
రథసప్తమి వైభవం: శ్రీమన్నారాయణుడిగా దర్శనమిచ్చిన మలయప్ప.
యాత్రికులతో కిటకిటలాడుతున్నతిరుమల.
వాహన సేవలు
సూర్య ప్రభ వాహనం - ఉదయం 5.30 నుంచి 8 గంటల వరకు
చిన్న శేష వాహనం - ఉదయం 9 నుంచి 10 గంటల వరకు
గరుడ వాహనం - ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు
హనుమంత వాహనం - మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల వరకు
చక్రస్నానం - మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు
కల్పవృక్ష వాహనం - సాయంత్రం 4 నుంచి ఐదు గంటల వరకు
సర్వభూపాల వాహనం - సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు
చంద్రప్రభ వాహనం - రాత్రి 8 నుంచి 9 గంటల వరకు
తిరుమల శ్రీవారి క్షేత్రంలో రథసప్తమి వేడుకల నేపథ్యంలో యాత్రికులతో కిటకిటలాడుతోంది. వాహనసేవలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆదివారం తెల్లవారుజామున 5:30 గంటలకు సూర్యప్రభ వాహనాన్ని అధిరోహించిన శ్రీమన్నారాయణుడు (శ్రీమలయ్యప్పస్వామి) తిరుమాడ వీధుల్లో విహరిస్తూ దర్శనమిచ్చారు. వాహనసేవ ముందు కళాకారుల ప్రదర్శనలు యాత్రికులను కనువిందు చేస్తున్నాయి.
తిరుమలలో రథసప్తమి సందర్భంగా ఒకరోజు బ్రహ్మోత్సవంగా భావించే ఉత్సవాల నిర్వహణకు టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. వారాంతపు సెలవులు కావడం వల్ల తిరుమల కు యాత్రికులు పోటెత్తారు. ఆలయ మాడవీధుల్లో తో పాటు గ్యాలరీలన్నీ కిటకిటలాడుతున్నాయి. తిరుపతి నుంచి తిరుమలకు చేరడానికి వీలుగా యాత్రికుల కోసం ఆర్టీసీ ద్వారా ఈ సంవత్సరం 2300 సర్వీసులు నడపడానికి ఏర్పాటు చేసినట్లు టీటీడీ చైర్మన్ బి.ఆర్ నాయుడు చెప్పారు.
సూర్యోదయం వేళ..
ప్రతికూల వాతావరణం ఉన్న నేపథ్యంలో ఆకాశంలో మబ్బులు కమ్ముకున్నాయి. ఈదురుగాలులు వెలిగింతలు పెడుతున్నాయి. తిరుమలలో శ్రీవారి మూల విరాట్టుకు నిత్య కైంకర్యాలు పూర్తి చేశారు. ఆ తర్వాత సూర్యుడి కిరణాలు ప్రసరించే సమయాన్ని నిర్ధారించిన ఆగమ శాస్త్ర పండితులు ఆదివారం ఉదయం 5:30 గంటలకు సూర్యప్రభ వాహనంపై శ్రీమలయప్ప స్వామి వారిని ఊరేగించడానికి ఏర్పాటు సిద్ధం చేశారు.
శ్రీవారి ఆలయం నుంచి శ్రీమలయప్పస్వామి సూర్యోదయానికి ముందే వాహన మండపానికి తీసుకొని వచ్చారు. విశేష సమర్పణ అనంతరం స్వామి వారిని సూర్యప్రభ వాహనంపై ఆశీలను చేసి, సర్కారు హారతి సమర్పించారు. ఆ తర్వాత శ్రీవారి ఆలయ మాడవీధుల్లో పల్లకిసేవ విహారానికి బయలుదేరింది. ఆలయ సమీపంలోని కి వచ్చిన తర్వాత వాహనం కొద్దిసేపు ఆగింది. వాతావరణం పలుకరించిన స్థితిలో సూర్యకిరణాల ప్రసరించే సమయాన్ని నిర్ధారించిన ఆగమ శాస్త్ర పండితులు సూర్యప్రభ వాహనాన్ని ముందుకు కదిలించారు. ఆ సమయంలో శ్రీవారి ఆలయంతో పాటు మాడవీధులన్నీ యాత్రికులతో కిటకిటలాడుతున్నాయి. నాలుగు మాడవీధుల్లో స్వామివారిని దర్శించుకునే విధంగా మన అయ్యప్ప స్వామి వారి నీ వాహనాన్ని యాత్రికుల వైపు మళ్ళించారు. ఉదయం ఎనిమిది గంటల వరకు ఈ కార్యక్రమం నిరాటంకంగా సాగింది.
