తిరుమల:రథసప్తమినాడు మలయప్పను తాకనున్న సూర్యకిరణాలు..
x

తిరుమల:రథసప్తమినాడు మలయప్పను తాకనున్న సూర్యకిరణాలు..

25న ఒకరోజు బ్రహ్మోత్సవంలో 85 ఫుడ్ కోర్టుల ఏర్పాటు.


14 రకాల అన్నప్రసాదాల పంపిణీ

2,300 ట్రిప్పులు తిరగనున్న ఆర్టీసీ బస్సులు

వెయ్యి మంది కళాకారుల ప్రదర్శనలు

2,500 మంది పోలీసులతో రక్షణ

ఏర్పాట్లను పరిశీలించిన టీటీడీ చైర్మన్, ఈఓ

తిరుమలలో ఈ నెల 25వ తేదీ సూర్య జయంతి (అర్ధ బ్రహ్మోత్సవం) కి టీటీడీ ( Tirumala Tirupati Devasthanams TTD) విస్తృత ఏర్పాట్లు చేసింది. ఆ రోజు ఉదయం 5.30 గంటలకు రథసప్తమి సందర్భంగా సూర్యకిరణాలు స్పర్శించే సమయం నుంచి రాత్రి చంద్రోదయం వరకు శ్రీమలయప్పస్వామి వారు ఏడు వాహనాలపై విహరిస్తూ దర్శనం ఇవ్వబోతున్నారు.

శ్రీవారి ఆలయ మాడవీధుల్లోని గ్యాలరీల్లో యాత్రికులకు 14 రకాల అన్నప్రసాదాలు నిరంతరాయంగా అందించనున్నారు. యాత్రికుల కోసం తిరుపతి, తిరుమల మధ్య 2300 ట్రిప్పులు ఆర్టీసీ బస్సులు నడపాలని నిర్ణయించారు. వాహనసేవల ముందు వెయ్యి మంది కళాకారులు 56 కళారూపాలు ప్రదర్శించనున్నారు. 2,500 మంది పోలీసులు, టీటీడీ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ వింగ్ సిబ్బందితో గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు.

తిరుమల మాడవీధుల్లోని గ్యాలరీల్లో ప్రత్యేక ఏర్పాట్లు

తిరుమలలో సాలకట్ల బ్రహ్మోత్సవాలకు ( Tirumala Brahmotsavam ) ఏమాత్రం తీసిపోని విధంగా ఏర్పాట్లు చేసినట్లు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు చెప్పారు.

"శ్రీవారి బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ద్వార దర్శనాలను విజయవంతం చేసినట్లు గానే జ‌న‌వ‌రి 25వ తేదీ రథసప్తమి వేడుకలు వైభవంగా నిర్వహిస్తాం" అని టీటీడీ చైర్మ‌న్ నాయుడు తెలిపారు.

