
తిరుమలలో పాదరక్షల భద్రపరిచే కేంద్రం (ఫైల్)
తిరుమలలో చెప్పులకూ ఓ లెక్కుంది.. వాటికి QR కోడ్ రక్ష ఉందబ్బా...
లగేజీ కౌంటర్ల తరహాలో పాదరక్షల నిర్వహణ
తిరుమల శ్రీవారి ఆలయ మాడవీధుల్లో పాదరక్షలు (చెప్పులు) ధరించి తిరగడం నిషేధం. పరిసరాల్లోకి ప్రాంతాల్లోకి వెళ్లాలంటే చెప్పులు వదిలి వెళితే మళ్ళీ దొరకవేమో! అని యాత్రికుల మనోభావాలను కూడా టీటీడీ (TTD) పరిగణలోకి తీసుకుంది. తిరుమలలో లగేజీ కౌంటర్ల తరహాలో క్యూ ఆర్ (QR code) ఆధారిత పాదరక్షల నిర్వహణ కౌంటర్లు ఏర్పాటు చేసింది.
"ఈ కేంద్రాలకు మంచి ఆదరణ లభిస్తోంది. యాత్రికులకు మానసిక ఇబ్బందిని తొలగించాం. ఆరు నెలల్లో 8,45,816 చెప్పులను డిపాజిట్, డెలివరీ సమర్థవంతంగా నిర్వహించాం" అని టీటీడీ అదనపు ఈఓ సిహెచ్. వెంకయ్యచౌదరి చెప్పారు.
మాడవీధుల్లో చెప్పులు నిషేధం
తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లడానికి వైకుంఠం వన్, వైకుంఠం టూ కాంప్లెక్స్, మాడవీధుల్లోకి వెళ్లడానికి రంబగీచా అతిథి గృహాల సముదాయంలో చెప్పులు వదిలేయాలి. తిరిగి వచ్చేసరికి అవి ఉంటాయో లేదో అనేది కూడా సందేహమే. ఒకవేళ ఆ చెప్పులు అక్కడే ఉన్న పారిశుధ్య కార్మికులు కుప్పగా తోసి వేయడం వల్ల అవి ఎక్కడున్నాయో తెలుసుకోవడం కూడా కష్టం.
"తిరుమలలో యాత్రికుల సౌకర్యం కోసం ఏర్పాటు చేసిన పాదరక్షల ట్రాకింగ్ అండ్ మేనేజ్మెంట్ వ్యవస్థ సమర్థవంతంగా పనిచేస్తోంది" అని వెంకయ్య చౌదరి స్పష్టం చేశారు.
తిరుమలలో చెప్పులు భద్రపరచడానికి ఆధునిక ట్రాకింగ్ వ్యవస్థ వల్ల పరిశుభ్రత మరింత మెరుగవుతుంది. యాత్రికులకు సౌకర్యం, ఆహ్లాదకరమైన దర్శన అనుభవం అందించడమే టీటీడీ ప్రధాన లక్ష్యంగా Smart Shoe Keeping విధానాన్ని అమలు చేస్తోంది" అని వెంకయ్య చౌదరి చెప్పారు.
చెప్పులు పోతాయనే బాధ లేదు..
తిరుమలకు వచ్చే యాత్రికులు దర్శనానికి వెళ్లే మందు చెప్పులు వదలి వెళ్లాలి. తిరిగి వచ్చేసరికి అవి దొరకకుంటే తమ సంబంధీకులతో పదేపదె చెప్పుకుంటూ మధనపడిపోతుంటారు. ఈ పరిస్థితి నివారించడానికి 2024 లోనే చెప్పులు భద్రపరిచే గదులను ఏర్పాటు చేసినా, నిర్వహణ ఇబ్బందికరంగా మారింది.
యాత్రికుల మనోభావాలను పరిగణలోకి తీసుకున్న టిటిడి (Tirumala Tirupati devasthanam Ttd) పాదరక్షలను భద్రపరుచుకునే గదులలో క్యూఆర్ కోడ్ ఆధారిత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులో తెచ్చింది.
