చిత్తూరు మామడి పరిశ్రమలను తాకిన ఇజ్రేల్-ఇరాన్ యుద్ధం
x

చిత్తూరు మామడి పరిశ్రమలను తాకిన ఇజ్రేల్-ఇరాన్ యుద్ధం

ఇరాన్ యుద్దంతో ఆగిన వెయ్యి టన్నుల మామిడి గుజ్జు, 600 టన్నుల అరటి


చిత్తూరు రైతులకు ఈ ఏడాది కష్టాలే..?

రాయలసీమలో అరటి రైతులకు కడగండ్లు

దేశీయ మార్కెట్లే శరణ్యం అంటున్న వ్యాపారులు

రాయలసీమలో ఉద్యానవన పంటలపై ఇరాన్ యుద్ధం శరాఘాతంగా మారింది. చిత్తూరు జిల్లాలో పండే తోతాపురి రకం మామిడి పంట, మామిడి గుజ్జు (Mango pulp) పరిశ్రమలను మధ్య ప్రాచ్య యుద్ద వాతావరణం దెబ్బతీసింది. దీనితో గుజ్జు ఎగుమతులు ఆగిపోయాయి. దిగుమతిదారులు షిప్ మెంట్ రద్దు చేస్తున్నట్లు పరిశ్రమల యజమానులకు సందేశాలు పంపారు. ఈ ఏడాది మామిడి సీజన్ మొదలవుతున్నా అరబ్బు దేశాల తోపాటు మధ్యప్రాఛ్య దేశాలేవీ కూడా గుజ్జు కొనుగోలు కాంట్రాక్టు చేసుకునేందుకు ముందుకు రాలేదు. సాధారణంగా ఈ ప్రక్రియ మార్చి నెలాఖరులే దా ఏప్రిల్ మొదటి వారంలో జరుగుతుంది.

ఇదే పరిస్థితిన అనంతపురం, కడప జిల్లాల అరటి రైతులకు కూడా ఎదురవుతూ ఉంది.యుద్ధం వల్ల ఎగుమతులు ఆగిపోవడంతో రైతులకు ట్రేడర్లకు భారీగా నష్టం వాటిల్లింది. ఈ రెండు జిల్లాలనుంచి రోజుకు 600 టన్నుల అరటి ఎగుమతులు ఆగిపోయాయి. దీంతో సగటున రెండు కోట్ల నుంచి మూడు కోట్ల రూపాయలు రైతులు నష్టపోతున్నారు.

" చిత్తూరు జిల్లాలో ఇప్పుడిప్పుడే గుజ్జు ఎగుమతి ప్రారంభం కాబోతున్నది. అయితే నేపథ్యంలో ఇరాన్ యుద్ధ ప్రభావం వల్ల హార్ముజ్ జలసంధి ద్వారా సముద్రమార్గంలో నౌక రవాణా ఆపివేశారు. కంటైనర్ కాంట్రాక్టు తాత్కాలికంగా రద్దు చేస్తున్నాం" అని కంటెనర్లు గుజ్జు పరిశ్రమల యజమానులకు దేశంలోని నౌకాశ్రయాలకు సమీపంలోని రాష్ట్రాల బయ్యర్లకు ఈ మెయిల్ సందేశం పంపించారు.

చిత్తూరు జిల్లాలో 47 గుజ్జు పరిశ్రమలు ( Pulp industries) గత ఏడాది ఉత్పత్తి చేసిన గుజ్జు ఇప్పుడిప్పుడే ఎగమతులు ప్రారంభమమయ్యాయి. ఇరాన్ యుద్ధ తీవ్రతరం కావడం, హార్ముజ్ జలసంధి మూసి వేశారు. దీంతో దేశం నుంచి మామిడి గుజ్జ దిగుమతి చేసుకొనే గల్ఫ్ దేశాల్లో సౌదీ అరేబియా, ఒమన్, దుబాయ్ తోపాటు ఇతర దేశాలకు గుజ్జు ఎగుమతి పూర్తిగా ఆగిపోయింది. సుమారు లక్ష టన్నుల గుజ్జు గోదాములకే పరిమితమైంది. ఈ పరిణామాలు పండ్ల పరిశ్రమదారులు, తద్వారా రైతులపై తీవ్ర ప్రభావం చూపుతోంది.

గత ఏడాది ఉక్రేయిన్ యుద్ధంతో ..

