శ్రీవారితో పెట్టుకున్నాం.. ఏమి చేస్తాడో ఏమో..?!
x

వైసీపీ మాజీ మంత్రులు జోగి రమేష్, ఆర్.కే. రోజా

శ్రీవారితో పెట్టుకున్నాం.. ఏమి చేస్తాడో ఏమో..?!

కల్తీ నెయ్యిపై వైసీపీని ఇరకాటంలో పడేసిన మాజీ మంత్రుల సంభాషణ


తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడలేదనిది నిజమే. ఈ విషయంలో పైకి మాత్రమే బింకంగా మాట్లాడుతున్నామని మాజీ మంత్రి ఆర్కే. రోజా (RK Roja ) చేసిన వ్యాఖ్యలతో వైసీపీ ( Ycp ) ని ఇరకాటంలో పడేశారు. మాజీ మంత్రి జోగి రమేష్ తో ఆర్.కే రోజా మధ్య జరిగిన సంభాషణ ఆసక్తికరంగా మారింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

"శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో వాడింది కల్తీ నెయ్యే" అని మాజీ మంత్రి రోజా అంగీకరించారు. "దేవుడితో పెట్టుకున్నాం. ఏమి జరుగుతుందో ఏమో అని లోపల భయంగా ఉంది" అని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. టీడీపీ (TDP ) కూటమి మరింతగా మాటల దాడి చేయడానికి ఊతం ఇచ్చినట్టే మారింది.
సోషల్ మీడియాలో వైరల్
నకిలీ మద్యం కేసులో బెయిల్ పై విడుదల అయిన మాజీ మంత్రి జోగి రమేష్ విజయవాడలోని తన నివాసంలో ఉన్నారు. కొన్ని రోజుల కిందట ఆయన నివాసంపై దాడి జరిగిన విషయం తెలిసిందే. దీంతో ఆయనను పరామర్శించడానికి ఆర్.కే. రోజా ఇంటికి వెళ్లారు. ఆమె వెంట వైసీపీ మహిళా నాయకులు కూడా ఉన్నారు. మాజీ మంత్రి జోగి రమేష్ తో ఆర్.కే. రోజా మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

కల్తీ నెయ్యిపై ఆరోపణలు ఇవీ..

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో గొడ్డు కొవ్వు, చేపనూనె కలిసిన నెయ్యి వాడారనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు వ్యాఖ్యల నేపథ్యంలో 2019 నుంచి 2024 వరకు వైసీపీ ప్రభుత్వంలో నెయ్యి కొనుగోలు వ్యవహారంపై సీబీఐ సారధ్యంలోని సిట్ అధికారులు 15 నెలల పాటు దేశంలోని అనేక రాష్ట్రాల్లో విచారణ చేశారు. ఇందులో 36 మంది నిందితులుగా సీబీఐ గుర్తించింది. వారిలో 12 మంది టీటీడీ ఉద్యోగులు ఉన్నారని విచారణ నివేదికపై నెల్లూరు ఏసీబీ కోర్టులో ఈ సంవత్సరం జనవరి 21వ తేదీ చార్జిషీట్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

వైసీపీ ఎదురుదాడి

సీబీఐ చార్జిషీట్ లో " గొడ్డు కొవ్వు, చేప నూనె కాకుండా, కూరగాయల ప్రేరకాలు, రసాయనాలు కలిశాయి" అని సీబీఐ తన చార్జిషీట్ లో ప్రస్తావించడం వైసీపీ స్వరాలు పదునెక్కాయి. మాజీ సీఎం వైఎస్. జగన్ (YS Jagan ) తోపాటు టీటీడీ మాజీ చైర్మన్లు వైవి. సుబ్బారెడ్డి, భూమన కరుణాకరరెడ్డి తోసహా వైసీపీ నేతలు సంబరాలకు దిగారు. ఆలయాల వద్ద శుభ్రం చేయడం ద్వారా పూజలు చేయడంతో కల్తీ నెయ్యి వ్యవహారం మళ్లీ రాజకీయంగా మంటలు పుట్టించింది.
"వైఎస్. జగన్ ను రాజకీయంగా అణగదొక్కడానికే మా పార్టీపై నిందలు మోపారు" అని టీటీడీ మాజీ చైర్మన్, వైసీపీ అధికార ప్రతినిధి భూమన కరుణాకరరెడ్డి తన మాటలకు పదును పెట్టారు.
"సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మనసులోని కుళ్లు పోవాలి. శ్రీనివాస ప్రసాద నిందా పరిహార హోమం" నిర్వహించిన భూమన కరుణాకరరెడ్డి ఏమన్నారంటే..
"టీటీడికి సరఫరా చేసిన నెయ్యిలో కల్తీ వ్యవహారం ఆ నాటి పాలక మండలికి సంబంధం లేదు" అని వ్యాఖ్యానించారు.

