
1986 జనవరి 21..
పోతిరెడ్డిపాడు వద్ద వైఎస్. రాజశేఖరరెడ్డి ఎమన్నారంటే...
“కరువు బండ ” యాత్ర పేరుతో 1986 జనవరి ఒకటో తేదీ ప్రారంభమైన పాదయాత్రలు 21వ తేదీ నంద్యాల సమీపంలోని పోతిరెడ్డిపాడుకు చేరాయి. రాయలసీమలోని అన్నిపాంతాలను కలుపుతూ సాగింది. వైఎస్. రాజశేఖరరెడ్డి నాయకత్వంలో లేపాక్షి నుంచి , రాయదుర్గం నుంచి ఎంవీ రమణారెడ్డి, తిరుపతి నుంచి మైసూరా రెడ్డి, మదనపల్లి నుంచి సీహెచ్, చంద్రశేఖర్ రెడ్డి, భూమన్, శ్రీధర్, మంత్రాలయం శేషశయనా రెడ్డి నాయకత్వంలో మొత్తం రాయలసీమను కవర్ చేస్తూ 21 జనవరి 1986 నాటికి పోతిరెడ్డిపాడుకు చేరుకున్నాయి. ప్రకాశం జిల్లా కంబం,గిద్దలూరు నుంచి కందుల నాగార్జున రెడ్డి నాయకత్వంలో మరో బృందం కూడా వీరితో పాటు పాదయాత్ర చేశారు.
ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం 22-Jan-1986 నాడు పోతిరెడ్డిపాడు చేరుకొని సింబాలిక్ నాలుగు పలుగులతో కొంచెం మట్టి తవ్వడం, రాయలసీమను కరువు నుంచి కాపాడాలని కోరుతూ “కరువు బండ” కృష్ణా నదిలోకి తోశారు.
పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యం పెంపుదల కోసం నంద్యాల వద్ద 1986 జనవరి 21వ తేదీ జరిగిన సభలో వైఎస్.రాజశేఖరరెడ్డి, మిగతా నాయకులు ఏమన్నారో.. యథాతధంగా...
రాయలసీమకు న్యాయం జరిగే దాకా ఉద్యమం ఆగదు: వైఎస్ ప్రకటన
రాయలసీమ న్యాయమైన కోరికల సాధనకు ఇప్పుడు ప్రారంభించిన ఉద్యమం లక్ష్యసాధన జరిగే వరకూ కొనసాగుతుందని పిసిసి (ఐ) మాజీ అధ్యక్షుడు వైఎస్. రాజశేఖరరెడ్డి (YSR) చెప్పారు. ఇక్కడకు (కర్నూలుకు) 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న పోతిరెడ్డిపాడు వద్ద శ్రీశైలం కుడకాలువ హెడ్ రెగ్యులేటర్ వద్ద మంగళవారం జరిగిన పెద్ద సభలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రసంగిస్తూ, ప్రజలు చావు బతుకుల్లో ఉద్యమాలు జరిపినప్పుడు కాంగ్రెస్ సైట్ పార్టీ బలపరిచిందని, ఇప్పుడు తన ఉద్యమాన్ని యువకుడైన కాంగ్రెస్ అధ్యక్షుడు రాజీవ్ గాంధీని బలపరచగలరని చెప్పాడు.
కాంగ్రెస్ పార్టీకి రాయలసీమ ఉద్యమంతో సంబంధం లేదని" పిసిసి అధ్యక్షుడు జలగం చేసిన ప్రకటనను ప్రస్తావించిన వైఎస్. రాజశేఖరరెడ్డి "హతవిధీ మా పీసీసీ అధ్యక్షుడు పరిస్థితి ఇలా ఉంది" అని వైఎస్ అన్నాడు.
ఈ సభకు మాజీ మంత్రి శేషసేనారెడ్డి అధ్యక్ష వహించారు.
