దేవతా పక్షీ.. నేలపట్టుకు వచ్చావా తల్లీ!
x

దేవతా పక్షీ.. నేలపట్టుకు వచ్చావా తల్లీ!

14 వేల కిలోమీటర్ల 'రెక్కలకష్టం'.. యురేషియన్ కర్లూ పక్షి ఆగమనం


సుదూర తీరాల నుంచి.. రెక్కల కష్టాన్ని నమ్ముకుని.. 14 వేల కిలోమీటర్లు సాగరంపై సాహసం చేస్తూ.. ఆకాశ గంగమ్మ ఒడిలో తేలుతూ నేలపట్టుకు చేరిన 'యురేషియన్ కర్లూ'పై ప్రత్యేక కథనం.

తిరుపతి జిల్లాలోని నేలపట్టు సైబీరియా పక్షులకు విడిదిగా మారింది. ఈ ఏడాది ఈస్ట్ అట్లాంటిక్ (East Atlantic ) నుంచి గంటకు 80 కిలోమీటర్ల వేగంతో ఎగిరే యురేషియన్ కర్లూ ( కర్ లీ) దాదాపు 14,000 వేల కిలోమీటర్లు ప్రయాణించి, నేలపట్టు ప్రాంతంలో ప్రత్యక్షమైంది. దీనితో పాటు సీ గుల్స్, (sea gulls and terns) వంటి అరుదైన పక్షి కూడా ఉందని అటవీశాఖ వన్యప్రాణి విభాగం గుర్తించింది. 20 ఏళ్ల జీవితకాలం ఉన్న యురేషియన్ కర్లూ పక్షి రెక్కలు 89-106 సెంటీమీటర్లు పొడవు ఉంటాయి. తూర్పు అట్లాంటిక్ ఫ్లై వే వెంట సుదూరం ప్రయాణించింది. స్పెయిన్, ఐర్లాండ్ నుంచి ఉరల్ పర్వతాలకు మాత్రమే పరిమితమైన ఈ పక్షి ఆర్కిటిక్ సర్కిల్ వరకు పరిమితమైనట్టు రికార్డులు చెబుతున్నాయి.

ఫైల్ ఫొటో

"వలస పక్షుల లెక్కింపులో యురేషియన్ కర్లూ, సీ గల్స్ తోపాటు ఇంకొన్ని ప్రత్యేక అతిథులుగా వచ్చినట్లు గుర్తించాం" అని సూళ్లూరుపేట డీఎఫ్ఓ హారిక 'ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్' ప్రతినిధికి చెప్పారు.

చిత్తడి నేలలే ఆవాసం
వలస పక్షుల ప్రేమాయణానికి చిత్తడి నేలలు బృందావనంగా మారాయి. ఒంటరిగా వచ్చే ఈ పక్షులు ఆరు నెలల తరువాత జంటగా, పిల్లలతో కలిసి సైబీరియాకు తిరిగి వెళ్లడం అనేది సర్వసాధారణం. 30 ఏళ్ల కిందటి 36 రకాల పక్షులు నేలపట్టు, పులికాట్ సరస్సు ప్రాంతానికి వచ్చేవి. ఆ సంఖ్య ఆరు నుంచి ఏడు వేలకు పెరిగింది. పక్షులను లెక్కించడంలో అటవీశాఖకు బొంబాయి నేచురల్ హిస్టరీ సొసైటీతో అవినాభావ సంబంధం ఉంది. ఏటా 1.60 లక్షల పక్షులు వస్తున్నట్లు ఓ లెక్క ఉంది.

"ఈ ఏడాది దాదాపు లక్షకు పైగానే వలస పక్షులు వచ్చాయి. ఎనిమిది బృందాలు పక్షులను లెక్కించాయి. అవన్నీ క్రోడీకరించాలి" అని డీఎఫ్ఓ హారిక స్పష్టం చేశారు.
విడిది కేంద్రాలు ఇవి...
తిరుపతి జిల్లా నేలపట్టు, పులికాట్ సరస్సుతో పాటు గోదావరి జిల్లాల్లోని కొల్లేరు సరస్సు, టెక్కలి వద్ద ఉన్న తేలినీలాపురం ప్రాంతాలకు సైబీరియా వలస పక్షులకు విడిది కేంద్రాలుగా ఉన్నాయి. కొల్లేరు సరస్సు వద్దకు వచ్చే పక్షుల్లో పరజీ, పరాజము, ములుగుపిల్ల, సైబీరియా పక్షులు శీతాకాలంలో సందడి చేస్తుంటాయి. తేలినీలాపురం సమీపంలోకి 3,000 పెలికాన్, స్టార్క్స్ పక్షులు, జర్మనీ, రష్యా, మలేషియా, హంగేరీ, సింగపూర్, సైబీరియా నుంచి 113 రకాల పక్షులు వలస వస్తున్నట్లు సర్వేలో తేలిందని ఆ ప్రాంత అటవీశాఖ అధికారులు చెప్పారు. గుంటూరు జిల్లాలోని ఉప్పలపాడు కూడా వలస పక్షులకు నిలయంగా ఉంది.

తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గం దొరవారిసత్రం, ఇంకొన్ని ప్రాంతాలు విదేశీ పక్షులకు కేంద్రంగా మారింది. శీతాకాలంలో వేల కిలోమీటర్లు ప్రయాణించి ఇక్కడికి వచ్చే పక్షులు వైశాఖంలో అంటే ఆరు నెలల తరువాత వేసవి తిరిగి వెళ్లడం సహజంగా జరుగుతూ ఉంటుంది. ప్రస్తుతం ఈ ప్రాంతంలోని నేలపట్టు (Nelapattu ), పులికాట్ సరస్సు (Puliot Lake) తోపాటు నేరేడు, మారేడు, అత్తిగుంట చెరువుల్లోని కడప చెట్లపై గూళ్లు ఆవాసంగా ఏర్పాటు చేసుకుంటున్నాయి.
1970లో వెలుగులోకి నేలపట్టు
నేలపట్టు వద్ద వలస పక్షులను 1970 లో పక్షి శాస్త్రవేత్త సలీం మెయిజుద్దీన్ అలీ చగుర్తించారు. 1976లో పక్షుల రక్షిత కేంద్రంగా మార్చారు. ఆ తరువాతి నుంచి అటవీశాఖ వన్యప్రాణి విభాగం సంరక్షిస్తోంది. ఈ కథలో కాస్త వెనక్కి వెళితే.. 1896 నవంబర్ 12వ తేదీ జన్మించిన సలీం అలీ పక్షి శాస్త్రవేత్త కావడానికి బొంబాయి నేచురల్ హిస్టరీ సొసైటీ (Bombay Natural History Society - BNHS) కార్యదర్శి వాల్టర్ శామ్యూల్ మిల్లార్డ్ పక్షుల అధ్యయనంపై ఆసక్తి కలిగించారు. ఆ తరువాత సలీం అలీ రాజ్యసభ సభ్యుడిగా సేవలు అందించారు. ఆయనకు పద్మవిభూషణ్ గౌరవం కూడా దక్కింది. 200 ఏళ్ల చరిత్ర కలిగిన బొంబాయి నేచురల్ హిస్టరీ సొసైటీ మూతపడకుండా కాపాడేందుకు అప్పటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ సాయం తీసుకున్నారు. దేశంలో పక్షిశాస్త్రం (Ornithology) పై అవగాహన, అధ్యయనం పెంచడానికి కృషి చేసిన సలీం అలీకి "Birdman of India"గా గుర్తింపు సాధించిన ఆయన 1987 జూన్ 20వ తేదీ తుదిశ్వాస విడిచారు.
పెరిగిన వలసలు..