తిరుమలలోని తరిగొండ వెంగమాంబ అన్నదాన ప్రసాద్ కేంద్రం వద్ద ఈ ఏడాది జనవరిలో క్యూఆర్ కోడ్ ఆధారిత పాదరక్షల కౌంటర్ ను టీటీడీ అదనపు వెంకయ్య చౌదరి ప్రారంభించారు. కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ సంస్థ తమ సిఎస్ఆర్ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటుచేసిన ఈ పైలెట్ ప్రాజెక్టును సామాన్య యాత్రికులు శ్రీవారి ఆలయంలోకి ప్రవేశించే మొదట వైకుంఠం క్యూ కాంప్లెక్స్- 2 (Tirumala Vaikuntam Queue Complex-2) వద్ద పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించారు. మంచి ఆదరణ లభించింది. దీంతో క్యూ ఆర్ కోడ్ ఆధారిత చెప్పుల స్టాండ్లను తిరుమలలోనీ ఎనిమిది ప్రాంతాల్లో కౌంటర్లను ఏర్పాటు చేశారు
చెప్పులు ఎలా భద్రపరుస్తారు
ఆలయం చుట్టుపక్కల ఉన్న మాడవీధుల్లోకి పాదరక్షలతో వెళ్లడానికి అవకాశం లేదు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్, అన్నదాన సత్రం వద్ద చెప్పులు లేకుండా వెళ్లాలి. ఈ ప్రదేశంలో ఏర్పాటు చేసిన కౌంటర్లలో పాదరక్షలు అప్పగించగానే క్యూఆర్ కోడ్ తో ఉన్న చీటీ ఇస్తారు. అందులో పాదరక్షల సంఖ్య, వాటి సైజు, రాక్ నెంబర్, వాటిని భద్రపరిచిన స్థానం వివరాలన్నీ ఆ సిటీలో రికార్డు అవుతాయి.
యాత్రికులు అన్ని ప్రాంతాలను తిరిగి మళ్లీ కౌంటర్ వద్దకు వచ్చి క్యూఆర్ కోడ్ చీటీ ఇస్తే స్కాన్ చేస్తారు. ఆ చెప్పులు ఎక్కడ ఉన్నాయి అనే విషయం కూడా అందులో కనిపిస్తుంది. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా యాత్రికులకు వారి పాదరక్షలు తిరిగి అందజేస్తారు. దీంతో యాత్రికులు సంతృప్తి చెందుతారు.
"చిత్తం దేవుడి పైన మనసు చెప్పులు పైన" అనే సామెతను టీటీడీ తిరగరాసింది. ఈ సామెతకు కొత్త భాష్యం చెప్పింది.
"తిరుమలలో కళ్యాణకట్ట, శ్రీవారి ఆలయానికి ఎదురుగా ఉన్న అఖిలాండం సమీపంలోని బేడి ఆంజనేయస్వామి ఆలయం, శ్రీవారి ఆలయంలోకి వెళ్లడానికి వైకుంఠం వన్, టు, శ్రీవాణి కేంద్రం, 300 రూపాయల శీఘ్రదర్శనం క్యూలోకి వెళ్లే మార్గంలోని ఏటీసీ సర్కిల్ వద్ద కూడా క్యూఆర్ కోడ్ ఆధారిత పాదరక్షల నిర్వహణ కేంద్రాలు ఏర్పాటు చేస్తాం" అని టీటీడీ అదనపు ఈఓ వెంకయ్య చౌదరి చెప్పారు.
8 లక్షల మందికి సేవలు
తిరుమలలో భక్తుల సౌకర్యార్థం కోసం టీటీడీ (TTD) అమలు చేస్తున్న QR కోడ్ ఆధారిత పాద రక్షల ట్రాకింగ్, మేనేజ్‌మెంట్ వ్యవస్థ సమర్థవంతంగా పనిచేస్తూ, ఫలితాలు ఇస్తోంది. ఆధునిక సాంకేతికతతో అమలులోకి వచ్చిన ఈ విధానం ద్వారా భక్తులు తమ పాద రక్షలను సులభంగా డిపాజిట్ చేసి, తిరిగి వేగంగా తీసుకోగలుగుతున్నారు.
