
మా కుటుంబాలకు లేని ఇబ్బంది మీకేమిటో..
వైసీపీ నేతకు టీటీడీ చైర్మన్ స్ట్రాంగ్ కౌంటర్
రేపు కల్తీ నెయ్యిపై విచారణకు రానున్న ఏకసభ్య కమిషన్
ఈ అంశం దారి మళ్లించడమే వైసీపీ వ్యూహం
వీడియోలోని ఫొటోలు 30 ఏళ్ల నాటివి
ఆమె కుటుంబంతో సన్నిహిత సంబంధం ఈనాటిది కాదు.
కేసులతో సమాధానం చెబుతా..
మద్రాసులో ఏమి జరిగిందో బయట పట్టనా.
వైసీపీ నేనే భూమనపై టీటీడీ చైర్మన్ ఫైర్
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఏకసభ్య కమిషన్ సోమవారం తిరుపతికి రానున్నది. ఈ అంశాన్ని పక్కదారి పట్టించడానికే నాపై రాసలీలల వీడియో వైసీపీ తెరపైకి తెచ్చిందని టీటీడీ చైర్మన్ బీఆర్. నాయుడు ఆరోపించారు.
"ఆ మహిళ కుటుంబంతో మాకు 30 ఏళ్ల పరిచయం, అనుబంధం ఉంది. వారి ఇంటి వాళ్లకు మా ఇంట్లో వాళ్లకు లేని ఇబ్బంది నీకేమిటి కరుణాకర్" అని టిటిడి చైర్మన్ బిఆర్. నాయుడు ఘాటుగా సమాధానం ఇచ్చారు. ఆమె లేదా కుటుంబీకులు మీకు చెప్పారా? లేదా ఫిర్యాదు చేశారా? మీకు వచ్చిన ఇబ్బంది ఏమిటో అర్థం కావడం లేదని నాయుడు వైసీపీని ఇరకాటంలో పడేశారు.
నా పరువు, ప్రతిష్ఠ, టీటీడీ పవిత్రతకు భంగం కలిగించే విధంగా మార్ఫింగ్ వీడియోలతో బురద జల్లిన వైసిపి నాయకులపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని బి ఆర్ నాయుడు ఆదివారం మధ్యాహ్నం మీడియాతో మాట్లాడుతూ హెచ్చరించారు. నేను పోలీసులకు ఫిర్యాదు చేశాను. ఆమె కుటుంబసభ్యులు కూడా హైదరాబాదులో ఫిర్యాదు చేయబోతున్నారని నాయుడు స్పష్టం చేశారు.
విషయం ఇదీ..
టిటిడి చైర్మన్ బీఆర్. నాయుడు ఓ మహిళలతో సన్నిహితంగా ఉన్న వీడియోలు వైరల్ అయిన విషయం తెలిసిందే. దీనిపై వైసీపీ అధికార ప్రతినిధి, టీటీడీ మాజీ చైర్మన్ బి కరుణాకరరెడ్డి తో టు ఆ పార్టీ నాయకులు ఆదివారం మీడియాలో అనేక ప్రశ్నలు సంధించారు.
"రాసలీల వ్యవహారం నేపథ్యంలోనే వైసీపీ ప్రభుత్వంలో ఎస్వీబీసీ చైర్మన్ పృథ్విని పదవి నుంచి తప్పించాం. బిఆర్. నాయుడుపై కూడా అదే తరహా చర్యలు తీసుకోవాలి" అని వైసిపి నేతలు టిడిపిని డిమాండ్ చేశారు.
కల్తీ నెయ్యి కేసులో డైవర్షన్ కోసమే..
తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం పై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఏకసభ్య కమిషన్ సోమవారం తిరుపతికి వస్తోందని టీటీడీ చైర్మన్ బి ఆర్. నాయుడు మీడియాకు చెప్పారు. ఈ అంశాన్ని పక్కదారి పట్టించడానికి వైసీపీకి ఉన్న సహజ అలవాటులో భాగంగానే, తన వ్యక్తిత్తాన్ని, పూర్తిగా ప్రైవేటు జీవితానికి సంబంధించిన విషయాలతో విషం చిమ్మారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో నాయుడు ఆదివారం మధ్యాహ్నం మీడియాతో మాట్లాడుతూ అనేక విషయాలను వెల్లడించారు.
ఆమెతో 30 ఏళ్ల పరిచయం
"వీడియోలో ఉన్న మహిళ కుటుంబంతో మా కుటుంబానికి 30 ఏళ్ల పరిచయం ఉంది. మా కుటుంబాలకు లేని దురద వైసిపికి ఎందుకు వచ్చింది" అని వైసిపి అధికార ప్రతినిధి భూమన కరుణాకర్ రెడ్డికి చురక వేశారు.
"సోషల్ మీడియాలో, ఆ తర్వాత అనేక మీడియా సంస్థల్లో మా కుటుంబాల పరువును ప్రతిష్టను దెబ్బతీసే విధంగా వ్యవహరించారు. నేను, ఆ మహిళ కుటుంబం కూడా ఫిర్యాదు చేస్తున్నారు. ఇంకా చాలా కేసులు నమోదు అవుతాయి. ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండు" అని కరుణాకరరెడ్డిని టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడు ఘాటుగా హెచ్చరించారు.
"25 నుంచి 30 ఏళ్ల క్రితం తీసుకున్న ఫోటోలను ఈ వీడియోలో కలిపి మార్ఫింగ్ చేశారు. ఈ పని చేసే గాడిదలు సరిగా కూడా చేయలేకపోయారు" అని నాయుడు ఎద్దేవా చేశారు. వీడియో నిజం కావచ్చు. అందులో ఏమి అశ్లీలత ఉందో సమాధానం చెప్పాలి అని ఆయన వైసీపీ నాయకులను నిలదీశారు.
బాబు చెప్పడంతో శాంతించా..
స్వతహాగా తాను రాజకీయ నాయకుడిని కాదని టీటీడీ చైర్మన్ బి.ఆర్ నాయుడు స్పష్టం చేశారు. వేరే పదవులకు అవకాశం ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబును మెప్పించి టిటిడిలో సేవ చేయడానికి మాత్రమే వచ్చా అని ఆయన చెప్పారు.
ప్రతి విషయంలో శ్రీవారి ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా వ్యవహరించవద్దనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సూచనల వల్లే టిటిడి మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి ఇంకా పరువుగా ఉన్నాడని నాయుడు అన్నారు.
"నేను చైర్మన్గా బాధ్యతలు తీసుకున్న మొదటి రోజు నుంచి నా పదవికి రాజీనామా చేయాలని కరుణాకర్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. కనీసం వారం, పది రోజులు, నెల కూడా నా పాలన చూడకుండానే మొదటి రోజు నుంచి నా రాజీనామా కోరారు" అని బి ఆర్ నాయుడు గుర్తు చేశారు. వైసీపీ ప్రభుత్వంలో టీటీడీ చైర్మన్గా పని చేసిన వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి వేల లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డారని కూడా నాయుడు ఆరోపించారు.
"నేను బాధ్యతలు చేపట్టిన మొదటి రోజు నుంచి నాపై బురదజల్లే కార్యక్రమం వైసిపి చేస్తోంది" అని బీఆర్ నాయుడు ఆరోపించారు. పదేపదే ఎందుకు ఇలా అంటున్నారని రీసెర్చ్ చేస్తే, చైర్మన్ కార్యాలయంలో వదిలి వెళ్లిన ఫైళ్లు చూస్తే, అక్రమాలు ఎన్నో చేశారనే ఆధారాలు దొరికాయని, వాటిని బయటపెడతాననే నా రాజీనామా కోరుతున్నారని నాయుడు చెప్పారు.
