క్యాబినెట్లో ప్ర’యోగం లేక‘ నిరాశపడిన సీనియర్లు
x

క్యాబినెట్లో ప్ర’యోగం లేక‘ నిరాశపడిన సీనియర్లు

కొత్తగా ఎన్నికయిన వారికి పెద్దపీట వేస్తూ, సీఎం ఎన్. చంద్రబాబు మంత్రివర్గ కూర్పు సీనియర్లను నిరాశకు గురి చేసింది. ముందుచూపుతో వ్యవహరించినట్లు కనిపించినా, ఒకో జిల్లాలో ఒకోరకమైన ప్రయోగం చేసినట్లు కనిపిస్తోంది.


మంత్రివర్గంలో ఛాన్స్ దొరుకుతుందని ఆశలో ఉన్నసీనియర్లకు సీఎం చంద్రబాబు చేయిచ్చారు. గత అర్ధరాత్రి పేర్లు వెలువడ్డాక వారంతా తీవ్ర నిరాశకు లోనయ్యారు. వైఎస్ఆర్ సీపీ నుంచి తిరుగుబాటు చేసి వెళ్లి, ఎన్నికల్లో విజయం సాధించి వారిలో ఆనం రామనారాయణరెడ్డి, కొలుసు పార్థసారధికి అవకాశం ఇచ్చారు. నెల్లూరు రూరల్లో కోటంరెడ్డి శ్రీధరరెడ్డి అనంతపురం జిల్లా గుంతకల్లు నుంచి విజయం సాధించిన గుమ్మనూరు జయరాంకు అవకాశం దక్కలేదు. అంతేకాకుండా, రాయలసీమలో సీనియర్లు పరిటాల సునీత, భూమా అఖిలప్రియ, ఎన్. అమరనాథరెడ్డి, కడపలో ఎన్. వరదరాజులరెడ్డి, మాధవీరెడ్డికి అవకాశం ఉంటుందని భావించారు.

