
EXclusive | కడప:యువకుడి శవంతో స్టేషన్ ముందు బైఠాయించిన దళితులు
దళిత యువకుడిని సజీవ దహన యత్నం.. వారం తరువాత మృతి
పార్శిళ్లు డెలివరీ చేసే దళిత యువకుడిని సజీవదహనం చేయడానికి విఫలయత్నం చేశారు. తీవ్ర గాయాలతో పోరాడుతూ వారం తరువాత ఆ యువకుడు మరణించాడు. నిందితులను పట్టుకోవడంలో పోలీసుల తీరును నిరసిస్తూ సోమవారం రాత్రి కడప జిల్లా పోరుమామిళ్ల పోలీస్ స్టేషన్ వద్ద దళితులు యువకుడి మృతదేహంతో రోడ్డుపై నిరసన సాగిస్తున్నారు.
ఓ దళిత యువకుడిని గుర్తు తెలియని వ్యక్తులు సజీవదహనం చేయడానికి ప్రయత్నించారు. ఈ సంఘటన ఫిబ్రవరి 23వ తేదీ జరిగింది. తీవ్రంగా గాయపడిన ఆ యువకుడు చికిత్స తీసుకుంటూ తిరుపతి రుయా ఆస్పత్రిలో మరణించాడు. నిందితులు ఎవరైంది గుర్తించడంలో పోలీసుల నిర్లక్ష్యంగా ఆగ్రహించిన దళితులు కడప జిల్లా పోరుమామిళ్ల పోలీస్ స్టేషన్ వద్ద యువకుడి మృతదేహంతో ధర్నాకు దిగారు. ఈ వార్త రాసే సమయం సోమవారం రాత్రి 10.30 గంటల వరకు నిరసన జరుగుతోంది.
తిరుపతి నుంచి ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ ప్రతినిధి పోరుమామిళ్ల సీఐ... కి ఫోన్ చేసే సమయానికి బాధితులు ప్రశ్నలతో నిలదీస్తుండడం వినిపించింది.
"యువకుడి మరణానికి సంబంధించిన విషయంలోనే ప్రజలతో మాట్లాడుతున్నాం" అని పోరుమామిళ్ల ఎస్ఐ వెంకట కొండారెడ్డి
సమాధానం చెప్పారు. సీఐ హేమసుందరరావు బాధిత దళితులకు నచ్చ చెప్పడానికి విఫలయత్నం చేస్తున్నట్లు సమాచారం అందింది.
ఇంతకీ ఏమి జరిగింది..
కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం కాశినాయన మండలం గంగనపల్లె దళితవాడకు చెందిన కుందుల దిలీప్ పార్శిళ్ల డెలివరీ బాయ్ గా పనిచేసే వాడు. కాశినాయన మండలం నాయనపల్లెలో ఓ యువతికికి వచ్చిన పార్శిల్ డెలివరీ చేయడానికి వెళ్లాడు. ఈ యువతి దిలీప్ పై సందేహం వచ్చిందనే ప్రచారంలో ఉంది.
కాశినాయన మండల ఎస్ఐ యోగేంద్ర కథనం మేరకు...
పార్శిళ్లు డెలివరీ చేస్తున్న దిలీప్ కు ఫోన్ చేసిన కొందరు గ్రామ శివారులోకి రావాలని ఫోన్ చేసి పిలిపించారు. అక్కడికి వెళ్లిన దిలీప్ పై పెట్రోలు పోసిన గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించారు. ఈ సమాచారం అందుకున్న బంధువులు దిలీప్ ను పోరుమామిళ్ల ఆస్పత్రికి తరలించారు.
"నాపై కలసపాడు మండలం పుల్లారెడ్డిపల్లెకు చెందిన బంధువుల సహకారంతో పెట్రోల్ పోసి నిప్పటించారు" అని ఆస్పత్రిలో చెప్పినట్టు వార్తలు వచ్చాయి. తీవ్రంగా గాయపడిన దిలీప్ ను వైద్యుల సూచన మేరకు కడప రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉందని చెప్పడంతో మెరుగైన చికిత్స కోసం తిరుపతి రుయా (SVRR Government General Hospial ) కు తరలించారు. వారంపాటు తల్లడిల్లిన దిలీప్ తిరుపతి రుయా ఆస్పత్రిలో మరణించాడు.
మృతదేహంతో ధర్నా...
తమ కొడుకుపై పెట్రోల్ పోసి నిప్పంటించి, మృతికి కారణమైన నిందితులను గుర్తించడంలో పోలీసులు విఫలం అయ్యారని దిలీప్ కుటుంబీకులు, బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దిలీప్ మృతదేహంతో పోరుమామిళ్ల పోలీస్ స్టేషన్ ముందు రోడ్డుపై నిరసనకు దిగారు. కాశినాయన స్ఐ యోగేంద్ర, పోరుమామిళ్ల సీఐకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వారిని సముదాయించడానికి సీఐ విఫలయత్నం చేశారు.
"మా బిడ్డ దిలీప్ మరణానికి కారణమైన వారిని అరెస్టు చేసే వరకు కదలిలేది లేదు. శవంతో ఇక్కడే ఉంటాం" అని దిలీప్ మృతదేహంతో దళితులు, సంఘాల నేతలు బైఠాయించారు. దీంతో పోరుమామిళ్లలో పరిస్థితి ఉద్రిక్తతకు దారితీసినట్లు సమాచారం అందింది.
ఇపుడు సమయం రాత్రి 10 .45 గంటల వరకు శవంతో మాదిగలు మొత్తం పోరుమామిళ్ల స్టేషన్ ముందు బైఠాయించే ఉన్నారు.
Next Story