గత సంవత్సరం యూరోపియన్ దేశాల యుద్ధం వల్ల చిత్తూరు మామిడి రైతులు, గుజ్జు పరిశ్రమలను సంక్షోభంలో పడేసింది. రష్యా- ఉక్రేయిన్ యుద్ధంతో గాజాపై ఇజ్రాయిల్ దాడులు. భారత ఉత్పత్తులపై 28 నుంచి 30 శాతం దిగుమతి సుంకం విధించడం. ఇవన్నీ వెరసి చిత్తూరు జిల్లాలో మామిడి గుజ్జు పరిశ్రమ కుదేలైంది.

బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలపై మారిటోరియం ఇవ్వాలని అప్పట్లో ఆల్ ఇండియా ఫుడ్ ప్రాసెసర్ అసోసియేషన్ (all India food processor association- Aifpa) సౌత్ జోన్ చైర్మన్, చిత్తూరు జిల్లా మామిడి గుజ్జు పరిశ్రమల యజమానుల సంఘం ప్రధాన కార్యదర్శి కట్టమంచి గోవర్ధన్ బాబి కోరారు.

ఈ ఏడాది ఇరాన్..

"గత ఏడాది యూరోపియన్ దేశాల్లో యుద్ధం. ఇప్పుడు ఇరాన్ యుద్ధం వల్ల మధ్యప్రాచ్య దేశాలకు గుజ్జు ఎగుమతి చేయలేని పరిస్థితి ఏర్పడింది. కంటైనర్లు కూడా రద్దు చేశారు. యజమానులే స్వయంగా ఎగుమతి చేసే పరిస్థితి లేదు" అని గోవర్థన బాబీ ఆందోళన చెందారు.

పాలస్తీనా, ఇజ్రాయిల్ దేశాల్లో యుద్ధ ప్రభావం చిత్తూరు జిల్లాపై పడింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లోని (United Arab Emirates) ఒమన్ (Oman) ప్రభుత్వ రంగ బయ్యర్లు ముందుకు రాకపోవడం వల్ల చిత్తూరు జిల్లాలో నిల్వలు భారీగా పేరుకు పోవడానికి దారితీసిందని ఆయన వివరించారు.

గత ఏడాది మిగిలి ఉన్న లక్ష టన్నులు ఎగమతులు గత 20 రోజుల నుంచి స్వల్పంగా ప్రారంభం అయ్యాయి. ఇదే సమయంలో ఇరాన్ యుద్ధం వల్ల షిప్ మెంట్ రద్దు చేశామంటూ బయ్యర్ల నుంచి సందేశం అందిందని బాబీ ఆవేదన చెందారు.

చిత్తూరు జిల్లాలో 87,500 ఎకరాల్లో (దాదాపు 1.10 లక్షల హెక్టర్లు) గత ఏడాది సుమారు 88 వేల మంది రైతులు మామిడి తోటలు సాగు చేస్తున్నారు. గత ఏడాది ఊహించని దిగుబడి వచ్చింది. ఈ సారి కూడా అదే పరిస్థితి ఉన్నట్లు మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

జిల్లాలో మరో 47 పరిశ్రమలు చిత్తూరు, పలమనేరు, పూతలపట్టు నియోజకవర్గం పరిధిలో మామిడి గుజ్జు తీసే పరిశ్రమలు 47 ఉన్నాయి. అందులో తిరుపతి ప్రాంతాల్లో ఆరు మామిడి గుజ్జు పరిశ్రమలు ఉన్నాయి. ఈ పరిశ్రమలో ఏటా సీజన్లో 7 లక్షల టన్నుల మామిడి కాయలు ప్రాసెస్ చేయగలిగినంత సామర్థ్యం ఉంది. ఇంత భారీ స్థాయిలో ప్రాసెస్ చేస్తే, 3.50 లక్షల టన్నుల గుజ్జు దిగుబడి వస్తుంది.

కంటైనర్లు రద్దు...

దేశంలోని ముంబై, చెన్నై, కోలకతా తోపాటు ఢిల్లీలోని సుమారు 20 ఏజెన్సీల నుంచి బయ్యర్లు ఆర్డర్ల ద్వారా గుజ్జు కొనుగోలు చేస్తారు. పరిశ్రమల నుంచి పోర్టు వరకు యజమానులు కంటైనర్లలో మామిడిగుజ్జ పంపిస్తే, అక్కడి నుంచి ఓడ ద్వారా విదేశాలకు ఎగుమతి చేయడం ఓ పద్ధతి. ప్రస్తుత పరిస్థితుల్లో గుజ్జు పరిశ్రమల యజమానులే విదేశాల దాకా పంపడం సాహసంతో కూడుకున్నది. ఆ భారం భరించలేం..

