Adulterated ghee | షోలాపూర్ కి చేరిన వెంకన్న పంచాయతీ..!
x

Adulterated ghee | షోలాపూర్ కి చేరిన 'వెంకన్న' పంచాయతీ..!

వైసీపీ వ్యూహాత్మక దాడి... వివాదం సాగదీతకేనా?


శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి వాడిన కల్తీ నెయ్యి వ్యవహారం తిరుమల ఏడుకొండలను తలపిస్తూ, మలుపులు తిరుగుతోంది. నెయ్యిలో గొడ్డు కొవ్వు, చేప నూనె కాకుండా, రసాయనాలు, పామోలిన్ కారకాలు ఉన్నాయనే సీబీఐ నివేదిక వైసీపీ అస్త్రంగా మార్చుకుంది. ఇది టిడిపి కూటమిని ఆత్మరక్షణలో పడేసింది. ఈ అంశాన్ని అనుకూలంగా మలుచుకునేందుకు ఎదురుదాడి ప్రారంభించిన వైసీపీ మహారాష్ట్రలోని పూణే సమీపంలోని షోలాపూర్ వద్ద ఉన్న ఇందపూర్ పాల పరిశ్రమ, ఆ సంస్థతో (Contract Manufacturing) ఒప్పందం చేసుకున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు కుటుంబీకుల పాల పరిశ్రమ పేరును తెరపైకి తెచ్చారు. దీని వెనుక వైఎస్. జగన్ దీర్ఘకాలిక వ్యూహాత్మక ఎత్తుగడ ఉన్నట్లు రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు కుటుంబానికి చెందిన పాల పరిశ్రమకు వ్యతిరేక వార్తలు, లింకులు తొలగించాలనే సుప్రీం కోర్టు గ్యాగ్ ఆర్డర్ వైసీపీ ( YCP )ఎదురుదెబ్బ తగిలినట్టే కనిపిస్తోంది
"కల్తీ నెయ్యి వ్యవహారంలో వైసీపీ అడ్డగోలు మాటలు సరైనవి కావు" అని టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు ఓ.వి. రమణ కూడా ఓ డిబేట్ లో అభ్యంతరం చెప్పారు. అగ్ మార్క్ నెయ్యి కొనుగోలుకే టీటీడీ ప్రాధాన్యత ఇస్తుందని ఆయన గుర్తు చేశారు. ఇందాపూర్ డెయిరీ అందించిన నెయ్యి కల్తీ జరిగిందా? లేదా? తేల్చండని ఆయన వైసీపీని నిలదీశారు.

నెయ్యి కేసు ఇదీ..

2024 సెప్టెంబర్ 18వ తేదీ నుంచి టిడిపి కూటమి, వైసిపి రాజకీయ రగడకు తిరుమల కేంద్ర బిందువుగా మారింది.
"తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో గొడ్డు కొవ్వు, చేప నూనె తోపాటు ఇతర పదార్థాలను కల్తీ చేశారు" అనేది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు చేసిన ఆరోపణ తో తీవ్ర కలకలం చెలరేగింది. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై 15 నెలలపాటు సుధీర్ఘంగా దర్యాప్తు చేసిన సిబిఐ (Central bureau of investigation CBI) సారధ్యంలోని సిట్ ( special investigation team SIT) Nellore ACB కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసింది.
"సీబీఐ చార్జిషీట్ లో 36 మంది నిందితులను గుర్తించినట్లు స్పష్టం చేసింది. అందులో 12 మంది టీటీడీ ( TTD ) ఉద్యోగులు ఉన్నారు" అని అభియోగపత్రంలో ప్రస్తావించింది. ఇంకా ఏమి చెప్పిదంటే..
"2019 నుంచి 2024 వరకు కల్తీ నెయ్యితో 20 కోట్ల లడ్డులు తయారు చేశారు.ఈ నెయ్యి సరఫరా చేసిన పాల డెయిరీలకు ఎలాంటి ఆవులు లేవు. పాలు సేకరించకుండా, వెన్న ఉత్పత్తి లేని సంస్థలే. ఈ నెయ్యితో 1.61 కోట్ల కిలోల నెయ్యి కొనుగోలు చేస్తే, అందులో 68 లక్షల కిలోల నెయ్యిలో 40 శాతం పామోలిన్, పామ్ కెర్నల్ ఆయిల్, ఇతర రసాయనాలు ఉన్నాయి" అనేది సీబీఐ సారధ్యంలోని సిట్ (SIT )తేల్చిన అంశాలు.
తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం (Tirumala srivari laddu prasadam) తయారీలో వాడిన నెయ్యిలో కల్తీ జరిగింది (Ghee adulteration). ఇందులో చేప నూనె, గొడ్డు కొవ్వు ప్రస్తావన లేకపోవడంపై వైసీపీ అనుకూలంగా మలుచుకుని టిడిపి కూటమి ప్రభుత్వంపై దాడి ప్రారంభించింది.
"కల్తీ నెయ్యి కేసులో ఎక్కడా సీబీఐ వైసీపీకి క్లీన్ చిట్ ఇవ్వలేదు" అని టీటీడీ బోర్డు చైర్మన్ బీఆర్. నాయుడు తెగేసి చెబుతున్నారు.
"శ్రీవారి యాత్రికుల మనోభావాలను దెబ్బతీస్తున్నారు. రాజకీయంగా వైఎస్. జగన్ ను అణిచివేసే ప్రయత్నం చేస్తున్నారు. జరగని కల్తీని జరిగినట్లు అకారణంగా నిందలు మోపారు" అని వైసిపి అధికార ప్రతినిధి, టిటిడి మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తో సహా ఆ పార్టీ నాయకులు ఎదురుదాడి ప్రారంభించారు. ఆయన మాటలు అలా ఉంటే..
"తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదంలో కల్తీ జరిగింది" అనే విషయాన్ని 2019 నుంచి 24 వరకు టిటిడి చైర్మన్గా పనిచేసిన వైసిపి రాజ్యసభ వైవి.సుబ్బారెడ్డి అంగీకరించినట్లు మీడియాలో కథనాలు వచ్చాయి.
"ఈ విషయాన్ని తెరమరుగు చేసే విధంగా వైసీపీ ప్రభుత్వ కాలంలో తిరుమల లడ్డు తయారీకి వాడిన నెయ్యిలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపించినట్లు జరగలేదనే విషయం స్పష్టమైంది" అని వైసీపీ నేతలు విరుచుకుపడుతున్నారు.

