జంగా... ముంచావు కదా.. టీడీపీ కొంప..
x

జంగా... ముంచావు కదా.. టీడీపీ కొంప..

అతిథి గృహానికి స్థలం కేటాయింపులో బోర్డు సభ్యుల మధ్య వార్..


తిరుమల కేంద్రంగా టీడీపీ కూటమిలో మరో అంగర్గత వివాదం చెలరేగింది. టీటీడీ బోర్డు సభ్యుడు జంగా కృష్ణమూర్తి రాజీనామాతో కలహాలకు బీజం పడింది. తిరుమలలో కొత్త అతిథి గృహాల నిర్మాణానికి స్థలం కేటాయించకూడదనే టీటీడీ బోర్డు తీర్మానానికి భిన్నంగా వ్యవహరించడం వివాదానికి కారణమైంది.

తిరుమలలో అతిథి గృహం నిర్మాణానికి 20 ఏళ్ల తరువాత బీసీ, నేత టీటీడీ బోర్డు సభ్యుడు జంగా కృష్ణమూర్తికి మళ్లీ స్థలం కేటాయించారు. కూటమిలో భాగస్వామిగా ఉన్న బీజేపీ ప్రతినిధి తిరుమలలో జరిగిన టీటీడీ బోర్డు సమావేశంలో, జనసేన చీఫ్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ క్యాబినెట్ తీర్మానంపై అభ్యంతరం నేపథ్యంలో అనుమతి రద్దు చేశారు. దీంతో టీటీడీ నేత జంగా కృష్ణమూర్తి టీటీడీ పాలక మండలి సభ్యత్వానికి రాజీనామా చేసిన వ్యవహారం కూటమిలో అంతర్గతంగా వివాదాల నిప్పు రాజేసింది.
"టీటీడీ నిబంధనల ప్రకారం బోర్డు సభ్యుడుగా ఉంటే వ్యక్తి ప్రత్యక్షంగా, పరోక్షంగా లబ్ధి పొందే పనులు చేయకూడదు" అని ఓ అధికారి నిబంధనలు గుర్తు చేశారు. దీనికి భిన్నంగా వ్యవహరిస్తే సభ్యత్వం రద్దయ్యే అవకాశం కూడా లేకపోలేదని ఆ అధికారి స్పష్టం చేశారు.
"తిరుమలలో వసతి గృహాల (Cottages/Guest Houses) నిర్మాణానికి టీటీడీ అమలు చేస్తున్న కాటేజ్ డొనేషన్ స్కీం (Cottage Donation Scheme)కు విరుద్ధంగా అనుమతి ఇవ్వడానికి ఆస్కారం లేదు" అని బోర్డు సభ్యుడు జీ. భానుప్రకాష్ రెడ్డి అభ్యంతరం చెప్పినా, మిగతా సభ్యులు అనుమతి ఇచ్చారు.
తిరుమలలో అతిథి గృహాల నిర్మాణానికి, ఆధునీకరణకు టీటీడీ ఓ విధానం అమలు చేస్తోంది. దాతల ద్వారా మరమ్మతులు చేయించడానికి విరాళాలు స్వీకరిస్తుంది. వారు కొన్ని సేవలు తీసుకోవడానికి కూడా మార్గదర్శకాలు ఉన్నాయి. ఇదిలావుంటే.
"టీటీడీ పాలక మండలి సభ్యత్వానికి జంగా రాజీనామా పత్రం ముఖ్యమంత్రికి పంపారు. అది టీటీడీ పాలక మండలికి కూడా చేరింది. కొన్ని రోజుల్లో వివాదం సమసి, ఆయన మళ్లీ పదవిలో కొనసాగే అవకాశం ఉంది" అని సీనియర్ సభ్యుడు ఫెడరల్ ప్రతినిధికి చెప్పారు.
తెరవెనుక..
తిరుమలలో పంచాయతీరాజ్, రెవెన్యూ అతిథి గృహం నిర్మాణానికి అనుమతి కోరుతూ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన దరఖాస్తును టీటీడీ బోర్డు సున్నితంగా తిరస్కరిస్తూ, నిబంధనలు ఉటింకించిన విషయంపై సోషల్ మీడియాలో కథనాలు వైరల్ అయ్యాయి. దీంతో ఆగ్రహంగా ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..
