Kadapa | రాజ.. రాజ.. రాజమార్తాండ.. మఠాధిపతికి  పట్టాభిషేకం..
x
కడప జిల్లా బ్రహ్మంగారి వారసుడిగా 12వ మఠాధిపతిగా సింహాసనం అదిష్టించనున్న వీరధర్మజ వేంకటాద్రిస్వామి. పురాతన కాలం నాటి సింహాసంనం.

Kadapa | రాజ.. రాజ.. రాజమార్తాండ.. మఠాధిపతికి పట్టాభిషేకం..

బి.మఠంలో ఉదయం 10 గంటల నుంచి 1.30 గంటల మధ్య.. స్వర్ణకిరీట ధారణతో సింహాసనంపైకి 12వ మఠాధిపతి.


ముగ్గురు ఆధ్యాత్మిక వేత్తలతో కిరీటధారణ

వీరబ్రహ్మేంద్ర సజీవసమాధి చెంత అరుదైన ఘట్టం.

తిరుపతి హథీరాంజీ మఠం, బి. మఠంలోనే ఆధ్యాత్మిక వారసత్వ ఆచారం

రాజ.. రాజ.. రాజమార్తాండ.. అని వందిమాగధులు కీర్తిస్తుంటే.. వింజా మరలు వీచే వారు ఓ పక్క. రాజసం ప్రదర్శించే రాజుల వైభోగం జానపద కథల్లో చదవి ఉంటాం. అందులో యువరాజుకు పట్టాభిషేకం చేయడం వంటి కథలు ఉండవచ్చు. జానపద సినిమాల్లో మాత్రమే ఆ దృశ్యాలు కనిపిస్తాయి.

కడప జిల్లా కందిమల్లాయపల్లె (బ్రహ్మంగారి మఠం. బి.మఠం)లో మఠాధిపతికి పట్టాభిషేకం చేసే అరుదైన ఘట్టం గురువారం జరగనున్నది. చారిత్రక, వారసత్వ నేపథ్య సజీవ సంఘటన కళ్లముందు సాక్షాత్కారం కాబోతోంది. ఈ తరం గుర్తించుకునే అరుదైన చారిత్రక ఘట్టంగా నిలుస్తుందనడంలో సందేహం లేదు.
కడప జిల్లా బ్రహ్మంగారి మఠం (బీ. మఠం) ( Brahmagari Mutt ) మఠాధిపతిగా వీరధర్మజ వేంకటాద్రిస్వామివారికి గురువారం ఉదయం పట్టాభిషేకం నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటల నుంచి ప్రారంభమయ్యే ఈ కార్యక్రమం మధ్యాహ్నం స్వర్ణకిరీట ధారణతో మఠాధిపతి సింహాసనం అధిష్టించనున్నారు.
రాజ్యాలు పోయాయి. రాచరికం లేదు. ఆ చారిత్రక ఆనవాళ్లు కళ్లముందు ఉన్నాయి. వారి వారసులు ఉన్నారు. పూర్వకాలం నాటి పట్టాభిషేకం ఆధ్యాత్మిక వారసత్వంగా రాయలసీమలో సజీవంగా ఉంది. కాలజ్ఞాని మద్విరాట్ పోతులూరి
వీరబ్రహ్మేంద్ర స్వామి మఠం
లో వారసులకు పట్టాభిషేకం చేయడం అనే అరుదైన వాస్తవ నేపథ్యం ఇది.
"మఠాధిపతి పట్టాభిషేకం, స్వర్ణకిరీట ధారణ, సింహాసనం అధిష్టించే కార్యక్రమాలకు ఏర్పాట్లు చేశాం. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక నుంచి వచ్చే యాత్రికులకు కూడా ఏర్పాట్లు చేశాం" అని బి. మఠం మేనేజర్ గా నియమితులైన పీపీఎన్. ప్రసాద్ చెప్పారు.
రాయలసీమలో ఆధ్యాత్మిక చారిత్రక నేపథ్యం కలిగిన తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారికి అపర భక్తుడైన హథీరాంజీబాబా వారసులైన మహంతుకు మాత్రమే తిరుపతిలో పట్టాభిషేకం జరుగుతుంది. కడప జిల్లా బి.మఠంలో పోతులూరి వీరబ్రహ్మంగారు సజీవ సమాధి అయిన బీ.మఠంలో మాత్రమే మఠాధిపతులకు పట్టాభిషేకం చేసే ఆచారం ఉంది.

బి.మఠం వెళ్లే.. మార్గం..

కడప నుంచి 70 కిలోమీటర్ల దూరంలో బి.మఠం ఉంది. కడప నుంచి హైదరాబాద్ వెళ్లే మార్గంలో కడప దాటిన తరువాత ఖాజీపేట దాటిన తరువాత మైదుకూరుకు 25 కిలోమీటర్ల దూరం ఉంటుంది. నెల్లూరు నుంచి కడపకు వచ్చే మార్గంలో బద్వేలు నుంచి బి. మఠం వెళ్లేమార్గం ఉంటుంది.

