1.50 లక్షల మంది హాజరవుతారని అంచనా..
3,500 మంది పోలీసులతో భద్రత
ఒంటిమిట్టకు 125 ఆర్టీసీ బస్సులు...
ఏర్పాట్లు చేసిన టీటీడీ
కియోస్క్ యంత్రాలతో యాత్రికులకు అక్షింతల పాకెట్లు
రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్న కడప జిల్లా ఒంటిమిట్ట శ్రీకోదండరామాలయం యాత్రికులతో కిటకిటలాడుతోంది. సీతా సమేత శ్రీకోదండరాముడి కల్యాణోత్సవం బుధవారం సాయంత్రం 6.30 గంటల నుంచి రాత్రి 8.30 గంటల వరకు నిర్వహించడానికి టీటీడీ ( Tirumala Tirupati Devasthanams ) వేదపండితులు ముహూర్తం నిర్ణయించారు. ఈ కార్యక్రమానికి ముందే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించడానికి ఒంటిమిట్టకు చేరుకుంటారు. కడప, రాజంపేట నుంచి మధ్యలో ఉన్న ఒంటిమిట్టకు ఏపీఎస్ఆర్టీసీ 125 బస్సులు 1,050 ట్రిప్పులు తిప్పడానికి అందుబాటులో ఉంచారు.
"కడప జిల్లా యంత్రాంగంతో టీటీడీ అధికారులు, సిబ్బంది మధ్య సమన్వయం ఏర్పాటు చేశా. ఉత్సవాలు బాగా జరుగుతున్నాయి. కల్యాణోత్సవానికి యాత్రికులకు ఇబ్బంది లేకుండా సిద్ధం చేసిన ప్రణాళిక అమలు చేస్తున్నాం" అని టీటీడీ ఈఓ ముద్దాడి రవిచంద్ర చెప్పారు. టీటీడీలోని వివిధ విభాగాల నుంచి 500 మంది ఉద్యోగులు,, 2,500 మంది శ్రీవారి సేవకులు యాత్రికులకు సౌకర్యాలు అందించడానికి వీలుగా ఒంటిమిట్టలో సిద్ధంగా ఉంచామని ఈఓ రవిచంద్ర వివరించారు.
"యాత్రికులకు సేవలు అందించడానికి 2,500 శ్రీవారి సేవ ( Sreevaari Seva ) కులను అందుబాటులో ఉంచారు. గ్యాలరీల్లో ఉండే భక్తులకు సాయంత్రం నుంచి పులిహోర, రవ్వ కేసరి, మైసూర్ పాక్, బిస్కెట్ ప్యాకెట్, కారాసు, అరటిపండు, టిష్యూ పేపర్, ఉడెన్ స్పూన్, మూడు లక్షల తాగునీరు బాటి్లు, వాటర్ టబ్బుల ద్వారా నీటి సరఫరా, రెండు లక్షల మజ్జిగ ప్యాకెట్లు, లక్ష టెట్రా ప్యాకెట్లు పంపిణీకి కూడా టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.
ఒంటిమిట్టకు కనీసంగా లక్షమందికి పైగానే యాత్రికులు హాజరవుతారని టీటీడీ విజిలెన్స్ విభాగం ( TTD Vigilance and Security Wing ) , కడప జిల్లా పోలీసులు అంచనా వేయడంతో పాటు భద్రతా ఏర్పాట్లు చేశారు. నేలపైనే కాకుండా, నింగిపై కూడా ఆధునిక సాంకేతిక పరికరాలతో నిఘా ఏర్పాటు చేశారు.
"టిటిడి విజిలెన్స్ విభాగం, అబ్జర్వేషన్ టీం, ఫైర్ సిబ్బంది 510 మంది, టిటిడి స్కౌట్స్ 200 మంది, జిల్లా పోలీస్ యంత్రాంగం 3,000 మందిని భద్రతా విధుల్లో ఉంటారు" అని టీటీడీ సీవీఎస్ఓ కేవి. మురళీకృష్ణ, కడప జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ చెప్పారు.