డిఫెన్స్ లో పడేసిన రోజా మాటలు

నెల్లూరు ఏసీబీ కోర్టులో సీబీఐ చార్జిషీట్ లో తమకు క్లీన్ చిట్ ఇచ్చిందని వైసీపీ సంబరాలు చేసుకుంటూ, టీడీపీ కూటమిపై ఎదురుదాడి ప్రారంభించింది. ఈ పరిస్థితుల్లో మాజీ మంత్రి ఆర్.కే. రోజా చేసిన వ్యాఖ్యాలు పూర్తిగా వైసీపీని ఆత్మరక్షణలో పడేసింది.
విజయవాడలోని మాజీ మంత్రి జోగి రమేష్ తో మాట్లాడుతున్న వీడియో బయటికి వచ్చింది.
వారి మధ్య సంభాషణ ఎలా జరిగిందంటే..
రోజా: మేము గవర్నమెంటులో ఉన్నాం. అన్న ఒక ఇదితో తప్పు చేశాం. దేవుడి (తిరుమల శ్రీవారి) తో పెట్టుకున్నాం. ఏ సైడ్ నుంచి వెంకటేశ్వరస్వామి ఏమి చేస్తాడో అనే భయం అందరిలో కనిపిస్తుంది (నవ్వుతూ వ్యాఖ్య) ఇది అందరిలో కనిపిస్తూ ఉంది. పైకి బింకంగా మాట్లాడడం తప్ప, తప్పులు చేసుకుంటూ పోతున్నాం.
జోగి రమేష్: ఇది నేషనల్ న్యూస్ అయిపోయింది. నేషనల్ లో బాగా కవర్ అయిపోయింది. పార్లమెంట్లో, రాజ్యసభలో మాట్లాడడం, జనాల్లో బాగా అర్థం అయింది.
రోజా: అవును జనాల్లో బాగా అర్థం అయిపోయింది. కదా సర్. ఇంట్లో పెట్రోల్ పంపుల దగ్గర ఇవే మాటలు ఉన్నాయి. ఇంట్లో పిల్లలు అందరూ అర్థం చేసుకున్నారు.
జోగి: కింద కార్యకర్తలు ఏమన్నా గానీ, ఏమైనా ఇబ్బందే కాదా?

ఇరకాటంలో వైసీపీ

మాజీ మంత్రులు జోగి రమేష్, ఆర్కే. రోజా మధ్యా సాగే సంభాషణలో వైసీపీ మహిళా విభాగం నాయకులు కూడా గొంతు కలిపారు. వారి మధ్య సంభాషణ సరదాగా సాగినా, శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందనే విషయాన్ని సూటిగా అంగీకరించడం ద్వారా వైసీపీని పూర్తిగా ఇరకాటంలో పడేశారు. ఢిల్లీలో రెండు రోజుల కిందట మాట్లాడిన టీటీడీ మాజీ చైర్మన్, వైసీపీ రాజ్యసభ సభ్యుడు వైవి. సుబ్బారెడ్డి కూడా
"నెయ్యిలో కల్తీ జరిగింది" అనే ఆరోపణను వై.వీ. సుబ్బారెడ్డి అంగీకరించినట్లు మీడియాలో కథనాలు వచ్చాయి. ఇందులో తమ ప్రమేయం లేదని కూడా ఆయన బుకాయించారు. తాజాగా మాజీ మంత్రులు జోగి రమేష్, ఆర్.కే రోజా మధ్య జరిగిన సంభాషణ వీడియో వైసీపీని మరింత ఇబ్బందులో పడేసినట్లే కనిపిస్తోంది. వారి సంభాషణలో విస్తవాలు బయటికి వచ్చినట్లు భావించే టీడీపీ కూటమి నేతల మాటలకు మరింత పదును పెట్టేందుకు ఆస్కారం కల్పించింది. దీనిని వైసీపీ నేతలు ఎలా ఎదుర్కొంటారనేది చర్చకు తెర తీసింది.

కొసమెరుపు:

కూటమి ప్రభుత్వం మాట్లాడింది తప్పు అని సీబీఐ చెప్పిన తరువాత ప్రభుత్వ పెద్దల్లో ఫ్రస్ట్రేషన్ పెరిగి పోయింది అని జోగి రమేశ్ తో అంటున్న మాటల పూర్తి వీడియోను ఆర్ కే. రోజా విడుదల చేశారు.
"వాళ్ల ఛానల్ అడిగిన ప్రశ్నలకే పవన్, చంద్రబాబుకు ఫ్రాస్టేషన్ పెరిగిపోతుంది. మీకు దేవుడు చెప్పాడా… లేదని చెప్పరా… అని అరుస్తున్నారు" అని కూడా ఆమె వ్యాఖ్యానించారు. మాజీ మంత్రి జోగి రమేశ్ తో జరిగిన సంభాషణ వీడియోను వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని రోజా మండిపడ్డారు.
Read More
Next Story