ఆంధ్రా భద్రాద్రి:ఏప్రిల్ 1న సీతారాముల కల్యాణోత్సవం
x
ఒంటిమిట్ట కోదండరామాలయం (ఫైల్)

ఆంధ్రా భద్రాద్రి:ఏప్రిల్ 1న సీతారాముల కల్యాణోత్సవం

ఒంటిమిట్ట కోదండరాముడి బ్రహ్మోత్సవాలు మార్చి 27న ప్రారంభం


మార్చి 26న అంకురార్పణ

27న ధ్వజారోహణం

ఏర్పాట్లు చేస్తున్న టీటీడీ

జేఈవో వి. వీరబ్రహ్మం సమీక్ష

ఆంధ్ర వాల్మీకి వావిలికొలను రచనలకు ప్రాధాన్యం

కడప జిల్లా ఒంటిమిట్ట శ్రీకోదండ‌రామ‌స్వామివారి ఆలయంలో సీతారాములవారి కల్యాణోత్సవం ఏప్రిల్ ఒకటో తేదీ నిర్వహించడానికి టీటీడీ (Tirumala Tirupati Devasthanams TTD) సన్నాహాలు ప్రారంభించింది. ఆంధ్రా భద్రాద్రి ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయంలో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలకు మార్చి 26వ తేదీ అంకురార్పణ జరుగుతుంది. 27వ తేదీ ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి.

ఒంటిమిట్ట కోదండరామాలయం పునఃనిర్మాణానికి కృషి చేసిన‌ ఆంధ్ర వాల్మీకి వావిలికొలను సుబ్బారావు రచించిన కీర్తనలకు టీటీడీ ప్రాధాన్యత ఇచ్చింది. ఆ పుస్తకాలను ముద్రించడం, వాటిని బ్రహ్మత్సవాల వేళ భ‌క్తుల‌కు పంపిణీ చేయాలని టీటీడీ నిర్ణయించింది. టీటీడీ ప్రజా సంబంధాల విభాగం సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం చేయాలి అని జేఈఓ వీరబ్రహ్మం అధికారులను ఆదేశించారు.
ఒంటిమిట్టలో వార్షిక బ్ర‌హ్మోత్స‌వాలు, ఏప్రిల్ 1న జ‌రుగ‌నున్న శ్రీసీతారాముల క‌ల్యాణం ఏర్పాట్ల‌ు వేగ‌వంతం చేయడం, ఇప్ప‌టివ‌ర‌కు చేసిన ఏర్పాట్లు, అభివృద్ధి ప‌నులు, భ‌విష్య‌త్తులో చేప‌ట్టాల్సిన ప‌నుల‌పై అన్ని విభాగాల అధికారుల‌తో టిటిడి జేఈఓ వి. వీర‌బ్ర‌హ్మం అధికారుల‌తో బుధవారం ఆయన స‌మీక్షించారు.

టీటీడీ చీఫ్ ఇంజినీర్ టివి.సత్యనారాయణ, ఎస్ఈలు మనోహర్, నరసింహమూర్తి, ఎస్ఇ (ఎలక్ట్రికల్) వెంకటేశ్వర్లు, సిపిఆర్ఓ డాక్టర్ తలారి రవి, సీఎంఓ ( TTD Chief Medical Officer) డాక్టర్ కుసుమ కుమారి, ఆలయ డిప్యూటీ ఈఓ ప్రశాంతి, అదనపు ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సునీల్, హెచ్ డీపీపీ ప్రత్యేకాధికారి రఘునాథ్ ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఒంటిమిట్ట శ్రీకోదండ రామస్వామి వారి ఆలయం ముందు తాత్కాలిక వంటశాల, ముడి సరుకులు నిల్వ‌ ఉంచే షెడ్ల నిర్మాణం సకాలంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. భక్తులకు అన్నప్రసాదాల పంపిణీకి టేబుళ్లు, కుర్చీలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఆలయం, యాగశాలలో మరమతలు త్వ‌రగా పూర్తి చేయాల‌న్నారు.
టిటిడి స్థానిక ఆలయాల తరహాలోనే శ్రీవారిసేవకులను ఒంటిమిట్ట కోదండ‌రామ‌స్వామివారి ఆల‌యంలో వినియోగించుకునే విధంగా కార్యాచణ అమలు చేయాలని టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం సూచించారు.

