
ప్రకృతి ఆరాధన కోసం.. కొండ కోనల్లో సాహసయాత్ర..
మహాశివరాత్రికి జనారణ్యం కానున్న రాయలసీమ అభయారణ్యం.
పీలేరు వద్ద ప్రకృతి చెక్కిన శిల్పం ఝరి కోన.
విఠలాచార్య సినిమా సెట్టింగ్ తలపించే దృశ్యం
హత్యరాల చెరుకులు మహాతీపి
శివభక్తుల అడుగులన్నీ అడవుల వైపే..
శేషాచలం, నల్లమల, లంకమల అడవుల్లో ప్రకృతి ఆరాధనకు యాత్రికులు బయలుదేరారు. కొండకోనల్లో పచ్చదనం ఆస్వాదించనున్నారు. కోనల్లో నెలవైన ఈశ్వరుడి ఆలయాల వైపు జనం అడుగులు సాగుతున్నాయి. మహాశివరాత్రి నేపథ్యంలో కొండల్లోని ఆలయాల వద్ద జలపాతాల సోయగం ఆస్వాదిస్తూ, జాగారం చేయడానికి వెళుతున్న యాత్రికులతో అడవులన్నీ సందడిగా మారాయి.
అభయారణ్యంలో ఉన్న శివాలయాల వద్ద ముందస్తు ఏర్పాట్లు చేశారు. భద్రతా కారణాల రీత్యా తిరుపతి జిల్లాలోని తలకోన, కడప జిల్లాలోని నిత్యపూజ కోన, కర్నూలు జిల్లాలో అహోబిలం సమీప ప్రాంతాల్లో జలపాతం వద్ద పోలీసులు ఆంక్షలు విధించారు.
రాయలసీమలోని అటవీ ప్రాంతాల్లో ఉన్న శైవాలయాలకు చారిత్రక నేపథ్యం ఉంది. పీలేరుకు సమీపంలోని కలకడ వద్ద బాహుదా, సత్యవతీ నదుల సంగమ కేంద్రం. సమీపంలోని కోనసిద్ధేశ్వర స్వామి ఆలయంలో ఛత్రపతి శివాజీ సేదదీరినట్లు కథనం. ఉంది. ఈ ఆలయానికి రెండు కిలోమీటర్ల దూరం వెళితే కనిపించే ఝరి కోన (రెండు నదుల సంగమ) ప్రకృతి చెక్కిన ప్రదేశంగా కనిపిస్తుంది.
జ్యోతిర్లింగ క్షేత్రాలు..
దేశంలోని ద్వాదశ లింగాల్లో రెండు రాయలసీమ జిల్లాలోనే ఉన్నాయి. వాటిలో వాయు లింగ క్షేత్రమైన శ్రీకాళహస్తి చిత్తూరు జిల్లాలో ఉంది. మరో జ్యోతిర్లింగ క్షేత్రం కర్నూలు జిల్లా శ్రీశైలంలో ఉంది. ఈ క్షేత్రాలతోపాటు రాయలసీమలో విస్తరించి ఉన్న శేషాచలం, నల్లమల, లంకమల అటవీ ప్రాంతం
ప్రకృతి అందాలకు నిలయం. ఈ అటవీ ప్రాంతంలోని కొండకోనల్లో ఉన్న శైవాలయాలకు చారిత్రక నేపథ్యం కూడా ఉంది.
శ్రీకాళహస్తి.. వెయ్యి లింగాల కోన
శ్రీకాళహస్తి అనగానే మనకు గుర్తుకు వచ్చేది రాహు కేతువులు కొలువైన ముక్కంటి వాయులింగ క్షేత్రం.
శ్రీకాళహస్తి సమీపంలోని వెయ్యిలింగాలకోన కూడా ప్రధానమైంది. దట్టమైన అడవుల్లో ఉన్న ఈ కోన వైపు మహాశివరాత్రి నేపథ్యంలో వేలాదిమంది యాత్రికులు నడక ప్రారంభించారు.