క్లుప్తంగా.. చరిత్ర


బి.మఠం ఊరి పేరు వాస్తవంగా 17వ శతాబ్దం నుంచి కందిమల్లాయపల్లె. ఈ ఊరిలో కాలజ్ఞాని వీరబ్రహ్మేంద్రస్వామి 1683లో సజీవసమాధి కావడం అనేది ఓ చారిత్రక వాస్తవం. ఇక్కడ దేవాలయం నిర్మాణం, ఆ తరువాత మఠం ఏర్పాటు చేశారు. బ్రహ్మంగారు జీవించి ఉన్న కాలంలో కాలజ్ఞానం ద్వారా భవిష్యత్తులో జరిగే సంఘటనలు ముందుగానే ఊహించారు. దీంతో ఈ ప్రదేశం చారిత్రక, దర్శనీయ కేంద్రంగా మారింది. మఠంగా ఏర్పాటు చేసిన తరువాత మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామివారి వారసులే మఠాధిపతులుగా ఉంటున్నారు.

రాష్ట్రంలోని అనేక ప్రాంతాల నుంచి వచ్చిన వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయాల సిద్ధాంతులు

2021 మే 8: బి. మఠం మఠాధిపతుల్లో ఏడో తరానికి చెందిన 11వ పీఠాధిపతి వీరభొగ వసంత వెంకటేశ్వరస్వామి వయసు మీరడంతో తుదిశ్వాస విడిచారు. 52 సంవత్సరాల పాటు ఆయన మఠాధిపతిగా ఆధ్యాత్మిక కార్యక్రమాలకు వారసుడిగా కార్యక్రమాలు నిర్వహించారు. ఆయన మరణానంతరం బి.మఠం మఠాధిపతి ఎంపికపై ఏర్పడిన వివాదం కొన్ని రోజుల కిందట కొలిక్కి వచ్చింది.

12వ మఠాధిపతికి పట్టాభిషేకం..


బ్రహ్మంగారి మఠం 12వ మఠాధిపతిగా వీరధర్మజ వేంకటాద్రిస్వామివారికి పట్టాభిషేకం చేసే క్రతువులో భాగంగా ఈ నెల 24వ తేదీ పూజలతో లాంఛనంగా ప్రారంభించారు. గురువారం (ఫిబ్రవరి 26వ తేదీ ) వేంకటాద్రిస్వామివారికి పట్టాభిషేకం చేయడానికి ముహూర్తం ఖరారైంది. బ్రహ్మంగారి మఠంలో 24వ తేదీ నుంచి వైదిక కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఈపాటికే గుంటూరు తోపాటు వివిధ ప్రాంతాలకు చెందిన వేదాంతులు, సిద్ధాంతులు బి.మఠం చేరుకుని పూజలు చేస్తున్నారు.

రాజ రాజ.. రాజమార్తాండ...

