
తిరురమలలో విక్రయించే శ్రీవారి బంగారు, వెండి, రాగి డాలర్లు (ఫైల్)
తిరుమల శ్రీవారి డాలర్లు:ఇకపై ఆన్ లైన్ లో విక్రయం..
టీటీడీ ఫైనాన్స్ కమిటీ సిఫారసు
టీటీడీ ఆదాయం పెంచే లక్ష్యం
సామాన్యులకు డాలర్లు అందుబాటులోకి
వెబ్ సైట్ లో మార్పులు
ఇక తేదీ మాత్రమే ఖరారు చేయడమే ఆలస్యం..
శ్రీవారి బంగారు డాలర్లు కావాలంటే తిరుమలకే రావాల్సిన అవసరం లేదు. టిటిడి వెబ్ సైట్ ( TTD Website) డిజిటల్ ప్లాట్ఫారం వేదికగా విక్రయించడానికి సన్నద్ధమైంది. దేశంలో ఎక్కడి నుంచి అయినా వెబ్సైట్లో కొనుగోలు చేస్తే పోస్ట్ ఆఫీస్ ల ద్వారా అందించడానికి టిటిడి సిద్ధమైంది. బులియన్ మార్కెట్ ధరతో పోలిస్తే, శ్రీవారి డాలర్ ధర దాదాపు రూ. 10 వేలకు తక్కువగా ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్ ప్రభావాల నేపథ్యంలో మార్కెట్ లో రోజూ వారి ధరలు మారినా, టీటీడీ విక్రయించే డాలర్ ధర వారానికి ఒకసారి మారుతుంటుంది.
టీటీడీ ఆదాయం పెంచుకునే మార్గాల్లో శ్రీవారి బంగారు డాలర్లను డిజిటల్ ప్లాట్ఫారం ద్వారా విక్రయించడానికి పరిశీలించాలని టిటిడి ఆర్థిక సలహా కమిటీ అధికారులకు సూచన చేసింది.
"సామాన్య యాత్రికులకు కూడా డాలర్లు అందుబాటులో ఉంచడానికి ఈ ప్రతిపాదన చేశాం" అని కూడా టిటిడి పాలకమండలి, ఫైనాన్స్ కమిటీ స్పష్టం చేసింది.
"ఒక గ్రామం నుంచి 10 గ్రాముల బరువు ఉన్న తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారితో పాటు పద్మావతి అమ్మవారి ప్రతిమ ఉన్న బంగారు డాలర్ తయారీ' కి కూడా చర్యలు తీసుకోవాలని టిటిడి అధికారులను కమిటీ ఆదేశించింది.
తిరుమల శ్రీవారి ఆలయం ఎదుట అఖిలాండానికి సమీపంలో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేసి శ్రీవారి బంగారు వెండి డాలర్లను టీటీడీ విక్రయిస్తుంది. ఈ డాలర్లను 10, ఐదు, రెండు గ్రాముల బరువుతో తయారు చేస్తున్నారు. అలాగే వెండితో 50, 10, ఐదు గ్రాముల బరువుతో వెండి డాలర్లను కూడా తయారు చేయించి విక్రయిస్తున్నారు.
2006లో టీటీడీ డాలర్లను మెంట్ ( Mint) లో తయారు చేయించేది. తిరుమల శ్రీవారికి యాత్రికులు నిలువుదోపిడీ ఇవ్వడం, సమర్పించిన ఆభరణాలు పరకామణి ( కానుకల లెక్కింపు కేంద్రం)లో వేరు చేసి, తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనానికి తరలించి, ట్రెజరీలో భద్రపరుస్తారు. ఆ బంగారు ముంబైలోని మింట్ కు పంపించడం ద్వారా డాలర్లు తయారు చేయించి తెప్పిస్తారు.
తిరుమల శ్రీవారి ఆలయం బొక్కసం (ట్రెజరీ)కి తరలిస్తారు. తిరుమలలోనే ఏర్పాటు చేసిన కౌంటర్ ద్వారా ఇప్పటి వరకు విక్రయిస్తున్నారు.
ధర తక్కువ..
జ్యువెలరీషాప్ లో విక్రయించే బంగారానికి, బులియన్ మార్కెట్ ప్రకటించే ధరలకు శ్రీవారి డాలర్ ధర భిన్నంగా ఉంటుంది. మార్కెట్లో బంగారు ధర మండుతున్న పరిస్థితుల్లో శ్రీవారి డాలర్ ధర రూ 10 వేలకు తక్కువగానే ఉంటుంది.
బహిరంగ మార్కెట్లో బంగారు ధర పెరుగుతున్న నేపథ్యం. స్వచ్ఛమైన బంగారు తో తయారు చేసిన శ్రీవారి డాలర్లను సామాన్య భక్తులకు కూడా అందుబాటులో ఉంచాలనేది టిటిడి లక్ష్యం. ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకొని డాలర్లు ఆన్లైన్లో విక్రయించాలని సంకల్పించారు. తేదీ ప్రకటించడమే మిగిలి ఉంది.
2025 ఏప్రిల్ 22వ తేదీ దేశీయ మార్కెట్లో బంగారు ధర ఆల్ టైం రికార్డుకు చేరిన సమయం అది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారు లక్ష రూపాయలు దాటింది. షాపుల్లో బంగారు కొంటే తరుగుతోపాటు, జీఎస్టీ కూడా మూడు శాతం చెల్లించాలి. అంటే 10 గ్రాముల బంగారు ఆభరణం సుమారు 1. 13 లక్షలు అవుతుందని అంచనా. అదే శ్రీవారి డాలర్ తిరుమలలో కొనుగోలు చేస్తే 91 వేల రూపాయలకే దొరికింది. అంటే సుమారు 20వేల రూపాయలు తేడా కనిపించింది.
