
టీటీడీ ఆలయాల వద్ద ఆకలి అనే మాటకు చోటు లేకుండా..
మార్చి నుంచి రెండు పూటలా అన్నప్రసాదాల వితరణ.
తిరుమల తరహాలో దేశంలోని 56 ఆలయాల వద్ద రెండు పూటలా ఈ ఏడాది మార్చి నుంచి రెండు పూటలా అన్నదానం చేయాలని టీటీడీ నిర్ణయించింది. తిరుమలలో రెండు వేల మంది సామర్థ్యంతో 40 ఏళ్ల కిందట అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రస్తుతం ఆ సంఖ్య మూడు లక్షలకు చేరింది. దీనికోసం ఏడాదికి దాదాపు 150 కోట్ల రూపాయాలు వెచ్చిస్తున్నట్లు సమాచారం. అనుబంధ ఆలయాల వద్ద రెండు పూటలా అన్నప్రసాదాలు వడ్డించడానికి కార్యాచరణ సిద్ధం చేశారు. దీంతో ఖర్చు కూడా పెరగబోతోంది.
ఉదాహరణకు.. కడప జిల్లా ఒంటిమిట్ట ఆలయం వద్ద ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు 1,500 మందికి అన్నప్రసాదాల పంపిణీ కోసం గత ఏడాది ప్రారంభించింది. దీనికోసం ఏడాదికి టీటీడీ 4.35 కోట్ల రూపాయలు కేటాయించింది. రెండు పూటలా అన్నప్రసాదాల వితరణ వల్ల ఆ ఖర్చు రెట్టింపు కాబోతోంది. దాతల నుంచి అందుతున్న విరాళాలతో తిరుమల తోపాటు అనుబంధ ఆలయాల వద్ద కూడా ఈ కార్యక్రమం నిరాటంకంగా అమలు చేయడానికి టీటీడీ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది.
"ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఆదేశాల మేరకు ఈ పథకం విస్తరించాలని నిర్ణయించాం" అని టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలో టిటిడి జేఈఓ వి. వీరబ్రహ్మం, ఎఫ్‌ఏ అండ్ సీఏఓ ఓ. బాలాజీ, సీఈ ( TTD Chief Engineer ) టి.వి. సత్యనారాయణ తోపాటు ఇతర అధికారులతో ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ సమీక్షించారు.
"ప్రస్తుతం 56 టిటిడి ఆలయాల వద్ద అన్నప్రసాద వితరణ కొనసాగుతోంది. మార్చి నెలాఖరు నాటికి రెండు పూటలా అన్నప్రసాద వితరణ జరిగేలా ప్రణాళికలు రూపొందించండి" అని ఈఓ అనిల్ కుమార్ సింఘాల్
40 ఏళ్ల కిందట ప్రారంభం
తిరుమలలో నిత్యాన్నదాన పథకాన్ని ఎండోమెంట్ స్కీం కింద 1985 ఏప్రిల్ ఐదో తేదీ అప్పటి సీఎం ఎన్.టీ. రామారావు ప్రారంభించారు. అప్పట్లో రెండు వేల మంది యాత్రికులకు మాత్రమే అన్నప్రసాదాలు వడ్డించే ఆస్కారం ఉండేది. 1994లో శ్రీవేంకటేశ్వర నిత్యాన్నదాన ట్రస్టు (Sri Venkateswara Nithya Annadana Trust )గా, 2014లో శ్రీవెంకటేశ్వర అన్నప్రసాద ట్రస్టుగా పేరు మార్చారు. తిరుమలలో రెండు వేల మందికి అన్నప్రసాదాలు వడ్డించేందుకు ఈ కార్యక్రమం ప్రారంభించారు. యాత్రికుల రద్దీ, దాతల విరాళాలు పెరగడంతో అన్నప్రసాద వితరణ కూడా విస్తరించడానికి టీటీడీ శ్రద్ధ తీసుకుంది.
రోజూ.. 2.5 లక్షల యాత్రికులకు
టీటీడీ అమలు చేస్తున్న ఈ కార్యక్రమం ద్వారా తిరుమల తోపాటు తిరుపతి, అనుబంధ ఆలయాల వద్ద రోజుకు 2.5 లక్షల మందికి అన్నప్రసాదాలు వడ్డిస్తోంది. సాధారణ రోజుల్లో మాత్రమే తిరుమలలో 1.75 లక్షల నుంచి 1.90 లక్షల మందికి, వారాంతాల్లో రద్దీ ఎక్కువగా ఉంటే, ఆ సంఖ్య 2.50 లక్షల మంది ప్రత్యేక ఉత్సవాల సమయంలో ఆ సంఖ్య మూడు లక్షలకు పైగాడే ఉంటోంది. దీని కోసం నిత్యం 12 టన్నుల బియ్యం, ఏడు టన్నుల కూరగాయలు వినియోగిస్తోంది. ఆరు వేల లీటర్ల పాలు కూడా క్యూలైన్లలో ఉన్న యాత్రికులకు అందిస్తోంది.
