చీమకుర్తి గెలాక్సీ గ్రానైట్ను కదలనివ్వని ఇరాన్ యుద్ధం
x

చీమకుర్తి 'గెలాక్సీ గ్రానైట్'ను కదలనివ్వని ఇరాన్ యుద్ధం

క్వారీలు, ఓడరేవుల్లో ఆగిన 1.50 లక్షల క్యూబిక్ మీటర్ల గ్రానైట్


20 అడుగుల కంటైనర్ లో 30 మెట్రిక్ టన్నుల రవాణా

ఒకో కంటైనర్ పై రూ. రెండు లక్షల వార్ సెస్సు

చెన్నై నుంచి చైనాకు రెండు లక్షల ఖర్చు.

యుద్ధం వల్ల రెండింతలైన భారం.

అయినా కదలని గ్రానైట్ రాళ్లు, ఓడలు

అంతర్జాతీయ మార్కెట్ ప్రభావితం చేస్తున్న ప్రకాశం జిల్లా చీమకుర్తి గెలాక్సీ గ్రానైట్ ( Cheemakurti Galaxy Granite) పరిశ్రమ సంక్షోభంలో పడింది. ఎగుమతులకు బయ్యర్లు కుదుర్చుకున్న ఆర్డర్లు కూడా రద్దు చేశారు. ఇరాన్ యుద్ధం నేపథ్యంలో ఆరు లక్షల క్యూబిక్ మీటర్ల గెలాక్సీ గ్రానైట్ ఆగిపోయింది. దీనికి తోడు గల్ఫ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ( United Arab Emirates (UAE), తోపాటు పశ్చిమ ఆసియాలో నౌకాశ్రయాల వద్ద అన్లోడింగ్ జరగడం లేదు. ఈ పరిస్థితుల్లో ఒక్కో కంటైనర్ కు రెండు లక్షల రూపాయలు యుద్ధ పన్ను చెల్లించడం భారంగా మారింది. గల్ఫ్ దేశాలు 40 శాతం గెలాక్సీ గ్రానైట్ ఆర్డర్లు హోల్డ్ చేశాయని ఓ వ్యాపారి చెప్పారు.

