
పులివెందుల 'ఆత్మపై'కి తిరగబడిన 'కుప్పం అస్త్రం'
ముప్పేట దాడి . ఇంటి పోరుకు తోడు జగన్ ముందు ఎన్నో సవాళ్లు..
కడప జిల్లా పులివెందులపై ముప్పేట దాడి ప్రారంభమైంది. కుప్పంపై వైసిపి ప్రయోగించిన అస్త్రాలే పులివెందుల వైపు తిరగబడ్డాయి. ఉమ్మడిగా టిడిపి. జనసేన, పీసీసీ చీఫ్, స్వయాన చెల్లెలు షర్మిలారెడ్డి నుంచి వైఎస్. జగన్ కు సవాళ్లు ఎదురవుతున్నాయి. సభ్యత్వ నమోదుతో జనసేన పార్టీ పులివెందులలో ఆధిపత్యం కోసం రంగంలోకి దిగింది. స్థానిక సంస్థల పోరు తరువాత ఈ పరిణామాలు రానున్న ఎన్నికల నాటికి ఎన్ని మలుపులు తిరుగుతాయనే ఉత్కంఠకు తెర తీసింది.
"వైసీపీది రప్పా.. రప్పా సిద్ధాంతం. పులివెందులలో జనసైనికులు జనసేన జెండాను రెపరెపలాడిస్తున్నారు" అని జనసేన నేత టీసీ. వరుణ్ వ్యాఖ్యానించారు.
రాయలసీమలో రెండు నియోజకవర్గాలు కీలకం. చిత్తూరు జిల్లా కుప్పం 1983 నుంచి టీడీపీకి, 1978 నుంచి కడప జిల్లా పులివెందుల వైఎస్. రాజశేఖరరెడ్డి, ఆయన కుటుంబీకులకు 12 ఎన్నికల నుంచి అడ్డాగా నిలిచింది. కుప్పంలో 1989 నుంచి నారా చంద్రబాబును వరుసగా ఎనిమిదోసారి ఎమ్మెల్యేగా గెలిపించారు.
రాజకీయ ప్రాధాన్యత కలిగిన పులివెందుల పరిస్థితుల్లోకి వెళ్లే ముందు..
"పులివెందుల అనగానే వైఎస్ఆర్ గుర్తుకు వస్తారు. ఓ రకంగా చెప్పాలంటే ఈ ప్రాంతం వైఎస్ఆర్ ఆత్మతో సమానం. నాయకులు తటస్థంగా ఉండవచ్చుగాక, ప్రత్యర్థులు పాగా వేయడం అంత సులువు కాకపోవచ్చు" అని ఓ కార్మిక సంఘం నేత విశ్లేషించారు.
కుప్పంపై వైఎస్ఆర్ ఫోకస్..
రాష్ట్ర రాజకీయాలను రాయలసీమ ప్రాంత నేతలే నిర్దేశిస్తున్నారు. కడప జిల్లా పులివెందుల నుంచి వైఎస్. రాజశేఖరరెడ్డి, ఆ తరువాత జగన్, చిత్తూరు జిల్లా కుప్పం నుంచి నారా చంద్రబాబు కీలక నేతలుగా మారారు. కుప్పంపై పట్టు కోసం వైఎస్ఆర్ కాలం నుంచి ప్రారంభమైన యత్నాలు సాగుతున్నా ఫలించలేదు. కుప్పంలో బలమైన క్యాడర్, నాయకత్వాన్ని పటిష్టం చేసుకున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు రాజకీయ వ్యూహం ముందు వైఎస్ఆర్ చతురత ఫలించలేదు. జగన్ జమానాలో కూడా అదే పరిస్థితి.
టిడిపి ఆవిర్భావం తర్వాత 1983, 1985 ఎన్నికల్లో రంగస్వామి నాయుడు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 1989 ఎన్నికలలో కుప్పం రాజకీయ తెరపైకి వచ్చిన నారా చంద్రబాబు 2024 ఎన్నికల వరకు ఎనిమిది సార్లు వరుసగా విజయం సాధించడం, నాలుగోసారి ముఖ్యమంత్రిగా ఆ నియోజకవర్గం నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ పరిస్థితిని గమనిస్తే,
కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు, టీడీపీ సొంతం చేసుకున్న ఓటర్లు మరొకరిని ఆదరించలేమనే విధంగా తీర్పు ఇస్తున్నారు. కుప్పం నుంచి 1989 మొదటిసారి పోటీ చేసిన నారా చంద్రబాబు 6,918 ఓట్ల మెజారిటీతో ప్రారంభించిన జైత్రయాత్రలో వైఎస్ఆర్ ఆశీస్సులతో 1983, 1989 దొరస్వామి నాయుడు కాంగ్రెస్ అభ్యర్థిగా 24,500, 43,180 ఓట్లు సాధించి గట్టి పోటీ ఇచ్చారు. 1994 ఎన్నికల్లో ఆర్. గోపీనాథ్ 24,622 ఓట్లు, మూడుసార్లు వరుస పరాజయాలతో సుబ్రహ్మణ్యం రెడ్డి 1999 ఎన్నికల్లో 27601 ఓట్లు, 2004లో 38,535, 2009లో 43 866 ఓట్లు సాధించి దీటుగా నిలిచారు.
