Bird flu | సదుం దాటని కోళ్ల మృత్యుఘోష..
x

Bird flu | సదుం దాటని కోళ్ల మృత్యుఘోష..

భయం లేదంటున్న కలెక్టర్. చికెన్ ధరపై కనిపించని ప్రభావం.


వైరస్ సోకిన కోళ్లతో రైతులకు నష్టం

ఖననం చేసిన 12,312 కోళ్లకే పరిహారం

2021 నిబంధనలు ఇవీ..


అన్నమయ్య మదనపల్లె జిల్లాలో వెలుగు చూసిన బర్డ్ ఫ్లూ కలకలం రేపింది. ఇది రీటైల్ మార్కెట్ లో చికెన్, గుడ్ల ధరలపై ఏమాత్రం ప్రభావం చూపించలేదు. బర్డ్ ఫ్లూ సదుం మండలం నుంచి మిగతా 24 మండలాలకు విస్తరించలేదని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ స్పష్టం చేశారు. నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లిస్తామని ఆయన హామీ ఇచ్చారు. చికెన్, గుడ్లు ఎలా ఉడికించి తినాలనే విషయంలో పశుసంవర్ధక శాఖాధికారులు సూచనలు చేశారు.

మదనపల్లె జిల్లా సదుం మండలం పుత్తవారిపల్లె, అమ్మగారి పల్లె, కంబంవారిపల్లెలోని మూడు కోళ్ల ఫారాల్లో గత శుక్రవారం కోళ్లు అసహజ మరణానికి గురైన విషయం తెలిసిందే. కోళ్ల అవశేషాలను భోపాల్ లోని హై సెక్యూరిటీ ల్యాబ్ కు శాంపిల్స్ పంపించారు. బర్డ్ ఫ్లూ వల్ల మరణించాయని తేలడంతో 8 ర్యాపిడ్ రెస్పాన్స్ బృందాలతో స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (SOP ప్రకారం ఆ కోళ్లను ఖననం చేయించారు.
చిత్తూరు జీడీ. నెల్లూరు నియోజకవర్గం కార్వేటినగరం మండలం బీవీ ఆర్కే. పేట లో కూడా వెయ్యి నాటు కోళ్లు మరణించిన విషయం తెలిసిందే. ఇవి కూడా బర్డ్ ఫ్లూ వల్ల మరణించాయని పశుసంవర్ధక శాఖ అధికారులు ప్రాధమికంగా నిర్ధారించారు.
"సదుం మండలం పుత్తవారిపల్లె, అమ్మగారిపల్లె, కంబంవారిపల్లెల్లో 12,312 కోళ్లకు వైరస్ సోకకుండా ఖననం చేశాం. ఇవన్నీ నాటు కోళ్లే. వాటిలో కొన్ని 80 రోజులు, కొన్ని 90 రోజుల వయసు ఉన్న కోళ్లే" అని పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ గుణశేఖర్ పిళ్లై చెప్పారు. దీనికి కేంద్ర ప్రభుత్వ 2021లో తెచ్చిన ఉత్తర్వుల ప్రకారం పరిహారం అందించడానికి సిఫారసు చేస్తామని ఆయన చెప్పారు.

జాగ్రత్తల వల్లే విస్తరించలేదు..

సదుం మండలంలోని మూడు గ్రామాల్లో బర్డ్ ఫ్లూ గుర్తించిన వెంటనే ముందు జాగ్రత్తలు తీసుకున్నామని పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ గుణశేఖర్ పిళ్లై తెలిపారు. ఈ మూడు గ్రామాల్లో దాదాపు 24 వేల కోళ్లు మరణించాయి.
"సదుం మండలం నుంచి కోళ్లను ఇతర ప్రాంతాలకు తరలించకుండా నిఘా ఉంచాం. బతికి ఉన్న కోళ్ల వల్ల వైరస్ సోకే ప్రమాదం ఉండడంతో వాటిని ఎస్ఓపీ ప్రొసీజర్ ప్రకారం ఖననం చేయించాం" దీంతో జిల్లాలోని 24 మండలాలకు వైరస్ విస్తరించకుండా కట్టడి చేయడం సాధ్యమైందని డాక్టర్ గుణశేఖర్ పిళ్లై చెప్పారు.
"బర్డ్ ఫ్లూ వల్ల చనిపోయిన కోళ్లకు పరిహారం అందే అవకాశం లేదు. వైరస్ విస్తరించకుండా, జీవించి ఉన్న కోళ్లను ఖననం చేస్తారు. వాటి వయసు ఆధారంగా కోళ్లకు పరిహారం చెల్లించడానికి ఆస్కారం ఉంది" దీనిపై పశుసంవర్థక శాఖ డాక్టర్ ప్రదీప్ ఏమి చెప్పారంటే..
"సదుం మండలం పుట్టావారిపల్లెలో నేను పరిస్థితిని పరిశీలించాను. బర్డ్ ఫ్లూ వల్ల ఆరు వేల కోళ్లు చనిపోయాయి" అని డాక్టర్ ప్రదీప్ చెప్పారు. జీవించి ఉన్న కోళ్లకు విస్తరించకుండా జాగ్రత్తలు తీసుకుని 1,672 కోళ్లను ఎస్ఓపీ ప్రొటోకాల్స్ పాటిస్తూ, ఖననం చేశామని ఆయన వివరించారు. ఈ కోళ్లకు పరిహారం అందుతుందని ఆయన స్పష్టం చేశారు.