అండగా నిలిచిన సీమ

రాయలసీమ నాలుగు జిల్లాల్లో 52 అసెంబ్లీ స్ధానాల్లో 42 చోట్ల టీడీపీ అభ్యర్థులే విజయం సాధించారు. కూటమిలోని బీజేపీ నుంచి ముగ్గురు, జనసేన నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. నెల్లూరులో పదికి పది స్థానాలను టీడీపీ దక్కించుకుంది. ఈ ఐదు జిల్లాల నుంచి తొమ్మిది మందికి సీఎం ఎన్. చంద్రబాబు క్యాబినెట్లో అవకాశం దక్కింది. వారిలో నలుగురు సీనియర్లు కాగా, ఐదుగురు కొత్తగా గెలిచిన వారే కావడం గమనార్హం. వారిలో ఒకరు మహిళ ఉన్నారు. పాత,కొత్త సభ్యుల మేళవింపులో అనుసరించిన విధానం ’యధావిధిగానే చంద్రబాబు ప్రయోగం చేసినట్లు కనిపిస్తోంది. అయితే కూటమిలోని పార్టీలకు అవకాశం ఇవ్వాల్సిన కారణంగా చూపించి సీనియర్లను కట్టడి చేయడానికి కొత్తవారిని తెరమీదకు తెచ్చినట్లు పరిశీలకులు అంచనా వేస్తున్నారు.
బాబు ఎక్కరే...
చిత్తూరు జిల్లా నుంచి సీఎం ఎన్. చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మంత్రి పదవి ఆశించిన సీనియర్ నేత, పలమనేరు ఎమ్మెల్యే ఎన్. అమరనాథరెడ్డి అడియాశగా మారింది. రాష్ర్టంలో ముస్లిం ఎమ్మెల్యేలు ముగ్గురు ఉండగా, మదనపల్లె నుంచి విజయం సాధించిన షేక్ షాజహాన్ బాషాకు అవకాశం ఉంటుందని భావించారు. అయితే కర్నూలు జిల్లా నంద్యాల ఎమ్మెల్యే టీడీపీలో సీనియర్ నేత, 1985 నుంచి అనేక పదవులు నిర్వహించిన ఎన్.ఎం.డీ ఫరూఖ్ కు అవకాశం కల్పించారు. 2014 -2019 మధ్య బనగానపల్లె నుంచి విజయం సాధించి, గత ఎన్నికల్లో ఓటమి చెందిన బీసీ. జనార్థనరెడ్డికి క్యాబినెట్లో స్ధానం దక్కింది. అనూహ్యంగా కర్నూలు నగరం నుంచి మొదటిసారి గెలిచిన రాజ్యసభ మాజీ సభ్యడు, టీజీ. వెంకటేష్ కుమారుడు టీజీ. భరత్ కు అవకావం కల్పించడం వెనుక మతలబు ఏమిటనేది చర్చకు దారితీసింది. రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన సీనియర్ మహిళా నేత, ఎన్నో పోరాటాలు సాగించిన మాజీ మంత్రి, ఆళ్లగడ్డ ఎమ్మల్యే భూమా అఖిలప్రియకు అవకాశం దక్కకపోవడం వెనుక మతలబు ఉందనే చర్చ జరుగుతోంది.
కడప కథేమిటి.. ఇలా అయ్యింది?
కడప జిల్లాలో ఇద్దరు సీనియర్లు కాదని, కొత్తగా ఎన్నికైన రాయచోటి ఎమ్మల్యే మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి మంత్రి పదవి దక్కింది. ఇది ఒకరకంగా సీఎం ఎన్. చంద్రబాబు చేసిన ప్రయోగంగా కనిపిస్తోంది. కడప జిల్లా తాజా మాజీ సీఎం వైఎస్. జగన్ మోహన్ రెడ్డి స్వప్రాంతం. ఈ జిల్లాలో పది స్థానాల్లో టీడీపీ ఐదు, జనసేన ఒకటి, బీజేపీ ఒక సెగ్మెంట్ లో విజయం సాధించింది. ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డి ప్రాతినిధ్యం వహించిన ఈ జిల్లాలో ప్రొద్దుటూరు ఎమ్మెల్యే ఎన్. వరదరాజుల రెడ్డి గతంలో ఐదుసార్లు గెలిచిన వ్యక్తి, ఆ తరువాత మొదటిసారి విజయం సాధించినా సీనియర్ అయిన మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర యాదవ్ ను కాదని మొదటిసారి ఎన్నికైన రాంప్రసాద్ రెడ్డినిి మంత్రి పదవి వరించింది. ఈయన కాంగ్రెస్ పార్టలో ఉన్న నాటి నుంచి మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డితో సన్నిహితంగా మెలగడమే కాకుండా, రాష్ర్ట విభజన తరువాత నల్లారి సారధ్యంలోని జై సమైక్యాంధ్ర పార్టీ నుంచి కూడా రాయచోటిలో పోటీ చేశారు. అంతేకాకుండా, ఆయనకు చినబాబు అభయం కూడా ఉందనే మాటలు వినిపిస్తున్నాయి. ఇదిలావుంటే, వయసు, రాజకీయాల్లో సీనియర్లను సమన్వయం సాధించడం సాధ్యం అవుతుందా? చంద్రబాబు ప్రయోగం ఫలిస్తుందో? వికటిస్తుందనేది కాలమే సమాధానం చెప్పాలి.
పరిటాలకు మొండి చేయి..
అనంతపరం జిల్లాలో ప్రధానంగా రాప్తాడు నియోజకవర్గంలో గత ఐదేళ్లు అధికార పార్టీపై మాజీ మంత్రి పరిటాల సునీతమ్మ, ఆమె తనయుడు పరిటాల శ్రీరాం దాదాపు యుద్ధమే చేయాల్సి వచ్చంది. అడుగడుగునా నిర్బంధాలు ఎదుర్కొన్నారు. తాజా సార్వత్రిక ఎన్నికల్లో పరిటాల సునీతమ్మ ప్రత్యర్థి అయిన సిట్టింగ్ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిపై 23, 329 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఆమె కుమారుడు పరిటాల శ్రీరాం కూడా ధర్మవరం అసెంబ్లీ స్థానంలో బీజేపీ రాష్ర్ట కార్యదర్శి వై. సత్యకుమార్ విజయంలో అన్నీ తానై వ్యవహరించారు. అయినా, ధర్మవరంలో బీసీ సామాజికవర్గానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే సత్యకుమార్, టీడీపీ నుంచి ఉరవకొండలో మొదటిసారి విజయం సాధించిన బీసీ మహిళ ఎస్. సవితమ్మకు అవకాశం కల్పించడంలో చంద్రబాబు మదిలో ఆలోచన ఏమిటో బోధపడడం లేదని సీనియర్ నేత అయిన పరిటాల సునీతమ్మ మద్దతుదారులు ఆవేదన చెందుతున్నారు. అమె సామాజిక వర్గానికి చెందిన ఉరవకొండ ఎమ్మల్యే పయ్యావుల కేశవ్ కు అవకాశం కల్పించారు. ఇక్కడ కొత్తగా గెలిచిన ఇద్దరికి ఒక సీనియర్క్ మాత్రమే అవకాశం దక్కింది.
ఇద్దరు సీనియర్లకే..
నెల్లూరు జిల్లా టీడీపీకి ఏకపక్షంగా నిలిచింది. పదికి పది సీట్లు అందించింది. ఈ ప్రాంతానికి వచ్చే సరికి మిగతా సీఎం ఎన్.చంద్రబాబు మిగతా జిల్లాల ఫార్ములా పక్కన ఉంచినట్టు స్ఫష్టం అవుతోంది. రాయలసీమ జిల్లాల్లా సీనియర్లతో కొత్తగా ఎన్నికైన వారిని మేళవించారు. నెల్లూరులో మాత్రం ఇద్దరూ సీనియర్లకే అవకాశం కల్పించారు. సీనియర్ అయిన ఆత్మకూరు ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి, నెల్లూరు నగరంలో నారాయణను మంత్రి పదవులు వరించాయి. గత అధికార పార్టీపై తిరుగుబాటు చేసి, టీడీపీ నుంచి గెలిచిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధరరెడ్డి మంత్రి పదవి ఆశించి భంగపడ్డారు. జిల్లాలో రాజకీయ చిత్రపటం మారడంలో కీలకమైన నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి సతీమణి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి కోవూరు నుంచి విజయం సాధించారు. వారిద్దరికీ సేవా నేపథ్యం ఉంది. మంత్రివర్గంలో ఆమెకు స్ధానం కల్పిస్తారనే చర్చ జరిగింది. మిగతా జిల్లాల ప్రయోగం ఇక్కడ అమలు కాకపోవడంపై అధికార పార్టీలో చర్చకు తెరతీసింది.
Read More
Next Story