సాధారణ రోజుల్లో సముద్రమార్గాన కంటైనర్ రవాణా జరిగేది. చిత్తూరు జిల్లాలోని పరిశ్రమల నుంచి కంటైనర్ లో పల్ఫ్ డబ్బాలు, భారీ డ్రమ్ములు నింపేవారు. ఈ కంటైనర్ (container) చెన్నై సమీపంలోని నౌకాశ్రయానికి చేరేది. అక్కడి నుంచి ఓడల్లో (ship) ఎర్రసముద్రం (Red Sea) మీదుగా గల్ఫ్, అరబ్ ఎమిరేట్స్, ఇతర యూరోపియన్ దేశాలకు రవాణా జరుగుతుంది.

ఉదాహరణకు ఎర్రసముద్రం మీదుగా ఓ కంటైనర్ తీసుకువెళ్లాలంటే వెయ్యి డాలర్లు అవుతుందనుకుందాం. ఇప్పుడు శ్రీలంక మీదుగా అనేక దేశాలు చుట్టుకుని వెళ్లడం వల్ల ఆ భారం 5వేల నుంచి 6000 డాలర్లు భరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే 500 నుంచి 600. శాతం భారం పెరిగింది. అని గోవర్ధన్ బాబి విశ్లేషించారు.

1. చెన్నై వరకు పరిశ్రమల యజమానులు తరలించడం ఒక పద్ధతి. అక్కడి నుంచి బయ్యర్ తరలిస్తారు.

2. రెండో విధానం. ఒక పద్ధతిలో కొంతవరకు పరిశ్రమల యజమానులే రవాణా చేస్తారు. ఆ తర్వాత పొరుగు దేశాల బయ్యర్లు కంటైనర్లు తీసుకువెళ్తారు. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది.

"అన్ని ఖర్చులు పరిశ్రమల యజమానులు భరించాలని అంటున్నారు. దీని వల్ల ఆర్థిక భారం భరించడం శక్తికిమించిన భారంగా మారింది" అని బాబి పరిశ్రమల యజమానులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించారు.

ఇందులో రెండు పద్ధతులు ఉంటాయి.

1. Fob (forwarding on board)పరిశ్రమ నుంచి చెన్నై వరకు కంటైనర్ చేరవేయడం యజమాని బాధ్యత. అక్కడి నుంచి షిప్ లోకి ఎక్కించడం. వారికి అవసరమైన దేశానికి తరలించే బాధ్యత బయ్యర్ ఖర్చు భరిస్తారు

2. C and F (clearing and forwarding) అంటే మామిడి గుజ్జు తీసిన పరిశ్రమ నుంచి కంటైనర్ చెన్నై షిప్పియార్డుకు తీసుకెళ్లడం. అక్కడి నుంచి నిర్దిష్ట దేశానికి తరలించే ఖర్చు మొత్తం పరిశ్రమ యజమాని భరించాలి.

"మొదటి పద్ధతి వల్ల కొంతమేరకు మాత్రమే పరిశ్రమ యజమాని ఖర్చు భరించాలి. రెండో పద్ధతిలో పూర్తిగా భరించడం మరింత భారం అవుతుంది" అని బాబి వివరించారు. ప్రాసెసింగ్ యూనిట్ యజమానులే ఆ భారం మొత్తం భరించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

"ఇది అత్యంత ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కావడం వల్ల ఎగుమతులకు సాహసించ లేకపోతున్నాం" అని బాబి విశ్లేషించారు.

ప్రభుత్వం స్పందించాలి..

అరటి రైతుకు దెబ్బ

ఇరాన్ యుద్దం కారణంగా అనంతపురం, కడప జిల్లాల నుంచి రోజుకు 600 టన్నుల అరటి ఎగుమతులు ఆగిపోయాయి. దీంతో రోజూ సగటున రెండు కోట్ల నుంచి మూడు కోట్ల రూపాయల వ్యాపారం ఛిద్రమైంది.

ఢిల్లీ నుంచి బయ్యర్లు ముందుకు రాని స్థితిలో కువైట్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యూకే దేశాలకు యుగమతులు ఆగిపోయాయి. నాయకులు జోక్యం చేసుకుంటేనే మేలు జరుగుతుందని పులివెందుల ప్రాంతానికి చెందిన రైతు హరినాథరెడ్డి అభిప్రాయపడ్డారు.