మీడియాతో మాట్లాడుతున్న టీటీడీ చైర్మన్ బీఆర్. నాయుడు

తిరుమలలో టీటీడీ సీవీఎస్వో కేవీ. ముర‌ళీకృష్ణ‌, సీఈ స‌త్యనారాయ‌ణ‌, డిప్యూటీ ఈఓలు లోక‌నాథం, రాజేంద్ర‌ తోపాటు ఇత‌ర అధికారులతో సమీక్షించారు.తిరుమ‌ల‌లోని అన్న‌మ‌య్య భ‌వ‌న్ లో గురువారం టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్‌, బోర్డు స‌భ్యులు జ్యోతుల నెహ్రూ, ప‌న‌బాక ల‌క్ష్మి, అద‌న‌పు ఈఓ సి.హెచ్‌.వెంక‌య్య చౌద‌రితో చైర్మన్ బీఆర్. నాయుడు మీడియాతో మాట్లాడారు. తిరుమలలో చేసిన ఏర్పాట్లను చైర్మన్ బీఆర్. నాయుడు అధికారులతో కలిసి అంతకుముందు పరిశీలించారు.
ఆర్జిత సేవలు రద్దు
రథసప్తమి సందర్భంగా యాత్రికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని బ్రహ్మోత్సవాల తరహాలోనే సామాన్య యాత్రికులకు ప్రాధాన్యత ఇచ్చే విధంగా ఏర్పాట్లు చేసినట్టు టీటీడీ చైర్మన్ బీఆర్. నాయుడు చెప్పారు. జనవరి 25 న శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవ‌లు రద్దు చేసినట్టు ఆయన తెలిపారు. ప్రివిలేజ్ ద‌ర్శ‌నాలు, ప్రోటోకాల్ ప్ర‌ముఖుల‌కు మిన‌హా వీఐపీ బ్రేక్ ద‌ర్శ‌నాల‌ను ర‌ద్దు చేశామని ఆయన వివరించారు.
"ఎక్కువ‌ మంది భ‌క్తుల‌కు శ్రీ‌వారి ద‌ర్శ‌నం క‌ల్పించడానికి ప్రాధాన్యత ఇస్తున్నాం. ఆ ఉద్దేశంతో తిరుపతిలో జ‌న‌వ‌రి 24 నుండి 26వ తేదీ వరకు స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్లు జారీ ర‌ద్దు చేశాం" అని టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ చెప్పారు. తిరుమలలో ర‌థస‌ప్త‌మి రోజు గ్యాలరీల్లో వేచి ఉండే యాత్రికులకు అన్నప్రసాదాల పంపిణీకి 14 ర‌కాల మెనూ సిద్ధం చేయనున్నట్టు ఆయన తెలిపారు. గ్యాల‌రీల్లోని భ‌క్తులంద‌రికీ 85 ఫుడ్ కౌంట‌ర్ల ద్వారా ఉద‌యం నుంచి రాత్రి వ‌ర‌కు అన్న ప్ర‌సాదాలు అందేలా ప్ర‌త్యేక ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేసినట్లు ఆయన తెలిపారు. టీటీడీలోని వివిధ విభాగాల సిబ్బందితో పాటు మాడ వీధుల్లోని గ్యాలరీల్లో యాత్రికులకు అన్న‌ప్ర‌సాదాలు, పానీయాలు పంపిణీ చేసేందుకు దాదాపు 3,700 మంది శ్రీ‌వారి సేవ‌కుల సేవ‌లు వినియోగించుకుంటున్నట్లు ఈఓ సింఘల్ వివరించారు.

వాహన సేవలు ఇలా..
సూర్య ప్రభ వాహనం - ఉదయం 5.30 నుంచి 8 గంటల వరకు
చిన్న శేష వాహనం - ఉదయం 9 నుంచి 10 గంటల వరకు
గరుడ వాహనం - ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు
హనుమంత వాహనం - మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల వరకు
చక్రస్నానం - మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు
కల్పవృక్ష వాహనం - సాయంత్రం 4 నుంచి ఐదు గంటల వరకు
సర్వభూపాల వాహనం - సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు
చంద్రప్రభ వాహనం - రాత్రి 8 నుంచి 9 గంటల వరకు
సాంస్కృతిక కార్యక్రమాలు
ఉభయ దేవేరులతో కలిసి మలయప్పస్వామి విహరించే సమయంలో కళాకారుల ప్రదర్శనలు మైమరిపిస్తాయి. వాహన సేవల ముందు ఈ కళలు దేశంలోని అన్ని రాష్ట్రాల సంస్కృతీ, సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఉంటాయి. గత ఏడాది బ్రహ్మోత్సవాల నుంచి నాణ్యమైన కళలు, కళాకారులను ఎంపిక చేస్తున్నట్లు టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ చెప్పారు. అందులో భాగంగానే రథసప్తమి రోజు వాహ‌నసేవ‌ల ముందు వెయ్యి మంది కళాకారులు 56 రకాల క‌ళారూపాల ప్ర‌ద‌ర్శ‌నలు ఇవ్వడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు.
బ్రహ్మోత్సవ తరహా భద్రత
బ్రహ్మోత్సవాల తరహాలోనే యాత్రికుల భద్రతకు ప్రాధాన్యత ఇచ్చినట్లు టీటీడీ సీవీఎస్ఓ కేవి. మురళీకృష్ణ చెప్పారు. 1300 మంది పోలీసులు, 1200 మంది విజిలెన్స్ సిబ్బందితో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్టు ఆయన తెలిపారు. భ‌ద్ర‌త‌కు సంబంధించి STANDARD OPERATION PROCEDURE అనుస‌రిస్తూ టీటీడీ భ‌ద్ర‌తా విభాగం జిల్లా పోలీసు యంత్రాంగంతో స‌మ‌న్వ‌యం చేసుకుని భ‌ద్ర‌త ప‌ర్య‌వేక్షిస్తామని సీవీఎస్ఓ మురళీకృష్ణ వివరించారు. ప‌బ్లిక్ అడ్రెస్ సిస్టం ద్వారా భ‌క్తులకు అవ‌స‌ర‌మై స‌మాచారాన్ని వివిధ భాష‌ల్లో తెలియజేస్తామని ఆయన చెప్పారు
అదనపు బస్సులు