"శ్రీకోదండరామాలయం తోపాటు సమీప ప్రాంతాల్లో 235సీసీ కెమెరాలు, 12 డ్రోన్లతో పర్యవేక్షిస్తాం. దీనికోసం కమెండ్ కంట్రోల్ సెంటర్ ( Command and Control Center) , మరో మూడు మూడు సబ్ కంట్రోల్ రూమ్ ల నుంచిడి పర్యవేక్షణ చేసే విధంగా సాంకేతికతను వాడుతున్నాం" అని కడప జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ వివరించారు. స్వామివారి కళ్యాణోత్సవానికి వచ్చే యాత్రిలకుల సౌకర్యార్థం కోసం కడప వైపు 13, తిరుపతి వైపు ఐదు చోట్ల పార్కింగ్ ప్రాంతాలు ఏర్పాటు చేసినట్టు ఆయన చెప్పారు. సుమారు 21 కిలోమీటర్ల దూరం రోడ్డుకు ఇరుపక్కలా విద్యుద్దీపాలతో పగటి వాతావరణం తలపించేలా ఏర్పాట్లు, సూచిక బోర్డులు, మొబైల్ పెట్రోలింగ్, పర్యవేక్షణ బృందాలు గస్తీలో ఉంటాయని ఆయన వివరించారు.
యాత్రికులకు 250 బస్సులు
కడప, రాజంపేట పట్టణాలకు మధ్యలో జాతీయ రహదారి 40 ( National Highway 40) పై ఒంటిమిట్ట శ్రీకోదండరామాలయం ఉంటుంది. ఇక్కడికి 1.050 బస్సులు నడపడానికి ఆర్టీసీ అధికారులు ఏర్పాటు చేశారు. కడప నుంచి ఒంటిమిట్టకు 85 బస్సులతో 425 ట్రిప్పులు, రాజంపేట నుంచి ఒంటిమిట్ట వరకు 40 బస్సులతో 625 ట్రిప్పుల ద్వారా యాత్రికులను ఒంటిమిట్టకు తరలించడం, మళ్లీ గమ్యస్థానాలకు చేర్చడానికి ఏర్పాట్లు చేశారు. దీంతో పాటు సొంతవాహనాల్లో వచ్చే వారికి కడప, రాజంపేట మార్గాల్లో పార్కింగ్ సదుపాయాలు కల్పించారు. అక్కడి నుంచి అంటే, ట్రాఫిక్ డైవర్షన్ ప్రాంతాల నుంచి ఒంటిమిట్ట కల్యాణ వేదిక వరకు 20 బస్సులు ఏర్పాటు చేశామని కడప జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి మీడియాకు చెప్పారు.
కమనీయంగా పెండ్లి మండపం
సీతాసమేత శ్రీకోదండరాముడి కల్యాణోత్సవం కమనీయంగా సాగడానికి టీటీడీ ఉద్యానవిభాగం పుష్పాలు, పత్రాలు, ఫలాలతో ఆకర్షణీయంగా పెండ్లి మండపం సిద్ధం చేసింది. కల్యాణ వేదిక తోపాటు శ్రీకోదండరాముడి ఆలయం, పరిసర ప్రాంతాలను సాంప్రదాయ పుష్పాలతో అలంకరించారు.
"కల్యాణోత్సవానికి 24 గంటల ముందు నుంచే సుమారు 600 కార్మికులు పుష్పాలంకరణ చేయడానికి పనిచేయించాం. 12 టన్నుల సాంప్రదాయ పుష్పాలు, లక్ష కట్ ఫ్లవర్స్ అలంకరణకు వినియోగించినట్లు" టీటీడీ ఉద్యానవన విభాగం డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసులు ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ ప్రతినిధికి చెప్పారు. శ్రీకోందరామాలయం వద్ద కళాకృతులుతో ఏర్పాటు చేసిన సంక్షిప్త రామాయణ ఘట్టం యాత్రికులను బాగా ఆకట్టుకున్నదాని ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు.
విస్తృత ఏర్పాట్లు..
శ్రీకోదండరామాలయం వద్ద కల్యాణోత్సవానికి టీటీడీ యంత్రాంగం పకడ్బందీగా ఏర్పాట్లు చేసింది. దాదాపు లక్ష మందికి పైగానే అంచనాలతో టీటీడీ విజిలెన్స్, ఇంజినీరింగ్, అన్నదానం విభాగం అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేశారు. కల్యాణోత్సవం వేళ భారీగా తరలిచ్చే యాత్రికుల మధ్య తోపులాట లేకుండా బారికేడింగ్ ఇక్కడ ఏర్పాటు చేసినట్లు టీటీడీ సివిల్ ఇంజినీరింగ్ విభాగం అధికారులు చెప్పారు.
1. కల్యాణ వేదిక ప్రాంగణం వద్ద ఉన్న 121 గ్యాలరీల్లో 60 వేల మంది కూర్చునే సదుపాయం.