షోలాపూర్ కు వ్యాపించిన ప్రకంపనలు

తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారం 18 నెలలుగా సాగుతోంది. సీబీఐ చార్జిషీట్ దాఖలు చేసిన తరువాత వైసీపీ మాటల వేడి పెంచింది. ఇన్నాళ్లు ఆరోపణలు, ప్రత్యారోపణలతో సాగిన రాజకీయాలు ఒక్కసారిగా వెడెక్కాయి.
"మహారాష్ట్రలోని షోలాపూర్ సమీపంలోని ఇందాపూర్ డైరీ (Sonai Brand) నుంచి టీటీడీకి నెయ్యి సరఫరా చేస్తున్నా విషయం. దీనికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు కుటుంబీకుల సారధ్యంలో నిర్వహిస్తున్న పాల పరిశ్రమకు లింకులు ఉన్నాయి" అని వ్యూహాత్మక ఆరోపణలు చేసినట్లు రాజకీయ పరిశీలకులకు అంచనా వేస్తున్నారు.
మహారాష్ర్టలోని ఇందాపూర్ డైరీ 2014లో టీటీడికి నెయ్యి సరఫరా చేసింది. ఆ తరువాత టెండర్లకు అర్హత సాధించలేదు. మళ్లీ టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత టీటీడికి నెయ్యి అందిస్తున్న విషయంపై వైసీపీ చీఫ్, వైఎస్. జగన్, శాసనమండలిలో ఆ పార్టీ నేత బొత్స సత్యనారాయణ ఆరోపణలు సంధించారు.
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వ్యవహారం 18 నెలలుగా దేశంలోనే కాకుండా ప్రపంచంలోని శ్రీవారి భక్తుల మధ్య చర్చ జరుగుతోంది. ఇన్నాళ్లు సైలెంట్ గా ఉన్న వైసీపీ, సీబీఐ చార్జిషీట్ దాఖలు చేసిన తరువాత దొరికిన అవకాశాన్ని తనకు అనుకూలంగా మలుచుకునే యత్నంలో టీడీపీపై ఎదురుదాడి ప్రారంభించినట్లు పరిశీలకులు అంచనా వేస్తున్నారు.
"టీటీడీకి నెయ్యి సరఫరా చేసిన విధానం పై వైసీపీ నాయకులు ఇష్టానుసారంగా మాట్లాడడం సరైనది కాదు. మా పాలకమండలి వచ్చిన తర్వాత ఓపెన్ టెండర్లతో పారదర్శకంగా వ్యవహరించాం. వైసిపి ప్రభుత్వం లో యాత్రికుల మనోభావాలతో చెలగాటమాడిన అన్న ప్రసాదాల తయారీలో కూడా నాణ్యత పెంచడానికి ప్రాధాన్యత ఇచ్చాం" అని టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడు కౌంటర్ ఇచ్చారు. నెయ్యితో సహా అన్న ప్రసాదాల తయారీ, ఉప్పు నుంచి పప్పు, మసాలా దినుసుల నుంచి బియ్యం వరకు నాణ్యతకే ప్రాధాన్యత ఇచ్చామని నాయుడు గుర్తు చేశారు.

