లేదు.. లేదంటూనే.. కరెంటు బిల్లు మోత మోగించబోతున్నారా!
x

లేదు.. లేదంటూనే.. కరెంటు బిల్లు మోత మోగించబోతున్నారా!

విద్యుత్ చార్జీల ట్రూ డౌన్ పచ్చి మోసం అంటున్న వామపక్షాలు.


కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ఆమోదించిన విద్యుత్ బిల్లు 2025 రాష్ట్రానికి యమపాశం వంటిది. ఇది విద్యుత్ రంగం మనుగడే ప్రమాదంలో పడుతుంది. విద్యుత్ నియంత్రణ మండలి అస్థిత్వం కోల్పోతుందనే అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి.

"రాష్ట్రంలో విద్యుత్ చార్జీలు మరింత తగ్గించి మేలు చేస్తాం" అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు తోపాటు విద్యుత్ శాఖ మంత్రి స్పష్టం చేశారు. 15,654 కోట్ల రూపాయలు ఆదాయం లోటు చూపించిన ఏపీఈఆర్ సీ 2026-27 సంవత్సరంలో విద్యుత్ చార్జీల భారం మోపడానికి సిద్ధం అవుతోంది. పరిశ్రమలు, కమర్షియల్ సంస్థల నుంచి ఒక యూనిట్ వసూలు చేస్తున్న 50 పైసలు రూపాయికి పెంచడానికి ఏపీఈఆర్సీ సిద్ధమైంది.
"కోర్టు ఆదేశాల నేపథ్యంలో ట్రౌ డౌన్ చార్జీలకు స్వస్తి చెప్పిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 17 వేల కోట్లు భారం మోపింది" అని సీపీఎం నేత కందారపు మురళి ఆరోపించారు. ఈ పరిస్థితికి కేంద్ర ప్రభుత్వం తీసుకుని వచ్చిన విద్యుత్ బిల్లు 2025 రాష్ట్రానికి యమపాశం లాంటిది అని ఆయన అభివర్ణించారు. విద్యుత్ చార్జీల ట్రూ డౌన్ అనేది కూడా పచ్చి మోసం అని మురళి స్పష్టం చేశారు.
"కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ఆమోదించిన విద్యుత్ బిల్లు 2025 రాష్ట్రానికి యమపాశం వంటిది. విద్యుత్ రంగం మనుగడే ప్రమాదంలో పడుతుంది. నియంత్రణ మండలి అస్థిత్వం కోల్పోతుంది" అని కందారపు మురళి ఆందోళన వ్యక్తం చేశారు.

తిరుపతి ఎస్పీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయంలో ఏపీఈఆర్సి ( Andhra Pradesh Electricity Regulatory Commission APERC) చైర్మన్ పీవీఆర్. రెడ్డి అధ్యక్షతన ప్రజాభిప్రాయ సేకరణకు శ్రీకారం చుట్టింది. విద్యుత్ సంస్థలు ఏపీఈఆర్ సీకి సమర్పించిన నివేదికలో 15,654 కోట్ల రూపాయలు తగ్గుదల చూపించింది. ఈ లోటు భర్తీ చేసుకునేందుకు 2026-27 ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ లోటు భర్తీ చేయడానికి కమర్షియల్, పరిశ్రమలపై భారం మోపడానికి ఏపీఈఆర్సీ సిద్ధమైంది.
విద్యుత్ చార్జీల తగ్గించండి

రానున్న ఆర్థిక సంవత్సరంలో విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని వామపక్ష నేతలు డిమాండ్ చేశారు. ట్రూ అప్ చార్జీల పేరిట వసూలు చేస్తున్న మొత్తాన్ని ఆపివేయడంతో పాటు వినియోగదారులకు చార్జీల భారాన్ని తగ్గించి ఉపశమనం కల్పించాలని సీపీఎం, సీపీఐ నేతలు ఈఆర్సీ చైర్మన్ పివిఆర్ రెడ్డికి వినతిపత్రం సమర్పించారు. సిపిఎం నేత కందారపు మురళీ, సీపీఐ నేత రామానాయుడు, సారధ్యంలో సీపీఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు, టి. సుబ్రహ్మణ్యం, ఎస్ జయచంద్ర, కే వేణుగోపాల్, మాధవ్ కృష్ణ, సాయి లక్ష్మి, జి. బాలసుబ్రమణ్యం, మునిరాజా, సిపిఐ నేతలు చిన్నం పెంచలయ్య, విశ్వనాథ్ ఏపీఈఆర్సీ చైర్మన్ ను కలిశారు. అంతకుముందు
తిరుపతి ఏపీ ఎస్పీడీసీఎల్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో సీపీఎం నేత కందారపు మురళీ తన వాదనలు వినిపించారు. విద్యుత్ చార్జీలు తగ్గించి, వినియోగదారులకు ఉపశమనం కలిగించాలని మురళీ డిమాండ్ చేశారు. ఆయన ఏమన్నారంటే..
"టీడీపీ కూటమి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలను పెంచలేదని అంటోంది. 26 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా ట్రూ డౌన్ చేసి ఛార్జీలు తగ్గించామని చెబుతున్న వాదనలో పసలేదు. గత రెండేళ్లలో 17వేల కోట్ల అదనపు భారం మోపింది. వైసిపి ప్రభుత్వం తొమ్మిది సార్లు చార్జీలు పెంచి 32,000 కోట్ల రూపాయల భారం మోపింది" అని సిపిఎం నేత కందారపు మురళి ప్రస్తావించారు.

