
Exclusive | చిత్తూరులో బర్డ్ ఫ్లూ: వైరస్ మూలాలు హైదరాబాదులోనే..?
సదుం తరువాత కార్వేటినగరంలో వేయ్యి కోళ్లు మృతి.
చిత్తూరు జిల్లాలో రెండు చోట్లే ఎఫెక్ట్.
సదుం తరువాత..
కార్వేటినగరంలో నాటు కోళ్ల మరణం
ఒకే సంస్థ నుంచి కోడిపిల్లలు..
తమిళనాడు నుంచి ఫీడ్.
మూలాలు గుర్తించిన పశుసంవర్ధక శాఖ
చిత్తూరు జిల్లాలోని పుంగనూరు నియోజకవర్గం నుంచి వైరస్ సోమవారం చిత్తూరు జీడీ. నెల్లూరుకు విస్తరించింది. కార్వేటినగరం మండలం Rkvb పేటలో సోమవారం వెయ్యి నాటు కోళ్లు చనిపోయాయి. ఒకే సంస్థ నుంచి కోడిపిల్లలు, ఫీడ్ అందిన కోళ్ల ఫారాలకు మాత్రమే వైరస్ సోకిందని కీలక ఆధారాన్ని పశుసంవర్థక శాఖ అధికారులు గుర్తించారు. ఏటా ఫిబ్రవరిలో బర్డ్ ఫ్లూ పంజా విసరడం వల్ల వేసవిలో కోడి మాంసం, గుడ్డు ధర పెరిగే పరిస్థితి ఏర్పడుతోంది.
"హైదరాబాద్ నుంచి చిప్స్ (కోడి పిల్లలు), తమిళనాడులోని ఈరోడ్ నుంచి ఫీడ్ ఒకే వ్యక్తుల నుంచి అందినట్లు మా అధికారుల పరిశీలనలో తేలింది" అని కార్వేటినగరం వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ కొత్తింటి గోపి 'ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్' ప్రతినిధికి చెప్పారు.
"వెయ్యి నాటు కోళ్లు చనిపోవడం వల్ల తనకు తీరని నష్టం కలిగింది" అని కార్వేటినగరం మండలం ఆర్కేవిబీ. పేటకు చెందిన కోళ్ల ఫారం నిర్వాహకుడు గోపి ఆవేదన వ్యక్తం చేశారు.
పౌల్ట్రీ రంగంలో చిత్తూరు కీలకం...
చిత్తూరు కేంద్రంగా రాయలసీమలో కోళ్ల పరిశ్రమ విస్తరించడానికి డాక్టర్ సుందర నాయుడు బీజం వేశారు. ఫలితంగానే చిత్తూరులో నెక్ రీజనల్ కార్యాలయం ఏర్పాటుకు కూడా ఆయన కారణమయ్యారు. దీంతో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పౌల్ట్రీ పరిశ్రమపై ఆధారపడి వేల కుటుంబాలు జీవిస్తున్నాయి. హేచరీస్ కూడా పదుల సంఖ్యలో ఏర్పాటయ్యాయి.
పలమనేరు నియోజకవర్గంలో సుమారు 200 మందికి పైబడే కోళ్ల ఫారాలు నిర్వహిస్తున్నారు. మదనపల్లి, పుంగనూరు, చిత్తూరు, జీడీ నెల్లూరు నియోజకవర్గాల్లో కోళ్ల ఫారాలు నిర్వహించే వారి సంఖ్య సుమారు 1000 కి పైబడే ఉంటుందని అంచనా.
జిల్లాలో ఏటా పదిలక్షల ఫారం కోళ్లు, ఏడు లక్షల కోళ్ల పెంపకం జరుగుతున్నట్టు పౌల్ట్రీ రంగా అని పడలో చెబుతున్నారు. జిల్లాలో 37089 మెట్రిక్ టన్నుల కోళ్ళు, 10.73 లక్షల కోడిగుడ్లను హేచరీస్, కోళ్ల ఫారాలు నిర్వహించే రైతులు ఉత్పత్తి చేస్తున్నారు. అంటే సుమారు పదివేల మంది రైతులు ఈ పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్నారని చెబుతున్నారు. దేశంలో పౌల్ట్రీ రంగంలో గుర్తింపు పొందిన చిత్తూరు జిల్లా బర్డ్ ఫ్లూ, అసైనిటీస్ వైరస్ వల్ల చతికిలబడుతోంది.
"ప్రతి సంవత్సరం వేసవి కాలానికి ముందే ఎందుకు వస్తుందో అర్థం కావడం లేదు" అని పలమనేరు నియోజకవర్గం పెద్దపంజాణి మండలం రాయలపేటకు చెందిన ఐరాల సుధాకర్ సందేహం వ్యక్తం చేశారు.
