చిత్తూరు జిల్లాలో కరెంటు తీగలు తగిలి 11 నుంచి 12 సంవత్సరాల వయసు ఉన్న రెండు ఏనుగులు మరణించాయి. మరో ప్రదేశంలో అటవీ సమీప గ్రామాలు చిరుత పులల సంచారంతో బిక్కుబిక్కుమంటున్నాయి. జిల్లాలోని పూర్వ మదనపల్లి డివిజన్లోని పడమటి ప్రాంతాల్లో వన్యప్రాణులకు రక్షణ లేకుండా పోయింది. చిరుతపులులతో గ్రామాలు భయం గుప్పెట చిక్కుకున్నాయి.
పీలేరు వద్ద అటవీ సమీప గ్రామంలో మామిడి తోటల రక్షణకు తీసిన కరెంటు తీగలు తగిలి రెండు గున్న ఏనుగులు మరణించిన సంఘటలన సోమవారం ఉదయం వెలుగు చూసింది. శేషాచలం అడవులకు సమీపంలోని తలకోన అటవీప్రాంతం నుంచి వచ్చిన ఏనుగుల దాడిలో అరటి తోట తోపాటు, వేరుశనగ పంటలు కూడా ధ్వంసం అయ్యాయి. పలమనేరు నియోజకవర్గం బైరెడ్డిపల్లి మండలంలోని అటవీ సమీప గ్రామాలు చిరుత పులల సంచారంతో పాడి రైతులు కలవరం చెందుతున్నారు.
పీలేరు వద్ద రెండు ఏనుగులు మరణించాయని సమాచారం తెలియగానే భాకరాపేట తిరుపతి డీఎఫ్ఓ సాయిబాబా సంఘటన ప్రదేశానికి చేరుకున్నారు. ఈ ఘటనపై విచారణ చేస్తున్నారు.
"భాకరాపేట అటవీరేంజ్ పరిధిలో 11 నుంచి 12 ఏళ్ల వయసు ఉన్న రెండు ఆసియా జాతి ఏనుగులు మరణించాయి" అని తిరుపతి వన్యప్రాణుల సంరక్షణ విభాగం (Tirupati Wildlife Conservation Department ) డీఎఫ్ఓ సాయిబాబా తెలిపారు.
ఎర్రవారిపల్లె మండలం నెరబైలుకు సమీపంలోని సాయిబులపల్లె గ్రామానికి 450 మీటర్ల అటవీ సరిహద్దుు సమీపంలోని మామిడి తోటలో ఈ సంఘటన జరిగిందని డీఎఫ్ఓ సాయిబాబా వివరించారు. 33 కేవీ ట్రాన్స్ మిషన్ లైన్ నుంచి అక్రమంగా తీసిన తీగల వల్లే ఈ ఏనుగులు మరణించినట్లు ప్రాధమిక దర్యాప్తులో తేలిందనీ, మామిడి తోట యజమాని షేక్ అక్తర్, వేరుశనగ పంట సాగు చేస్తున్న రైతు షేక్ సమీర్ పై భాకరాపేట అటవీశాఖ కార్యాలయంలో కేసు నమోదు చేశాం" అని డీఎఫ్ఓ సాయిబాబా ఓ ప్రకటన విడుదల చేశారు.
పలమనేరు నియోజకవర్గం బైరెడ్డిపల్లె అటవీసమీప గ్రామాల్లో చిరుత పులుల సంచారం పెరిగిందని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు.
"రెండు నెలల నుంచి చిరుతపురుల సంచారం వల్ల కంటి మీద కునుకు లేకుండా పోయింది" అని బైరెడ్డిపల్లె మండలం వడ్డేపల్లి గ్రామానికి చెందిన రమేష్ ఆందోళన వ్యక్తం చేశారు.
రెండు ఏనుగుల బలి
అడవులకు సమీపంలోని గ్రామాల వద్ద వన్యప్రాణుల నుంచి మామిడి తోటల రక్షణ కోసం తీసిన కరెంటు తీగలు తగిలి సోమవారం రెండు ఏనుగులు మరణించాయి.
పీలేరు నియోజకవర్గంలోని కొన్ని మండలాల్లో ఎర్రావారిపాలెం, కె.వి. పల్లె, పులిచెర్ల, కలకడ మండలాల్లోని గ్రామాలు 90 శాతం అడవులకు సమీపంలోనే ఉంటాయి. ఈ గ్రామాల్లో ఉద్యానవన పంటలు మామిడి, టమోటా పంటలు రైతులు ఎక్కువగా సాగు చేస్తుంటారు. అడవులకు సమీపంలోని గ్రామాల వద్ద సాగులో ఉన్న పంటలపై వన్యప్రాణుల దాడులు తరచూ జరగడం సర్వసాధారణంగా మారింది.