తగ్గని ధరలు..

ఉమ్మడి జిల్లాలో కర్ణాటకకు సరిహద్దులోని మదనపల్లెలో బర్డ్ ఫ్లూ మొదట బయటపడింది. ఈ తరువాత తమిళనాడుకు సరిహద్దులోని చిత్తూరు జిల్లా జీడీ. నెల్లూరు నియోజకవర్గం కార్వేటినగర మండలం బీవీఆర్కే. పేటలో ఆ ఆనవాళ్లు కనిపించాయి. అయినా, జిల్లాలో చికెన్, కోడి గుడ్ల ధరలపై ఏమాత్రం ప్రభావం చూపించలేదు.
వైరస్ ప్రభావం కనిపించిన పుంగనూరు, దీనికి సమీపంలోని జిల్లా కేంద్రం మదనపల్లెలో కూడా చికెన్ ధరలో తేడా కనిపించలేదు.
1. లైవ్ కోడి ధర కిలో 118 నుంచి 120 వరకు పలికింది.
2. స్కిన్ లెస్ చికెన్ రూ. 220 నుంచి 250 వరకు విక్రయించారు.
3. డ్రెస్ డ్ చికెన్ 220 నుంచి 230 వరకు పలికింది.
4. కోడి గుడ్డు ధర కూడా రూప ఆరు నుంచి ఎనిమిది వరకు ఉంది.
జీడి. నెల్లూరులో మాత్రం ధరల్లో కాస్తవ్యత్యాసం కనిపిస్తోంది. ఈ ఏడాది ప్రారంభం జనవరిలో కిలో చికెన్ రూ. 300, గుడ్డు రూ. ఎనిమిదికి ధర పలికింది. ప్రస్తుతం జీడి. నెల్లూరులో ణారం కోడి ధర కిలో 180, డ్రెస్ట్ చికెన్ కిలో రూ.120 నుంచి 150 వరకు, లైవ్ చికెన్ ధర రూ. 90 నుంచి వంద రూపాయల వరకు ఉన్న పౌల్ట్రీ పరిశ్రమవర్గాల ద్వారా తెలిసిన సమాచారం.

కోళ్లకు పరిహారం

మదనపల్లె జిల్లాలోని మిగతా మండలాలకు బర్డ్ ఫ్లూ విస్తరించలేదని కలెక్టర్ నిశాంత్ కుమార్ స్పష్టం చేశారు. వైరస్ సోకకుండా వల్ల చనిపోయిన కోళ్లకు స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ (SOP) ప్రకారం ఖననం చేసిన వాటికి పరిహారం అందుతుందని ఆయన వెల్లడించారు.
"జిల్లాలోని 24 మండలాలలో ఎక్కడా కూడా బర్డ్ ఫ్లూ నమోదు కాలేద. బర్డ్ ఫ్లూ పై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు" అని జిల్లా కలెక్టర్ శశాంక్ కుమార్ స్పష్టం చేశారు. సదుం మండలంలోని మూడు గ్రామాల్లో 12,312 జీవించి ఉన్న కోళ్లను ఖననం చేశారు. అమ్మగారిపల్లె, కంభంవారిపల్లెలో పరిస్థితిని సమీక్షించిన పశువైద్య శాఖ అధికారి డాక్టర్ మునిచంద్రారెడ్డి చెప్పారు.

ఈ సూచనలు పాటించండి..

కోడి మాంసం తినడానికి ముందు కొన్ని సూచనలు పాటించాలని పశుసంవర్ధక శాఖ ఏడీ డాక్టర్ గుణశేఖర్ పిళ్లై కొన్ని సూచనలు చేశారు.
" కోళ్ల నుంచి మనుషులకు బర్డ్ ఫ్లూ సోకే అవకాశాలు దాదాపు శూన్యం. 100 డిగ్రీల పైగా ఉష్ణోగ్రతతో వేడి చేసిన చికెన్ ను, గుడ్లు తినడం వల్ల ఎలాంటి ప్రమాదం లేదు" అని స్పష్టం చేశారు. పొరుగు ప్రాంతాల నుంచి కోళ్ల ఫారాల వద్దకు సందర్శకులను రానివ్వకుండా జాగ్తర్తలు పాటిస్తే చాలని ఆయన సూచించారు.

Read More
Next Story