"ఫ్లూ అంతే జలుబు. శీతాకాలంలోనే ఇది సోకుతుంది. కోళ్లఫారాల్లో నిర్దిష్ట ఉష్ణాగ్రతలు పాటించకుంటే ఇది సాధారణంగా సోకుతుంది" అని కార్వేటినగరం వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ కొత్తింటి గోపి వివరించారు.
సదుం నుంచి ప్రారంభమై..
మదనపల్లి అన్నమయ్య జిల్లా కర్ణాటకకు సరిహద్దుల్లో విస్తరించి ఉంది. పుంగనూరు నియోజకవర్గం సదుం మండలం పుట్టవారిపల్లి, కంభంవారిపల్లి, అమ్మగారిపల్లెలో కోళ్ల ఫారాల్లో దాదాపు 28 వేల కోళ్లు వైరస్ ప్రభావంతో చనిపోయాయి. సమాచారం అందగానే పశుసంవర్ధక శాఖ అధికారి గుణశేఖర్ గ్రామాన్ని సందర్శించారు. భోపాల్ లోని హై సెక్యూరిటీ ల్యాబ్ కు శాంపిల్స్ పంపిస్తే బర్డ్ ఫ్లూ అని తేలింది. 8 ర్యాపిడ్ రెస్పాన్స్ బృందాలతో స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ పద్ధతులతో చనిపోయిన కోళ్లను ఖననం చేయించారు. కంభంవారిపల్లె ఫారంలో చనిపోయిన కోళ్లకు సంబంధించిన శాంపిల్స్ ఇంకా అందలేదు.
"బర్డ్ ఫ్లూ వల్ల మానవాళికి ఇబ్బంది జరగకుండా చర్యలు తీసుకున్నాం. ఈ గ్రామాల నుంచి కోళ్లను ఇతర ప్రాంతాలకు తరలించకుండా కూడా నిఘా ఉంచాం" అని అన్నమయ్య మదనపల్లి జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ స్పష్టం చేశారు. కోళ్లకు పరిహారం చెల్లిస్తామని కూడా ఆయన భరోసా ఇచ్చారు.
"కోళ్లు చనిపోతే నష్టం మాకు. వ్యాపారం బాగుంటే లాభాలు హేచరీస్ యజమానులకు లబ్ధి పొందుతున్నారు" అని కోళ్ల ఫారం రైతు ఐరాల సుధాకర్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పరిహారంపై టర్నరీ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ కొత్తింటి గోపి ఏమన్నారంటే...
"వైరస్ వల్ల చనిపోయిన కోళ్లు పరిహారం రాదు. మిగతా కోళ్లకు సోకకుండా ప్రొటోకాల్స్ ప్రకారం ఖననం చేసే కోడి వయసు ఆధారంగా పరిహారం ఉంటుంది. కార్వేటినగరంలో చనిపోయినవి 80 రోజుల వయసున్న నాటు కోళ్లు. కిలోకు రూ.150 పరిహారం అందుతుంది. 30,40 రోజుల ఆధారంగా పరిహారంలో మార్పు ఉంటుంది" అని డాక్టర్ గోపీ వివరించారు.
కార్వేటినగరానికి విస్తరణ
చిత్తూరు జిల్లాలోని తూర్పు ప్రాంతాలు తమిళనాడుకు సరిహద్దులో ఉంటాయి. బర్డ్ ఫ్లూ వైరస్ ఇతర ప్రాంతాలకు విస్తరించకుండా జాగ్రత్తలు తీసున్నట్లు అన్నమయ్య జిల్లా కలెక్టర్ శశాంక్ కుమార్ చెప్పారు. ఈ వైరస్ చిత్తూరు జిల్లా జీడీ. నెల్లూరుకు విస్తరించింది. ఈ నియోజకవర్గంలో దాదాపు 200 మంది రైతులు కోళ్ల ఫారాలు నిర్వహిస్తున్నట్లు అంచనా. కార్వేటినగరం మండలంలో కోళ్ల ఫారాలు ఎక్కువగా ఉన్నాయి. Rkvb పేట సమీపంలోని కోళ్ల ఫాంలో వెయ్యి నాటు కోళ్లు సోమవారం చనిపోయాయి. దీంతో చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్ స్పందించారు.