ప్రకాశం జిల్లా చీమకుర్తి గ్రానైట్ పరిశ్రమకు 2005 నుంచి 2015 వరకు స్వర్ణయుగంగా సాగింది. ఆ తర్వాత కోవిడ్ పరిస్థితి గ్రానైట్ పరిశ్రమను దెబ్బతీస్తే.. ప్రస్తుతం ఇరాన్ యుద్ధం ఎగుమతులు నిలిచిపోయే పరిస్థితి కల్పించాయి. ఇరాన్ యుద్ధ నేపథ్యంలో, గ్రానైట్ ఎగుమతులు నిలిచిపోవడం వల్ల దేశీయ మార్కెట్ల పైనే ఆధార పడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
"చీమకుర్తి ప్రాంతంలో నెలకు సుమారు 60 వేల క్యూబిక్ మీటర్ల గ్రానైట్ వెలికి తీస్తున్నారు. ముడి రాయి చైనాకు, పాలిష్ చేసిన స్లాబులు మిగతా దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. జనవరి నుంచి 1.50 లక్షల క్యూబిక్ మీటర్ల ముడిరాయికి సమాన గ్రానైట్ ఎగుమతి చేస్తే, అందులో సగం వంతు గ్రానైట్ గల్ఫ్, అరబ్బు దేశాలతో పాటు ప్రాశ్ఛ్యదేశాల్లోని ఓడరేవులు వద్ద పోర్టుల్లో నిలిచిపోయింది. ఇది వెనక్కి తీసుకుని రాలేని స్థితిలో కంటెనర్ కు రెండు లక్షల వరకు వార్ సెస్సు (War Cess) భారం పడింది"
గ్రేటర్ రాయలసీమ లో అంతర్భాగంగా భావించే ప్రకాశం జిల్లా కూడా ఒకప్పుడు కరువుకు నిలయం. పశుగ్రాసం కూడా పండదని భావించిన భూ గర్భంలో అరుదైన బ్లాక్ గెలాక్సీ నిక్షేపాల వల్ల రామతీర్థం పరిసర ప్రాంతాల్లోని ఎకరం భూమి మూడు కోట్ల నుంచి నాలుగు కోట్ల రూపాయల వరకు పలుకుతున్నట్టు తెలిసింది.
1983లో చీమకుర్తి పరిసర ప్రాంతాల్లోని రామతీర్థం వద్ద కూడా వందల ఎకరాల్లో గ్రానైట్ నిక్షేపాలు ఉన్నట్లు కనుగొన్నారు. 1978లో సంతనూతలపాడు ఎమ్మెల్యేగా పనిచేసిన వేమా ఎల్లయ్య చీమకుర్తికి నాలుగు కిలోమీటర్ల దూరంలో రాళ్లు రప్పల తో పాటు రేగు చెట్టుతో నిండిన 400 ఎకరాల ప్రభుత్వ భూమిని సద్వినియోగం చేయాలని భావించారు. దీనికోసం రామతీర్థం కేంద్రంగా పశుక్షేత్రం ఏర్పాటు చేయించారు. ఆ తర్వాత జరిగిన అన్వేషణలు ఈ ప్రాంతంలోని భూగర్భంలో అరుదైన వేల కోట్ల విలువైన గ్రానైట్ నిక్షేపాలు ఉన్నాయనే విషయం బాహ్య ప్రపంచానికి తెలిసిందనీ గనుల శాఖ అధికారులతో పాటు మీడియా కథనాలు వెల్లడించాయి.
చీమకుర్తి గెలాక్సీ గ్రానైట్ నిక్షేపాలు సుమారు 500 ఎకరాలలో విస్తరించి ఉన్నాయి. దీని ఆధారంగా 40 పైగా ప్రధాన క్వారీలు 1600కు పైగా ప్రాసెసింగ్ యూనిట్లు పనిచేస్తుంటే, 20 నుంచి 25 వేల మంది ప్రత్యక్షంగా మరో లక్ష మంది పరోక్షంగా జీవనానికి ఆధారంగా మిగిలాయి. 1978లో ప్రారంభమైన గ్రానైట్ తవ్వకాలు 1990 నాటికి ఈ పరిశ్రమ అంతర్జాతీయ స్థాయికి విస్తరించింది. ఇక్కడి గ్రానైట్ ఖనిజానికి స్టార్ గెలాక్సీ అని పేరు కూడా ఉంది. నల్లటి రాయిపై బంగారు వర్ణంలో వేసే చుక్కలు ఈ గ్రానైట్ ప్రత్యేకత.

గెలాక్సీ గ్రానైట్ కథ ఏమిటి

చీమకుర్తి ప్రాంతంలో 1983 వ సంవత్సరంలో గ్రానైట్ నిక్షేపాలు సమృద్ధిగా ఉన్నాయని విషయం తెలిసిన తర్వాత 1985లో మైనింగ్ ప్రారంభమైంది. అందులో జూబ్లీ గ్రానైట్ యజమాని నన్వాని గ్రానైట్ బయటికి తీసి, అంతర్జాతీయ మార్కెట్లో విక్రయానికి చైనాకు తీసుకువెళ్లారు. పరిశీలించిన చైనా వ్యాపారులు నల్లని రాయిపై భూగర్భంలోనే మెరిసే నగషీల మాదిరి ఉన్న తెల్లటి రేణువులు చూసి ఆశ్చర్యపోయారు. దీంతో ఆ నల్లని బండకు బ్లాక్ గెలాక్సీ అని పేరు పెట్టినట్లు అధికార వర్గాల సమాచారం. ఈ బ్లాక్ గెలాక్సీ గ్రానైట్ వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా వేడిని నియంతలచుకొని చల్లదనం పంచుతుందనేది చీమకుర్తి వ్యాపారులు చెబుతున్నారు.