ఒక రోజు ఖర్చు 44 లక్షలు
తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ నిత్యాన్నదాన సత్రంలో ఒక రోజు అన్నదాన ప్రసాదాలు వడ్డించడానికి రోజకు రూ.44 లక్షలు ఖర్చు అవుతుంది. దీనికోసం ఎస్వీ అన్నదాన పథకం టీటీడీ నిర్వహిస్తోంది. శ్రీవారి దర్శానికి వచ్చే యాత్రికుల్లో దాతలు ఈ పథకానికి భారీగానే విరాళాలు అందిస్తున్నారు.
తిరుమల అన్నదాన సత్రంలో ఉదయం అల్పాహారం కోసం పది లక్షలు, మధ్యాహ్నం భోజనానికి రూ.17 లక్షలు, రాత్రి భోజనాలు వడ్డించడానికి రూ.17 లక్షలు ఖర్చు అవుతూందని టీటీడీ గణాంకశాఖ అధికారులు స్పష్టం చేశారు. ఈ పథకానికి రూ.44 లక్షలు విరాళంగా అందించే దాత పేరును మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నదాన సత్రంలో ప్రదర్శించడం ఆనవాయితీగా పాటిస్తున్నారు.
తిరుమలతో పాటు అనుబంధ ఆలయాల వద్ద అన్నప్రసాదాల పంపిణీకి టీటీడీ ప్రత్యేక యంత్రాంగం తోపాటు శ్రీవారి సేవకుల స్వచ్ఛంద సేవలు అందిస్తున్నారు. ఈ ఆలయాల వద్ద అన్నదాన పథకం అమలు చేయడానికి ఏడాదికి దాదాపు 150 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నదని అధికారవర్గాల సమాచారం. దాతల నుంచి అందుతున్న విరాళాలతో అన్ని ఆలయాల వద్ద అన్నప్రసాదాల వితరణకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఒంటిమిట్ట ఆలయం వద్ద ఇలా..
తిరుమల తరవాత అనుబంధ ఆలయాలకు అన్నప్రసాదాల వితరణను టీటీడీ విస్తరించింది. కడప జిల్లా ఒంటిమిట్ట వద్ద ఉన్న శ్రీకోదండరామాలయం వద్ద రోజుకు 1,500 మందికి గత ఏడాది ఆగష్టు నెల నుంచి అన్నప్రసాదాలు అందిస్తున్నారు. దీనికోసం టీటీడీ 4.35 కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించింది. దేశంలోని మిగతా 56 అనుబంధ ఆలయాల్లో ఒంటిమిట్ట కోదండ రామాలయం కూడా ఒకటి. "ఈ ఆలయం వద్ద కూడా రెండు పూటలా అన్నదాన పథకం పెంచాలని" టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ అధికారులను ఆదేశించారు. దీంతో బడ్జెట్ మరింత పెంచాల్సిన అవసరం ఏర్పడింది.
టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత తిరుమలతో పాటు అనుబంధ ఆలయాల వద్ద అన్నప్రసాదాల నాణ్యత పెరిగింది.
"మేలురకం బియ్యం తోపాటు ఆహార వస్తువులను కూడా కొనుగోలు చేయడానికి తీసుకున్న నిర్ఱయాలు ఫలించాయి" అని టీటీడీ అదనపు ఈఓ సీహెచ్. వెంకయ్య చౌదరి స్పష్టం చేశారు.
ట్రస్టుకు పెరిగిన విరాళాలు..
టీటీడీ ఏర్పాటు చేసిన ఎస్వీ అన్నదాన ట్రస్టుకు దాతల నుంచి విరాళాలు భారీగా అందుతున్నాయి. 2023 నుంచి 2024 లో 1,854 కోట్ల రూపాయలు ఉన్న విరాళాల మొత్తం 2026 ఆగష్టు నాటికి మాత్రమే కార్పస్ ఫండ్ కింద 2,263 కోట్ల రూపాయలు అందినట్టు రికార్డులు స్పష్టం చేస్తున్నాయి.
"ఈ డిపాజిట్ల ద్వారా ఏడాదికి రెండు వందల కోట్ల రూపాయల వడ్డీ వస్తోంది" అని ఓ టీటీడీ అధికారి చెప్పారు. ఆ వడ్డీ మొత్తం ద్వారానే అన్నదాన పథకం నిర్వహణ సాగుతున్నట్లు కూడా ఆయన స్పష్టం చేశారు. 2024 నవంబర్ నుంచి 2025 అక్టోబర్ వరకు సుమారు 339 కోట్ల రూపాయలు విరాళాలు అందింది. ఈ విరాళాలను జాతీయ బ్యాంకుల్లో డిపాజిట్ చేసిన టీటీడీ, ఆ వడ్డీనే అన్నప్రసాద కేంద్రాల విస్తరణకు వినియోగిస్తోంది.
Next Story