శ్రీవీరబ్రహ్మేంద్ర స్వాములవారి మఠం 12వ మఠాధిపతిగా శ్రీశ్రీశ్రీ వీరధర్మజ వేంకటాద్రి స్వాములవారి పట్టాభిషేకం చేసే లాంఛనాలు 26 తేదీ ఉదయం పది గంటల నుంచి ప్రారంభం అవుతాయి. ముగ్గురు ఆధ్యాత్మిక వేత్తలు ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా నిర్వహించనున్నారు.
రాజరాజ.. రాజమార్తాండ అని పరివారం కీర్తిస్తుండగా.. రాచమర్యాదలతో పీఠాధిపతిగా పట్టాభిషేకం చేయడానికి పట్టువస్త్రాలు ధరించి, మఠాధిపతిగా బాధ్యతలు స్వీకరించడానికి రాజఠీవిని ప్రదర్శిస్తూ, వేంకటాద్రి స్వాముల వారిని గణపతి మండపం వరకు పల్లకీలో మోసుకుని వస్తారు. ఉదయం పది గంటలకు సాదరంగా ఈ కార్యక్రమం ప్రారంభం అవుతుంది. గణపతి మండపం వద్ద ఏర్పాటు చేసిన హోమ గుండం వద్ద పూజల తరువాత వీరధర్మజ వేంకటాద్రి స్వాములవారిని మధ్యాహ్నం 1.30 గంటలకు సింహాసనంపై ఆశీనులను చేస్తారు.
"నిర్ణీత ముహూర్తం సమీపించగానే పీఠాధిపతిగా వీరధర్మజ వేంకటాద్రి స్వాములవారికి స్వర్ణకిరీట ధారణ చేస్తారు. 12వ పీఠాధిపతిగా అధికారిక ప్రకటన చేస్తారు. పీఠాధిపతి బాధ్యతలు అప్పగిస్తున్నాం" అని ముగ్గురు ఆధ్యాత్మికవేత్తలు ప్రకటన చేయడంతో ఈ క్రతువు ముగుస్తుంది. ఆ తరువాత బ్రహ్మంగారి సజీవసమాధి చెంత ఏర్పాటు చేసే వేదికపై సింహాసన సమయంలో తదుపరి పల్లకిలో మహాద్వారం దగ్గరకు వచ్చే భక్తులకు శిష్యులకు మఠాధిపతిగా శ్రీశ్రీశ్రీ వీరధర్మజ వేంకటాద్రి స్వాములవారు దర్శనం ఇస్తారు.
కాలజ్ఞాని పోతులూరి వీరభ్రహ్మేంద్రస్వామి సజీవ సమాధి అయిన కందిమల్లాయపల్లె (బి.మఠం)లో పీఠాధిపతి పట్టాభిషేకం వైదిక ఆగమ శాస్త్ర పద్ధతిలో ఉంటుందని బి.మఠం మేనేజర్ పీపీఎన్. ప్రసాద్ చెప్పారు. ఈ అరుదైన ఘట్టానికి వచ్చే యాత్రికులకు అన్ని ఏర్పాట్లు చేశామని ఆయన తెలిపారు.
"వీరధర్మజ వేంకటాద్రి స్వాములవారికి పట్టాభిషేకం చేసే సమయంలో మఠాధిపతితో కరచాలనం చేయవద్దు. మఠాధిపతి నుంచి ప్రతి నమస్కారం ఉండదు. ఆశీర్వచన పూర్వకంగా సంకేతం ఇస్తారు" అని ప్రసాద్ తెలిపారు. పద్దతిలో జరుగును.
"మధ్యాహ్నం మూడు గం తర్వాత ఆధ్యాత్మిక వేత్తలు, వివిధ రంగాల ప్రముఖులు, మఠాధిపతి కుటుంబ సభ్యులు కల్యాణ మండపంలో ఆధ్యాత్మిక సమావేశం ఉంటుంది" అని ప్రసాద్ వివరించారు. బి.మఠం పీఠాధిపతి పట్టాభిషేకాన్ని చూసేందుకు వచ్చే యాత్రికుల కోసం ఐదు అన్నదాన ప్రసాద వితరణ కేంద్రాలు ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. దూరప్రాంతాల నుంచి వచ్చే భక్తులు, శిష్యులు, ప్రముఖులకు వసతి సౌకర్యం కూడా ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు.

ధార్మికంగా వికసిద్దాం..

బ్రహ్మంగారి వారసుడిగా పీఠాధిపతిగా ప్రకటన తరువాత మూడు రోజుల కిందట మఠం సిబ్బంది తోపాటు భక్తులకు వీరధర్మజ వేంకటాద్రి స్వామి వ్యక్తిగతంగా మాట్లాడారనేది విస్వసనీయం సమాచారం.
"మఠం అభివృద్ధి, భక్తుల సౌకర్యాలు కల్పించడానికి సేవలు అందించండి. మఠంలో సమయపాలన పాటించండి. చిత్తశుద్ధితో పని చేయండి" అని వీరధర్మజ వేంకటాద్రి స్వామి నిర్దేశం చేసినట్లు తెలిసింది. మఠం నిర్వహణ, యాత్రికుల సేవలో పనితీరు బాగోలేకుంటే కఠిన చర్యలు తప్పవు" అని కూడా సుతిమెత్తగా హెచ్చరించారనేది మఠం వర్గాల ద్వారా తెలిసిన సమాచారం.
బి.మఠం భవిష్యత్తు మేనేజరుగా పీపీఎన్. ప్రసాద్‌ ను అధికారికంగా ఆ సమయంలోనే ప్రకటించారు. 11వ పీఠాధిపతిగా ధార్మిక కార్యక్రమాలను మఠంలో పర్యవేక్షించిన సమయంలో మేనేజర్ గా సేవలు అందించిన పెంచలయ్య కొడుకే ప్రసాద్ కావడం గమనార్హం. ఈ పోస్టు కూడా వారసత్వంగానే ప్రసాద్ కు దక్కినట్టు కందిమల్లాయపల్లె స్థానికుల ద్వారా తెలిసిన సమాచారం.

మఠం కిటకిట..

కాలజ్ణానంతో తాత్వికతను ప్రబోధించిన వీరబ్రహ్మేంద్రస్వామి సజీవ సమాధి అయిన బి.మఠం క్షేత్రానికి దక్షిణాది రాష్ట్రాల నుంచి చేరుకున్న యాత్రికులతో కిటకిటలాడుతోంది. కడప, కర్నూలు, తిరుపతి, చిత్తూరు, ఒంగోలు, అనంతపురం ప్రాంతాల నుంచి యాత్రికులు చేరుకున్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి వైదికులు, కర్ణాటక నుంచి భారీగా వచ్చిన భక్తులతో బి. మఠం కిటకిటలాడుతోంది.
Read More
Next Story