
కల్తీ నెయ్యి రగడ:యాత్రికుల మనోభావాలు ఏమి సమాధానం చెబుతున్నాయి!
మళ్లీ మొదటికి వచ్చిన అంతులేని ఈ కథ కంచికి చేరేదెప్పుడు..?
తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యిపై సీబీఐ దాఖలు చేసిన చార్జిషీటును ఎవరికి వారు టీడీపీ, వైసీపీ తమకు అనుకూలంగా అన్వయించుకుంటున్నారు. ఎవరికి వారు క్లీన్ చిట్, పరస్పర ఆరోపణలతో రెండేళ్ల తరువాత మళ్లీ రాజకీయ రగడ ప్రారంభమైంది. తిరుమల శ్రీవారిని దర్శించుకునే యాత్రికులు, హుండీకి సమర్పించే కానుకలు, లడ్డు ప్రసాదాల కొనుగోలుతో మనోభావాలు చాటుకుంటున్నారు. అంతులేని ఈ కథ కంచికి ఎప్పుడు చేరుతుందనేది తేల్చడం కష్టమే.
2024 సెప్టెంబర్ 18: తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదంలో గుడ్డు కొవ్వు, చేప నూనె వంటి పదార్థాలు కలిపారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు టిడిఎల్పి (TDLP) సమావేశంలో వ్యాఖ్యానించడం వల్ల కలకలం చెలరేగింది. ఈ వివాదం పీక్ స్టేజీకి చేరడం, దర్యాప్తు ప్రారంభమైన రోజుల్లోనే..
సెప్టెంబర్ 25: తేదీ నుంచి 30వ తేదీ వరకు ఆరు రోజుల్లో యాత్రికులు 21.3 లక్షల శ్రీవారి లడ్డూలు కొనుగోలు చేశారు. 4.52 మంది యాత్రికులు స్వామివారిని దర్శించుకున్నట్లు టీటీడీ రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. రోజుకు 3.5 లక్షల నుంచి నాలుగు లక్షల లడ్డూలు సగటున కొనుగోలు చేశారు. కల్తీ నెయ్యి వివాదం కొనసాగున్న సమయంలోనే 2024లో 12.15 కోట్ల లడ్డూలు విక్రయిస్తే, 2025 నాటికి ఆ సంఖ్య 12.52 కోట్లకు పెరిగినట్టు శ్రీవారి పోటు రికార్డులు స్పష్టం చేస్తున్నాయి.
అలిపిరి వద్ద కొందరు భక్తులతో 'ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్' ప్రతినిధి మాట్లాడారు.
"నెయ్యిలో కల్తీ జరిగిందని మీడియాలో చూస్తున్నాం. సంవత్సరం ముందు రుచిలో కొంత తేడా మాత్రం కనిపించింది" అని బెంగళూరుకు చెందిన యాత్రికురాలు అరుణ వ్యాఖ్యానించారు. ఏడాదికి ఒకసారి వస్తాం. కావలసిన లడ్డూలు కొనుగోలు చేస్తూనే ఉన్నాం అని అరుణ చెప్పారు.
తగ్గని డిమాండ్
తిరుమల శ్రీవారి ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడారనే విషయంలో శ్రీవారి యాత్రికులను తీవ్ర కలవరానికి గురి చేసింది. అయినా, లడ్డు ప్రసాదాలకు మాత్రం డిమాండ్ తగ్గలేదు.
సెప్టెంబర్ 25వ తేదీ శ్రీవారిని దర్శించుకున్న యాత్రికులు 3.2 లక్షల లడ్డూలు కొనుగోలు చేశారు. 26 తేదీ కూడా 75 వేల మంది యాత్రికులు 3.5 లక్షల లడ్డూ ప్రసాదాలు కొనుక్కకున్నారు. 27వ తేదీ 70 వేల మంది యాత్రికులు 3.4 లక్షల లడ్డూు కొన్నారు.