2. ప్రతి గ్యాలరీలో భక్తులకు సకాలంలో సేవల కోసం పారా మెడికల్ సిబ్బంది, టిటిడి ఉద్యోగులు, పోలీసులు, శ్రీవారి సేవకులు.
3 వైద్య శిబిరాలు, 250 మంది పారామెడికల్ సిబ్బంది, 35 మంది వైద్య నిపుణులు, 8 అంబులెన్స్ లు, అగ్నిమాపక సిబ్బందికి విధుల కేటాయింపు
4. కల్యాణ వేదిక ప్రవేశ ప్రారంభంలో తలంబ్రాల పంపిణీకి 28 కియోస్క్ లు (కౌంటర్లు) ఏర్పాటు చేశారు.
5. ప్రతి భక్తుడికి ముత్యాల తలంబ్రాలు, శ్రీవారి లడ్డూ ప్రసాదం, కంకణం, అన్నప్రసాదాలు.
6. నడిచి వచ్చే భక్తుల సౌకర్యార్థం 11 ప్రాంతాలలో ప్రత్యేకంగా షెడ్లు ఏర్పాటు. ఇక్కడ పానకం, మజ్జిగ, చలివేంద్రం, వాటర్ కూలర్లు, పోలీస్, మెడికల్ సిబ్బంది ఉంటారు.
7. శ్రీ కోదండరామస్వామి వారి ఆలయం నుంచి కల్యాణ వేదిక వరకు భక్తులు చల్లని వాతావరణంలో నడిచేందుకు వీలుగా చలువ పందిళ్లు, నీటి పిచుకారి యంత్రాలు ఏర్పాటు.
8. ఆలయ సమీపంలో మూడు వేల మంది భక్తులు వేచి ఉండేందుకు, క్యూలో వెళ్ళెందుకు జర్మన్ షెడ్డు ఏర్పాటు.
9. కల్యాణోత్సవంలో ఉండే భక్తులతో పాటు, కల్యాణం వీక్షించేందుకు వచ్చిన భక్తులందరూ శ్రీ సీతారాముల కల్యాణోత్సవాన్ని వీక్షించేలా 21 ఎల్ఈడీ స్క్రీన్ ల ఏర్పాటు
10. ఆలయం, కల్యాణ వేదిక, పరిసర ప్రాంతాల్లో 38 వివిధ దేవతామూర్తుల విద్యుత్ కటౌట్లు, భక్తులు సులువుగా గుర్తించేదెలా సూచిక బోర్డులు ఏర్పాటు.
11. కళ్యాణ వేదిక, ఆలయ పరిసరాలలో 250 మరుగుదొడ్లు, టిటిడి, జిల్లా యంత్రాంగం సమన్వయంతో 3,268 మంది పారిశుద్ధ్య కార్మికులు విధులు నిర్వహిస్తారు.
శ్రీవారి గరుడోత్సవానికి తీసిపోని ఏర్పాట్లు
తిరుమలలో శ్రీవారి బ్రహ్మెత్సవాలు, గరుడోత్సవానికి తీసిపోని విధంగా టీటీడీ ఏర్పాట్లు చేసింది. యాత్రికులకు ఉదయం నుంచి రాత్రి వరకు ఆలయ ప్రాంగణంలో, కల్యాణ వేదిక వద్ద నిరంతరాయంగా అన్నప్రసాదాలు పంపిణీ చేస్తున్నారు. ఇందులో రుచికరమైన అన్నం, సాంబరు, రసం, మజ్జిగ, పచ్చడి, కర్రీ, బెల్లం పొంగలి అందిస్తున్నారు.
"యాత్రికులకు సేవలు అందించడానికి 2,500 శ్రీవారి సేవకులను అందుబాటులో ఉంచాం. దేశంలోని అనేక ప్రాంతాల నుంచి వచ్చిన స్వచ్ఛంద సేవులు నిరంతరాయంగా సేవలు అందిస్తున్నారు" అని టీటీడీ చీఫ్ పీఆర్ఓ తలారి రవి చెప్పారు. గ్యాలరీల్లో ఉండే భక్తులకు సాయంత్రం నుంచి పులిహోర, రవ్వ కేసరి, మైసూర్ పాక్, బిస్కెట్ ప్యాకెట్, కారాసు, అరటిపండు, టిష్యూ పేపర్, ఉడెన్ స్పూన్, మూడు లక్షల తాగునీరు బాటి్లు, వాటర్ టబ్బుల ద్వారా నీటి సరఫరా, రెండు లక్షల మజ్జిగ ప్యాకెట్లు, లక్ష టెట్రా ప్యాకెట్లు పంపిణీకి కూడా టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.