కల్యాణ వేదిక వద్ద ఏర్పాట్లు


ఒంటిమిట్ట కోదండరామాలయం సమీపంలోని కల్యాణ వేదిక వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులను జేఈఓ పరిశీలించారు.

"సీతారాముల కల్యాణోత్సవం తరువాత యాత్రికులకు తలంబ్రాలు పంపిణీ చేయడం. అన్న‌ప్ర‌సాదాలు అందించే 17 కౌంటర్లు, ప్రవేశ, నిష్క్రమణ గేట్లు పటిష్టంగా ఉండే విధంగా ఏర్పాట్లు చేయండి" అని జేఈఓ వీరబ్రహ్మం ఆదేశివంచారు. కల్యాణ వేదిక ప్రాంగణంలోని వసతి సముదాయం వద్ద ఉన్న జల ప్రసాదం వినియోగంలోకి తీసుకురావాలన్నారు. కల్యాణ వేదికకు నలువైపులా పచ్చదనానికి ప్రాముఖ్యత ఇచ్చేలా తీర్చిదిద్దాలని అటవీ శాఖ అధికారులను ఆదేశించారు. ఆలయం నుంచి కల్యాణ వేదిక వరకు రోడ్డు ఇరువైపుల మొక్కలు పెంచాలని సూచించారు. కళ్యాణ వేదిక వద్ద విఐపీలు బస చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. కల్యాణ వేదిక ప్రాంగణంలో ఏర్పాటు చేసే తాత్కాలిక వంటశాల స్థలాన్ని పరిశీలించి సూచ‌న‌లు చేశారు.

తొక్కిసలాట లేకుండా...

ఒంటిమిట్ట కోదండరామాలయానికి వచ్చే వేలాది మంది యాత్రికులు, వీఐపీలను దృష్టిలో ఉంచుకుని రద్దీకి తగినట్లు భద్రతా ప్రమాణాలు పాటిస్తూ బారికేడింగ్ కోసం ఏర్పాట్లు చేస్తున్నారు.
"యాత్రికులకు సౌకర్యంగా క్యూలు, వసతి షెల్టర్లు, సూచిక బోర్డులు, తాగునీటి సౌకర్యం, తదితర ఇంజినీరింగ్ పనులు సకాలంలో పూర్తి చేయండి" అని వీరబ్రహ్మం ప్రత్యేకంగా ఆదేశించారు. రథం తిరిగే వీధులు, ముఖ్యంగా మాడ వీధుల్లో మరమ్మతు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. భక్తులను ఆకట్టుకునేలా కటౌట్లు, విద్యుత్ దీపాలంకరణలు, పుష్పాలంకరణలు ఏర్పాటు చేయాలన్నారు.

టీటీడీ నుంచి డిప్యూటేషన్

ఆంధ్ర భద్రాద్రిగా గుర్తించిన ఒంటిమిట్టను శ్రీరామనవమిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఉత్సవాలు నిర్వహిస్తోంది. టీటీడీ అనుబంధంగా ఈ ఆలయంలో బ్రహ్మోత్సవాలకు టీటీడీ, అన్ని విభాగాల సిబ్బందిని డిప్యూటేషన్ పై నియమించనున్నారు. ఆలయం, పరిసర ప్రాంతాల్లో ప్రథమ చికిత్స కేంద్రాలు, వైద్య సిబ్బంది, మందులు, అంబులెన్స్‌లు అందుబాటులో ఉంచడానికి కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు.
"బ్రహ్మోత్సవాలకు 10 రోజుల ముందు నుంచే ప్రచార ర‌థాల‌తో పరిసర గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేయాలి" అని జేఈఓ వీరబ్రహ్మం ప్రత్యేక సూచనలు చేశారు.