గెలాక్సీ తరువాత..

ప్రకాశం జిల్లాలో గెలాక్సీ గ్రానైట్ కు చైనా మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉంది. ఆ తర్వాత కుప్పం గ్రీన్, బ్లాక్, ఇస్కాన్ వైట్, సిల్వర్ వేల్స్, జి 20, కుప్పం గ్రీన్, నగిరి వైట్ గ్రానైట్ కు అంతర్జాతీయ మార్కెట్లో మంచి ధరలు లభిస్తున్నాయి.
ప్రకాశం జిల్లా చీమకుర్తి నుంచి గెలాక్సీ గ్రానైట్ రా మెటీరియల్ బ్లాక్ తో పాటు, పాలిష్ చేసిన స్లాబులు కూడా ఎగుమతి చేస్తున్నారు. నెల్లూరు జిల్లా కృష్ణపట్నం, మద్రాసులోని నౌకాశ్రయం నుంచి వియత్నాంతోపాటు పచ్చిమాసియా దేశాలైన ఇరాన్ ఇరాక్ వైట్ దుబాయ్ సౌదీ అరేబియా ఖతార్ దేశాలతో పాటు ఎక్కువగా చైనాకు ఆ నెలకు కనీసం గా 2,600 నుంచి 3000 కంటైనర్ల గెలాక్సీ గ్రానైట్ తరలిస్తున్నారు. పది రోజులుగా జరుగుతున్న ఇరాన్ యుద్ధ వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో గ్రానైట్ పరిశ్రమపై కూడా తీవ్ర ప్రభావం చూపించిందని చీమకుర్తిలోని వ్యాపారులు, బయ్యర్లు, క్వారీల ప్రతినిధులు కూడా చెబుతున్నారు.

చీమకుర్తి నుంచి చైనాకు వయా... చెన్నై

చెన్నై నుంచి చైనాకు నేరుగా ఉండే నౌకలు అందుబాటులో ఉండడం వల్ల 12 నుంచి 18 రోజుల్లో చేరడానికి ఆస్కారం ఉంటందని సమాచారం. ఇక్కడి చేరడానికి పశ్చిమాసియా, (Middle East), యూరప్ (Urope) దేశాలకు వెళ్లడానికి ప్రధాన జలమార్గంగా హార్ముజ్ జలసంధి (Strait of Hormuz)లో ఉద్రిక్త పరిస్థితి వల్ల చీమకుర్తి నుంచి గెలాక్సీ గ్రానైట్ 70 నుంచి 80 శాతం ఎగుమతి ఆగింది. చెన్నై నుంచి నౌకాయానం ఆగడం వల్ల షిప్పింగ్ సేవలు నిలిపివేశాయి. కొన్నింటిని ఇతర జలమార్గాల్లో మళ్లించడం వంటి కారణాలతో కంటైనర్ల కొరత ఏర్పడింది. వార్ రిస్క్ ప్రీమియం ( War Risk Premium) పెంచేశాయి. దీనికి తోడు వార్ సెస్సు విధిస్తున్నారు.

ఓ కంటైనర్ పంపడానికి ఖర్చు..

చెన్నైనౌకాశ్రయం నుంచి చైనాలోని ప్రధాన షాంఘై, జియామెన్ ఓడ రేవుల వరకు 20 అడుగుల కంటైనర్ లో 27 నుంచి 30 మెట్రిక్ టన్నుల గ్రానైట్ పంపడానికి పశ్చిమాసియా యుద్ధం వల్ల సముద్ర మార్గంలో రవాణా చార్జీలు ఓ కంటెనర్ నుంచి వెయ్యి నుంచి 15 వందల డాలర్లు (భారత కరెన్సీలో 90 వేల నుంచి 1.25 లక్షల వరకు చార్జీ విధిస్తున్నట్లు వ్యాపారవర్గాల ద్వారా తెలిసింది. టెర్మినల్ హ్యాండ్లింగ్ డాక్యుమెంటేషన్, కస్టమ్స్ క్లియరెన్స్ చార్జీలు పది నుంచి వేల రూపాయలు, మొత్తంగా కంటైనర్ కు 1.40 లక్షల నుంచి రెండు లక్షల వరకు భారం పడుతోంది. దీనికి తోడు వార్ రిస్క్ చార్జీ కలిసింది.