కాంగ్రెస్ హవాలోనూ..
కుప్పం నుంచి 1989లో 6918 మెజారిటీతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ప్రారంభించిన విజయం 1994లో 56,588, 1999లో 65,687 మెజారీటీ సాధించారు. వైఎస్ఆర్ సారథ్యంలోని కాంగ్రెస్ పార్టీ పవనాలు బలంగా ఉన్నా, నారా చంద్రబాబు 2004లో 59,588, 2009లో 46,066 మెజార్టీ సాధించారు. 2014 ఎన్నికల్లో నారా చంద్రబాబు 47,121 ఓట్లు సాధించినా, 2019లో ఆ మెజార్టీ భారీగా 30,722 కు పడిపోయింది. వైఎస్ఆర్ మరణం తర్వాత ఆయన కొడుకు వైఎస్ జగన్ సారథ్యంలోని వైసిపి పెద్ద సవాల్ ఎదురైంది.
'వై నాట్ కుప్పం'
2014 తో పోలిస్తే 2019 ఎన్నికల్లో వైసిపి ప్రయోగించిన ఆపరేషన్ వై నాట్ కుప్పం ( YCP Operation Why Not Kuppam ) అస్త్రం చంద్రబాబు మెజారిటీ తగ్గించడమే కాదు. ఆందోళనకు కూడా గురి చేసిందనే విషయం ఇక్కడ కనిపిస్తుంది. ఈ ఆపరేషన్ ఆ బాధ్యతలు పుంగునూరు ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి, ఆయన కొడుకు రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి స్వయంగా పర్యవేక్షించారు. అందులో భాగంగా బీసీ అజెండాతో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కే .చంద్రమౌళిని 2014 ఎన్నికల్లో రంగంలోకి దించడంతో 55,831, 2019 ఎన్నికల్లో 69,424 ఓట్లు సాధించడం టిడిపికి ప్రధానంగా నారా చంద్రబాబుకు మింగుడు పడలేదు. చంద్రమౌళి అనారోగ్యంతో మరణించిన తర్వాత ఆయన కొడుకు, ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్సీ కెఆర్.జే భరత్ ను 2024 ఎన్నికల్లో వైసీపీ తెరపైకి తెచ్చింది. ఊహించని విధంగా 73,923 ఓట్లు సాధించడం ద్వారా గట్టి సవాల్ విసిరారు. కుప్పంలో ఈ మూడు ఎన్నికల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబుకు గట్టి పోటీ ఎదురైంది.
2019, 2024 ఎన్నికల్లో
"చంద్రబాబు కుప్పం నుంచి ఓటమి చెందే అవకాశం ఉంది" అనే విధంగా రాజకీయ ప్రకంపనలు కనిపించాయి. దీంతో ఎన్నడూ లేని విధంగా నారా చంద్రబాబు, ఆయన కొడుకు నారా లోకేష్, భార్య నారా భువనేశ్వరి కుప్పం బాట పట్టాల్సిన అనివార్యమైన పరిస్థితిని వైసిపి కల్పించింది. కుప్పం ప్రజలు టిడిపిని ఆదరించి, చంద్రబాబు జైత్రయాత్రకు అండగా నిలిచారు. ఈ అనుభవాలతో టీడీపీకి తోడు జనసేన కూడా అవకాశం కోసం నిరీక్షించింది. తమ పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ ను వ్యక్తిత్వ హననానికి పాల్పడన వైసీపీపై ప్రతీకారం తీర్చుకోవాలని ఎదురు చూస్తున్న జనసేన ( Janasena) శ్రేణులకు సభ్యత్వ నమోదును అవకాశంగా మలుచుకున్నారు.