భూమన ప్రశ్నలు ఇవీ..

టీటీడీకి పూణే సమీపంలోని ఇందాపూర్ వద్ద ఉన్న సోనై బ్రాండ్ నెయ్యి సరఫరా చేసిన తీరుపై టీటీడీ మాజీ చైర్మన్, వైసీపీ అధికార ప్రతినిధి భూమన కరుణాకరరెడ్డి మీడియా వద్ద రెండు ప్రశ్నలు సందించారు.
"2015లో ఇందాపూర్ సంస్థ కిలో నెయ్యి రూ.278కే సరఫరా చేశారు. 2016లో ఆ సంస్థ డిస్ క్వాలిఫై అయింది" అని భూమన గుర్తు చేశారు. 2025 డిసెంబర్ 16వ తేదీ అదే సంస్థ నుంచి కిలో నెయ్యి రూ. 658కి కొనుగోలు చేయడం వెనుక తిరకాసు ఏమిటి? అనే ప్రశ్న లేవనెత్తారు.
2013 నుంచి 2019 వరకు ప్రీమియర్ అగ్రి డెయిరీ నుంచి కిలో రూ.300 వంతున 40 లక్షల కేజీల నెయ్యి కొనుగోలు చేశారు. ఇప్పుడు ఇందాపూర్ సంస్థకు అంత ధర ఇవ్వడం ఎలాసాధ్యమైంది" అని భూమన ధర్మసందేహాలు లెవనెత్తారు.

వ్యూహం వెనుక కారణం?

కల్తీ నెయ్యిపై ఇందాపూర్ పాల డెయిరీకి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు కుటుంబీకుల సారధ్యంలోని పాల పరిశ్రమకు అనుబంధంపై వైఎస్. జగన్ ఆరోపణలు తెరపైకి తీసుకుని రావడం వెనుక దీర్ఘకాలిక రాజకీయ వ్యూహంతోనే కొత్త వివాదం తెరపైకి తెచ్చినట్లు అంచనా వేస్తున్నారు.
తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంపై విచారణకు సీబీఐ 18 నెలలు సమయం తీసుకుంది. ఈ కేసు నెల్లూరు కోర్టులో ఇంకా విచారణ ప్రారంభం కాలేదు. ఈ పరిస్థితుల్లో ఈ వివాదం కొనసాగింపు దిశగానే వైఎస్. జగన్ ఇందాపూర్ డెయిరీని తెరపైకి తెచ్చినట్లు అంచనా వేస్తున్నారు. దీనివల్ల ఈ వివాదం కొంతకాలం సాగదీత ద్వారా టీడీపీ కూటమిని మరింత ఆత్మరక్షణలో పడేయాలనే వ్యూహంతోనే ఎత్తుగడ వేసినట్లు కనిపిస్తోంది. ఇది మరో ఏడాది వరకు సాగదీయడమే ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది.

ఎప్పటి వరకు.. .ప్రయోజనాలు..

తిరుమల లడ్డూ వివాదం ఇంకా కొన్నాళ్లు సాగే క్రమంలో వైసీపీ ఆందోళనలు మరింత ఉధృతం చేసే అవకాశం ఉన్నట్లు ఆ పార్టీ వర్గాల సమాచారం. కేసులు, అరెస్టులతో మరింత సానుభూతి లభిస్తుందని భావిస్తున్నట్లు తెలిసింది. ఈ కాలం ఇలా సాగితే, మరో ఏడాది గడవడం కష్టం ఏమీ కాదు.
"ఏడాది తరువాత జనంలోకి వస్తా. రూడ్లపై తిరుగుతా. పాదయాత్ర చేస్తా" అని వైసీపీ చీఫ్ వైఎస్. జగన్ తన కార్యాచరణ ఈపాటికే ప్రకటించిన విషయం తెలిసిందే. దీనివల్ల జనంలోకి వెళ్లి, టీడీపీ కూటమిపై రాజకీయ ఎదురుదాడి ప్రారంభించే లక్ష్యంలో భాగంగానే ఇందాపూర్ డెయిరీనీ తెరపైకి తెచ్చినట్లు అంచనా వేస్తున్నారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు కుటుంబీకులు నిర్వహిస్తున్న పాల కర్మాగారానికి ఇందాపూర్ డెయిరీ (Sonai Brand) సంస్థపై వైసీపీ సంధించిన ఆరోపణలు చర్చనీయాంశంగా మారాయి. ప్రస్తుతం సోనా బ్రాండ్ నెయ్యిని టీటీడీకి సరఫరా జరుగుతోంది. వైసీపీ ఆరోపణల పర్యవసానాలు ఎలా ఉండబోతాయనేది ఆ సంస్థ ప్రతిస్పందనపై ఆధారపడి ఉంది.
Read More
Next Story