అంతకుముందు లేపాక్షి నుంచి వైఎస్ రాజశేఖరరెడ్డి, తిరుపతి నుంచి డాక్టర్ ఎంవీ మైసూరారెడ్డి, రాయదుర్గం నుంచి డాక్టర్ ఎంవి. రమణారెడ్డి, మదనపల్లి నుంచి భూమన్, సిహెచ్ చంద్రశేఖర్ రెడ్డి, కదిరి న్యాయవాది శ్రీధర్, మంత్రాలయం నుంచి శేషశయనారెడ్డి నాయకత్వంలో ఈనెల (1986 జనవరి) ఒకటో తేదీన ఉద్యమంచే పట్టినట్లు శేషశయనారెడ్డి ప్రకటించారు. రెండవ తేదీ బయలుదేరిన పాదయాత్ర బృందం పోతిరెడ్డిపాడు వద్దకు చేరుకున్నాయి.
పోతిరెడ్డిపాడు వద్ద రెగ్యులేటర్ నీటిని విడుదల చేసే స్థోమతను 11 వేల క్యూసెక్కుల నుంచి 50 వేల క్యూసెక్కులకు పెంచాలని కోరుతూ ఈ నాయకులంతా లాంఛనంగా గడ్డపారలతో కాల్వ గట్టు తవ్వారు.
ఈ కార్యక్రమం ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా సాగింది.
ఈ సభలో డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ, రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయిన వారు ముందు కోస్తా జిల్లాల ప్రయోజనాలను తర్వాత తెలంగాణ ప్రయోజనాలను ఆశిస్తూ కాపాడుతున్నారని, రాయలసీమ మొర వినడం లేదని అన్నారు.
సభకు అధ్యక్షత వహించిన శేషశయనారెడ్డి మాట్లాడుతూ ఉద్యమకారులు ప్రజలను రెచ్చగొడుతున్నారనే ఆరోపణలను ఖండించారు. నాయకత్వ లోపం వల్లే రాయలసీమ వెనుకబడిందని ఆయన అన్నారు.
మాజీ ఎమ్మెల్యే వి. రాంభూపాల్ చౌదరి మాట్లాడుతూ ముఖ్యమంత్రికే ప్రజాస్వామ్యం మీద, శాసనసభ మీద విశ్వాసం లేదని విమర్శించారు.
ఆర్. రెడ్డప్పరెడ్డి (అనంతపురం జి.వ అధ్యక్షుడు) మాట్లాడుతూ రాయలసీమ ఎడారిగా మారకుండా ప్రభుత్వం కళ్లు తెరిపించడానికి ఈ ఉద్యమం సాగిస్తున్నట్లు చెప్పారు.
డాక్టర్ ఎంవీ. మైసూరా రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం రాయలసీమను నిర్లక్ష్యం చేస్తున్నదని కరువు నివారణకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని అన్నారు. తిరుపతి దేవస్థానం అధ్యక్ష పదవి కోస్తా జిల్లాలకు కట్టబెట్టారని, తిరుపతిలో ఏర్పాటు చేయాల్సిన ఆర్టీసీ వర్క్ షాప్ ను నెల్లూరు ప్రాంతానికి తరలించాలని మైసూరారెడ్డి విమర్శించారు.
రాయలసీమ విమోచన సమితి అధ్యక్షుడు డాక్టర్ ఎంవీ. రమణారెడ్డి మాట్లాడుతూ రాయలసీమ ఇప్పటికీ ఎడారిగా మారిందని అన్నారు. బచావత్ అవార్డు ప్రకారం కృష్ణ నుంచి మనకు కేటాయించిన 810 టిఎంసి జలాల నుంచే రాయలసీమకు నీరు కేటాయించాలని కోరారు.
శ్రీశైలం కుడి కాలువకు ఈ ఏడాది 5 కోట్ల కేటాయించారని, ఇలాగైతే ఈ పథకం పూర్తి కావడానికి నూరేళ్లు పడుతుందని డాక్టర్ ఎంవి. రమణారెడ్డి విమర్శించారు.
ఈ సభలో కే అనంతాచార్యులు, వై గోపాల్ రెడ్డి,, జి ప్రభాకర్ రెడ్డి, కే రఘువీరారెడ్డి, సిహెచ్ చంద్రశేఖర్ రెడ్డి, ఆర్ వెంకట్ రాముడు, భూమన్, మహమ్మద్ ఇమామ్, నాగలక్ష్మి రెడ్డి, ఆర్ రాజగోపాల్ రెడ్డి, బుడ్డా వెంకటరెడ్డి, మండల సుబ్బారెడ్డి, ఎన్సీ గంగిరెడ్డి ప్రభృతులు ప్రసంగించారు.
Next Story

