
ISRO | విద్యార్థుల ఆలోచనలకు రెక్కలు తొడుగుతాం..
ఈ నెల 27 నుంచి యువికా శిక్షణకు దరఖాస్తుల స్వీకరణ.
అంతరిక్ష విజ్ఞానంపై ఆసక్తి ఉన్న విద్యార్థుల ఆలోచనలకు ఇస్రో రెక్కలు కడతానంటోంది. గ్రామీణ విద్యార్థుల ఆలోచనలకు పదును పెట్టడానికి (Indian space research organisation ISRO) యువ విజ్నాన కార్యక్రమం ( యు వి కా-2026) నిర్వహించనుంది. ఎనిమిదో తరగతి పూర్తి చేసిన (9వ తరగతి) విద్యార్థులు ఈనెల 27వ తేదీ నుంచి మార్చి 31వ తేదీ లోపు దరఖాస్తులు చేసుకోవాలని సూచించింది. ఎంపిక చేసిన విద్యార్థులకు మే నెల పదో తేదీ నుంచి దేశంలోని రాకెట్ ప్రయోగ కేంద్రాల్లోఅన్ని వసతులు కల్పించి శిక్షణ ఇవ్వనున్నట్లు ఇస్రో వెల్లడించింది. ఈ కార్యక్రమం నిర్వహణ వెనుక ఉద్దేశం, కల్పిచే సదుపాయాలు ఎలా ఉన్నాయంటే..
గ్రామీణ ప్రాంత విద్యార్థులకు సైన్స్ పై ఆసక్తి కలిగించేందుకు ఇస్రో ప్రతి సంవత్సరం యువికా కార్యక్రమం నిర్వహిస్తోంది. 8వ తరగతి పూర్తి చేసిన విద్యార్థులకు, NCC క్యాడేట్లకు వెయిటేజీ మార్కులు కూడా ఇచ్చే అవకాశాన్ని ఇస్రో కల్పించింది. ఇస్రో దేశంలో ఏడు ప్రాంతాల్లోని ప్రయోగ కేంద్రాల్లో 14 రోజులపాటు ఉచితంగానే అన్ని వసతులతో ఈ శిక్షణ ఇస్తుంది.
దరఖాస్తు ఇలా చేయాలి
రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో 8వ తరగతి పూర్తి చేసిన విద్యార్థులు ఇస్రో అధికారిక వెబ్సైట్ www.isro.gov.in లో దరఖాస్తు చేసుకోవడానికి వెసులుబాటు కల్పించింది. ఈ వివరాలన్నీ పరిశీలించిన తర్వాత ఇస్రో శాస్త్రవేత్తలు విద్యార్థులను ఎంపిక చేస్తారు. రాష్ట్రంలోని తిరుపతి జిల్లా సూళ్లూరుపేట వద్ద ఉన్న శ్రీహరికోట అంతరిక్ష ప్రయోగ కేంద్రంలో..
"స్పేస్ టెక్నాలజీ, సైన్స్ అప్లికేషన్ పై ప్రాథమిక విజ్ఞానాన్ని అందించడానికి ప్రయోగాత్మక పాఠాలు చెబుతారు" అని ఇస్రో ప్రతినిధులు వెల్లడించారు.
శ్రీహరికోట తో పాటు హైదరాబాద్, డెహ్రాడూన్ (ఉత్తరాఖండ్), తిరువనంతపురం (కేరళ), బెంగళూరు (కర్ణాటక), అహ్మదాబాద్ (గుజరాత్), షిల్లాంగ్ (మేఘాలయ) రాష్ట్రాల్లోని ఇస్రో కేంద్రాల్లో కూడా విద్యార్థులకు అంతరిక్ష విజ్ఞానంపై ఆసక్తి కలిగించే పరిశోధనాత్మక శిక్షణ ఇవ్వనున్నారు.
అగ్రదేశాల సరసన భారత్
తిరుపతి జిల్లా సూళ్లూరుపేట సమీపంలోని శ్రీహరికోట వద్ద ఉన్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) వంద రాకెట్ల ప్రయోగాల మైలురాయిని దాటింది. అగ్రదేశాలకు ఏమాత్రం తీసుకొని విధంగా భారత్లో కీలక పరిశోధనలు చేయడానికి రాకెట్ ప్రయోగాలను విజయవంతంగా నింగిలోకి పంపించిన శాస్త్రవేత్తలు పట్టు సాధించారు.
"పాఠశాల స్థాయి నుంచే శాస్త్ర విజ్ఞానం పై మక్కువ ఉన్న విద్యార్థుల ఆలోచనలతో మేము రెక్కలు తొడుగుతాం" అని ఇస్రో శాస్త్రవేత్తలు భరోసా ఇస్తున్నారు. అభివృద్ధి చెందిన దేశాల సరసన మరింత బలంగా భారత్ నిలిపే లక్ష్యంలో భాగంగానే విద్యార్థి దశ నుంచే శాస్త్రవేత్తలను తయారు చేసే దిశగా యు వికా పేరిట విద్యార్థులకు శిక్షణ ఇవ్వడానికి ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఇస్రో స్పష్టం చేసింది.
ఎంపిక విధానం ఇలా..
ఇస్రో నిర్వహించే యువిక-2026 కార్యక్రమానికి దరఖాస్తు చేసుకున్న ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో 9వ తరగతి చదువుతున్న విద్యార్థులను ఎంపిక చేస్తారు. వారికి ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయంటే.
1. 8వ తరగతిలో సాధించిన మార్కులకు 50 శాతం వెయిటేజీ ఎంపికైన విద్యార్థులకు ఇస్తారు.
2. స్పేస్, సైన్స్ క్లబ్ లో ఉన్న విద్యార్థులకు ఐదు శాతం వెయిటేజీ ఉంటుంది.
3. రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎస్సే రైటింగ్, వక్తృత్వ పోటీల్లో ప్రతిభ చూపితే పది శాతం.
4. Ncc, స్కౌట్స్ అండ్ గైడ్ విభాగాల్లో ఉంటే ఐదు శాతం, గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు 20% మార్కుల్లో ప్రాధాన్యం ఇస్తారు.
భోజనం పెట్టి.. వసతి కల్పించి..
రాకెట్ ప్రయోగ కేంద్రాల్లో శిక్షణ కోసం ఎంపికైన విద్యార్థులకు ఇస్రో అన్ని వసతులు ఉచితంగా కల్పిస్తుంది. విద్యార్థులకు ప్రయాణ ఖర్చులు చెల్లిస్తుంది.
"శిక్షణ కాలంలో ఉచితంగా భోజనం, వసతి కూడా ఏర్పాటు చేస్తుంది. విద్యార్థులను 14 రోజులపాటు ఇస్రో స్పేస్ సెంటర్ల (ISRO Space Centers)కు తీసుకుని వెళ్తారు. అక్కడ సైన్స్ సంబంధించిన వింతలు విశేషాలతో పాటు సప్త గ్రహ కూటమి అంశాలపై కూడా అవగాహన కల్పిస్తాం" అని ఇస్రో శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. రాకెట్ ప్రయోగాల్లో మేధస్సును ప్రదర్శించే శాస్త్రవేత్తలతో కూడా విద్యార్థులు మాట్లాడేందుకు అవకాశం ఉంటుందని, సందేహాలను తీర్చడంతో పాటు అవసరమైన సూచనలు కూడా చేస్తారని ఇస్రో ప్రతినిధులు స్పష్టం చేశారు.
Next Story