"దేశంలోని విభిన్న సంస్కృతులను ప్రతిబింబించే విధంగా 1000 మంది కళాకారులు ప్రదర్శనలు ఇస్తున్నారు" అని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ చెప్పారు. వాహన సేవల ముందు 56 కళారూపాలు కనువిందు చేసే విధంగా ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు.
తిరుమల కిటకిట
వరుస సెలవుల నేపథ్యంలో తిరుమల శ్రీవారి క్షేత్రం యాత్రికులతో రద్దీగా మారింది. రథసప్తమి నేపథ్యంలో స్లాటేడ్ సర్వదర్శనం (ఎస్ ఎస్ డి) తోకలు జారీ నిలిపివేయడంతో యాత్రికులు నేరుగా తిరుమలకు చేరుకున్నారు. దీంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్, నారాయణగిరి షెడ్యూల్ అన్ని యాత్రికులతో నిండిపోయాయి. శ్రీవారి దర్శనం కోసం తిరుమల రింగ్ రోడ్ లోని సేవా సదన్ వరకు క్యూలైన్ విస్తరించింది. శ్రీవారి దర్శనానికి 16 గంటలు సమయం పడుతుందని టిటిడి అధికారులు వెల్లడించారు.
14 రకాల అన్నప్రసాదాలు
తిరుమల రథసప్తమి వేడుకలు నిర్వహణకు వారం నుంచే టిటిడి అధికారులు సన్నాహాలు చేశారు. ఉదయం సూర్యప్రభ వాహనంతో ప్రారంభమైన రథసప్తమిని బ్రహ్మోత్సవం ఆదివారం రాత్రి చంద్రోదయం వేళ చంద్రప్రభ వాహనంతో ముగుస్తుంది. ఏడు వాహనాలపై మలయప్ప స్వామి వారు పల్లకిపై తిరుమల విహరిస్తూ యాత్రికులకు దర్శనం ఇవ్వబోతున్నారు. తిరుమలలో వేచి ఉన్న యాత్రికులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా టిటిడి అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేశారు.
"గ్యాలరీలోని యాత్రికులకు నిరంతరాయంగా 14 రకాల అన్న ప్రసాదాలు అందించడానికి ఏర్పాట్లు చేసాం" అని టిటిడి చైర్మన్ బి.ఆర్ నాయుడు మీడియాకు చెప్పారు.
యాత్రికులకు అన్నప్రసాదాలు, మంచినీరు అందించడానికి 3700 మంది శ్రీవారి సేవకులు స్వచ్ఛందంగా సేవలు అందిస్తున్నారని కూడా ఆయన చెప్పారు.
విఐపి బ్రేక్ దర్శనాలు రద్దు చేయడం ద్వారా సామాన్య యాత్రికులకు ప్రాధాన్యత ఇస్తూ శ్రీవారి మూలమూర్తిని దర్శించుకునేందుకు ఏర్పాటు చేసినట్లు కూడా టిటిడి అధికారులు చెప్పారు.
తిరుమలలో ఎలాంటి సంఘటనకు ఆస్కారం లేకుండా 2500 మంది సివిల్ పోలీసులు, టిటిడి విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ సిబ్బంది సేవలను వినియోగిస్తున్నారు.
"తిరుమల ఆలయ పరిసరాలు, మాడవీధుల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కమాండ్ కంట్రోల్ తో అనుసంధానం చేశాం" అని టీటీడీ అదనపు ఈఓ సీహెచ్. వెంకయ్య చౌదరి చెప్పారు. రద్దీని గుర్తించడం, వారికి అవసరమైన సేవలు అందించడానికి టీటీడీ యంత్రాంగాన్ని సంసిద్ధంగా ఉంచినట్లు ఆయన చెప్పారు.
Next Story