నేలపట్టు వద్దకు 30 ఏళ్ల కిందటి వరకు 36 రకాల పక్షులు మాత్రమే వచ్చేవని అటవీశాఖ అధికారులు చెప్పిన సమాచారం. ప్రస్తుతం 16 రకాల జాతులకు సంబంధించిన ఆరు నుంచి ఏడు వేల పక్షులు రావడం, సంతోనోత్పత్తి ద్వారా మరో పది శాతం అదనంగా సైబీరియా ప్రాంతాలకు తిరిగి వెళుతున్నట్లు చెబుతున్నారు. ఇక్కడికి బర్మా, నేపాల్, అమెరికా, చైనా, ధాయ్ లాండ్, శ్రీలంక, బంగ్లాదేశ్, అంటార్కిటికా, ప్రాంతాల నుంచి వలస పక్షులు వస్తున్నట్లు గుర్తించారు.
లెక్కింపు ఇలా..
వలస పక్షులను ఈ సంవత్సరం కూడా ఆసియా నీటి పక్షుల గణన (AWC)–2026 జరిగింది. ఇందులో బాంబే నేచురల్ హిస్టరీ సొసైటీ (BNHS), తిరుపతి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (IISER), శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (SHAR), తిరుపతి నేచర్ సొసైటీ, IFMR- GSB క్రియా విశ్వవిద్యాలయం, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IIIT) – ఇంజనీరింగ్ కళాశాల, శ్రీసిటీ వంటి శాస్త్రీయ విద్యా సంస్థల సహకారంతో నిర్వహించారు. సూళ్లూరుపేటలోని వివిధ ప్రభుత్వ విభాగాల అధికారులు కూడా నీటి పక్షుల గణనలో చురుకుగా పాల్గొన్నారు.
1.పాయింట్ కౌంట్: ఒక నిర్దిష్ట ప్రాంతంలో పక్షుల సంఖ్య లెక్కిస్తారు.
2. లైన్ ట్రన్సెక్ట్: ఒకే మార్గంలో పక్షుల సంఖ్య
3. రాడార్ టెక్నాలజీ: పక్షుల కదలికలను గుర్తించి, రాడార్ ద్వారా గుర్తించడం
4.సిటిజన్ సైన్స్: స్వచ్ఛంద సేవకులు పక్షుల సంఖ్యను లెక్కించడానికి సాయం తీసుకుంటారు.
పెరిగిన వలస పక్షుల సంఖ్య
2025లో నేలపట్టు, పులికాట్ సరస్సు వద్ద 24,549 పక్షులు గుర్తించారు. ఈ పక్షులు సైబీరియా, ఆస్ట్రేలియా, ఆగ్నేయాసియా దేశాల నుంచి వచ్చాయి. అరుదుగా గుర్తించిన పక్షుల్లో ఫ్లెమింగో, పెలికాన్, సైబీరియన్ కొంగలు ఉన్నాయని సూళ్లూరుపేట డీఎఫ్ఓ హారిక చెప్పారు.
2021లో పక్షులు నేలపట్టు, పులికాట్ సరస్సు ప్రాంతంలో 26,499 పక్షులు విడిది చేసినట్లు గుర్తించారు. 2020తో పోలిస్తే ఈ సంఖ్య తక్కువ అని నిర్ధారించారు. 2022లో 31 రకాల 24,549 పక్షులు వచ్చాయి. 2025లో 24 వేల పక్షులు శీతాకాలంలో విడిది చేసినట్టు గుర్తించారు. ఈ సంఖ్య అంతకంటే ఎక్కువగానే ఉందనేది పక్షి ప్రేమికులు చెబుతున్న మాట.
ఇదీ ఓ పక్షి ప్రేమికుడి అనుభవం

నేలపట్టు మినహా పులికాట్ సరస్సు, అటకానితిప్ప, బీవీ.పాళెం, ఇరకందీవి వద్ద ఫ్లెమింగో పక్షులకు నిలయంగా ఉందని రేణిగుంటకు చెందిన బర్డ్ వాచర్ బండారు హరికృష్ణ చెప్పారు. నేలపట్టు, పులికాట్, కొల్లేరు ప్రాంతాల్లో సర్వే చేసిన అనుభవాలను హరికృష్ణ 'ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్' ప్రతినిధితో పంచుకున్నారు.
"పక్షులను లెక్కించడంలో కెమెరా, బైనాక్యులర్స్ ప్రధానంగా తీసుకుంటారు" అని హరికృష్ణ చెప్పారు.
"ఉదాహరణకు.. బైనాక్యులర్ లో చూసి ఒక ప్యాచ్ గా విస్తీర్ణం పరిగణలోకి తీసుకుంటాం. అందులో పది లేదా 20 భాగాలుగా విభజిస్తాం. ఒకో భాగంలో 10 పక్షులను గుర్తించి, 20 భాగాల్లో కనిపించినవి 200 పక్షులుగా లెక్కిస్తాం" అని హరికృష్ణ వివరించారు.
"హై రెజల్యూషన్ కెమెరా లెన్స్ ద్వారా ఫోటో తీయడం ద్వారా కూడా గణన జరుగుతుంది. ఒక బిట్ లో కనిపించే పది పక్షులను గుర్తించి, ఫోటోనే 20 భాగాలుగా గుర్తించి ఆ ప్రదేశంలో ఎన్ని పక్షులు ఉందనే విషయాన్ని నిర్ధారించడానికి పక్షుల గణనలో పాటించే పద్ధతులు ఇవి" అని హరికృష్ణ వివరించారు. నేలపట్టు మినహా మిగతా నాలుగు ప్రదేశాలకు 1,600కు పైగానే ఫ్లెమింగో పక్షులు వచ్చాయనేది ఓ అంచనా అని ఆయన అంటున్నారు.
సైబీరియన్ పక్షులు (Siberian birds ) సూళ్లూరుపేట ప్రాంతంలోని పల్లెలకు దేవతాపక్షులుగా భావిస్తారు. ఆ పక్షులను వేటాడితే అధికారులే కాదు. ఆ గ్రామ ప్రజలే సహించరు. వాటి వల్ల పంటలతో పొలాలు సస్యశ్యామలంగా ఉంటాయి. మేము సుభిక్షంగా ఉంటామని ఆ గ్రామాల ప్రజలు చెబుతారు.
ఇక్కడికే ఎందుకు..