అది స్వర్ణయుగం..

ప్రకాశం జిల్లా చీమకుర్తి గ్రానైట్ పరిశ్రమకు 2005 నుంచి 2015 వరకు స్వర్ణ యుగముల సాగింది. ప్రకాశం జిల్లా నుంచి గత 20 సంవత్సరాల్లో దాదాపు 1.1 కోట్ల క్యూబిక్ మీటర్ల గెలాక్సీ గ్రానైట్ ఎగుమతి జరిగితే 2025వ సంవత్సరం నుంచి అంతర్జాతీయంగా అనేక సవాలను ఎదుర్కొంటుంది. 2025లో బ్లాక్ గెలాక్సీ గ్రానైట్ సుమారు 6.25 లక్షల క్యూబిక్ మీటర్లు ఎగుమతి జరిగినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఒక ప్రముఖ సంస్థలు మేడ్ వేస్ట్ వంటివి మాత్రమే ఏడాదికి సుమారు 66000 ఉత్పత్తిని సాధించినట్లు రికార్డులు స్పష్టం చేస్తున్నాయి.
2005 నుంచి 2010 వరకు
చైనాకు నాలుగు లక్షల క్యూబిక్ మీటర్లు.
ఇటలీకి ఐదు లక్షల క్యూబిక్ మీటర్లు
2011 నుంచి 2015 వరకు
ఆరు లక్షల నుంచి ఎనిమిది లక్షల క్యూబిక్ మీటర్లు
2016 నుంచి 202 వరకు
వియత్నాం దేశానికి ఐదు లక్షల క్యూబిక్ మీటర్లు
గల్ఫ్ దేశాలకు 6.50 లక్షల క్యూబిక్ మీటర్లు
2021 నుంచి 2024 వరకు
అమెరికా దేశానికి నాలుగు లక్షల క్యూబిక్ మీటర్లు,
యూరప్, చైనాకు 5.50 లక్షల క్యూబిక్ మీటర్లు.

వార్ సెస్సు..

