
నంద్యాల వద్ద ప్రయివేటు బస్సు దగ్థం
కంటైనర్ ను ఢీకొన్న నెల్లూరు బస్సు. ముగ్గురు సజీవదహనం. పది మందికి గాయాలు.
ఉమ్మడి కర్నూలు జిల్లా నంద్యాల వద్ద గురువారం వేకువజామున ఘోర ప్రమాదం జరిగింది. అదుపుతప్పిన ప్రయివేటు ట్రావెల్స్ బస్సు కంటైనర్ ను ఢీకొనడంతో ముగ్గురు సజీవ దహనం అయ్యారు. మరో పది మంది ప్రయాణికులు గాయపడ్డారు. క్లీనర్ అప్రమత్తత వల్ల సుమారు 20 మంది ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు.
నంద్యాల జిల్లా సిరివెళ్ల మండలం సిరివెళ్లమెట్ట గ్రామం వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. మృతులు హైదరాబాదుకు చెందిన వారని చెబుతున్నారు. గాయపడిన ప్రయాణికులు కూడా హైదరాబాద్, నెల్లూరుకు చెందిన వారిగా భావిస్తున్నారు. ఈ సంఘటన వివరాలివి.
నెల్లూరు నగరం నుంచి Arbcvr ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు 36 మంది ప్రయాణికులతో బుధవారం రాత్రి హైదరాబాదుకు బయలుదేరింది. గురువారం వేకువజామున ఆ బస్సు నంద్యాల జిల్లా సిరివెళ్ల మండలం సిరివెళ్ల మెట్ట వద్ద జాతీయ రహదారిపై ఈ ప్రైవేటు బస్సు ప్రయాణిస్తోంది. ప్రయాణికులు అందరూ గాఢనిద్రలో ఉన్నారు. బస్సు టైరు పేలిపోవడంతో అదుపు తప్పిన బస్సు కుదుపులకు ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. వేగంమీద ఉన్న బస్సు డివైడర్ ను ఢీకొని ముందుకు దూసుకుని వెళ్ళింది. అదే సమయంలో ఎలక్ట్రిక్ బైక్ లోడుతో ఎదురుగా వస్తున్న కంటైనర్ లారీని ఈ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొంది. ఈ ధాటికి మంటలు చెలరేగాయి. ఆ మంటల్లో చిక్కుకున్న ప్రైవేట్ బస్సు, కంటైనర్ డ్రైవర్, క్లీనర్ మృతి చెందారు.
బస్సు క్లీనర్ అప్రమత్తం
ప్రమాదం జరిగిన వెంటనే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు క్లీనర్ అప్రమత్తమై అద్దాలు పగలగొట్టారని తెలిసింది. అదే సమయంలో ఈ మార్గంలో వెళుతున్న డీసీఎం వాహనం డ్రైవర్ కూడా తన వాహనాన్ని ఆపి, బస్సు అద్దాలను పగలగొట్టడంతో ప్రయాణికులు కిటికీల నుంచి కిందికి దూకి ప్రాణాలు కాపాడుకున్నట్లు సమాచారం అందింది.
పది మందికి గాయాలు
ప్రమాదానికి గురైన బస్సులో ఉన్న ప్రయాణికులు ప్రాణభీతితో బిక్క చచ్చిపోయారు. బస్సు క్లీనర్, డీసీఎం వాహనం క్లీనర్ బస్సు అద్దాలను పగలగొట్టడంతో ఆందోళనగా కిటికీల నుంచి దూకే సమయంలో సుమారు 10 మంది ప్రయాణికులు గాయపడినట్లు సమాచారం అందింది. వారంతా హైదరాబాద్, నెల్లూరు నగరానికి చెందిన వారిని తెలుస్తోంది.
డ్రైవర్ల సజీవ దహనం
నంద్యాల జిల్లా సిరివెళ్ల మెట్ట వద్ద బుధవారం తెల్లవారుజామున సుమారు రెండు గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రైవేటు బస్సు కంటైనర్ లారీని ఢీకొనడంతో రెండు వాహనాల డ్రైవర్లు, లారీ క్లీనర్ గుర్తుపట్టలేనంతగా సజీవ దహనం అయ్యారు.
నంద్యాల వద్ద జరిగిన ఈ ప్రమాద నేపథ్యంలో రవాణా శాఖ అధికారులకు మరోసారి సవాల్ విసిరినట్లే కనిపిస్తోంది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో లగేజీ మంటలు అంటుకోవడంతో ప్రమాద తీవ్రత పెరగడానికి ఆస్కారం కల్పించినట్లు తెలుస్తోంది. కంటైనర్ లో ఉన్న ఎలక్ట్రిక్ వాహనాలకు మంటలు అంటుకోవడంతో ప్రమాద తీవ్రత మరింత పెరిగినట్లు పోలీసు వర్గాల ద్వారా అందిన సమాచారం.
గాయపడిన సుమారు పదిమంది ప్రయాణికులను నంద్యాల ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన సమాచారం తెలిసిన వెంటనే నంద్యాల జిల్లా పోలీసులతో పాటు, రవాణా శాఖ అధికారులు కూడా ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. సజీవ దహనమైన ముగ్గురి మృతదేహాలను కూడా నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రి మార్చరీకి తరలించి న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Next Story