శ్రీకాళహస్తి నుంచి రామాపురం వెళ్లే దారిలో రోడ్డు పైనుంచి రెండు కిలోమీటర్లు లోపలకు నడిచి లేదా సొంత వాహనాల్లో కొండ వరకు వెళ్ళవచ్చు. అక్కడి నుంచి కొండ ఎక్కడం మొదలు పెట్టడానికి ముందే ప్రకృతి ఒడిలో గలగల పారే జలపాతం ఆహ్లాదం పంచుతుంది. ఆ తర్వాత అడవిలో ప్రయాణం సాగుతుంది.. నిటారుగా ఉండే ఈ కొండ మెట్లు ఎక్కి, పైకి చేరగానే రాజుల కాలంలో నిర్మించిన చిన్న మందిరం సేద తీరడానికి అనువుగా ఉంటుంది. ఈ మార్గంలో కొండముచ్చుల బెడద కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ అడవిలోనే భక్త కన్నప్ప వేటాడడం ఇక్కడి శివలింగాన్ని పూజించినట్లు కూడా చారిత్రిక నేపథ్య కథనం ఇక్కడ శిల్పాలన్నీ రాతిపైనే అంటే కొండ గోడకు చెక్కి ఉంటాయి. ఈ ప్రదేశానికి వెళ్లడానికి యాత్రికులు శివరాత్రికి ముందు రోజే బయలుదేరడం కనిపిస్తుంది.
శేషాచలం అటవీ ప్రాంతంలో..
తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం ఎర్రవారిపాలెం మండలంలో తలకోన ఒక ప్రసిద్ధ పర్యాటక కేంద్రం. తిరుమల పర్వతసానువులకు కింద ఉన్న దట్టమైన అడవిలో ఉన్న ఈ తలకోన తిరుపతికి 45 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడి సిద్దేశ్వరుడి ఆలయానికి చారిత్రక నేపథ్యం ఉంది. పర్యాటక, ఆధ్యాత్మిక క్షేత్రంగా ఉన్న తలకోనకు రెగ్యులర్ బస్ సర్వీసులు కూడా ఆర్టీసీ నడుపుతోంది.
మహాశివరాత్రి నేపథ్యంలో శనివారం నుంచి రెండు రోజులపాటు తిరుపతి, మదనపల్లి, pelru, డిపోల నుంచి కూడా ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు. దూరప్రాంతాల నుంచి వచ్చేవారు భాకరాపేట నుంచి 26 కిలోమీటర్లు ఉన్న తలకోనకు ఆటోల్లో నెరబైలు గ్రామం మీదుగా ప్రయాణం చేయవచ్చు. ఇక్కడ టీటీడీ, తలకోన ఆలయ అతిథి గృహాలు కూడా అందుబాటులో ఉన్నాయి.
తలకోన అడవుల్లోనే 60 మీటర్ల ఎత్తు నుంచి జాలువారే జలపాతం ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ. శేషాచలం అడవుల్లో ఏనుగుల సంచారం అధికంగా ఉండడం వల్ల తలకోన వాటర్ ఫాల్స్ వద్దకు వెళ్లకుండా ఆంక్షలు విధించారు.
"ఏనుగులతో పాటు ఎలుగుమంటల సంచారం కూడా ఎక్కువగా ఉంది. అందువల్ల జలపాతం వద్దకు ఈనెల 16వ తేదీ వరకు అనుమతి ఉండదు" అని సిద్దేశ్వరాలయ చైర్మన్ సోమనాధ రెడ్డి, చంద్రగిరి డిఎస్పి బీ. ప్రసాద్, స్పష్టం చేశారు.
తలకోనకు వచ్చే యాత్రికులు రామ్ లక్ష్మణ్ ఘాట్ వరకు మాత్రమే అనుమతిస్తామని వారు చెప్పారు. ఇక్కడికి సమీప ప్రాంతాల నుంచే కాకుండా, కడప జిల్లా (ప్రస్తుతం తిరుపతి జిల్లా) రైల్వే కోడూరు నియోజకవర్గంలోని అనేక ప్రాంతాల నుంచి శేషాచలం అడవి మార్గంలో కాలినడకన యాత్రికలు వస్తుంటారు. గత ఏడాది ఏనుగుల దాడిలో కొందరు చనిపోయిన నేపథ్యంలో అటవీశాఖ అధికారులు ఆంక్షలు అమలు చేస్తున్నారు.