"డిపిఓ, డిఎంహెచ్వో, పశుసంవర్ధక శాఖ అధికారులను అప్రమత్తం చేసాం. చనిపోయిన కోళ్ల అవశేషాలను భోపాల్ కు పంపించాం"అని కలెక్టర్ సుమిత్ కుమార్ చెప్పారు. ప్రజారోగ్యానికి ఇబ్బందులు లేకుండా అన్ని భద్రత చర్యలు తీసుకుంటునట్లు కూడా స్పష్టం చేశారు.
మూలాలు ఆ రాష్ట్రాల్లోనే..
చిత్తూరు జిల్లాలో సదుం, కార్వేటినగరం మండలం Rkvb పేటలో బర్డ్ ఫ్లూ వైరస్ విస్తరించింది. ఆ మూలాలు హైదరాబాద్, తమినాడులోని ఈరోడ్ లో ఉన్నట్లు పశుసంవర్థక శాఖాధికారులు గుర్తించారు. సదుం, జిల్లాలోని మిగతా ప్రాంతాల్లో ఆ సమస్య లేదని వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ కొత్తింటి గోపి చెప్పారు.
"సదుం మండలంలో కోళ్ల ఫారాలకు, కార్వేటినగరంలోని ఆర్కేవీబీ పేటలోని ఫాంకు కూడా హైదరాబాద్ లోని INDBRO సంస్థ నుంచి కోడిపిల్లలు అందించారు. తమిళనాడులోని ఈరోడ్ నుంచి ఫీడ్ ఓకే వ్యక్తి నుంచి అందింది" అని డాక్టర్ గోపి వివరించారు.
"తమిళనాడులో వైరస్ ఎక్కువగా ఉంది. ఈ రెండు సంస్థల వాహనాలు ఈ ప్రాంతానికి రావడం. అనారోగ్యంతో ఉన్న వారు రావడం వల్ల కోళ్లకు వైరస్ సోకిందా? అనే విషయంలో పరిశీలన చేస్తున్నాం" అని డాక్టర్ గోపీ వివరించారు. కార్వేటినగరం మండలం Rkvb పేటలో పది రోజుల కిందట కొన్ని కోళ్లు మరణించాయి. వాటిని తిరుపతిలోని పశుసంవర్థక శాఖ ఆస్పత్రికి తీసుకుని వచ్చిన గోపీ పరీక్షలు చేయించారు.
"ఆ కోళ్లకు లింఫాయిడ్ ల్యూకోసిస్ సోకిందని నిర్ధారించారు. మినహా బర్డ్ ఫ్లూను గుర్తించలేకపోయారు" అని డాక్టర్ గోపీ వివరించారు. లేదంటే, ఈ సమస్య ఎక్కువయ్యేది కాదని కూడా ఆయన అభిప్రాయపడ్డారు.
ఫిబ్రవరిలోనే ఎందుకు?
పౌల్ట్రీ రంగానికి ఫిబ్రవరి నెల ఓ శాపంగా మారింది. ప్రతి సంవత్సరం ఇదే నెలలో బర్డ్ ఫ్లూ సోకుతోంది. 2024 ఫిబ్రవరిలో నెల్లూరు జిల్లాలో ప్రారంభమైన వైరస్ చిత్తూరుకు విస్తరించింది. 2025 ఫిబ్రవరిలో ఉభయ గోదావరి జిల్లాల్లో h5 N1 వైరస్ నిర్ధారణ అయింది. గోదావరి జిల్లాలతో పాటు ఏలూరులో కూడా జనవరి 13వ తేదీన మొదలైన వైరస్ ప్రభావం వల్ల ఐదు లక్షల కోల్డ్ వరకు చనిపోయాయి. ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలోని పౌల్ట్రీ పరిశ్రమ కుదలైంది. తాజాగా మళ్లీ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పుంగనూరు నుంచి గంగాధర నెల్లూరు కు విస్తరించడం పై కోళ్ల ఫారాలు నిర్వహించే రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. 2021 నుంచి కేంద్ర ప్రభుత్వం యాక్షన్ ప్లాన్ కోళ్ల పరిశ్రమలను ఆదుకోవడానికి కార్యాచరణ ప్రకటించింది. అందులో
"పశు వైద్యులతో పరిశీలించడం, రేపిడ్ రెస్పాన్స్ టీమ్స్ ఏర్పాటు. ppe కిట్లు, మందులు అందుబాటులో ఉంచుకోవడం. ప్రజారోగ్యం కాపాడడం" అనేవి కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నిబంధులు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నాయని రైతు సాధికార మాసపత్రిక ఏరువాకలో 2025 మార్చి 20వ తేదీ స్పష్టం చేశారు.
వేసవికి ధరలు పెరుగుతాయి?
ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నెలలో వస్తున్న ఈ సంక్షోభం వల్ల కోళ్ల పెంపకాలపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. హేచరీస్ నుంచి కోడి పిల్లలు అందించడం కూడా ఆలస్యం కావడం వల్ల వాటిని పెంచడం కూడా సాధ్యం కావడం లేదు. దీనిపై రాయలపేటకు చెందిన ఐరాల సుధాకర్ ఏమంటారంటే..
"ఏటా 5, ఆరు విడతలుగా కోళ్ల పెంపకానికి ఆస్కారం ఉంటుంది. పౌల్ట్రీ పరిశ్రమలు కోడి పిల్లలు, ఫీడ్ అందిస్తాయి" అని సుధాకర్ చెప్పారు. హేచరీస్ యజమానులే కొనుగోలుదారులను తీసుకువచ్చి కోళ్లను కొనుగోలు చేయిస్తారని ఆయన చెబుతున్నారు.
'ఫారం లోని కోళ్లు బాగా ఉంటే కేజీల లెక్కన 5 లేదా 6 రూపాయల వంతున చెల్లిస్తారు. మూడు సంవత్సరాల కిందట కిలోకు మూడు రూపాయలు చెల్లించారు" అని సుధాకర్ వివరించారు.
మాకు నష్టాలే..
జిల్లాలోని కోళ్ల పరిశ్రమల నిర్వాహకులు ఫారాలు నిర్వహించే రైతులకు కోడి పిల్లలను అందిస్తారు. ఆరోగ్యంగా ఉన్న కోళ్లు మాత్రమే బయ్యర్ల ద్వారా హేచరీస్ యాజమాన్యాలు కొనుగోలు చేయిస్తాయి. వైరస్, లేదా ఇతర కారణాలతో చనిపోయే కోళ్లకు పరిహారం ఉండదు. హేచరీస్ ప్రతినిధులు కూడా పైసా కూడా ఇవ్వరు. దీంతో ఆ నష్టాలను రైతులే భరించాల్సి వస్తోంది.
ఉదాహరణకు పెద్ద షెడ్డు ఉంటే పదివేల వరకు కోళ్ల పెంపకానికి ఆస్కారం ఉంటుంది. కోళ్లు విక్రయించే సమయానికి కనీసం 50 నుంచి 60 కోళ్లు చనిపోతూ ఉంటాయి. ఆ నష్టాన్ని కోళ్ల ఫారం నిర్వాహకులే భరించాల్సిన పరిస్థితి ఉంని సుధాకర్ వేదన చెందారు.
కుంటి కోళ్లకు ధర తక్కువ
నిర్వహించే రైతులు అనేక రకాలుగా నష్టపోతున్నారు. చనిపోయిన కోళ్ల భారం రైతులపైనే పడుతుంటే, మరో సమస్య కూడా వారిని వెంటాడుతోంది. హేచరీస్ నుంచి చిన్నపిల్లలను రైతులకు అందిస్తారు. వాటి స్థితి ఎలా ఉంటుందనేది అప్పుడు కనుక్కోవడం కష్టం. 40 నుంచి 45 రోజుల తర్వాత ఆ కోళ్లు విక్రయించే సమయంలో కాళీ ఉంటే (week hen) ధర పడిపోతుంది. ఆ నష్టం కూడా రైతు పైన పడుతుంది. సాధారణంగా ఒక కోడి బరువు 2.5 కిలోలు ఉంటుంది. వీక్ కోడి అయితే ఆ బరువును 1.3/4 కిలోలుగానే పరిగణలోకి తీసుకుంటారు.
"దీని వల్ల కూడా కోళ్ల ఫారాల రైతులు నష్టపోతున్నారు" అని సుధాకర్ తమ స్థితిని వివరించారు.
చాలా కోళ్ల ఫారాలు ఖాళీ..
చిత్తూరు జిల్లాలో ప్రధానంగా పౌల్ట్రీ పరిశ్రమకు కేంద్ర బిందువుగా ఉన్న పలమనేరు, పూతలపట్టు, చిత్తూరు నియోజకవర్గాల్లో కొన్ని కోళ్ల ఫారాలు ఖాళీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పెంపకం కేంద్రాల నుంచి కోళ్లు కొనుగోలు చేసిన తర్వాత హేచరీస్ సకాలంలో పిల్లలు ఇవ్వడంలేదని రైతులు చెబుతున్నారు. ఇది వేసవి కాలానికి ముందే జరుగుతున్నందువల్ల సకాలంలో ఉత్పత్తి జరగని స్థితిలో పెరగడానికి కూడా ఆస్కారం కల్పిస్తున్నట్లు రైతులు విశ్లేషిస్తున్నారు.
Next Story

