
తిరుమలలో టీీడీ బోర్డు మీటింగ్ లో మాట్లాడుతున్న చైర్మన్ బీఆర్.నాయుడు, పక్కన ఈఓ రవిచంద్ర, బోర్డు సభ్యులు
టీటీడీ బడ్జెట్: 5,456.26 కోట్లతో ఆమోదం...
2026–27 బడ్జెట్ వివరాలు వెల్లడించిన చైర్మన్ నాయుడు
న్న రాష్ట్రంతో పరిపాలనలో పోటీపడే తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) 2026–27 ఆర్థిక సంవత్సరానికి రూ.5,456.26 కోట్ల బడ్జెట్‌కు ఆమోదం తెలిపింది. టీటీడీ పాలక మండలి సమావేశం శనివారం తిరుమలలోని అన్నమయ్య భవన్ లో జరిగింది. సమావేశం అనంతరం ఆమోదించిన బడ్జెట్ వివరాలతో పాటు, తీసుకున్న కీలక నిర్ణయాలను టీటీడీ చైర్మన్ బీ.ఆర్. నాయుడు వెల్లడించారు.
తిరుమలలోని అన్నమయ్య భవన్ లో ఆయన ఈఓ ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, జేఈఓలు వి.వీరబ్రహ్మం, డాక్టర్ ఏ .శరత్, సివిఎస్వో మురళికృష్ణ టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు వెల్లడించారు.
ముఖ్యాంశాలు ఇవీ..
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఆదేశాలతో టీటీడీ బోర్డు సబ్ కమిటీ సిఫార్సుల మేరకు టీటీడీ చరిత్రలో తొలిసారిగా తిరుమల తిరుపతి దేవస్థానం విద్యా సంస్థల్లో విద్యనభ్యసిస్తున్న విద్యార్థినీ, విద్యార్థులకు ఉన్నత ప్రమాణాలతో మెరుగైన విద్యను అందించేందుకు గాను రూ.118.89 కోట్లు కేటాయింపు. ఇందులో భాగంగా డిజిటల్ క్లాస్ రూములు, అదనపు హాస్టల్ బ్లాకులు, వంట గదుల ఆధునీకరణ, ఇతర మౌళిక సదుపాయాలు వంటి సమూలమైన మార్పులను తీసుకొచ్చేందుకు ఆమోదం.
శ్రీవారి ముడుపు పత్రం పథకం
భక్తుల విజ్ఞప్తి మేరకు శ్రీవారికి ముడుపులు అందించే దాతల సౌకర్యార్థం “శ్రీవారి ముడుపు పత్రం పథకం” ను ప్రయోగాత్మకంగా ప్రారంభించాలనే నిర్ణయం తీసుకున్నాం. ప్రస్తుతం భక్తులు మొక్కుల రూపంలో శ్రీవారి హుండీలో కానుకలు వేస్తున్నారు. ఇందుకు బదులుగా భక్తులు తిరుమలలో ఏర్పాటు చేసే కౌంటర్లలో UPI ద్వారా చెల్లింపులు చేస్తే అందుకు తగిన ముడుపు పత్రాలు అందజేస్తారు. వాటిని నేరుగా శ్రీవారి హుండీలో వేయవచ్చు. తద్వారా భక్తులు నగదు, నాణేలు తీసుకువచ్చేందుకు ఉన్న ఇబ్బందులు తొలగుతాయి.
తిరుమలలో భక్తుల సౌకర్యార్థం అదనంగా మరో అన్న ప్రసాద భవనం, ఆధునిక వంటశాలను అత్యాధునిక టెక్నాలజీతో నిర్మించేందుకు రిలయన్స్ సంస్థ రూ.100 కోట్ల నుండి రూ.120 కోట్లు విరాళం అందించేందుకు ముందుకు రావడంతో పనులు ప్రారంభించేందుకు ఆమోదం.
- ఆలయాలు, ప్రాకారాలు, రాజ గోపురాలు తదితర నిర్మాణాలకు అయ్యే ఖర్చును దృష్టిలో ఉంచుకుని తదనుగుణంగా శ్రీవాణి ట్రస్టు మార్గదర్శకాలను మార్పు చేసేందుకు ఆమోదం.