చెన్నై నౌకాశ్రయం నుంచి పశ్చిమాసియా ప్రధానంగా గల్ఫ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యూకే, సిరియా, సౌదీ అరేబియా ఇటలీ వియత్నాం ఈజిప్ట్ దేశాల్లోని నౌకాశ్రయాల వద్ద ఓడలు నిరీక్షిస్తున్నాయి.
"యుద్ధ వాతావరణం నేపథ్యంలో వ్యాపారం దెబ్బ తినడం వల్ల ఒక్కో కంటైనర్ కు రోజుకు రెండు వేల డాలర్లు (సుమారు రెండు లక్షల రూపాయలు) వార్ సెస్సు విధిస్తున్నారు. ఇది శక్తికి మించిన భారంగా మారింది" అని తన పేరు చెప్పడానికి ఇష్టపడని చీమకుర్తిలోని ఓ వ్యాపారి తెలిపారు.
"ఆ దేశాలకు గ్రానైట్తో వెళ్లిన ఓడలు ముందుకు వెళ్లలేక, తిరిగి చెన్నై నౌకాశ్రయానికి చేరలేని పరిస్థితిలో వార్ సెస్సు చెల్లించాల్సిన పనివారమైన పరిస్థితి ఏర్పడింది" అని విజయ్ అని ఎక్స్పోర్టర్ చెప్పారు.
మైన్స్ ఏడీ ఏమంటున్నారంటే..
చీమకుర్తి ప్రాంతమే కాదు ప్రకాశం జిల్లా నుంచి సంవత్సరానికి ఆరు లక్షల క్యూబిక్ మీటర్ల గెలాక్సీ గ్రానైట్ ఎగుమతి జరుగుతోందని రాష్ట్ర మైన్స్ అండ్ జియాలజీ డిపార్ట్మెంట్ ( Department of Mines and Geology )ఒంగోలు డిప్యూటీ డైరెక్టర్ రాజశేఖర్ చెప్పారు. ప్రకాశం జిల్లాలో 147 గ్రానైట్ క్వారీలు ఉంటే, ఇక్కడి ముడి సరుకును కటింగ్ ప్రాసెసింగ్ చేసే పరిశ్రమలు 1,500 వరకు ఉన్నాయి.
"జిల్లాలోని గ్రానైట్ క్వారీల ద్వారా ప్రభుత్వానికి ఏటా రెండు వందల కోట్లు రాయల్టీ వస్తుంది" అని మైన్స్ డిప్యూటీ డైరెక్టర్ ధనుంజయుడు తెలిపారు. 200 కోట్ల రూపాయాలు రాయల్టీ కూడా వస్తున్నట్లు చెప్పారు. రాయల్టీతో పోలిస్తే అదనంగా 300% గ్రానైట్ వ్యాపారం జరుగుతున్నట్లు సూచనప్రాయంగా అక్కడి వ్యాపారులు తెలిపారు.
"ఈ పరిశ్రమల ఆధారంగా 20వేల మంది ప్రత్యక్షంగాను లక్ష మందికి పైగానే పరోక్షంగా జీవించడానికి గ్రానైట్ పరిశ్రమ ఆదుకుంటుంది" అని గనుల శాఖ అధికారి రాజశేఖర్ విశ్లేషించారు. అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో ప్రధానంగా యుద్ధం నేపథ్యంలో గ్రానైట్ పరిశ్రమకు దేశీయ మార్కెట్లే శరణ్యమని కూడా ఆయన చెప్పారు. ప్రకాశం జిల్లాలో క్వారీతోపాటు, ముడి రాయిని కటింగ్ ప్రాసెసింగ్ చేసే పరిశ్రమ యజమాని ఒకరు కూడా ఇదే మాట చెప్పారు.
చీమకుర్తిలో బయటికి తీసే గెలాక్సీ గ్రానైట్ ముడిరాలను చైనాకు ఎగుమతి చేస్తుంటే, పాలిష్ చేసిన స్లాబులు వియత్నాంతో పాటు పశ్చిమాసియా తో పాటు గల్ఫ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాలకు ఎగుమతి చేస్తారని గ్రానైట్ క్వారీ, ప్రాసెసింగ్ యూనిట్ నిర్వహించే ప్రతినిధి చెప్పారు.
"మా పేర్లుతో కథనాలు వస్తే ఇబ్బందులు ఎదురవుతాయి. వ్యాపార కార్యకలాపాలు బయటకు చెప్పలేం. ప్రాసెసింగ్ చేసిన గెలాక్సీ గ్రానైట్ ప్లేట్స్ వ్యాపారం బాగానే ఉంది. మాకు ఇలాంటి ఇబ్బందులు లేవు" అని ఆ వ్యాపారి వ్యాఖ్యానించారు.

తగ్గిన ఆదాయం..

ఇరాన్ యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో అంతర్జాతీయంగా ఎగువతులు ఆగిపోవడం ఒక విధంగా గ్రానైట్ పరిశ్రమ సంక్షోభంలో పడింది. దీనికి తోడు భూగర్భం నుంచి వెలికి తీసిన గెలాక్సీ గ్రానైట్ కొనుగోలుదారులు తగ్గారు. కటింగ్, n ప్రాసెసింగ్ చేయడం కూడా భారంగా మారింది. అంతర్జాతీయ మార్కెట్లో ఏర్పడిన యుద్ధ సంక్షోభం వల్ల దేశీయంగానే వ్యాపారాలు చేయాల్సిన పరిస్థితి అనివార్యమైందని చెబుతున్నారు.