"తిరుమలలో ప్రభుత్వ అతిథి గృహం నిర్మాణానికి అడ్డుగా ఉండే నిబంధనలు టీటీడీ పాలక మండలిలోనే సభ్యుడైన జంగాకు వర్తించవా? " అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అభ్యంతరం లేవనెత్తినట్టు తెలిసింది. ఈ వ్యవహారం కాస్తా టీడీపీ కూటమిలో అంతర్గత సమస్యగా మారినట్లు ఆ పార్టీ వర్గాల ద్వారా తెలిసింది.
"తిరుమలలో నా ట్రస్టుకు మళ్లీ స్థలం కేటాయించే విషయంపై క్యాబినెట్ లో ఏమి చర్చ జరిగిందనే విషయం తెలియదు. ఆంధ్రజ్యోతి దినపత్రికలో నా వ్యక్తిత్వం దెబ్బతీసేలా కథనం రాయడం మనస్థాపం చెందాను. ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబుకు ఇబ్బంది రాకూదదనే బోర్డు సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నా" అని జంగా కృష్ణమూర్తి ఈ నెల తొమ్మిదో తేదీ మీడియా వద్ద సన్నాయి నొక్కులు నొక్కారు.
బోర్డు సభ్యుడిగా ఉన్నా... 20 ఏళ్లుగా ప్రతిబంధకాలే..
2005లో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా ఉన్న జంగా కృష్ణమూర్తి టీటీడీ సభ్యుడిగా పనిచేశారు. ఆ పదవితో తిరుమలలో అతిథిగృహం నిర్మాణానికి ప్రయత్నాలు ప్రారంభించారు. ఆయన వైసీపీ ప్రభుత్వంలో కూడా బోర్డు సభ్యుడిగా ఉన్న కాలంలో పరిస్థితి అనుకూలించింది. 2024 ఎన్నికలకు ముందు ఆయన టీడీపీలో చేరబోతున్నానే కథనాల నేపథ్యంలో ఆటంకం ఏర్పడింది. టీటీడీలో చేరారు. పార్టీ అధికారంలోకి రాగానే టీటీడీ బోర్డు సభ్యత్వం దక్కిన తరువాత తిరుమలలో అతిథిగృహం నిర్మాణానికి తీర్మానం సాధించారు. కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్న జనసేన చీఫ్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అభ్యంతరం చెప్పినట్లు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో జంగా కృష్ణమూర్తి టీటీడీ పాలక మండలి సభ్యత్వానికి రాజీనామా చేసినట్టు భావిస్తున్నారు.
2005 కాంగ్రెస్ పార్టీలో ఉన్న జంగా కృష్ణమూర్తి కాటేజీ నిర్మాణానికి దరఖాస్తు చేసుకున్నారు. అదే సంవత్సరం జూలై 31వ తేదీ అప్పటి టీటీడీ పాలక మండలి తిరుమల డొనేషన్ స్కీం కింద బాలాజీనగర్ ప్లాట్ నంబర్ 2లో 500 గజాల స్థలం కేటాయింది. ఓం శ్రీనమో వెంకటేశాయ 12 గదులతో గ్గోబల్ ట్రస్టు ద్వారా అతిథి గృహం నిర్మాణం చేయాలని భావించారు.
ఇందులో ఒక గది ట్రస్టు ఆధీనంలో ఉంటే, మిగతా 11 గదులు టీటీడీ యాత్రికులకు కేటాయించడానికి స్వాధీనం చేసుకుంటుంది. దీనికోసం టీటీడీకి దాత చెల్లించాల్సిన రూ. పది లక్షల నుంచి 50 లక్షలకు విరాళం మొత్తం పెంచుతూ తీర్మానించింది. ఆ డొనేషన్ చెల్లించని కారణంగా, 2006 జూలై 27వ తేదీ టీటీడీ స్పెసిఫైడ్ అధికారిటీ ( టీటీడీ పాలక మండలి నియామకం జరగకుంటే అధికారులే నిర్ణయాలు తీసుకునే కమిటి) స్థలం కేటాయింపు రద్దు చేసింది. ఆ తరువాత వైఎస్ఆర్ సారధ్యంలోని ప్రభుత్వం ప్రత్యేక కేసుగా పరిగణలోకి తీసుకుంది.