సదాశివకోన.. శాసనం పదిలం
తిరుపతి జిల్లా నగిరి నియోజకవర్గం వడమాలపేట మండలంలో ఉన్న సదాశివకోన కూడా ప్రకృతి ఒడిలో అలరారుతోంది. ఇక్కడ సదాశివేశ్వరుడి మహాలింగాన్ని త్రేతాయుగంలో పరశురాముడు ప్రతిష్టించినట్లు స్థల పురాణం చెబుతోంది. కొండల నుంచి జాలువారే జలపాతం ప్రత్యేక ఆకర్షణ.
వడమాలపేటకు 14 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంది. కాలినడకన వెళ్లి జాగారం చేసే భక్తుల సంఖ్య అధికంగా ఉంటుంది. పుత్తూరు నుంచి నాగిలేరు వరకు ఆర్టీసీ బస్సుల్లో ఇక్కడికి చేరుకోవచ్చు ఆ తర్వాత ఏడు కిలోమీటర్లు కాలినడకన వెళ్లాలి. ఏర్పేడు నుంచి చెల్లూరు మార్గంలో ఆలయం వద్దకు సొంతవాహనాల్లో వెళ్లొచ్చు. కాలినడన వెళ్లే యాత్రికులు వడమాలపేట నుంచి రామసముద్రం మీదుగా వెళ్లడానికి ఆస్కారం ఉంది.
సదాశివ కోన వద్ద అమ్మవారి ఆలయానికి ఎడమవైపున ఉన్న జలపాతం. దాని ఒడ్డున ఉన్న భారీ రాతి బండపై చెక్కిన పురాతన శిలాశాసనం ప్రత్యేక ఆకర్షణ. పరిషత్కుల అంచనాల ప్రకారం ఇది సుమారు 1300 నాటిది కావచ్చు అనేది ఓ అంచనా.
ప్రకృతి చెక్కిన శిల్పం.. ఝరి కోన
ప్రకృతిలో అందాలకు కొదవలేదు. ఆస్వాదించే మనసు ఉంటే చాలు.
చిత్తూరు జిల్లా పీలేరు నియోజకవర్గం కలకడ మండలం కేంద్రానికి సమీపంలోని ఝరి కోన చూస్తే అర్థమవుతుంది. ఝరి కోన వద్దకు వెళితే.. పాత సినిమాల్లో విఠలాచార్య నిర్మించిన సినిమా సెట్టింగ్ కళ్ళ ముందు కదలాడుతుంది. ఈ ప్రదేశం బాహుదా, సత్యవతి నదుల సంగమించే ప్రదేశం.
మహాశివరాత్రి నాడు దేవళంపేట వద్ద ఉన్న సిద్దేశ్వర స్వామి వారికి ఝరికొనలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. పీలేరు నుంచి బయలుదేరితే రాయచోటికి వెళ్లే మార్గంలో కలకడ దాటిన తర్వాత బహుద నది బ్రిడ్జి వస్తుంది. అక్కడ అదృశ్యమయ్యే నదీ జలాలు, మూడు కిలోమీటర్ల తర్వాత "వీ ఆకారం"లో ఉండే కొండల మధ్య ధారగా ప్రారంభమయ్యే జలపాతం నదిలా ప్రవహిస్తూ కనువిందు చేస్తుంది. ఇసుక కాస్త లోడితే చాలు చలిమ నుంచి వచ్చే స్వచ్ఛమైన నీరు పసందుగా ఉంటుంది. ఈ నదిలో ఒంపులు తిరిగినట్లు ఉండే ఇసుక దారిలో సుమారు కిలోమీటర్ వరకు సినిమా సెట్టింగ్ తలపించే రీతిలో కొండ రాళ్ళు ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి.
మహాశివరాత్రి మరుసటి రోజు సత్యవతి నది వద్ద దేవరఎడ్లతో సందడిగా మారుతుంది. కర్నూలు జిల్లా ఆలూరు సమీపంలో కర్రల సమరం తలపిస్తుంది. బసవన్నలను ఊరేగింపుగా తీసుకువచ్చే గ్రామస్తులు సందడి చేస్తారు.