"ముఖ్యమంత్రి నారా చంద్రబాబు చేసిన సూచనతోనే సంయమనం పాటించాను. ఇక చేతులు ముడుచుకొని కూర్చోను" అని నాయుడు హెచ్చరించారు. చాలాసార్లు భూమన కరుణాకరరెడ్డి తనను కలవడానికి ప్రయత్నించినా, అవకాశం ఇవ్వలేదని ఆయన చెప్పారు.
"టీటీడీలో వ్యవహారాలు బయటపెట్టవద్దని కోరడానికే భూమన నాతో కలవడానికి విఫల యత్నం చేశారు" అని బీఆర్. నాయుడు చెప్పారు.
వేల టికెట్లు అమ్మేశారు..
వైసీపీ ప్రభుత్వంలో వేల టికెట్లు అమ్మవేసిన ఫైళ్ళని చైర్మన్ కార్యాలయంలోనే వదిలి వెళ్లారని, అవన్నీ తన దగ్గర ఉన్నాయని కూడా వైసిపి ప్రభుత్వం లో చైర్మన్గా పని చేసిన వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డిని తీవ్రస్థాయిలో హెచ్చరించారు.
తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వ్యవహారం చట్టబద్ధంగానే నీకు తేల్చడానికి టిటిడి, రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందనే విషయాన్ని ఆయన చెప్పారు.
"ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఆపకుంటే భూమన కరుణాకర్ రెడ్డి చేసిన కుంభకోణాలు ఇంకా 10 బైటికి వచ్చేవి" అని టిటిడి చైర్మన్ నాయుడు ఓ బాంబు పేల్చారు. తిరుమల పవిత్రత దెబ్బతింటుందని ముఖ్యమంత్రి చెప్పడం, హిందూ ధర్మానికి ఇది ధర్మం కాదని చేసిన సూచన వల్లే వైసిపి ప్రభుత్వం లో చేసిన దుర్మార్గాలను బయట పెట్టకుండా ఆపానని ఆయన చెప్పారు.
మద్రాసు సంగతి బయట పెట్టనా..?
"కరుణాకర్ రెడ్డి మద్రాస్ లో నువ్వు ఏమి చేసావో నాకు తెలుసు.. అనవసరంగా నన్ను కెలికావు. ఇక నీకు చుక్కలు చూపిస్తా" అని బీఆర్. నాయుడు తీవ్రస్థాయిలో హెచ్చరిక జారీ చేశారు. నా మీడియా సంస్థలు కూడా సీనియర్ జర్నలిస్టులు ఉన్నారు. నీ సంగతి తేలుస్తా. నీవు తినేసిన వీర లక్షల కోట్లు కథ ఏందో తేలుస్తా" అని తీవ్రంగా స్పందించిన బి.ఆర్ నాయుడు
"నేను టీటీడీ చైర్మన్ గా వచ్చిన తర్వాత నాపై ఒక అవినీతి మచ్చ అయినా ఉందా? నేను ఎలాంటి అవినీతి అక్రమాలకు పాల్పడ్డానా? నిరూపించండి" అని ఆయన సవాల్ విసిరారు.
"టీటీడీ చైర్మన్గా నాకు ఉన్న విచక్షణ అధికారాల్లో టికెట్లు జారీ చేసే అవకాశం ఉంది. 50% కూడా నేను టికెట్లు ఇవ్వడం లేదు. దీనివల్ల నా స్నేహితులే కాదు. బంధువులకు కూడా అసంతృప్తి కలిగింది. నీ తరహాలో నేను వేల టికెట్లు అప్పనంగా విక్రయించడం లేదు" అని టిటిడి చైర్మన్ బి.ఆర్ నాయుడు వైసిపి అధికార ప్రతినిధి కరుణాకర్ రెడ్డిపై నిప్పులు చెరిగారు.
Next Story