- ఒంటిమిట్టలో 108 అడుగుల జాంబవంతుడి విగ్రహం ఏర్పాటుకు గాను డ్రై ఐల్యాండ్ నిర్మించేందుకు నిర్ణయం. అందుకుగాను రూ.20.17 కోట్లతో పనులకు ఆమోదం.
- కోయంబత్తూర్, గువహటి, బెలగావి, అదేవిధంగా పాట్నా వద్ద మోకామ నగరంలో శ్రీవారి ఆలయాల నిర్మాణాలకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు టీటీడీకి కేటాయించిన భూమిని తీసుకునేందుకు ఆమోదం.
- వకుళమాత ఆలయంలో అక్షర గోవిందం పేరుతో అక్షరాభాస్య కార్యక్రమం ప్రారంభించాలని నిర్ణయం.
- ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏప్రిల్ 1వ తేదీన జరగనున్న శ్రీ సీతారాముల కల్యాణానికి విచ్చేసే దాదాపు 70 వేల మంది భక్తులకు ఈ ఏడాది అదనంగా రూ.50 విలువ చేసే తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని ఉచితంగా అందించాలని నిర్ణయించారు. గత ఏడాది తలంబ్రాల ప్యాకెట్ కిట్‌ను అందించారు.
- ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భక్తులను ఆకట్టుకునేలా రూ. 4.25 కోట్లతో విద్యుత్ అలంకరణలు, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్, ఎల్ఈడి బోర్డులు ఏర్పాటు చేయాలని నిర్ణయం.
- ఆర్మీ వెల్ఫేర్ ప్లేస్ మెంట్ ఆర్గనైజేషన్ ద్వారా తిరుపతిలో 356 మంది, తిరుమలలో 371 మంది భద్రత సిబ్బంది నియామకానికి ఆమోదం.
- అలిపిరి తనిఖీ కేంద్రంలో రూ.8 కోట్లతో ఎక్స్ రే బ్యాగేజ్ స్కానర్లు, డోర్ ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్లు ఏర్పాటుకు ఆమోదం.
- తిరుమల, తిరుపతిలోని టీటీడీ గోశాలలు, పలమనేరులోని శ్రీవేంకటేశ్వర ఇంక్యూబేషన్ సెంటర్ లలో రూ.11.28 కోట్లతో అభివృద్ధి పనులకు ఆమోదం.
- టీటీడీ ఆలయాల్లో పరిచారకులుగా పని చేస్తున్న 51 మందికి అర్చకులుగా పదోన్నతి కల్పించేందుకు గాను ప్రభుత్వానికి నివేదించాలని నిర్ణయం తీసుకున్నారు.
- పార్వతీపురం మన్యం జిల్లాలో శ్రీ వేంకటేశ్వర దివ్య క్షేత్రం నిర్మాణానికి రూ.14.25 కోట్లు కేటాయింపు.
- తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయం చుట్టూ సిమెంట్ రోడ్లు, డ్రైనేజీ తదితర అభివృద్ధి పనులకు ఆమోదం.
- దేశవ్యాప్తంగా ఉన్న టీటీడీ ఆలయాలు, సత్రాలు, విశ్రాంతి భవనాలు, యాత్రికుల వసతి సముదాయాలు, విద్యా సంస్థలు, ఆసుపత్రులు, కల్యాణ మండపాల భద్రతను పర్యవేక్షించేందుకు తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో రూ.10.75 కోట్లతో కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటుకు ఆమోదం.
- ఇటీవల చాలామంది తమ స్వప్రయోజనాల కోసం తిరుమలలో అసత్య కథనాలతో రీల్స్ చేసి సోషియల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఎంతో భక్తితో తిరుమల పుణ్యక్షేత్రానికి వచ్చే భక్తుల మనోభావాలను దెబ్బతినేలా పోస్టు పెట్టేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని టీటీడీ హెచ్చరించింది.
Next Story

