తుక్కుగా మారిన  పేదల సంజీవని
x

తుక్కుగా మారిన పేదల సంజీవని

రూ. రెండు కోట్ల విలువైన నాలుగు వాహనాలు గల్లంతు వెనుక కథేమిటిి?


గ్రామాల్లో పేదలకు అత్యవసర వైద్య సేవలు అందించే 104 అంబులెన్సులు అలసిపోయాయి. మూలన ఉన్న సుమారు రెండు కోట్ల రూపాయల విలువైన నాలుగు వాహనాలు డంపింగ్ యార్డులో తుక్కుగా మారాయి. ఆరు నెలల తరువాత ఆ వాహనాలు కనిపించడం లేదని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఫిర్యాదు చేశారు. దీనిపై మాకంటే మాకు సంబంధం లేదని వైద్య శాఖ,104 వాహనాలు పర్యవేక్షించే సిబ్బంది తప్పంచుకుంటున్నారు. పూర్వ అన్నమయ్య జిల్లా రాయచోటిలో అంబులెన్సులు విక్రయించింది ఎవరనేది మిస్టరీగా మారింది.

"వాహనాలు కనిపించలేదు" అని మదనపల్లె జిల్లా డీఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ లక్ష్మీ నరసయ్య రాయచోటి పోలీసులకు ఫిర్యాదు చేశానని చెప్పారు.

గ్రామీణ ప్రజలకు సేవలు

రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు సంచార వైద్య సేవలు అందించడానికి 104 వాహనాలను ప్రవేశపెట్టింది. దీర్ఘకాలిక రోగులకు ప్రతినెల మందులు సరఫరా చేయడంతో పాటు అత్యవసర సేవలు అందించడంలో ఈ వాహనాలదే కూడా కీలక పాత్ర. 104 వాహనంలో డాక్టర్ తో పాటు నర్సులు అందుబాటులో ఉంటారు. గ్రామాలకు వెళ్లి ప్రసూతి సేవలు అందించడం ప్రమాద బాధితులకు సహాయం చేయడం అంటే అత్యవసర వైద్య సేవలు అందించడంలో కీలక పాత్ర పోషిస్తాయి ఒకరకంగా చెప్పాలంటే ఇవి మెడికల్ హెల్త్ కేర్ యూనిట్లు గా మంచి ఆదరణ ఉంది.

షెడ్డుకు చేరిన 11 వాహనాలు

2019 నాటికి అన్నమయ్య జిల్లాలో విస్తృతంగా సేవలు అందించిన 104 వాహనాల్లో 11 మరమ్మతులకు గురయ్యాయి. వాటిలో నాలుగు వాహనాలు రాయచోటి ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో మూలన ఉంచారు. అందులోని విలువైన పరకరాలు కూడా కండీషన్ లోని వాహనాల్లో వినియోగిస్తున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారుల ద్వారా తెలిసిన సమాచారం.
టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత రాయచోటి అన్నమయ్య జిల్లాకు 28 అంబులెన్సులు (104 వాహనాలు) ప్రభుత్వం కేటాయించింది. కొత్త వాహనాలకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండలిపల్లి రాంప్రసాదరెడ్డి ప్రారంభించడానికి ఏర్పాట్లు చేశారు. దీంతో రాయచోటి ప్రభుత్వాస్పత్రిలోని నాలుగు వాహనాలను ఎక్కడికో తరలించారు. అవి ఎక్కడికి వెళ్లాయో తెలియదు. కానీ, నాలుగు రోజుల కిందట తుక్కుగా మారడం కలకలం రేపింది.
రాయచోటి కేంద్రం నుంచి మదనపల్లెకు అన్నమయ్య జిల్లా కేంద్రం మారింది. ఆరు నెలల తరువాత వెలుగు చూసిన నాలుగు 104 వాహనాల గల్లంతు మాకంటే మాకు సంబంధం లేదు. అని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, 104 వాహన సేవల పర్యవేక్షకులు చేతులు దులుపుకుంటున్నారు.
"కండిషన్ లో ఉన్న వాహనాలు మాత్రమే మేము పరివేక్షిస్తాం. షెడ్డు కు చేరిన వాహనాలు మా పరిధిలో ఉండవు" అని 104 అంబులెన్స్ వాహనాల డీఎంవో ( district monitoring officer) వేణుగోపాల్ స్పష్టం చేశారు. ఈ వాహనాలను భవ్య హెల్త్ సర్వీసెస్ ప్రైవేటు లిమిటెడ్ అనే సంస్థ ద్వారా నిర్వహిస్తున్నదనే విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఆ సంస్థ ద్వారా మేము ఈ బాధ్యతలు నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు.

రాయచోటిలో ఏం జరిగింది?


పూర్వ రాయచోటి అన్నమయ్య జిల్లా కేంద్రం లో ప్రభుత్వ ఆసుపత్రికి నాలుగు 104 వాహనాలను కేటాయించింది. గ్రామీణ ప్రాంతాలకు విస్తృతంగా సేవలు అందించిన ఈ వాహనాలు మరమ్మతులు గురయ్యాయి. 104 సిబ్బంది కథనం మేరకు..