అనంతపురం జిల్లా నుంచి రోజుకు 300 నుంచి 500 టన్నుల అరటి ఎగుమతులపై ఇరాన్ యుద్ధం తీవ్ర ప్రభావం చూపింది. జిల్లాలో సాగులోని 15,990 హెక్టార్లలోని అరటి తోటల రైతులను తీవ్రంగా దెబ్బతీసింది.

"జిల్లాలో సాగు చేసే అరటిలో 15 నుంచి 20 శాతం ఇరాన్, ఇరాక్, సిరియా తోపాటు అరబ్ ఎమిరేట్స్ దేశాలకు ఢిల్లీ వ్యాపారులు ఎగుమతి చేస్తున్నారు" అని అనంతపురం ఉద్యానవన శాఖాధికారి రాజ్యలక్ష్మి తెలిపారు. 12 టన్నుల సామర్ధ్యం ఉన్న కంటైనర్లు రోజుకు అనంతపురం నుంచి తాడిపత్రి ద్వారా 40 వాహనాలు వెళుతుంటాయని ఆమె వివరించారు.

జిల్లాలో నార్పల, పుట్లూరు, యల్లనూరు, తాడిపత్రి, యాడికి, కల్యాణదుర్గం మండలాల్లో రైతులు నీటి వనరులు సద్వినియోగం చేసుకుంటున్నారు. ప్రతి రైతు డ్రిప్ పద్ధతిలో నీటిని పొదుపుగా వాడి, ఉద్యానవన పంటలు సాగుచేస్తుంటారని ఉద్యానవన శాఖాధికారి రాజ్యలక్ష్మి వివరించారు.

పడిపోయిన ధరలు

"పది రోజుల కిందట టన్ను అరటికాయలు 22 వేల వరకు పలికాయి. యుద్ధ ప్రభావం వల్ల ప్రస్తుతం టన్ను 13 వేల నుంచి 15 వేలకు తగ్గింది" అని తెలిపారు.

సాధారణ రోజుల్లో 80 శాతం అరటి ఢిల్లి, పంజాబ్, జమ్మూ, మహారాష్ట్రకు రవాణా అవుతున్నట్లే పూర్తిగా స్వదేశీ మార్కెట్లే ఆదుకోవాల్సిన అనివార్యమైన పరిస్థితి ఏర్పడింది. దీనిపై జిల్లా అధికారులు సమీక్షిస్తున్నారని ఉద్యానవన శాఖాధికారి స్పష్టం చేశారు. ఇరాన్ యుద్ధం సమసిన తరువాత జలరవాణాకు మార్గం సుగుమం అయ్యే వరకు పరిస్థితి ఇలాగే కొనసాగుతుందని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

పులివెందులపై అరటిపై తీవ్ర ప్రభావం..

కడప జిల్లాలో పులివెందుల తరువాత రైల్వే కోడూరు, రాజంపేట, బద్వేలు ప్రాంతాల్లో మామిడి తోపాటు అరటి తోటలు సాగుకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది. పులివెందుల నియోజకవర్గంలోని తొండూరు, వేముల, లింగాల మండలాల్లో మాత్రమే 26,416 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. అరటి కాయలు విదేశాలకు రోజుకు 60 నుంచి 70 టన్నుల ఎగుమతి చేస్తున్నారు. ఢిల్లీ నుంచి వచ్చే వ్యాపారులు కొనుగోలుకు ఈ ప్రాంతంలో నవంబర్ నుంచి ఏప్రిల్ వరకు అరటికాయలకు పీక్ సీజన్ (Peak season ) లో యుద్ధమేఘాలు కమ్ముకున్న పరిస్థితుల్లో ధరలు కుదేలయ్యాయి.

"పది రోజుల కిందట కూడా టన్ను అరటికాయలు 20 వేల నుంచి 25 వేలు పలికాయి. ఇప్పుడు ఏడు నుంచి తొమ్మిది వేల రూపాయలకు పడిపోయింది" అని రైతు శ్రీనివాసులురెడ్డి చెప్పారు. మొదటి కోత కాయలు టన్ను 25 వేల వరకు ఉంటుంది. ఇప్పుడు రెండో కోత జరిగే సమయం సీజన్ ముగింపులో కనీసంగా 13 నుంచి 15 వేలు పలకాల్సిన ధరలు పడిపోవడం రైతులకు తీవ్ర నష్టం కలిగించిందని శ్రీనివాసులు రెడ్డి చెప్పారు.