గెలాక్సీ కి డిమాండ్ ఎక్కువ..

దేశీయంగానే కాకుండా, అంతర్జాతీయ మార్కెట్లో కూడా గెలాక్సీ గ్రానైట్ కు అదిక ధర లభిస్తుంది. భూగర్భం నుంచి వెలికి తీసే గ్రానైట్ రాళ్లలో బ్లాక్, ఇస్కాన్ వైట్, సిల్వర్ వేల్స్, జీ 20, కుప్పం గ్రీన్, నగిరి ప్రాంతంలో వైట్ గ్రానైట్ నిక్షేపాలు ఉన్నాయి.
"కుప్పం గ్రీన్, సిల్వర్ వేల్స్, ఢిస్కన్ వైట్ గ్రానైట్ క్యూబిక్ మీటర్ ధర రూ. 40 వేలు పలుకుతుంది. చీమకుర్తిలోని గెలాక్సీ గ్రానైట్ మాత్రం క్యూబిక్ మీటర్ ధర లక్ష రూపాయలు ఉంటుంది" అని మదనపల్లి ప్రాంతానికి చెందిన గ్రానైట్ వ్యాపారి రెడ్డివారి సాయిప్రసాద్ రెడ్డి చెప్పారు.
చిత్తూరు జిల్లాలో మదనపల్లి, పుంగనూరు, పలమనేరు, కుప్పం ప్రాంతాలలో సుమారు 80 నుంచి 100 వరకు క్వారీలు ఉన్నాయి. ఈ ప్రాంతాల నుంచి కనీసంగా 450 నుంచి 500 క్యూబిక్ మీటర్ల గ్రానైట్ ముడి సరుకు జర్మనీ, ఇటలీ, తైవాన్ తోపాటు అరేబియా దేశాలకు కూడా ఎగుమతి అవుతున్నట్లు ప్రసాదరెడ్డి వివరించారు. ఖర్చులు విపరీతంగా పెరిగిపోయిన పరిస్థితుల్లో 60 శాతం క్వారీలు ఈపాటికి మూతపడ్డాయి. గ్రానైట్ కటింగ్, పాలిషింగ్ చేసే పరిశ్రమల యంత్రాలు కూడా తుప్పుపట్టే పరిస్థితి ఏర్పడింది. జిల్లాలో చిత్తూరు ఆ తర్వాత కుప్పం ప్రాంతంలోనే గ్రానైట్ క్వారీలు, పరిశ్రమలు అధికంగా ఉన్నాయి.
"గ్రానైట్ పరిశ్రమ యుద్ధం వల్లే కాదు. రాయల్టీ భారం కూడా భరించడం ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది" అని సాయిప్రసాద్ రెడ్డి చెబుతున్నారు.
భూగర్భం నుంచి వెలికి తీసే గ్రానైట్ తరలించడానికి క్యూబిక్ మీటర్ కు 7000 రూపాయలు రాయల్టీ చెల్లించాల్సి ఉంటుంది. దీనికి తోడు గ్రానైట్ ముడిగాళ్లు బయటికి తీయడానికి కూలీలకు కాంట్రాక్టు ద్వారా డబ్బు చెల్లించడం, యంత్రాలకు డీజిల్, మదనపల్లి నుంచి చెన్నై నవకాశ్రయానికి, ఒంగోలు నుంచి నెల్లూరు జిల్లా కృష్ణపట్నం ఓడరేవు లారీల్లో ముడి రాళ్లు తరలించడం ఖర్చు కూడా పెరిగిపోయింది అని ప్రసాద్ రెడ్డి వివరించారు.
"పర్మిట్ రుసుం, ఇంధన ఖర్చులు, కూలీల భారం పెరగడం వల్ల లాభాల మాట దేవుడెరుగు. మా చేతి నుంచి పడుకుంటే చాలు" అనే పరిస్థితి ఏర్పడింది అని కూడా చిత్తూరు ప్రాంత వ్యాపారులు చెబుతున్నారు.
Read More
Next Story