తిరుమలలో రథసప్తమి కోసం యాత్రికులు సులువుగా చేరుకునేందుకు కూడా టీటీడీ రవాణా వ్యవస్థపై దృష్టి కేంద్రీకరించింది. ఈ నెల 25 ఉదయం నుంచి రాత్రి వరకు ఆర్టీసీ బస్సులు 2300 ట్రిప్పులు నడపాలని నిర్ణయించారు. ఆ మేరకు తిరుపతి ఆర్టీసీ ఆర్ఎంకు కూడా సూచనలు చేశామని టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ చెప్పారు. గత సంవత్సరం రథసప్తమి రోజు ఏపీఎస్ఆర్టీసీ 1,900 ట్రిప్పుల మాత్రమే నడిపింది. తిరుమలలో సేవలు, అన్నప్రసాదాల నాణ్యత, రద్దీ నివారణకు తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలు ఇవ్వడం వల్ల యాత్రికుల సంఖ్య ఈ ఏడాది రథసప్తమికి పెరిగే అవకాశం ఉన్నట్లు అంచనా వేసి, బస్సు సర్వీసులు పెంచాలని నిర్ణయించింది.
తిరుమల శ్రీవారి ఆలయ మాడవీధుల్లోని గ్యాలరీలు, మిగతా అన్ని ప్రదేశాల్లో అత్యవసర సేవలకు కూడా టీటీడీ ముందస్తు కార్యాచరణ సిద్ధం చేసింది.

1. భక్తుల సౌకర్యార్థం మెరుగైన పారిశుద్ధ్య సేవలు.
2. గ్యాల‌రీల్లోని వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగించేలా ప్రత్యేక దృష్టి. అద‌న‌పు సిబ్బంది ఏర్పాటు.
3. భక్తులకు అత్యవసర సేవలందించడానికి వీలుగా అవసరమైన వైద్య సిబ్బంది, మందులు, అంబులెన్సు వాహనాలు సిద్ధం.
తిరుమల శ్రీవారి ఆలయ మాడవీధుల్లో రథసప్తమి కోసం గ్యాలరీల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. చలికి, ఎండకు ఇబ్బంది లేకుండా చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు. ఆలయాన్ని పుష్పాలతో మరింత ఆకర్షణీయంగా అలంకరించనున్నారు. ఈ ఏర్పాట్లను టీటీడీ చైర్మన్ బీఆర్. నాయుడు టీటీడీ పాలక మండలి సభ్యులు జ్యోతుల నెహ్రూ, పనబాక లక్ష్మి, అధికారులతో కలిసి పరిశీలించారు.

భ‌క్తుల‌కు ఎలాంటి అసౌక‌ర్యం క‌ల‌గ‌కుండా ప‌టిష్ట‌మైన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. అన్న‌ప్ర‌సాదాలు గ్యాల‌రీల్లోని ప్ర‌తి భ‌క్తుడికి చేరేలా ప్ర‌ణాళికాబ‌ద్ధంగా పంపిణీ చేయాల‌ని చెప్పారు. పారిశుద్ధ్య లోపం త‌లెత్త‌కుండా ఎప్ప‌టిక‌ప్పుడు చెత్త‌ను తొల‌గించి బ‌య‌ట‌కు త‌ర‌లించేందుకు చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు.


Read More
Next Story