" నా వినతి మేరకు గడువు పెంచడంతో పాటు అప్పటి ప్రభుత్వం 2008 అక్టోబరు నెలలో జీఓ కూడా ఇచ్చింది" అని జంగా చెప్పారు. కానీ అప్పటికి ఆయనకు మళ్లీ స్థలం కేటాయించలేదు.
వైసీపీలో మళ్లీ ప్రయత్నం..

ఉమ్మడి రాష్ట్రంలోనే సీఎంగా ఉన్న వైఎస్. రాజశేఖరరెడ్డి హెలికాప్టర్ దర్ఘటనలో మరణం తరువాత వైసీపీ ఏర్పడింది. జంగా కృష్ణమూర్తి కాంగ్రెస్ పార్టీని వీడి వైఎస్. జగన్ వెంట వచ్చారు. 2014లో ఆయన ప్రయత్నాలు ఫలించలేదు. 2019లో వైఎస్. జగన్ సారధ్యంలో ఏర్పడిన ప్రభుత్వ కాలంలో మళ్లీ తిరుమలలో స్థలం కోసం ప్రయత్నాలు చేశారు. దీంతో తిరుమలలో బాలాజీనగర్ ప్రాంతంలో కేటాయించిన స్థలాన్ని 2021 డిసెంబర్ 11, 2022 సెప్టెంబర్ నెల 24న తీర్మానాలు చేసింది.
నిబంధనల ఉల్లంఘనే..?
రాష్ట్ర శాసనసభ కమిటీల తరహాలోనే టీటీడీ పాలక మండలిలో కూడా సభ్యులు అనేక కమిటీల్లో ఉంటారు. అందులో టీటీడీ బోర్డు సభ్యుడిగా ఉన్న జంగా కృష్ణమూర్తి కూడా కీలక కమిటీలో సభ్యుడు.
"టీటీడీకి దాతలు ఆస్తులు, భూములు, స్థలాలు విరాళంగా అందిస్తుంటారు. దీనికి టీటీడీ ఎస్టేట్ కమిటి ఉంది. జంగా కృష్ణమూర్తి సభ్యుడు"
టీటీడీ బోర్డు సభ్యుడిగా ఉండే వ్యక్తికి నిబంధనల ప్రకారం ఆశ్రిత పక్షపాతం ఉండకూడదు. వ్యక్తిగతంగా లేదా పరోక్షంగా లబ్ధి పొందే పనులు చేయకూడదని టీటీడీ అధికారి ఒకరు నిబంధనలు వివరించారు. వీటికి విరుద్ధంగా వ్యవహరిస్తే, టీటీడీ బోర్డు సభ్యత్వం కోల్పోయే ప్రమాదం కూడా ఉంటుందని ఆ అధికారి వివరించారు.
పెరిగిన డొనేషన్
డొనేషన్ స్కీం కింద ఉన్న విరాళం పది లక్షల నుంచి 50 లక్షలకు, ఆ తరువాత కోటి రూపాయలకు టీటీడీ పెంచింది. మొదట జంగా అనుమతి తీసుకున్న సమయంలోనే సకాలంలో చెల్లించలేని స్థితి. ఇదిలా ఉంటే వ్యక్తిగతంగా కాకుండా,. ఓంశ్రీ నమో వెంకటేశాయ గ్లోబల్ ట్రస్టు పేరిట ఇవ్వాలని 2013 జనవరి నాల్గవ తేదీ జంగా టీటీడీకి లేఖ ద్వారా కోరారు. ఆ తరువాత 2023 మార్చి ఒకటో తేదీ ఆయన రూ. 50 లక్షలు చెల్లించినా, గడువు దాటిందని, చెబుతూ ఆ సొమ్ము తిరిగి చెల్లించడమే కాకుండా, బాలాజీ నగర్ లో కేటాయించిన స్థలం అనుమతిని రద్దు చేసింది.
ఈ వ్యవహారంపై జంగా కృష్ణమూర్తి మాట ఇది..
"వైసీపీ (YCP) ప్రభుత్వ కాలంలో టీటీడీ (TTD) ఈఓగా ఏవీ. ధర్మారెడ్డి ఉన్నారు. ఆ సమయంలో నేను రూ. 60 లక్షల వరకు డొనేషన్ చెల్లించాను. అప్పట్లో నేను టీడీపీ (TDP )లో చేరడానికి ప్రయత్నిస్తున్న సమయంలో నా డొనేషన్ వెనక్కి ఇచ్చాశారు. స్థలం కేటాయించాలనే ప్రతిపాదన తిరస్కరించారు" అని జంగా వ్యాఖ్యానించారు.
టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత జంగా కృష్ణమూర్తి టీటీడీ పాలక మండలి సభ్యుడిగా మూడోసారి నియమితులయ్యారు. తన ట్రస్టుకు స్థలం కేటాయించాలని ఆయన 2025 జూన్ నెలలో టీటీడీకి లేఖ రాయగా, జూలై 22న పాలక మండలిలో అనుమతి ఇస్తూ, తీర్మానించారు.
"శ్రీవారి సేవ కోసం స్థలం కేటాయించమని చేసిన వినతికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సానుకూలంగా స్పందించారు." అని జంగా కృష్ణమూర్తి చెబుతున్నారు.
తిరుమలలో స్థలం కేటాయింపుపై రాష్ట్ర దేవాదాయ శాఖ రాసిన లేఖకు టీటీడీ సమాధానం
"తిరుమలలో స్థలం కేటాయింపుపై కఠిన నిబంధనలు ఉన్నాయి" అని స్పష్టం గుర్తు చేస్తూనే జంగా కృష్ణమూర్తికి స్థలం కేటాయించిన తీర్మానం ప్రభుత్వానికి పంపించారు. కాగా, ఈ నెలలో జరిగిన మంత్రివర్గంలో ఈ అంశంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అభ్యంతరం చెప్పడంతో టీటీడీ బోర్డు చేసిన తీర్మానం రద్దు చేశారనేది సుస్పష్టం. పత్రికా కథనాన్ని ప్రస్తావిస్తూ, జంగా కృష్ణమూర్తి రాజీనామా అస్త్రం సంధించడం టీడీపీని ఇరకాటంలో పడేసినట్టు కనిపిస్తోంది.
"సీఎం చంద్రబాబు జోక్యం చేసుకున్నారు. ఈ సమస్య రోజుల్లో సమసిపోయే అవకాశం ఉంది" అని కూటమిలోని సీనియర్ నేత ఒకరు ఆశాభావం వ్యక్తం చేశారు.
కాటేజ్ డొనేషన్ స్కీం
తిరుమలలో యాత్రికులకు వసతి కల్పించడానికి దాదాపు 6,500 గదులు అందుబాటులో ఉంచింది. వాటిలో చాలా వరకు దాతల విరాళాలతో నిర్మించినవే. కాంక్రీటు భవనాలు పెరిగిపోతున్నాయంటూ దాదాపు 20 సంవత్సరాల్లో చాలాసార్లు కొత్త కట్టడాలకు అనుమతి ఇవ్వకూడదని టీటీడీ పాలక మండలిలో తీర్మానించారు. అమలు తీరు ఎలా ఉందనే విషయంలో అనేకసార్లు నిబంధనలు ఉల్లంఘనలు జరుగుతూనే ఉన్నాయి. ఇదిలా ఉంచితే..
తిరుమలలో దాతల సాయంతో కాటేజీల్లో కొత్తవి నిర్మాణం, పాతవాటిని మరమ్మతులకు టీటీడీ కాటేజీ టెనోషన్ స్కీం (Cottaahe Donation Scheme) అమలు చేస్తోంది.
1) నిర్మాణ నమూనా టీటీడీ ఇంజీనింగ్ విభాగం తయారు చేస్తుంది. దాతలకు నచ్చినట్టు మార్పులకు అనుమతి ఉండదు.
2) సొంత ఇంటి నిర్మాణానికి అనుమతి ఉండదు.
3) టీటీడీ మాస్టర్ ప్లాన్ ప్రకారం గదులు ఎక్కడ నిర్మించాలనేది బోర్డు నిర్ణయిస్తుంది.
4) దాతల భాగస్వామ్యం ఎలా ఉంటుందంటే..
పూర్తి భవన నిర్మాణంలో కాటేజీ లేదా అతిథి గృహం నిర్మాణానియ్యే ఖర్చు దాత భరించడం.
గదుల నిర్మాణం: బహుళ అంతస్తుల్లో ఒకో గదికి విరాళం ఇవ్వడం.