సెప్టెంబర్ 28వ తేదీ 82 వేల మంది యాత్రికులు 3.8 లక్షల లడ్డూలు కొనుక్కుంటే, 29వ తేదీ రికార్డు స్థాయిలో 85 వేల మంది యాత్రికులు 4.1 లక్షల లడ్లు కొనుగోలు చేసినట్లు రికార్డులు చెబుతున్నాయి. 30వ తేదీ యాత్రికుల సంఖ్య 68 వేలుగా ఉన్నప్పటికీ లడ్డూ ప్రసాదాలు మాత్రం 3.3 లక్షలు విక్రయించారు.
సెప్టెంబర్ 23వ తేదీ తిరుమల శ్రీవారి ఆలయంలో శాంతి హోమం, లడ్డూ ప్రసాదాల తయారీ కేంద్రం (పోటు)లో సంప్రోక్షణ చేశారు. నెయ్యి నాణ్యత పెంచడానికి, స్వచ్ఛమైన ఆవు నెయ్యి మాత్రమే వాడుతున్నట్లు టీటీడీ చేసిన ప్రకటనతో యాత్రికులు సాంత్వన పడ్డారు.
తిరుమలలో సాధారణంగా రోజుకు సగటున 3.5 లక్షల నుంచి నాలుగు లక్షల వరకు యాత్రికులకు టీటీడీ లడ్డూ ప్రసాదాలు విక్రయిస్తుంటుంది. ఆ మేరకు పోటు సామర్థ్యం పెంచడం తోపాటు బఫర్ స్టాక్ కూడా నాలుగు లక్షలకు పెంచింది.
తిరుమల లడ్డూ ప్రసాదం వివాదం సాగుతుండగా,
2024 సెప్టెంబర్ 20వ తేదీ నుంచి 23వ తేదీ మధ్య మాత్రమే 13 లక్షల లడ్డూ ప్రసాదాలు యాత్రికులు కొనుగోలు చేశారు. టీటీడీ నివేదిక ప్రకారం 2024లో 12.15 కోట్ల లడ్డూలు . 2025 నాటికి ఆ సంఖ్య 13.52 కోట్లకు చేరిందని టీటీడీ అధికారులు స్పష్టం చేశారు.
సెప్టెంబర్ 19: గుజరాత్ లోని NDDB (National Dairy Development Board) అనుబంధ సంస్థ సెంటర్ ఫర్ ఎనాలిసిస్ అండ్ లెర్నింగ్ ఇన్ లైవ్ స్టాక్ అండ్ ఫుడ్ ( Center for Analysis and Learning in Livestock and Food (CALF)) నివేదిక బయటపెట్టారు.
"నెయ్యిలో చేప నూనె, గొడ్డు మాంసం కొవ్వు (Brrf Tallow) ఉన్నట్లు రాసిన విషయాన్ని మాత్రమే నేను చెప్పాను" అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు తన మాటలను సమర్ధించుకున్నారు. దీంతో కల్తీకి బాధ్యులను గుర్తించడానికి సిట్ ( Special Investigative Team SIT) ఏర్పాటు చేశారు. మూడు రోజుల దర్యాప్తు చేసి, ప్రాధమిక నివేదిక రూపొందించే నేపథ్యంలో కేసు సుప్రీం కోర్టుకు చేరింది. సుప్రీం కోర్టు ఆదేశాలతో సీబీఐ సారధ్యంలోని సిట్ అధికారులు దర్యాప్తు చేశారు.