పులివెందుల రాజకీయ ముఖచిత్రాన్ని పరిశీలిస్తే 1978 నుంచి వైఎస్ఆర్ కుటుంబీకులే 12 ఎన్నికల నుంచి విజయం సాధించడం ద్వారా తమ ఆధిపత్యాన్ని చాటుకుంటున్నారు.
పులివెందుల వైపు తిరిగిన బాణాలు..
కుప్పంలో కాంగ్రెస్ నేతగా వైఎస్ రాజశేఖరరెడ్డి, వైసిపి చీఫ్ గా జగన్ అమలు చేసిన ఆపరేషన్ సక్సెస్ కాకున్నా, సత్తా చాటడం ద్వారా ప్రత్యర్థికి సవాల్ విసిరారని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ఆ పరిస్థితి పులివెందులలో పునరావృతమైంది.
పులివెందుల నుంచి 1978లో వైఎస్.రాజశేఖరరెడ్డి వరుసగా మూడుసార్లు గెలిచారు. 1999 నుంచి 2009 వరకు మరో మూడు సార్లు గెలిచారు. 1989లో ఆయన తమ్ముడు వైఎస్ వివేకానందరెడ్డి, 1991లో వైఎస్సార్ చిన్నాన్న వైఎస్. పురుషోత్తంరెడ్డి, గెలిచారు. ఆయన మరణం తర్వాత వైఎస్సార్ భార్య వైఎస్. విజయమ్మ, వైసిపి ఏర్పడిన తర్వాత 2014 నుంచి 2024 వరకు వరుసగా వైఎస్ జగన్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
"నాటి వైఎస్ఆర్ వెంట ఉన్న నేతలు జగన్ వెంట లేకపోవడం ఓ మైనస్" అని పులివెందుల ప్రాంతానికి చెందిన సీనియర్ జర్నలిస్టు శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో టీడీపీ నేతల్లో అంతర్గత పోరు కూడా లేకపోలేదని ఆయన గుర్తు చేశారు. ప్రస్తుత పరిస్థితి కొనసాగితే గడ్డు కాలానికి చేరువ అవుతున్నట్లే కనిపిస్తోంది, ఎన్నికల నాటికి ఓ అద్భుతం జరిగే అవకాశం లేకపోలేదు" అనేది శ్రీనివాసులురెడ్డి విశ్లేషణ.
టీడీపీకి కలిసిసొచ్చే అంశాలు
పులివెందుల నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్సీ మా రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి ( బీటెక్ రవి), స్థానిక సంస్థల ఎమ్మెల్సీ రాంభూపాలరెడ్డి పోరు సాగిస్తున్నారు. ఇన్నేళ్లు వైఎస్ఆర్ అమలు చేసిన తరహాలోనే టీడీపీ నేతలు వేసిన జెడ్పీటీసీ ఉప ఎన్నికలో అమలు చేసిన వ్యూహంతో జగన్ కు మొదటిసారి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. జెడ్పీటీసీ సభ్యురాలిగా మాజీ ఎమ్మెల్సి బి.టెక్ రవి భార్య విజయం సాధించారు. ఈ ఉపఎన్నిక బై పోల్ వైసీపీ బహిష్కరించే పరిస్థితి ఏర్పడింది.
"పోలీసుల అండతో టీడీపీ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసింది" అని కడప ఎంపీ వైఎస్. అవినాష్ రెడ్డి ఉక్రోషం వ్యక్తం చేశారు. ఎదురులేని ఊర్లో వైఎస్ఆర్ కుటుంబానికి ఇది గట్టి దెబ్బ తగిలిందనేది పరిశీలకుల అంచనా.
"వైఎస్ఆర్ కు తమ్ముడు వివేకానందరెడ్డి అన్ని వ్యవహారాలు చక్కదిద్దేవారు. జగన్ కు ఆ పరిస్థితి తక్కువ. ఎంపీ అవినాష్ రెడ్డి మాత్రమే ఉన్నారు. ఇది చాలడం లేదు. వైఎస్ కు వెన్నంటి తిరిగిన నేతలను బిటెక్ రవి చేరదీయడం ద్వారా టీడీపీ బలం పుంజుకుంటున్నట్లు కనిపిస్తోంది" అని ప్రొద్దుటూరు ప్రాంతానికి చెందిన సీనియర్ జర్నలిస్టు చెప్పారు. ఈ పరిస్థితుల్లో..
జనసేన రంగప్రవేశం..