లంకమల అడవిలో..
కడప జిల్లా పరిధిలో విస్తరించి ఉన్న లంకమల అడవులకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. అరుదైన జంతు జీవాలకు ఆలవాలంగా ఉన్న ఈ ప్రదేశంలో ఉన్న అడవుల్లో వెలసిన శివాలయాలకు వెళ్లాలంటే భక్తులు అత్యంత ఆసక్తి చూపిస్తారు. ఈ కొండల్లో వెలసిన నిత్య పూజ కూనకు కూడా ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. పచ్చటి అడివిలో ఆహ్లాదకరమైన అడవి కొండా, గుట్టల మధ్య ప్రయాణం చేయాలి.
కడప జిల్లా బద్వేలు తాలూకా సిద్దవటం మండలంలోని లంకమల అడవుల్లో నిత్య పూజ కోన ప్రసిద్ధి చెందింది.
కడప నుంచి సిద్ధవటం 33 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అక్కడి నుంచి దట్టమైన అడవి మార్గంలో ప్రయాణం సాగుతుంది. కొండ కింద ఉన్న పంచలింగాల వరకు బస్సులు షేర్ ఆటోలు అందుబాటులో ఉన్నాయి.. రోడ్డు మార్గంలో వెళితే 12 కిలోమీటర్లు ప్రయాణం చేయాలి. పంచలింగాల నుంచి కొండపై ఉన్న ప్రధాన గుడి వరకు కాలిబాటనే వెళ్లాలి. పెద్ద పెద్ద బండరాళ్ల మధ్య సాగే ఈ నడక మార్గం ఆహ్లాదంగా ట్రెక్కింగ్ ను తలపిస్తుంది.
కడప గుండాల్లో... మర్కటక దర్శనం
కడప జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గంలో రెండు గుండాలకోనలు కూడా యాత్రికులకు ప్రకృతి ఆహ్వానం పలుకుతూ ఉంటుంది.
రైల్వే కోడూరు నుంచి చిట్వేలి వెళ్లే మార్గంలో పెద్దూరు వద్ద బస్సు దిగి సుమారు పది కిలోమీటర్ల దూరం పెనుసిల నరసింహ స్వామి అభయారణ్యంలో ప్రవేశించాలి. గుండాలకోన కోనకు చేరాలంటే దట్టమైన అటవీ ప్రాంతంలో మూడు నదులు దాటుకుని ప్రయాణం సాగించాలి. దారి పొడవునా ఎర్రచందనం వనాలు స్వాగతం పలికితే, గుండాలకోనకు చేరిన తర్వాత రెండు కొండల మధ్య సన్నటి ప్రదేశంలో కనిపించే నీటి ధార మధ్య మర్కటేశ్వరుడు (ఎండ్రకాయ లేదా పీత) దర్శనం లభిస్తే ఈశ్వరుడు కనిపించిన ఆనందంగా భావిస్తారు. సుమారు 40 అడుగుల ఎత్తులో నుంచి దూకే జలపాతం ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ. దట్టమైన అడవిలోనే నెగళ్ళు వేసుకొని యాత్రికులు జాగారం చేయడానికి ఆసక్తి చూపిస్తారు.
రైల్వే కోడూరు మండలం సమీపంలోని శేషాచలం అడవుల్లో కూడా మరో గుండాల కొనకుండా కూడా ప్రత్యేక ఆకర్షణగా ఉంది. తిరుపతికి సమీపంలోని తలకోనను తలపించే రీతిలో ఇక్కడ భారీ కొండల నుంచి జాలవారి జలపాతం, సమీపంలో నీరు నిలిచిన గుండాలు, ప్రకృతి సోయగం యాత్రికులను ఇక్కడ ఉల్లాసం పంచుతుంది.
గుండ్ల బ్రహ్మేశ్వరం ప్రకృతి పాఠం
నల్లమల అటవీ ప్రాంతంలో వెలసిన శైవ క్షేత్రాల్లో కర్నూలు జిల్లా ఆత్మకూరు సమీపంలో ఉన్న గుండ్లబ్రహ్మేశ్వరం ఆలయం ఒకటి. కాకతీయ, విజయనగర సామ్రాజ్యంలో ఈ ఆలయాన్ని నిర్మించినట్లు శాసనాలు చెబుతున్నాయి. ఏడాదికి రెండు రోజులు మాత్రమే ఈ ఆలయ దర్శనం ఉంటుందని చెబుతున్నారు.