మళ్లీ రగడ
శ్రీవారి లడ్డు ప్రసాదం తయారీలో వాడిన కల్తీ నెయ్యి లెక్కలు సిట్ (special investigate your team) అధికారులు తేల్చారు. 12 రాష్ట్రాల్లో దాదాపు 15 నెలల పాటు దర్యాప్తు చేసిన సీబీఐ నెల్లూరు ఏసీబీ కోర్టులో 600 పేజీల చార్జిషీట్ దాఖలు చేసింది. ఈ నివేదికతో కల్తీ నెయ్యి వ్యవహారంపై టీడీపీ, వైసీపీ మధ్య మళ్లీ రగడ ప్రారంభమైంది. ఈ నివేదికను టీడీపీ, వైసీపీ నేతలు ఎవరికి పరిధిలో వారు అనుకూలంగా అన్వయించుకుంటున్న నేపథ్యంలో మళ్లీ గందరగోళం ఏర్పడింది. సీబీఐ నివేదికలో
"2019 నుంచి 2024 వరకు 60 లక్షల కల్తీ నెయ్యి సరఫరా జరిగింది. దీనిలో పాల డెయిరీ (Milk Dairy)ల యజమానులతో పాటు మధ్యవర్తులతో కలిపి 36 మంది నిందితులుగా గుర్తించారు. వారిలో 12 మంది టీటీడీ అధికారులు, ఉద్యోగులు ఉన్నారు" అని ఆరోపించింది. దర్యాప్తు సంస్థ తేల్చింది. ఈ నివేదికలో
"ఎన్ డీడీబీ (NDDB) రిపోర్టు ప్రకారం నెయ్యిలో కల్తీ నెయ్యిలో కొవ్వు కలవలేదు. ప్రమాదకర రసాయనాలు కలిశాయి. పామాయిల్ కూడా ఉంది" అనే వివరాల నివేదిక వైసీపీకి అస్ర్తంగా మారింది. ఇది టీడీపీ కూటమిని ఢిఫెన్స్ లో పడేసింది. దీంతో కల్తీ నెయ్యి కేసు మొదటికి వచ్చింది.
"నెయ్యికి మైక్రో డీఎన్ఏ చేయిస్తాం" అని టీటీడీ చైర్మన్ బీఆర్. నాయుడు స్పష్టం చేశారు. ఇక్కడ గమనించాల్సింది ఒకటే
"సీబీఐ చార్జిషీట్ లో ప్రస్తావించిన అంశాల్లో కొవ్వు కారకాలు లేవని మాకు క్లీన్ చిట్ ఇచ్చారు" అని వైసీపీ అంటోంది.
"వారికి ఎవరూ క్లీన్ చిట్ ఇవ్వలేదు. శ్రీవారి యాత్రికుల మనోభావాలతో ఆటలాడుకుంటున్నారు" అని చైర్మన్ నాయుడు నిప్పులు చెరుగుతున్నారు.
ఇవేమీ పట్టని యాత్రికులు..
శ్రీవారి లడ్డూ ప్రసాదంలో వాడిని కల్తీ నెయ్యి వ్యవహారంపై దేశ వ్యాపితంగా మళ్లీ చర్చకు తెరలేసింది. జాతీయ మీడియా దీనిపై గగ్గోలు పెడుతోంది. ఈ పరిస్థితుల్లో యాత్రికుల మనోభావాలు ఎలా ఉన్నాయంటే..
2024 జనవరి: తిరుమల శ్రీవారిని దర్శించుకునే యాత్రికులతో పాటు ఆదాయం, లడ్డూల విక్రయాలు కూడా పెరిగాయి. జనవరిలో 28 కోట్ల రూపాయలు శ్రీవారి హుండీకి ఆదాయం వచ్చింది. వైకుంఠ ద్వార దర్శనాల్లో ఒకే రోజు ఐదు కోట్ల రూపాయలు ఆదాయం దక్కింది. జనవరి నెలాఖరులో సగటున హుండీ ఆదాయం 3.5 కోట్లుగా నమోదైంది.
2024లో 12.15 కోట్ల లడ్డూ ప్రసాదాలు విక్రయించారు. 2025లో ఆ సంఖ్య 13.52 కోట్లకు చేరింది. గత ఏడాదితో పోలిస్తే ఇది పది శాతం అదనం.
2026 డిసెంబర్ 27వ తేదీ 5.13 లక్షల లడ్డూలు విక్రయించారు. పదేళ్ల రికార్డులు పరిశీలిస్తే ఇదే రికార్డు స్థాయి లడ్డూల విక్రయాలు.