ముందస్తు ఏర్పాట్లు

శ్రీకోదండరామస్వామి ఆలయం వద్ద నిర్వహించే సీతారాముల కల్యాణోత్సవం రోజు అశేషంగా వచ్చే యాత్రికులకు కొరత లేకుండా తిరుమల తరహాలో సేవలు అందించడానికి ఏర్పాట్లకు టీటీడీ సమాయత్తం అవుతోంది. భక్తులకు నిరంతరాయంగా అన్నప్రసాదాల పంపిణీకి శ్రద్ధ తీసుకుంటున్నారు.
"ఎండ వేడిమి నుంచి ఉపశమనం కలిగించడానికి మజ్జిగ, తాగునీరు పంపిణీకి కౌంటర్లు సిద్ధం చేయాలని" జేఈఓ సూచించారు. టీటీడీ విజిలెన్స్ ( TTD Vigilance and Security Wing ) అధికారులు స్థానిక పోలీసులతో సమన్వయం చేసుకుని భద్రత, పార్కింగ్ ఏర్పాట్లకు ప్రణాళిక సిద్ధం చేయాలని ఆయన సూచించారు.

ఎవరు ఈ వావిలికొలను


కడప జిల్లా జమ్మలమడుగు ప్రాంతానికి చెందిన వావిలికొలను సుబ్బారావు 1863 జనవరి 23న జన్మించారు. ప్రొద్దులూరు తాలూకా ఆఫీసులో గుమాస్తాగా చేరిన ఆయన రెవ్న్యూ ఇన్ స్పెక్టర్ గా పదోన్నతి తరువాత 1896 వరకు పని చేశారు. కందుకూరి వీరేశలింగం పంతులు తరువాత మద్రాసు ప్రెసిడెన్షీ కాలేజీలో ఆంధ్ర 1904-1920 వరకు పండితుడిగా పనిచేశారు. రామభక్తుడైన వావిలికొలను సుబ్బారావు ఆంధ్రీకరించి, ఆంధ్ర వాల్మీకి బిరుదు సంపాదించుకున్న ఆయనఒంటిమిట్టలోని కోదండ రామాయం పునరుద్ధరించడానికి కొబ్బరి చిప్పతో భిక్షాటన చేశారు. టెంకాయచిప్ప శతకం కూడా రచించారు.

సంస్కృత రామాయణాన్ని వావిలికొలను సుబ్బారావు 24 వేల చందో భరిత పద్యాలు తెలుగులో రాసి, దానికి మందరం అని పేరు పెట్టి, ఒంటిమిట్ట కోదండ రామాలయానికి అంకితం ఇచ్చారు. బళ్లారి రాఘవ అధ్యక్షతన జరిగిన సభలో మహా పండితులు వావిలికొలను సుబ్బారావుకు ఆంధ్ర వాల్మీకి బిరుదు ప్రదానం చేశారు.
శ్రీకోదండరామాలయానికి రాజుల ఇచ్చిన మాన్యాలు కరిగిపోయాయి. నైవేద్యం కరువైన రోజుల్లో వావిలికొలను సుబ్బారావు టెంకాయ చిప్పతో ఊరూరా తిరిగి భిక్షాటన చేయగా వచ్చిన సొమ్ముతో ఆలయాన్ని పునరుద్ధరించారు. చివరకు ఖాళీ అయిన టెంకాయచిప్పను చూపిస్తూ,
"నీ జన్మ ధన్యం కదే టెంకాయ చిప్పా" అంటూ వావిలికొలను సుబ్బారావు "టెంకాయ చిప్ప శతకం" చెప్పిన మహాకవిగా గుర్తింపు పొందారు.
భారతదేశ సందర్శనకు వచ్చిన ప్రిన్స్ ఆఫ్ వేల్స్ యువరాజును కీర్తిస్తూ, కవితలు చెప్పమని బ్రిటీష్ ప్రభుత్వం ఆదేశించిందట. బంగారు కంకణం బహుమతి ఇస్తామని ఆశపెట్టినా, వావిలికొలను సుబ్బారావు తిరస్కరించడంతో పాటు "నేను రాముడికి మాత్రమే దాసుడిని. కామదాసును కాదు" అని ఘాటుగా సమాధానం చెప్పినట్లు చరిత్ర చెబుతోంది.
Read More
Next Story