2026 మార్చి 11వ తేదీ బులియన్ మార్కెట్ ధర ప్రకారం 10 గ్రాముల బరువున్న 24 క్యారెట్ల బంగారం ధర 1.83,123 రూపాయలు పలుకుతోంది.
తిరుమలలో 10 గ్రాముల బరువు ఉన్న 24 క్యారెట్ల శ్రీవారి డాలర్ 1,85,555కు అందుబాటులో ఉంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటి అంటే తిరుమల లో బంగారు డాలర్ ధర ప్రతి మంగళవారం నిర్ణయం జరుగుతుంది. బులియన్ మార్కెట్ కు విభిన్నంగా ఇక్కడి బంగారు, వెండితో తయారు చేసిన శ్రీవారి డాలర్లు విక్రయాలు జరుగుతుంటాయి.
టీటీడీ సేవలో తపాలాశాఖ
శ్రీవారి యాత్రికులు టీటీడీకి ఇప్పటికే తపాలా శాఖ అనుసంధాన కర్తగా మారింది. శ్రీవారి హుండీ, టిటిడి ట్రస్టులకు ఈ మనీయార్డర్ పంపించడానికి తపాలా శాఖ టిటిడితో ఒప్పందం కుదుర్చుకుంది.
ఈ పద్ధతిలోనే తపాలా శాఖ ద్వారా బంగారు డాలర్లు కూడా డిజిటల్ ప్లాట్ఫారం పై కొనుగోలు చేసే యాత్రికుడికి బట్వాడా చేసేందుకు టీటీడీ ఒప్పందం చేసుకునే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాల ద్వారా తెలిసిన సమాచారం.
ఎలాగంటే..
తిరుమల శ్రీవారి బంగారు, వెండి డాలర్లను విక్రయించడానికి టిటిడి పగడ్బందీ వ్యవస్థను అందుబాటులో తీసుకురాబోతోంది. టీటీడీ అధికారిక వెబ్సైట్లో ప్రత్యేకంగా డాలర్ల విక్రయాల కోసం పోర్టల్ ఏర్పాటు చేస్తారు. అందులో డాలర్ కోసం నగదు చెల్లించి, వివరాలు నమోదు చేసిన తరువాత రసీదు వస్తుంది. ఆ వివరాలన్నీ పరిశీలించిన తరువాత టీటీడీ నగదు చెల్లించిన భక్తుడికి పోస్టల్ శాఖ ద్వారా బంగారు డాలర్ పంపిస్తారు.
భద్రత: బంగారు లేదా వెండి డాలర్ కొనుగోలు చేసిన వ్యక్తి ఇంటికి సురక్షితంగా పంపించడానికి కూడా టీటీడీ సిద్థమైంది. బంగారు డాలర్ కు భద్రత కల్పించే దిశగా ఎటువంటి నష్టం జగకుండా ట్రాన్సిట్ ఇన్సూరెన్స్ ( Transit Insurance ) సదుపాయం కూడా కల్పించే అవకాశం ఉందని టీటీడీ మార్కెటింగ్ విభాగం అధికారుల ద్వారా తెలిసిన సమాచారం.
ఆదాయం పెంపుదల కోసం..
టీటీడీకి ప్రస్తుతం శ్రీవారి హుండీ ద్వారా రోజుకు సగటున 3.5 కోట్ల నుంచి నాలుగు కోట్ల రూపాయల ఆదాయం లభిస్తోంది. యత్రికులు సమర్పించే తలనీలాల ద్వారా ఏడాదికి 15 వందల కోట్ల రూపాయాల వరకు ఆదాయం దక్కుతోంది. ఇవి కాకుండా, కొబ్బరి చిప్పల విక్రయం తో పాటు తొమ్మిది ట్రస్టులకు దాతలు అందించే విరాళాల ద్వారా ఆదాయం లభిస్తుంది. వీటికి తోడుగా..
శ్రీవారి బంగారు, వెండి డాలర్ల విక్రయం ద్వారా కూడా మరింత ఆదాయం పెంచుకునే దిశగా డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి తీసుకురావాలని టీటీడీ ఫైనాన్స్ కమిటీ సిఫారసు చేసింది.
శ్రీవారి డాలర్ ప్రస్తుతం బరువును బట్టి డిజైన్ తయారు చేస్తారు. మరింత ఆకర్షణీయంగా డాలర్లు తయారు చేయించాలి. ఒకటి నుంచి పది గ్రాముల బరువు ఉండే డాలర్ల తయారీకి డిజైన్లు తయారు చేయాలి. సామాన్యుల నుంచి సంపన్న యాత్రికుల వరకు వారి ఆర్థిక స్తోమతకు తగినట్టు డాలర్లను ప్రసాదంగా తీసుకుని అవకాశం కల్పించాలి" అని టిటిడి ఫైనాన్స్ కమిటీ సిఫారసు చేసింది.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులు డాలర్లు ఆన్లైన్లో కొనుగోలు చేస్తే, తిరుమల నుంచి లేదా టిటిడి ప్రధాన పరిపాలన భవనంలోని కార్యాలయం నుంచి తపాలా శాఖ ద్వారా భద్రంగా పంపించవచ్చు అని టిటిడి ఫైనాన్స్ కమిటీ సిఫార్సు చేసింది. దీంతో టీటీడీ అధికారిక వెబ్ సైట్, యాప్ ద్వారా విక్రయాలు జరిపేందుకు సాంకేతికంగా కూడా ఏర్పాట్లు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.
Next Story

