైవర్లకు వేకువ జామున ముఖాలు కడిగించి, వారు మద్యం సేవించి ఉన్నారా లేదా పరీక్షించడం, నిద్రమత్తు నుంచి చేరుకునే విధంగా వాళ్లతో మాటలు కలిపి ఆ తర్వాత వాహనాలను అనుమతించారు. ఈ కార్యక్రమం మొక్కుబడిగానే సాగుతున్నట్లు కనిపిస్తోంది.
కీలకమైన రహదారి
కర్నూలు నుంచి బెంగళూరు వెళ్లే 44 నంబర్ జాతీయ రహదారి కీలకమైంది. తిరుపతి నుంచి నంద్యాల మీదుగా కర్నూలు వరకు ఉన్న 40 నెంబర్ జాతీయ రహదారి కూడా ప్రధానమైంది. ఈ మార్గాల్లో హైవే పెట్రోలింగ్ పెంచాల్సిన అవసరాన్ని ప్రయాణికులు గుర్తు చేస్తున్నారు. ఆర్టీసీ బస్సులను మినహాయిస్తే ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు మితిమీరిన వేగంతోనే ప్రయాణించడం వల్ల ప్రమాదాలకు ఆస్కారం కలుగుతోందని చిన్నటేకూరు వద్ద జరిగిన బస్సు దగ్ధం ఘటన నేపథ్యంలో రవాణా శాఖ అధికారులు స్పష్టం చేశారు.
ఈ రెండు జాతీయ రహదారులపై జరిగిన ప్రమాదాల్లో వందల ప్రాణాలు గాలిలో కలిశాయి.
2005లో కర్నూలు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 300 మంది చనిపోతే, 2025లో 250కు మంది ప్రాణాలు విడిచారు.
నంద్యాల జిల్లా అంటే జాతీయ రహదారి 40 పై జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 2024 లో 300 మంది, 2025లో 279 మంది ప్రాణాలు కోల్పోయినట్లు రికార్డులు స్పష్టం చేస్తున్నాయి.
మితిమీరిన వేగం..
వందల కిలోమీటర్ల ప్రయాణం గంటల వ్యవధిలో చేరుకోవడానికి ప్రైవేటు బస్సులు మితిమీరిన వేగంతో ప్రయాణిస్తుంటాయి. ఉదాహరణకి తిరుపతి నుంచి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు రాత్రి చివరి బస్సు 9:30 నుంచి 10 గంటల మధ్య బయలుదేరితే హైదరాబాదుకు వేకువజామున 5 నుంచి 6 గంటల మధ్య చేరుకుంటుంది. ఈ స్థితిలో ప్రైవేటు బస్సుల వేగానికి కళ్లెం వెయ్యకుంటే మరిన్ని ప్రమాదాలకు ఆస్కారం ఉంటుందని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
Next Story

