రాయలసీమ ఎత్తిపోతల పథకం కోసం వైసీపీ ఆందోళనలు సాగిస్తామనే ప్రకటనపై పీసీసీ అధ్యక్షురాలు వైఎస్. షర్మిల నిప్పులు చెరిగారు. ఆమె అన్న వైఎస్. జగన్ కు ఐదు ప్రశ్నలు సంధించారు. జగన్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు రాయలసీమ ద్రోహులే అని ఘాటుగా వ్యాఖ్యానించారు.
మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకం (MGNREGA) పరిరక్షణ యాత్రలో భాగంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పీసీసీ అధ్యక్షురాలు షర్మిలారెడ్డి బస్సుయాత్ర సాగిస్తున్నారు. గంగాధరనెల్లూరు నియోజకవర్గంలో శుక్రవారం ఆమె మాట్లాడారు.
రాయలసీమ ఎత్తిపోతల పథకంపై YCP ఆందోళనలు చేయడానికి సిగ్గుండాలి అని ఏపీసీసీ (APCC) అధ్యక్షురాలు వైఎస్. షర్మిలారెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆ పార్టీ ఉద్యమాలు చేస్తాం అనడం హాస్యాస్పదం ఉందని ఆమె ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబుపై కూడా ఆమె విమర్శలు సంధించారు.
"అధికారంలో ఉన్న ఐదేళ్లు వైఎస్. జగన్ నిద్రపోయారు. ఇప్పుడు నిద్ర లేచిన ఆయన రాయలసీమ ప్రయోజనాలు కాపాడతానని చెప్పడం విడ్డూరంగా" ఉందని వైఎస్. షర్మిల వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
స్వయాన అన్న జగన్ పై షర్మిల ప్రశ్నలు సంధించారు.
1.వైసీపీ అధికారంలో ఉండగా రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఎందుకు పూర్తి చేయలేదు?
2. NGT దగ్గర అనుమతుల కోసం వాదనలు ఎందుకు వినిపించలేదు?
3. అనుమతిలు వచ్చేలా కేంద్రాన్ని ఎందుకు ఒప్పించలేదు
4. ఐదేళ్లు ప్రధాని నరేంద్రమోదీకి ఏళ్లు దత్తపుత్రుడుగా ఉన్నారు. రాయలసీమ ప్రాజెక్ట్ కావాలని ఎందుకు మోదీ పై ఒత్తిడి తేలేదు ?
5. జగన్ అధికారంలో ఉన్న ఐదేళ్లలో సీమ ప్రాజెక్టులపై ఎందుకు కన్నెత్తి కూడా చూడలేదు? అని ప్రశ్నించారు
ఆరు నెలల్లో అన్నారే..?
ఉమ్మడి రాష్ట్రంలో దివంగత సీఎం వైఎస్. రాజశేఖరరెడ్డి మొదలు పెట్టిన జలయజ్ఞం ప్రాజెక్టులు ఆరు 6 నెలల్లో పూర్తి చేస్తాం అని వైఎస్. జగన్ అధికారంలో ఉండగా చెప్పిన విషయాన్ని వైఎస్ షర్మిల రెడ్డి గుర్తు చేశారు. అధికారంలో ఉండగా చేయలేని పనులు, పదవులు పోయిన తరువాత గుర్తుకు వచ్చాయా? అని కూడా షల్మలా రెడ్డి ప్రశ్నించారు.'W
సీమకు ఇప్పుడూ... అన్యాయమే..
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు రాయలసీమ ప్రాజెక్టుల విషయంలో అన్యాయం చేస్తున్నారని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్. షర్మిలా రెడ్డి ఆరోపించారు. ఎత్తిపోతల పథకం అవసరం లేదన్నట్టు మాట్లాడడం సరైంది కాదన్నారు. ఎత్తిపోతల పథకం కాదని, ముచ్చిమర్రి దగ్గర నుంచి లిఫ్ట్ పెట్టి రాయలసీమకు నీళ్లు పారిస్తానని ముఖ్యమంత్రి నారా చెప్పడం విడ్డూరంగా ఉందని ఆమె వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
"సీఎం చంద్రబాబు, వైసీపీ చీఫ్ జగన్ సీమ ద్రోహులే" అని షర్మిలారెడ్డి ఘాటుగా వ్యాఖ్యానించారు. వారిద్దరి స్వప్రయోజనాల కోసం సీమ ప్రజల ప్రయోజనాలు తాకట్టు పెట్టారని ఆమె నిందించారు. అప్పడు జగన్, ఇప్పుడు సీఎం చంద్రబాబు ప్రధాని మోదీ ముందు సాగిలపడ, సీమకు అన్యాయం చేస్తున్నారని ఆమె మండిపడ్డారు.
పేదల పండుగ దెబ్బ తీశారు...
రాష్ట్రంలో ఉపాధి హామీ పనులు అంటే వైఎస్. రాజశేఖరరెడ్డి పాలనలో పేదలకు పండుగలా ఉండేదని, ఆ పరిస్థితి ఇప్పుడు లేకుండా చేశారని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్. షర్మిలా రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ కాలంలో అమలులోకి తెచ్చిన ఉపాధి హామీ చట్టం ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిందని ఆమె గుర్తు చేశారు. ఉపాధి హామీ పథకం నుంచి మహాత్మాగాంధీ పేరు తొలగించడం దారుణమన్నారు. ఓ పథకం ప్రకారం కుట్రతోనే పథకాన్ని నిర్వీర్యం చేయడానికి ప్రయత్నిస్తున్నారని షర్మిలారెడ్డి సందేహం వ్యక్తం చేశారు.
"ఆనాడు గాంధీని గాడ్సే చంపారు. ఇప్పుడు గాంధీ పేరు తొలగించి మోదీ మళ్లీ చంపారు" అని షర్మిలా రెడ్డి వ్యాఖ్యానించారు. VB G RAM G చట్టం మన్రేగాకు ప్రత్యామ్నాయం కానేకాదని ఆమె స్పష్టం చేశారు.