2026లో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతోందని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు చెబుతున్నారు
"నాణ్యమైన నెయ్యి వాడడం, పోటులో కార్మికులను పెంచడం, పరిశుభ్రత వంటి అంశాలు లడ్డూకు డిమాండ్ పెరిగింది" అనేది చైర్మన్ నాయుడు విశ్లేషణ. నాణ్యమైన నెయ్యి వాడకం లల్ లడ్డూ రుచి కూడా పెరిగిందనే ఫీడ్ బ్యాక్ వచ్చిందని ఆయన అంటున్నారు.
సీబీఐ నివేదిక తరువాత
కల్తీ నెయ్యిపై విచారణ చేసిన సీబీఐ నెల్లూరు ఏసీబీ కోర్టులో ఈ ఏడాది జనవరి 21న చార్జిషీట్ దాఖలు చేసిన తరువాత మళ్లీ టీడీపీ, వైసీపీ మధ్య యుద్ధం ప్రారంభమైంది.
కల్తీ నెయ్యి వ్యవహారంపై ఇటీవల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పు చేసి వైసీపీ (YCP) నేతలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూ, సిట్ చార్జిషీట్ లో కల్తీ నెయ్యి వాడకం వాస్తమని తేలిందని చెప్పారు. పూర్తిస్థాయిలో విచారణకు ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించడంతో ఈ కేసు మళ్లీ మొదటికి వచ్చింది. అయినా.. శ్రీవారి ఆదాయం తగ్గకపోగా, లడ్డు విక్రయాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి.
అనంతపురం జిల్లా కదిరికి చెందిన వినోద్, సాయిప్రసాద్ మాట్లాడుతూ, ఆరోపణలు వచ్చినప్పుడు కూడా మేము తిరుమలకు వెళ్లాం అని చెప్పారు.
"అప్పుడు లడ్డూలో కొంచెం రుచి తేడా అనిపించింది. లడ్డూ పొడిగా మారిపోయేది" అని చెప్పారు. ఈ విషయంలో నిజాలు బయటికి తీసుకుని వచ్చి, మళ్లీ అలా జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరాన్ని వారు గుర్తు చేశారు.
2026 జనవరి 24 నుంచి 31: తేదీల మధ్య 5.7 లక్షల మంది యాత్రికులు శ్రీవారి దర్శించుకున్నారు. 24వ తేదీ శ్రీవారిని దర్శించుకున్న 76,654 మంది యాత్రికుల ద్వారా 3.81 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది.25వ తేదీ 74 వేల మంది యాత్రికుల నుంచి హుండీకి రికార్డు స్థాయిలో నాలుగు కోట్ల రూపాయలకు పైబడే ఆదాయం వచ్చింది. 26వ తేదీ కూడా 75, 79ల యాత్రికుల ద్వారా 3.77 కోట్ల రూపాయలు ఆదాయం వస్తే, ఇదే పరిస్థితి ఇప్పటికి కొనసాగుతోంది. 31వ తేదీ 76,935 మంది యాత్రికుల ద్వారా 3.20 కోట్ల రూపాయల ఆదాయం వచ్చినట్లు టీటిడీ రికార్డులు స్పష్టం చేస్తున్నాయి.
ఫిబ్రవరి 7: తిరుమల శ్రీవారిని 81,777 మంది యాత్రికులు దర్శించు కోగా, హుండీకి 3.70 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. ఫిబ్రవరి 6:వ తేదీ 67,085 యాత్రికుల ద్వారా 3.78 కోట్ల రూపాయలు
ఫిబ్రవరి 5:వ తేదీ 61,655 యాత్రికులతో 3.89 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని టీటీడీ అధికారులు స్పష్టం చేశారు. లడ్డ కల్తీ వ్యవహారంలో ఎవరి మనోభావాలు దెబ్బతింటున్నాయనేది అర్థం చేసుకోవచ్చు. మొత్తానికి ఈ అంతులేని కథ ముగింపు ఎలా ఉండబోతుందనేది ఏసీబీ కోర్టు, సుప్రీం కోర్టులు మాత్రమే తేల్చడానికి అవకాశం ఉంది.
Next Story