"ఐదు లక్షల కిలోమీటర్లు తిరిగిన తర్వాత వాహనాలకు విశ్రాంతి ఇస్తారు" అని చెబుతున్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి (district medical and health officer Dm and HO) పూర్తిస్థాయి ఆధ్వర్యంలో మేనేజర్ స్థాయి అధికారి వీటిని పర్యవేక్షిస్తారు. రాయచోటి ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి ఆవరణలోని 44 వాహనాలు కనిపించకుండా పోయాయి. అవి డంపింగ్ యార్డ్ కు తరలించారు. ఆ నాలుగు 104 వాహనాలను తుక్కుగా మార్చి కిలోల లెక్కన విక్రయం చేశారు. విడిభాగాలు గల్లంతు చేశారు.
రాయచోటి జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్, ఇన్ చార్జి జిల్లా ఆస్పత్రుల సమన్వయాధికారి ( District Hospitals Coordinating Officer DCHS ) డాక్టర్ డి . లక్ష్మీ ప్రసాద్ మాట్లాడుతూ,
"104 వాహనాలు మరమ్మతులకు గురైన విషయం, వాటిని ఏమి చేశారనేది రికార్డు పరంగా నమోదు చేయలేదు" అని చెప్పారు.
గతంలో ఆస్పత్రి సూపరింటెండెంట్ గా బాధ్యతలు నిర్వహించిన డేవిడ్ సుకుమార్ మాత్రం ఈ విషయాన్ని కలెక్టర్ కు చెప్పానని అంటున్నారని ఆయన వివరించారు. రికార్డుల్లో ఎక్కడా నమోదు చేయలేదని ఆయన చెప్పారు.

ఆరు నెలల తర్వాత ఫిర్యాదు

రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రిలోని నాలుగు 104 వాహనాలు గల్లంతైన విషయాన్ని కూడా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు కనిపెట్టలేదు. అన్నమయ్య జిల్లా రాయచోటి నుంచి మదనపల్లెకు మార్చిన విషయం తెలిసిందే. కార్యాలయాల రికార్డులు, వాహనాలు తరలించే సమయంలో ఆడిటింగ్ వల్ల ఈ వాహనాలు లేవనే విషయం వెలుగులోకి వచ్చినట్లు తెలిసింది.
ఈ ఘటనపై అన్నమయ్య మదనపల్లె జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ లక్ష్మీ నరసయ్య రాయచోటి పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
"ఈ నాలుగు వాహనాలు 2019 నుంచి మూలన ఉన్నయనే విషయం నా దృష్టికి కూడా వచ్చింది. రాయచోటికి ట్రామా కేర్ సెంటర్ మంజూరు అయింది. ఈ సమయంలో ఆ వాహనాలను డంపింగ్ యార్డుకు తరలించారు. నా విచారణలో కూడా అదే విషయం చెప్పారు. ఆ వాహనాలను ఎవరూ పట్టించుకోకపోవడం వల్లే ఇది జరిగింది" అని డీఎం అండ్ హెచ్ ఓ లక్ష్మీనరసయ్య చెప్పారు.
"మరమ్మతులకు గురైన విషయం. ఆ విహనాలు కనిపించని విషయం రికార్డులు లేవు" అని లక్ష్మీనర్సయ్య చెప్పారు. తన దృష్టికి రాగానే ఆ నెల ఆరో తేదీ రాయచోటి పోలీసులకు ఫిర్యాదు చేశానని ఆయన స్పష్టం చేశారు.

50 లక్షల వాహనం

గ్రామీణ ప్రాంతాల్లో అత్యవసర వైద్య సేవలు అందించడానికి కేటాయించిన ఒక్కో 104 వాహనం కనీసంగా 50 లక్షల రూపాయల విలువ చేస్తుందని వైద్య ఆరోగ్యశాఖ అధికారుల ద్వారా తెలిసిన సమాచారం. ఈ అంబులెన్స్ లో విలువైన పరికరాలు కూడా రోగులకు సేవలు అందించడానికి అందుబాటులో ఉంటాయి.
"ఆక్సిజన్ సిలిండర్, వెంటిలేటర్, సూట్ కేస్, ఫ్రీజర్, డిసిప్రిలేటర్, స్పైనల్ బోర్డు, స్కానర్ l తోపాటు మొబైల్ మెడికల్ హెల్త్ కేర్ యూనిట్" ప్రత్యేకత.
రాయచోటిలో అదృశ్యమైన నాలుగు 104 వాహనాల ను విక్రయించింది ఎవరు అనేది సందేహాస్పదంగా మారింది.
"ప్రభుత్వ వాహనాలు మరమ్మతులకు గురైతే జిల్లా కలెక్టర్ ఆదేశం మేరకు వేలం వేయాలి. లేదంటే వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టర్ కు స్వాధీనం చేయాలి" ఈ నిబంధనలు కూడా ఇక్కడ అమలు చేయలేదని వైద్య ఆరోగ్యశాఖ అధికారుల ద్వారా తెలిసిన సమాచారం. ఈ వాహనాలు తుక్కుగా మారడం వెనక ఎవరి హస్తం ఉందనేది పోలీసుల దర్యాప్తులోనే తేలాలి.
Read More
Next Story