కందారపు మురళీ

తగ్గని సుంకాలు..
ఏపీఎస్పీడీసీఎల్ ఇస్తున్న విద్యుత్ బిల్లుల్లో వైసీపీ ప్రభుత్వం పెంచిన విద్యుత్ సుంకం, చార్జీలను కూటమి ప్రభుత్వం కూడా యథాతధంగా వసూలు చేస్తోంది. 2022 - 24 మధ్య సర్దుబాటు చార్జీల పేరిట యూనిట్కు 40 పైసలు వసూలు చేస్తోంది.
"2024 - 25 సంవత్సరానికి ముందుగానే యూనిట్ కు 40 పైసలు చొప్పున 2700 కోట్లు వసూలు చేశారు. అదనంగా వసూలు చేసిన దాంట్లో 927 కోట్ల రూపాయలను తగ్గించి, ట్రూ డౌన్ అని ప్రజల్ని మభ్యపరిచారు" అని కందారపు మురళి విశ్లేషించారు. డిస్కం సంస్థలు సమర్పించిన నివేదికలో బోగస్ లెక్కలు, తప్పుడు లెక్కలు కారణంగానే రూ. 12,771 కోట్ల భారం వేయాలని ప్రభుత్వం తరుపున పంపిణీ సంస్థలు కుట్ర పన్నాయని, నియంత్రణ మండలి వీటిలో అత్యధిక భాగాన్ని తిరస్కరించిందని దీనికి ప్రభుత్వం సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. వాస్తవం ఇదైతే 26 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా ట్రూ డౌన్ చేశామని మంత్రి పదేపదే చెప్పడం హాస్యాస్పదమని కందారపు మురళి విమర్శించారు.
అవినీతి ప్రధాన కారణం...
విద్యుత్ రంగం బలహీన పడటానికి ప్రధాన కారణం అవినీతేనని కందారపు మురళి తీవ్ర ఆరోపణలు చేశారు. సెకీ విద్యుత్ ఒప్పందం కారణంగా 1,50,000 కోట్ల నష్టం జరిగిందని స్వయంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అసెంబ్లీలో ప్రకటించినా, ఆ ఒప్పందాన్ని రద్దు చేయకుండా రాష్ట్రంలో ఎందుకు అమలు చేస్తున్నారని మురళీ ప్రశ్నించారు.
అమెరికాలో అవినీతిగా గుర్తించి కేసులు నమోదు చేస్తే, భారతదేశంలో, ఆంధ్ర రాష్ట్రంలో ఎందుకు పట్టించుకోలేదో అదానీకే ఎరుకని అన్నారు. అయిన వాళ్లకు అందలం ఎక్కించడం సెకి విద్యుత్ కుంభకోణంలో పరాకాష్ట అన్నారు. దీనినే క్రోనీ కాపీటలిజంగా కందారపు మురళి అభివర్ణించారు.
సెకి విద్యుత్ ఒప్పందంలో యూనిట్ ధర రూ.2.49 పైసలకే ₹1.50 లక్షల కోట్ల నష్టం వస్తుందని మాట్లాడిన ముఖ్యమంత్రి, యాక్సిస్ ఎనర్జీ కంపెనీతో యూనిట్ కు రూ.4.60పై ఒప్పందం ఎలా చేసుకుంటారని ప్రశ్నించారు.
ఒక్క సంతకంతో 84 కోట్ల రూపాయల లబ్ధి పొందాడని మాజీ సీఎండిపై మీడియా కోడై కూస్తున్నా, ప్రభుత్వం స్పందించలేదంటే ఇందులో ఎవరి పాత్ర ఏమిటని ప్రశ్నించారు. స్మార్ట్ మీటర్లలో 29 వేల కోట్ల రూపాయల స్కాం జరిగిందని, ట్రాన్స్ ఫార్మర్ల కుంభకోణంలో అవినీతి తారాస్థాయిలో ఉందని 56 వేల రూపాయలు విలువచేసే ట్రాన్స్ ఫార్మర్ కు ₹1,40,000లు చెల్లించి 84 కోట్లు అవినీతికి పాల్పడితే మాజీ సిఎండి ఉండాల్సింది జైలులోనా? ఇంట్లోనా అని ప్రశ్నించారు.
అవినీతి జరిగితే స్పందించరా?
