
తిరుమల శ్రీవారి ఆలయం ఎదుట డ్రమ్స్ వాయిస్తున్న పద్మశ్రీ శివమణి
ఢం.. ఢం. ఢమారే... శ్రీవారికి డ్రమ్స్ తో నీరాజనం
తిరుమలలో అలరించిన శివమణి సంగీత సంగమం.
తిరుమల శ్రీవారికి డ్రమ్స్ శివమణి నాదనీరాజనం సమర్పించారు. రోజువారి సంకీర్తనలు, ధార్మిక ఉపన్యాసాలు, సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే నాట్య కళారూపాలకు భిన్నంగా శివమణి డ్రమ్స్ ప్రతిధ్వనించాయి. శ్రీవారి దర్శనానికి వచ్చిన యాత్రికులను డ్రమ్స్ శివమణి వాయిద్య విన్యాసాలు ఆకట్టుకున్నాయి. శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న నాద నీరాజనం వేదికపై గురువారం సాయంత్రం నిర్వహించిన పద్మశ్రీ శివమణి బృందం సంగీత సంగమం కార్యక్రమం భక్తులను విశేషంగా అలరించింది.
తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఎదురుగా ఏర్పాటు చేసిన నాదనీరాజనం వేదిక పైనుంచి కళార్చన జరుగుతూ ఉంటుంది. రోజు సాయంత్రం ఏడు గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు నిర్వహించే కార్యక్రమాలు యాత్రికులను సేద తీర్చే విధంగా నిర్వహించడంలో టిటిడి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది.
తిరుమలలోని నాదనీరాజనం వేదిక పైనుంచి శ్రీవారిని కీర్తిస్తూ అన్నమయ్య సంకీర్తనలు ఆలపించే కళాకారులు స్వరార్చన సమర్పిస్తారు. ధార్మిక ఉపన్యాసాలు ఆలోచనలు రేకెత్తిస్తాయి. నిత్యం ఈ వేదికపై నుంచి నిర్వహించే కార్యక్రమాలు ఈ యాత్రికులను అలరిస్తూ ఉంటాయి.
వీటన్నిటికి భిన్నంగా..
తిరుమల శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న నాదనీరాజనం వేదిక పైనుంచి డ్రమ్స్ శివమణి తన వాయిద్య విన్యాసాలతో యాత్రికులను ఆకట్టుకున్నారు. ఈ వేదికపై నుంచి ఈ తరహా కార్యక్రమం నిర్వహించడం ప్రత్యేకంగా ఆకట్టుకుంది. తిరుమలేశుని సన్నిధిలో కళాకారులు నాదనిరాజనం వేదిక పైనుంచి కళార్చన సమర్పించే అవకాశం కోసం నిరీక్షిస్తూ ఉంటారు.
ఆ తరహా అవకాశం డ్రమ్స్ శివమణికి దక్కింది. వివిధ రకాల వాయిద్య పరికరాలను నాదనీరాజనం వేదికపై ఏర్పాటు చేసిన శివమణి సప్త స్వరాలను వాయిద్య పరికరాలపై ప్రతిధ్వనింపజేశారు. ఒక్కో వాయిద్య పరికరం పై ఒక శబ్దాన్ని పలికించిన డ్రమ్స్ శివమణి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి నీరాజనం సమర్పించారు. ఈ కార్యక్రమాన్ని తిరుమల దర్శనానికి వచ్చిన యాత్రికులతో పాటు ఆలయం పరిసర ప్రాంతాల్లో కటిక నేలనే పట్టు పాన్పుగా భావించి శీల తీరుతున్న వారంతా ఆస్వాదించారు.
"పద్మశ్రీ శివమణి నాదనీరాజనం వేదికపై ప్రదర్శన ఇవ్వడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా" అని టీటీడీ అదనపు ఈఓ సీహెచ్. వెంకయ్య చౌదరి చెప్పారు.
నాదనీరాజనం వేదికపై నుంచి అన్నమయ్య, త్యాగరాజ, పురందరదాసులు సంకీర్తనలకు డ్రమ్స్ శివమణి ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమానికి ఆర్.రఘురాం గాత్రం అందివ్వగా మాండొలిన్ యు.రాజేష్, మృదంగం విద్యాసాగర్, కీబోర్డ్ ద్వరా విశాఖ్ రాంప్రసాద్ సహకారం అందించారు.
ముఖ్య అతిథిగా వచ్చిన టీటీడీ అదనపు ఈఓ సి.హెచ్.వెంకయ్య చౌదరి, శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈఓలు లు లోకనాథం, సోమన్నారాయణ ఆద్యంతం ప్రేక్షకుల్లా ఆస్వాదించారు.
టీటీడీ అదనపు ఈఓ వెంకయ్య చౌదరి మాట్లాడుతూ, నాదనీరాజనం వేదికపై ప్రదర్శించే సాంస్కృతిక కార్యక్రమాలను వేలాదిమంది భక్తులు ప్రత్యేకంగా, లక్షలాదిమంది భక్తులు పరోక్షంగా వీక్షస్తున్నారని తెలిపారు.
"మన సంస్కృతి, సాంప్రదాయాలను ప్రపంచానికి చేరవేసేందుకు శ్రీవారి సన్నిధిలోని నాదనీరాజనం ప్రత్యేక వేదిక" అని వెంకయ్య చౌదరి అన్నారు. అనంతరం పద్మశ్రీ శివమణి బృందాన్ని ఎస్వీబీసీ సీఈఓ ఫణి కుమార్ శాలువాతో సత్కరించారు. వారికి శ్రీవారి ప్రసాదాలు, చిత్ర పటాన్ని అందజేశారు.
Next Story