నేల పట్టు సమీపంలోని నీటిలో 'కరుప్, నీర్' (Karup, Neer ) తోపాటు అనేక రకాల పేర్లతో పిలిచే "బేరింగ్ టోనియా యాక్యు టాంగ్యులా" (Baringtonia accipitrula ) శాస్త్రీయనామంతో ఉన్న మొక్కలు పుష్కలంగా పెరుగుతాయి. ఇవి దాదాపు నీటిలో సగభాగం మునిగి ఉంటాయి. ఇక్కడ ఉన్న బురద మట్టి ఈ చెట్లకు బాగా సరిపోతుంది. నీటిలోని చేపలకు ఆహారం బాగా దొరుకుతుంది. మత్స్య సంపదకు లోటు ఉండదు కాబట్టే పక్షులు సుదీర తీరాల నుంచి నేల పట్టుకు తరలి వస్తాయని పక్షి ప్రేమికులు చెబుతున్నారు.
సంతానోత్పత్తికి కేంద్రం
ఏటా అక్టోబర్ మొదటివారం నుంచి ప్రారంభమయ్య పక్షులరాక నవంబర్ మధ్యకు సందడి పెరుగుతుంది. డిసెంబర్ చివరికి మరింత ఎక్కువగా తరలివస్తాయి. నవంబర్ మొదటి లేదా రెండో వారంలో గుడ్లు పెట్టే ఈ పక్షులు డిసెంబర్ 2 లేదా మూడో వారంలో పిల్లల ఉత్పత్తికి అనుకూలంగా మార్చుకుంటాయని పక్షుల పరిశోధకులు చేసిన పరిశీలనలో వెల్లడైంది. పొదిగిన పిల్లలకు తల్లి పక్షి ఈతకొట్టడం ఎగరడం ఆహారాన్ని సంపాదించుకోవడం వంటి విద్యలు కూడా నేర్పిస్తుందని పరిశోధనలో వెల్లడైంది.
నేలపట్టు విదేశీ పక్షులకు నిలయంగా మారడానికి ప్రత్యేక కారణాలు కూడా ఉన్నాయి. ఇక్కడి వాతావరణం గూడబాతుల సంతానోత్పత్తికి కేంద్రంగా మారింది. పెలికాన్ (Pelican), బసత్, స్పాట్ బిల్డ్, స్పూన్ బిల్, పెలికాన్, ప్లోవర్స్, పక్షులతో పాటు సీ గుల్స్ (sea gulls, terns ) పక్షులు వస్తున్నట్లు గుర్తించారు. నత్తగుల్ల కొంగ, నీటి కాకి, తెల్ల కంకణాయి, శబరి కొంగ లాంటి అంతరిస్తున్న జాతులకు కూడా ఈ సంతాన ఉత్పత్తి కేంద్రంగా మారినట్లు గుర్తించారు.
నేలపట్టు పక్షుల విడిది కేంద్రానికి, బర్మా, నేపాల్, అమెరికా, చైనా, థాయిలాండ్, శ్రీలంక, బంగ్లాదేశ్, అంటార్కిటిక్ ఆ ప్రాంతాల నుంచి కూడా శీతాకాలంలో పక్షులు వలస వస్తుంటాయి. నేల పట్టుకు చేరుకునే ఫ్లెమింగోతోపాటు పెలికాన్, సైబీరియన్ కొంగలతో పాటు విదేశీ పక్షులను ఈ ప్రాంతంలో విశిష్ట అతిథులుగా ప్రేమించడమే కాదు. వాటి రాక కోసం దొరవారిసత్రం మండలంలోని గ్రామాల ప్రజలు నిరీక్షిస్తుంటారు.
పరిశోధన కేంద్రం
అటవీ శాఖ పర్యవేక్షణలో ఉన్న నేలపట్టు పక్షి ప్రేమికులకు ఓ పరిశోధనా కేంద్రంగా మారింది. రాత్రిళ్ళు కూడా పక్షుల జాడ, కదలికలు ఫోటోలు తీసుకోవడానికి కూడా ఔత్సాహిక ఫోటోగ్రాఫర్లు ఇక్కడికి కి పడుతుంటారు. నేలపట్టు వద్ద ఒక మ్యూజియం, గ్రంథాలయం, ఆడిటోరియం కూడా అటవీశాఖ ఏర్పాటు చేసింది.
"నేలపట్టు, పులికాట్ సరస్సులోకి ఇంకా అరుదైన పక్షులు వచ్చాయి. ఎనిమిది బృందాలు పక్షులను లెక్కించింది" అని డీఎస్ఓ హారిక చెప్పారు. లక్షకు పైగానే పక్షులు వచ్చాయి. ఏదిఏమైనా గతానికి భిన్నంగా అరుదైన పక్షులు నేలపట్టు వద్ద ప్రత్యక్షం అవుతున్నాయి. ఆ వివరాలు తెలుసుకోవాలంటే.. రెండు, మూడు రోజుల్లో వెల్లడిస్తామని హారిక తెలిపారు.
Read More
Next Story