హక్కులు: గదుల నిర్మాణం తరువాత దాతకు యాజమాన్య హక్కులు ఉండవు. వారికి గౌరవంగా కొన్ని సదుపాయాలు కల్పిస్తారు. దాత, వారి కుటుంబీకులు ఏడాదిలో సాధారంగా 30 రోజులు ఉచితంగా, కొన్ని సార్లు రాయితీపై వసతి సదుపాయం ఉంటుంది.
5) దాతలు టీటీడీ ఈఓకు దరఖాస్తు చేసుకోవాలి. నిర్ణయించిన విరాళం టీటీడీ పేరుతో డిపాజిట్ చేయాలి. నిర్మాణ బాధ్యత టీటీడీ ఇంజినీరింగ్ విభాగానిదే. గదుల నిర్వహణ, పారిశుద్ధ్యం, కేటాయింపు మొత్తం టీటీడీ రిసెప్షన్ విభాగం ఆధీనంలో ఉంటుంది.
6) దాతలు తమకు కేటాయించిన గదులు అద్దెకు ఇవ్వడం, వాణిజ్య ప్రయోజనాలకు ఆస్కారం ఉండదు.
7)పాత భవనాలు మరమ్మతు చేయడానికి, శిథిలావస్థకు చేరితే తొలగించే అధికారం టీటీడీకే ఉంటుంది.
విరాళాలు ఎలా తీసుకుంటారంటే..
తిరుమలలో అనేక రకాల కాటేజీలు ఉన్నాయి. వాటిలో కొత్త కాటేజీల నిర్మాణం చేపట్టడానికి వేలం నిర్వహిస్తారు. ప్రస్తుతం తిరుమలలో స్థలం విలువ 38 కోట్ల రూపాయలు దాత టీటీడీకి చెల్లించాలి. భవన నిర్మాణానికి సుమారు 15 కోట్ల రూపాయల వరకు భరించాలి. పూర్తయ్యాక, గదుల కేటాయింపు, టీటీడీ ఆధీనంలో ఉన్నా, నెల వారీగా నిర్వహణ ఖర్చు దాత భరించాలి. ప్రస్తుతం కొత్త భవన నిర్మాణాలకు అనుమతులు ఇవ్వడం లేదు. ఆధునీకరణకు మాత్రమే దాతలకు టీటీడీ ఆస్కారం కల్పిస్తోంది.
సదుపాయాలు..
1) ఐదు లక్షలకు లోపు విరాళం ఇచ్చిన దాతలకు ఏడాదికి ఒకసారి ఉచిత వసతి, ఐదుమందికి సుపధం నుంచి శ్రీవారి దర్శనానికి వెళ్లే అవకాశం.
2) రూ.ఐదు నుంచి పది లక్షలు ఇచ్చిన వారికి మూడు రోజుల వసతి, ఐదుగురికి బ్రేక్ దర్శనం
3) రూ. పది లక్షలు, ఆ పైన విరాళం ఇచ్చిన దాతకు ఏడాదిలో 30 రోజులు వసతి,, వీఐపీ బ్రేక్ దర్శనం, లడ్డూ ప్రసాదాలు బహుమానంగా ఇస్తారు.
4) కోటి రూపాయలు విరాళం ఇచ్చిన దాతకు ప్రత్యేక వీఐపీ సూట్ లో బస, ఉదయాస్తమాన సేవ లేదా ప్రత్యేక వీఐపీ దర్శనం
మార్పులు
టీడీపీ కూటమి ఏర్పడిన తరువాత బీఆర్. నాయుడు సారధ్యంలో పాలక మండలి ఏర్పాటైంది. 2025 సంవత్సరం నుంచి దాతలకు కల్పిస్తున్న సదుపాయలను సమీక్షించడం ద్వారా మార్పులు చేశారు. గతంలో గదులకు దాతల పేర్లు రాయడానికి ఉన్న సదుపాయం రద్దు చేసి, ఆ స్థానంలో ఆధ్యాత్మికత ఉంటే పేర్లు రాయడానికి అనుమతిస్తున్నారు.
టీటీడీకి విరాళం ఇచ్చిన దాత తరువాత వారి నామినీకి వసతి, దర్శనం సదుపాయాలు కల్పించే విధంగా నిర్ణయం తీసుకున్నారు. ఇంతులో కూడా వ్యక్తులకు జీవితకాలం, సంస్థలకు 20 సంవత్సరాల కాలపరిమితి విధించారు.
Read More
Next Story