2025 సెప్టెంబర్ నుంచి 2026 ఫిబ్రవరి 15 వరకు 8,45,816 పాద రక్షల డిపాజిట్–డెలివరీ లావాదేవీలు ఈ విధానం ద్వారా విజయవంతంగా నిర్వహించామని టీటీడీ అదనపు ఈఓ వెంకయ్య చౌదరి చెప్పారు. యాత్రికులు డిపాజిట్ చేసిన 4,24,047 పాదరక్షల్లో, 4,21,769 పాద రక్షలను తిరిగి అందజేశామని ఆయన తెలిపారు.
వేలల్లో చెప్పులు డిపాజిట్
తిరుమలలో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో ఆధునిక సాంకేతిక పరిజ్ణానం వినియోగించుకుంటే వేల సంఖ్యలో యాత్రికులు చెప్పులు డిపాజిట్ చేశారు. శ్రీవారి దర్శనం తరువాత తిరిగి తీసుకున్న లెక్కలు ఇవి.
1. తిరుమల ఏటీజీహెచ్ కేంద్రంలో 44,714 పాద రక్షలు డిపాజిట్ చేశారు. వాటిలో 44,340 మంది తిరిగి తీసుకున్నారు.
2. కృష్ణ తేజ సర్కిల్ కేంద్రంలో 56,019 పాద రక్షలు సేకరించగా, 55,428 పాద రక్షలు తిరిగి అందించారు.
3. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రం వద్ద డిపాజిట్ చేసిన 55,238 పాదరక్షల్లో 54,928 మంది తిరిగి తీసుకున్నారు.
4. పీఏసీ-5 కేంద్రంలో అత్యధికంగా 1,38,270 పాదరక్షలు డిపాజిట్ చేసిన యాత్రికుల్లో 1,37,904 తిరిగి తీసుకున్నారు.
5. రాంభగీచ విశ్రాంతి గృహం కేంద్రంలో 76,556 పాద రక్షలు భద్రపరిచిన వారిలో 76,071 మంది తిరిగి తీసుకున్నారు.
6. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ కేంద్రంలో 53,250 పాదరక్షలు భద్రపరచగా, 53,098 తిరిగి తీసుకున్నారు.
తిరుమలలో ప్రత్యేక రోజుల్లో రద్దీ ఏర్పడితే యాత్రికులు తమ పాదరక్షలు భద్రపరుచునేందుకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు ఉన్నాయని టీటీడీ అధికారులు చెప్పారు.
కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ సంస్థ (Coromandel International Limited) సహకారంతో టీటీడీ డిప్యూటీ ఈఓ (TTD Deputy EO) సోమన్నారాయణ ఆధ్వర్యంలో పాద రక్షల నిర్వహణ బాధ్యతలు పర్యవేక్షిస్తున్నారు. 2026 ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి 15వ తేదీ వరకు తిరుమలలోని ఆరు కేంద్రాల్లో 1,35,314 పాదరక్షలు భద్రపరిచి, తిరిగి తీసుకున్నారు
"గతంలో పాద రక్షలు పోవడం,, గందరగోళం ఏర్పడడం వంటి సమస్యలు తరచుగా ఎదురయ్యేవి. నూతన ట్రాకింగ్ విధానం అమలులోకి వచ్చాక యాత్రికుల మానసిక వేదనకు గురికాకుండా, నివారించాం" అని టీటీడీ అదనపు ఈఓ వెంకయ్య చౌదరి స్పష్టం చేశారు.
తిరుమలలోని కల్యాణకట్ (తలనీలాలు సమర్పించే కేంద్రం), బేడి ఆంజనేయస్వామి ఆలయం (శ్రీవారి ఆలయానికి ఎదురుగా ఉన్న అఖిలాండం), ఏటీసీ సర్కిల్ వద్ద మరో మూడు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో అవసరాన్ని బట్టి భవిష్యత్తులో అదనపు కౌంటర్లు ఏర్పాటు చేయడంతో పాటు సిబ్బంది సంఖ్య పెంచుతామని ఆయన వివరించారు. డం వంటి చర్యలతో ఈ వ్యవస్థను మరింత విస్తరించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
Next Story