ఇదే అవకాశంగా పులివెందుల వైపు జనసేన దృష్టి సారించింది. పార్టీని సంస్థాగతంగా పటిష్టం చేసుకునే దిశగా సభ్యత్వ నమోదు ప్రారంభానికి నిర్వహించిన ర్యాలీ, సభ రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. పులివెందుల నియోజకవర్గ పీఓసీ హరీష్ నిర్వహించిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర హస్తకళల సంస్థ చైర్మన్ డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ తోపాటు కడప పార్లమెంట్ జనసేన ఉద్యమ సభ్యత్వ సమన్వయకర్త టీసీ. వరుణ్, రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర హాజరయ్యారు.
"నియోజకవర్గంలో అత్యధిక సభ్యత్వం నమోదు చేయించాలి" అని జనసేన రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయడం అంటే వైఎస్. జగన్ కోటరీకి సవాల్ విసిరినట్టే అంచనా వేస్తున్నారు.
ఉద్యమ స్ఫూర్తితో ముందుకెళ్లడానికి సభ్యత్వ నమోదు లక్ష్యం సాధించాలని సభ్యత్వ నమోదు సమన్వయకర్త టీసీ. వరుణ్ సూచించారు.
"వైసీపీది రప్పా.. రప్పా సిద్ధాంతం. పులివెందులలో జన సైనికులు జనసేన జెండాను రెపరెపలాడిస్తున్నారు" అని జనసేన నేత టీసీ. వరుణ్ వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమాల నేపథ్యంలో పులివెందులలో రాజకీయ వాతావరణం వేడెక్కినా, గుంభనంగా సంయమనంతో ఉన్నామని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.
"పులివెందులపై వైఎస్ఆర్ ముద్ర ఎవరూ చెరపలేరు. ఆయనతో జగన్ కు పోలిక సరికాకున్నా, వారికి ప్రజల ఆదరణ ఏమాత్రం తగ్గలేదు. తగ్గదు. ప్రత్యర్థి రాజకీయ ఎత్తుగడలు ఏమాత్రం పనిచేయవు" అని కడప జిల్లాకు చెందిన ఓ కార్మిక నేత అభిప్రాయపడ్డారు.
సర్దుబాట్లలో జగన్..
పులివెందులలో పరిస్థితిని చక్కదిద్దుకునే పని కూడా వైఎస్. జగన్ పైనే పడిందనే వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. ప్రతిపక్షంలో ఉండగా అందరికీ చేరువగా ఉన్న జగన్ అధికారంలో ఉన్నప్పుడు పరదాలకు పరిమితం కావడం, సభలకు పాసులు జారీ చేయించడం వల్ల వైఎస్ఆర్ వెంట నడిచిన సీనియర్ నేతల్లో దేవిరెడ్డి శంకరరెడ్డి సహా చాలా మంది తటస్థంగా ఉన్నారని చెబుతున్నారు. క్యాడర్ ను సమన్వయం చేయడంలో కడప ఎంపీ వైఎస్. అవినాష్ రెడ్డి జగన్ నుంచి అనేకసార్లు చీవాట్లు తిన్నారనే విషయం మీడియాలో కూడా వార్తలు వెలువడ్డాయి. దీంతో రెండు నెలలకు ఒకసారి నియోజకవర్గం పర్యటనలతో ప్రజల్లో ఉండడానికి జగన్ ఆసక్తి చూపించడం వెనుక ప్రధాన కారణం ఇదేనని పులివెందుల నుంచి తెలుస్తున్న సమాచారం. 2014 ఎన్నికల తరువాత దూరమైన నేతలను సమీకరించడంపై కూడా వైసీపీ దృష్టి సారించినట్లు పార్టీ వర్గాల సమాచారం.
ఈ పరిణామాలను సొమ్ము చేసుకునే విధంగానే టీడీపీ కూటమి 2024 ఎన్నికల్లో సమాధానం ఇచ్చిన వై నాట్ పులివెందుల ఆపరేషన్ కోసం చాపకింద నీరులా కార్యకలాపాలు విస్తరిస్తున్నట్లు కనిపిస్తోంది.
"పులివెందులలో పరిస్థితి చక్కదిద్దుకోకుంటే, గత ఎన్నికలకు భిన్నమైన పరిస్థితి ఎదుర్కోక తప్పదు" అని ఈ ప్రాంతానికి చెందిన సీనియర్ నేతలు అభిప్రాయపడుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల తరువాత పరిణామాలు ఎన్నికల నాటికి ఏమేరకు ప్రభావం చూపిస్తాయనేది అంచనా వేయవచ్చనేది రాజకీయ పరిశీలకుల అంచనా.
Next Story