పీలేరు మండలానికి సమీపంలోని ఎర్రవారిపల్లె మండలం నెరబైలు గ్రామం కూడా పూర్తిగా తలకోన అటవీ ప్రాంతానికి సమీపంలో ఉంటుంది. ఈ ప్రాంతంలో ఎక్కువగా ఉన్న మామిడి తోటల రక్షణ రైతులకు కష్టంగా మారింది. ఈ పరిస్థితులు సాయిబులపల్లె వద్ద మామిడి తోటల వద్ద వేటగాళ్లు తీసిన ఉచ్చులో పడి రెండు ఏనుగులు మరణించిన వ్యవహారం సోమవారం ఉదయం వెలుగు చూసింది. ఉదయం పొలాల వద్దకు వెళ్లిన రైతులు కరెంటు తీగలు తగిలి రెండు ఏనుగులు మరణించి ఉండడం గమనించి వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు.
ఎర్రావారిపల్లి మండలం అడవులకు సమీపంలో ఉండడం వల్ల తరచూ ఏనుగుల దాడులు జరుగుతున్నాయి.
ఈ సంఘటన వెనక రెండు కథనాలు వినిపిస్తున్నాయి. సాయిబులపల్లె వద్ద మామిడి తోటలు అడవులకు సమీపంలో ఉన్నాయి.
"తలకోన, శేషాచలం అటవీ ప్రాంతం నుంచి ఆహారం కోసం వచ్చే ఏనుగులు, ఇతర వన్యప్రాణాల నుంచి పంటలను కాపాడుకునేందుకు కరెంటు తీగలు తీసి ఉండవచ్చు" అని భావిస్తున్నారు.
వన్య ప్రాణాలను వేటాడడానికి వేటగాళ్లు తీసిన కరెంటు వల్లే ఈ ఏనుగులు మరణించాయి అనే కథనం కూడా ఇక్కడ వినిపిస్తోంది. ఈ సంఘటనపై అటవీశాఖ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
చిరుతల నుంచి రక్షణ కల్పించండి
పలమనేరు ప్రాంతంలోని బైరెడ్డిపల్లె మండలంలో చిరుతల నుంచి రక్షణ కల్పించాలని నెల్లిపట్ల గ్రామస్తులు కోరుతున్నారు. గ్రామానికి సమీపంలోని రెండు చిరుత పులులు పాడి పశువులపై దాడి చేస్తున్నట్లు రైతులు ఆందోళన చెందుతున్నారు.
"పొలానికి సమీపంలోని షెడ్డు వద్ద కట్టేసి ఉంచిన ఆవు, దూడను చిరుత పులి చంపేసింది" అని నెల్లిపట్ల గ్రామానికి చెందిన గౌస్ బాషా ఆవేదన వ్యక్తం చేశారు. పొలాలకు సమీపంలోని చిట్టడవి సమీపానికి వెళ్లాలంటేనే భయంగా ఉందని రమేశ్ అనే రైతు కూడా చెప్పారు.
ఈ సంఘటనపై పలమనేరు ఫారెస్టు రేంజ్ ఆఫీసర్ ( Forest Range Officer FRO) నారాయణ ఏమన్నారంటే..
"రైతుల ఆందోళన నా దృష్టికి కూడా వచ్చింది. వాస్తవాలు తెలుసుకోమని బీట్ సిబ్బందికి సూచించా" అని ఎఫ్ఆర్ఓ నారాయణ చెప్పారు.
"నా విచారణలో ఈ సంఘటన చాలా పాతది అని తెలిసింది" అని చెప్పారు.
అటవీ సమీప గ్రామాల వద్ద ఏనుగులు, ఇతర వన్యప్రాణుల సంచారం తెలుసుకునేందుకు సాంకేతిక పరిజ్ణానం వినియోగిస్తున్నారు. వాటితో పాటు అడవి జంతుల వల్ల గ్రామస్తులకు ఇబ్బంది లేకుండా ముందుజాగ్రత్తలు తీసుకుంటున్నామని ఎప్ఆర్ఓ నారాయణ స్పష్టం చేశారు.