విద్యుత్ నియంత్రణ మండలి కూడా బాథ్యతగా వ్యవహరించడం లేదనే విమర్శలు అభిప్రాయ సేకరణలో వినిపించాయి.
"అవినీతితో నాకేమిటి సంబంధం అన్నట్టుగా ఏపీఈఆర్సీ వ్యవహరిస్తోంది. నియంత్రణ మండలి కూడికలు, తీసివేయటాలు చేయడమే కాదు. తప్పు, ఒప్పును ప్రశ్నించేట్టుగా, నియంత్రించేట్టుగా ఉండాలి" అని మురళీ సూచించారు.
"కార్పొరేట్ కంపెనీలకు ఆంధ్ర రాష్ట్రం తాకట్టు పెట్టారు అందులో తిరుపతిలోని ఎస్పీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయం ఆదానికి అప్పజెప్పడం కూడా నిదర్శనం" అని ఆయన ఆరోపించారు.
ఆయన ఇంకా ఏమి చెప్పారంటే..
"హిందూజా కంపెనీ నుంచి ఒక్క యూనిట్ విద్యుత్తు కొనకుండా ₹1200 కోట్లు చెల్లించి, ప్రజాధనానికి రక్షణ లేకుండా చేశారు. ట్రాన్స్ ఫార్మర్ ల కుంభకోణం, విద్యుత్ స్తంభాల కుంభకోణం, టవర్ల కుంభకోణం ప్రతిదీ అవినీతి కుంభకోణాలే" అని కందారపు మురళి అన్నారు. ఆదానీ స్మార్ట్ మీటర్ల కుంభకోణంలో ₹29 వేల కోట్ల రూపాయల స్కాం జరిగిందని మురళి తెలిపారు. సంస్కరణల వల్ల ప్రజలకు నష్టం జరిగిందని, కార్పొరేట్ కంపెనీలకు లాభం జరిగిందని, ఏ తప్పును సరిదిద్దారో సమాధానం రెగ్యులేటరీ కమిషన్ చెప్పాలి. అధికారిక ముద్ర వేయడం మినహా నియంత్రణ మండలి చేస్తున్నది ఏమిటి? అని కందారపు మురళి సూటిగా ప్రశ్నించారు.
రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన సబ్సిడీ బకాయిలు 10వేల కోట్ల రూపాయలను తక్షణం చెల్లించాలని డిస్కాములను ఆదుకోవాలని కందారపు మురళి డిమాండ్ చేశారు.టైమ్ ఆఫ్ డే (టిఓడి) విధానాన్ని రద్దు చేయాలని కందారపు మురళి డిమాండ్ చేశారు.
రుణాల సంక్షోభంలో డిస్కంలు
సంస్కరణల పేరుతో డిస్కాములు అప్పుల ఊబిలో కూరుకుపోయాయని ₹1,23,000ల కోట్ల రూపాయల అప్పులో ఉన్నాయని ఏడాదికి ₹481 కోట్ల రూపాయల వడ్డీ చెల్లిస్తున్నారని ఆరోపించారు.
తెలంగాణ తరహాలో కార్మికులను విలీనం చేయాలి
ప్రతి ఏడాది చేసిన అప్పుకు చెల్లిస్తున్న వడ్డీలో సగం కార్మికుల శ్రేయసుకు ఖర్చుపెడితే విద్యుత్ సంస్థలలో పనిచేస్తున్న 26,000 మంది కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్ చేయవచ్చని కందారపు మురళి అన్నారు. తెలంగాణ తరహాలో విలీనం చేయమని ఏళ్ల తరబడి కోరుతున్నా కార్మిక సంక్షేమం గురించి యాజమాన్యం పట్టించుకోవడంలేదని మురళి అన్నారు. పర్మినెంట్ ఉద్యోగులకు కాంట్రాక్ట్ కార్మికులకు వినియోగదారులకు రాష్ట్ర ప్రభుత్వానికి ఉపయోగపడని సంస్కరణలు ఎవరికోసమని ఆయన సూటిగా ప్రశ్నించారు. ఈ సంస్కరణలు కేవలం కార్పొరేట్ కంపెనీల కోసమేనని కళ్ళకు కట్టినట్టు కనబడుతున్నా నియంత్రణ మండలి నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నదని కందారపు మురళి ఆరోపించారు.
Read More
Next Story