ఆత్మకూరు సమీపంలోని గుండ్ల బ్రహ్మేశ్వరం వరకుకు వెళ్లాలంటే అటవీ శాఖ అధికారుల అనుమతి తప్పనిసరి. నంద్యాల, వెలుగోడు, ఆత్మకూరు నుంచి సంతజూటూరు, పెద్దదేవలాపురం గ్రామం మీదుగా ఈ క్షేత్రానికి వెళ్లడానికి అవకాశం ఉంది.
నంద్యాల నుంచి గాజులపల్లె మీదుగా గిద్దలూరు సమీపంలోని దిగువ మెట్ట వద్ద దిగి నేరుగా ఈ క్షేత్రానికి వెళ్ళవచ్చు. నంద్యాల నుంచి 42 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుండ్ల బ్రహ్మేశ్వరం మార్గంలో జాగ్రత్తలు పాటించాలని అటవీ శాఖ అధికారులు సూచనలు చేశారు.
"ఈ మార్గంలో ప్రస్తుతం 23 పురుల సంచారం ఉన్నట్లు గత ఏడాది అటవీ శాఖ అధికారులు చెప్పారు. నాగారం సాగర్ టైగర్ రిజర్వ్ ప్రాజెక్టు పరిధిలోని ఈ ప్రాంతంలో పుల్లలతో పాటు మచ్చలపిల్లి ఉడతలు దుప్పులు వంటి అనేక రకాల జంతువులకు ఈ అటవీ ప్రాంతం నిలయంగా ఉంది.
ఇసుక తిన్నెలపై చెరుకు గడలు తింటుంటే..
కడప జిల్లా రాజంపేట సమీపంలోని పోలి గ్రామం వద్ద ఉన్న హత్యరాలను అత్తిరాలగా కూడా పేరు. చెయ్యేరు నది ఒడ్డున ఉన్న ఈ గ్రామంలో 1830 నాటికే పరుశురామాలయానికి గుర్తింపు ఉంది. ఈ ప్రదేశంలోనే రెండు వేల సంవత్సరాల నాటి రోమన్ నాణేలు కూడా దొరికినట్టు చరిత్ర.
దేవగిరి యాదవరాజు సందర్శించిన ఈ ప్రదేశాన్ని పొత్తపి రాజు శ్రీకంఠ చోళులు మందిరం (మందరం) అనే గ్రామాన్ని స్వామివారికి సమర్పించినట్లు చారిత్రాక కథనం. గుట్టపై ఉన్న స్తంభంపై మహాశివరాత్రి రోజు దీపం వెలిగించడం ఆనవాయితీ.
హత్యరాల తిరునాళ్లలో చుట్టుపక్కల గ్రామాల్లో సాగు చేసే చెరుకు గడలకు ప్రసిద్ధి. వందలాది ఎడ్ల బండ్లలో తీసుకుని వచ్చే చెరుకు కొన్ని గంటల్లోనే విక్రయిస్తారు. చెయ్యేరు నది లోతు కనిపెట్టడం కష్టమే. ఈ నది ఒడ్డున ఇసుక తిన్నెలపై శివరాత్రి రోజు జాగారం చేయడం అనేది ఓ అనుభూతి మిగులుస్తుందని ఈ ప్రాంతానికి వచ్చే యాత్రికులు అంటుంటారు.
రాయలసీమలోని అటవీ ప్రాంతాల్లోని శైవక్షేత్రాల్లో మచ్చుకు ఇవి కొన్ని మాత్రమే. ఇంకా అనేక ప్రదేశాల్లో పచ్చటి అడవుల మధ్య సాగే ఆధ్యాత్మిక యాత్ర ఓ రకంగా ట్రెక్కింగ్ ద్వారా ప్రకృతి అనేక పాఠాలు నేర్పుతూ ఉంటుంది.
Next Story