పులివెందుల అరటిని దేశీయ మార్కెట్లో ఆదుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఉద్యానవన శాఖాధికారి రాఘవేంద్రరెడ్డి చెప్పారు.

"ఈ ప్రాంతం నుంచి ఢిల్లీ నుంచి వచ్చే వ్యాపారులు అనంతపురం జిల్లాతో పాటు పులివెందులలో కూడా అరటికాయలు కొనుగోలు చేస్తుంటారు. రోజుకు కనీసంగా 60 నుంచి 70 టన్నుల ఎగుమతి జరుగుతుంటుంది" అని రాఘవేంద్రరెడ్డి వివరించారు. పులివెందులలో పండించే అరటికాయల్లో 40 శాతం కువైట్, గల్ఫ్ దేశాలు, ఇరాన్, యుఏఈ ( United Arab Emirates UAE) దేశాలకు, మిగతా 60 శాతం దేశీయ మార్కెట్లకు రవాణ జరుగుతున్నదని రాఘవేంద్రరెడ్డి వివరించారు.

"ఇరాన్ యుద్ధం కారణంగా పులివెందుల నుంచి ఎగుమతులు ఆగిపోవడం వల్ల పూర్తి స్థాయిలో ఢిల్లీ, మహారాష్ట్ర, జమ్మ అండ్ కాశ్మీర్, బెంగళూరు మార్కెట్లు మాత్రమే అరటి దిగుబడి కొనుగోలు చేయాల్సిన పరిస్థితి" ఉందని రాఘవేంద్రరెడ్డి చెప్పారు. దీనిపై జిల్లా అధికారులు కూడా దృష్టి సారించారని ఆయన వివరించారు.

దళారులు ధరలు తగ్గించి కోనుగోలు చేయడం ద్వారా నష్టాలు తప్పలేదని అమ్మకపల్లెకు చెందిన రైతు హరినాథరెడ్డి వేదన చెందారు.

"నేను పది ఎకరాల్లో అరటి తోటలు సాగు చేస్తున్నా, ప్రస్తుతం టన్నుకు రూ. ఎనిమిది నుంచి తొమ్మిది వేలు కూడా రైతుకు దక్కడం లేదు" అని హరినాథరెడ్డి చెప్పారు. ఈయన ఏమంటున్నారంటే..

20 కంపెనీల నుంచి కొనుగోళ్లు..

ఢిల్లీ నుంచి వచ్చి అనంతపురంలో మకాం వేసే వ్యాపారులు పులివెందులలో కూడా అరటి కొనుగోలుకు మధ్యవర్తులను ఏర్పాటు చేసుకున్నారు. వ్యాపారుల కంటే దళారుల పాత్రే కీలకంగా మారిందనేది రైతుల ఆరోపణ. సుమారు 20 కంపెనీలు (ఏజెన్సీలు) వ్యాపారులు ఈ ప్రాంతంలో కొనుగోలు చేసే అరటి కాయలు తాడిపత్రి వద్ద కంటైనర్లకు చేర్చడానికి కేంద్రంగా ఏర్పాటు చేసుకున్నారు. 32 గంటల ప్రయాణం తరువాత ముంబైలోని తెంబుర్తి వద్ద కోల్డ్ స్టోరేజీ ప్లాంట్ లో నిలువ ఉంచి, జవహర్ లాల్ నెహ్రూ పోర్టు వద్దకు చేర్చడం ద్వారా షిప్పింగ్ కోసం నిరీక్షిస్తారు. అక్కడి నుంచి ఓడ సిద్ధంగా ఉందనే పోర్టు అధికారుల అనుమతితో సముద్రమార్గంలో పశ్చిమాసియా దేశాలతో పాటు గల్ఫ్, యూఏఈ దేశాలకు కూడా రవాణా చేస్తున్నారు.

"అనంతపురం, పులివెందుల ప్రాంతాల్లో సాగు చేసే జీ-9 ( Gra 9 ) రకం అరటి 15 రోజుల నుంచి 20 రోజుల పాటు నిలువ సామర్థ్యం ఉంటుంది" అని పులివెందుల ఉద్యానవన శాఖాధికారి రాఘవేంద్రరెడ్డి చెప్పారు.

Read More
Next Story