Tirumala float festival | తెప్ప తిరుణాలలో శ్రీరాముడిగా మలయప్ప దర్శనం
x
తిరుమల శ్రీవారి పుష్కరిణిలో కనువిందు చేస్తున్న తెప్పోత్సవం. ఇన్సెట్ లో శ్రీరామచంద్రమూర్తిగా మలయప్ప

Tirumala float festival | 'తెప్ప తిరుణాల'లో శ్రీరాముడిగా మలయప్ప దర్శనం

బ్రహ్మోత్సవాలను తలపిస్తూ ప్రారంభమైన ఐదురోజుల సాలకట్ల తెప్పోత్సవాలు.


తిరుమల శ్రీవారి పుష్కరిణిలో దృశ్యాలు కనువిందు చేశాయి. మలయప్ప స్వామి వారు ఉభయ దేవేరులతో కలిసి గురువారం రాత్రి తిరుమలలో తెప్పోత్సవాలు (float festival) అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఐదు రోజులు నిర్వహించే తెప్పోత్సవాల్లో మొదటి రోజు సీతా, లక్ష్మణ, ఆంజనేయ సమేతంగా శ్రీరామచంద్రమూర్తి అలంకారంలో మలయప్పస్వామివారు దర్శనమిచ్చారు. పుష్కరిణిలో విహరిస్తూ యాత్రికులకు కనువిందు చేశారు.


తిరుమలలో తొలిరోజు శ్రీ సీతారామలక్ష్మణ ఆంజనేయస్వామివారు పుష్కరిణిలో తెప్పపై మూడు చుట్లు తిరిగి భక్తులను ఆశీర్వదించారు. వేదం, గానం, నాదం మధ్య తెప్పోత్సవం వేడుకగా జరిగింది. తిరుమలలో గురువారం రాత్రి వార్షిక తెప్పోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఫాల్గుణ మాసంలో పౌర్ణమి సందర్భంగా ప్రతి సంవత్సరం ఐదు రోజులపాటు తక్కువ ఉత్సవాల నిర్వహించడం ఆనవాయితీగా పాటిస్తున్నారు.


ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ బీ.ఆర్.నాయుడు, ఈఓ ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈఓ సిహెచ్.వెంకయ్య చౌదరి, సీవీఎస్వో మురళీకృష్ణ, అధికారులు పాల్గొన్నారు.

శ్రీవారి తెప్పోత్సవాల చరిత్ర


తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయం ఎదుట ఉన్న పుష్కరిణిలో ఏటా ఘనంగా నిర్వహించే ఐదు రోజుల తెప్పోత్సవాలను “తెప్ప తిరునాళ్లు”గా పిలుస్తారు. శ్రీవారు స్వామి పుష్కరిణిలో అలంకరించిన తెప్పలపై విహరిస్తూ భక్తులకు దర్శనభాగ్యం కల్పిస్తారు. జీవన సాగరంలో మునిగిపోకుండా భక్తులను రక్షించే దైవానుగ్రహానికి ఇది ప్రతీకగా భావిస్తారు. తెప్ప అనగా పడవ, ఓడ.

ఓడలో సుఖాశీనులైన శ్రీవారిని కోనేటిలో విహారం చేయించడాన్నే తెప్పోత్సవం అంటారు. తిరుమలలో తెప్పోత్సవాలు అత్యంత ప్రాచీనకాలం నుంచి జరుగుతున్నాయని తెలుస్తోంది. ప్రతి సంవత్సరం ఫాల్గుణ / చైత్ర మాసాల్లో (ఫిబ్రవరి–మార్చి) ఏకాదశి నుంచి పౌర్ణమి వరకు ఈ ఉత్సవాలు జరుగుతాయి.

ఎప్పటి నుంచి

తిరుమల శ్రీవారి పుష్కరిణి మధ్యలో సాళువ నరసింహరాయలు క్రీస్తు శకం 1468లో పుష్కరిణి మధ్యలో నీరాళి మండపాన్ని నిర్మించి తెప్పోత్సవాలకు అనువుగా తీర్చిదిద్దారు. ఆయన కుమారుడు పెద్ద తిరుమలయ్య పుష్కరిణి పునరుద్ధరణ చేపట్టి, స్వామి పుష్కరిణి – వరాహ పుష్కరిణిని వేరు చేసినట్లు శాసనాల్లో ఉన్న చారిత్రక కథనం. క్రీస్తు శకం 15వ శతాబ్దానికి చెందిన శ్రీ తాళ్లపాక అన్నమయ్య తిరుమల తెప్పోత్సవాలను గొప్పగా కీర్తించారు. మధ్యలో కొంతకాలం విరామం వచ్చినప్పటికీ, 1921లో తిరిగి ఈ ఉత్సవాలు పునరుద్ధరించారు. వేసవికాలం ప్రారంభానికి ముందు పున్నమి వెన్నెలలో ఉభయ దేవేరులతో శ్రీవారి ఉత్సవామూర్తులు పుష్కరిణిలో విహరించే అరుదైన సన్నివేశం ఏడాదికి ఒకసారి మాత్రమే ఉంటుంది.

ఎలా సాగిందంటే...


తిరుమలలో వార్షిక తెప్పోత్సవాల నేపథ్యంలో శ్రీవారి పుష్కరిణితో సహా సమీప మాడవీధుల్లో మరింత దేదీప్యమైన వెలుగులు ప్రసరించే విధంగా విద్యుద్దీపాలు ఏర్పాటు చేశారు. పుష్కరిణి చుట్టూ కూడా రంగురంగుల విద్యుల్లతలను అమర్చారు. ఈ వెలుగులు మొత్తం పుష్కరిణికి కొత్త అందాలు తెచ్చాయి.

శ్రీవారి ఆలయం నుంచి పుష్కరిణి వద్ద ఉభయ దేవేరులతో కలిసి మలయప్పస్వామిని సర్వాంగసుందరంగా అలంకరించి వేడుకగా తీసుకుని వచ్చారు.
పుష్కరిణి వద్ద టీటీడీ అదనపు ఈఓ సీహెచ్. వెంకయ్య చౌదరితో పాటు అధికారులు పూజల అనంతరం, సీతా లక్షణ సమేత శ్రీరాముడి అలంకారంలో ఉన్న మలయప్పస్వామి విగ్రహాలను తెప్పలపైకి చేర్చారు. అక్కడి నుంచి ప్రారంభమైన తెప్పోత్సవం పుష్కరిణి చుట్టూ నీటిలో తేలియాడుతే ముందుకు సాగుతుంటూ, శ్రీవారి ఆలయ అర్చకులతో పాటు అధికారులు కూడా తెప్పలపై కూర్చుని సేవలో తరించారు.

తెప్పోత్సవాల నేపథ్యంలో వరాహస్వామి ఆలయ పరిసర ప్రాంతాలతో పాటు ఆలయం వరకు యాత్రికులతో తిరుమల క్షేత్రం మరింత రద్దీగా మారింది. సుమారు గంటలకు పైగానే సాగిన తెప్పోత్సవం కనువిందు చేసింది.


Read More
Next Story