రెండు తట్టల పేడ.. రెండు బిందెల నీటితో రోజంతా గ్యాస్..
x

రెండు తట్టల పేడ.. రెండు బిందెల నీటితో రోజంతా గ్యాస్..

నెలకు రూ. 30 లక్షలు భారంగా పడేలా గోబర్ గ్యాస్ ను దెబ్బతీసిన ఆధునికత.


పల్లెల్లో పాడి పశువుల పేడ సద్వినియోగం చేసుకుంటే వంటకు గ్యాస్ తయారవుతుంది. దీనివల్ల ఎల్పీజీ సిలిండర్ కోసం గంటల తరబడి క్యూలో నిలబడడం, రోజుల తరబడి నిరీక్షించే బాధ నుంచి ఉపశమనం లభిస్తుంది. ఆధునిక వసతులు అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో విద్యుత్ వాడకం పెరిగింది. ఎల్పీజీ సిలిండర్లు సరళంగా అందుబాటులోకి వచ్చాయి. సోలార్ పవర్ వినియోగంలోకి రావడం, ఉచిత గ్యాస్ పథకం వల్ల బయోగ్యాస్ అటకెక్కే పరిస్థితి ఏర్పడింది. గతానికి భిన్నంగా ఈ ప్రాంత రైతులు నెలకు కనీసంగా రూ. ౩౦ లక్షల భారం భరిస్తున్నారు.


"రెండు తట్టల పేడ, రెండు బిందెల నీళ్లు చాలు. పలుచటి ద్రవం తొట్టిలో పోస్తే చాలు. ఒక రోజుకు సరిపడ బయోగ్యాస్ ఉత్పత్తి జరుగుతుంది. మా ఇంట్లో ఇప్పటికీ బయోగ్యాస్ పైనే వంట వండుకుంటున్నాం" అని తవణంపల్లె మండలం టి. పుత్తూరు పంచాయతీ చిగురాకులపల్లెకు చెందిన పట్టభద్రుడు లవకుమార్, ఆయన భార్య సుధా చెప్పారు.

చిత్తూరు జిల్లాలో ఊరంతా ఎల్పీజీ సిలిండర్ల స్ధానంలో గోబర్ గ్యాస్ వాడారు. ఆ ఊరు ఒకప్పుడు గోబర్ గ్యాస్ హబ్. ఇపుడు గోబర్ గ్యాస్ మాయమైంది. కాలం మాడ్రన్ అవుతుంది. శక్తి వంతమయిన ఇంధనం వచ్చినపుడు పాత గోబర్ గ్యాసే ఎందుకు వాడాలి? అని భావించే వారు చాలా మంది ఉన్నారు. ప్రభుత్వం ప్లాంట్లు సబ్సిడీలు పునరుద్ధరించి, ప్లాంటు మంజూరు చేస్తే గోబర్ గ్యాస్ సద్వినియోగం చేసుకుంటామని పాడి రైతులు స్పష్టం చేస్తున్నారు.

జిల్లాలో 2021 వరకు గోబర్ గ్యాస్ సఫలమైందని నెడ్ క్యాప్ మేనేజర్ అబ్దుల్ గయాజ్ చెప్పారు. ప్రస్తుతం సూర్య ఘర్ పథకంపై ప్రభుత్వం దృష్టి సారించిందని తెలిపారు.
"మొదట్లో నెడ్ క్యాప్ ఏజెన్సీ ద్వారా గోబర్ గ్యాస్ ప్లాంట్లు నిర్మాణానికి ప్రభుత్వం చొరవ చూపింది. ఆ తరువాత డీబీటీ ( Direct Benefit Transfer DBT) వల్ల ఇబ్బందులు ఏర్పడినట్టు చెప్పారు. ఆ తరువాత ఈ పథకం ఆగిందని గుర్తు చేశారు.

"గోబర్ గ్యాస్ ప్లాంట్ల కోసం ఈ మధ్య కాలంలో వినతులు వస్తున్నాయి. దీనికోసం కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశాం. అనుమతి రాగానే పకడ్బందీగా పథకాన్ని అమలుకు చర్యలు తీసుకుంటాం" అని నెడ్ క్యాప్ మేనేజర్ అబ్దుల్ గయాజ్ వివరించారు.
రాయలసీమలో గోబర్ గ్యాస్ (Galvanizing Organic Bio-Agro Resources GOBAR) తయారీకి 2021 సంవత్సరంలో గోబర్ ధన్ పథకాన్ని కృష్ణ, అనంతపురం, కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో పైలెట్ ప్రాజెక్ట్ గా అమలు చేశారు. ఈ పథకం కింద పశువులు, వ్యవసాయ వ్యర్థాల నుంచి సాంప్రదాయ ఇంధన వనరులు, సేంద్రియ ఎరువుల ఉత్పత్తి కోసం ప్లాంట్లు ఏర్పాటు చేశారు.
చిత్తూరు జిల్లాలో గోబర్ ధన్ (Gobar Dhan ) పథకాన్ని నెడ్ క్యాప్ ద్వారా అమలు చేశారు. పూతలపట్టు నియోజకవర్గంలోని తవణంపల్లె మండలంలో 24 గ్రామ పంచాయతీల్లో 37 రెవెన్యూ గ్రామాల్లో జనాభా 53,708 మంది ఉంటే..
"ప్రతి గ్రామంలో పది నుంచి 15 శాతం మంది రైతులు తమ ఇళ్ల వద్ద వ్యక్తిగత బయోగ్యాస్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకున్నారు" అని రామకృష్ణాపురానికి చెందిన దామోదరనాయుడు చెప్పారు.
"ఐదేళ్ల కిందటి వరకు గ్రామంలో కనీసంగా 20 ప్లాంట్లు ఉండేవి. గ్యాస్ వాడకం అందుబాటులోకి రావడానికి తోడు రైతుల్లో కూడా ఆధునిక వసతుల సద్వినియోగానికి మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికీ పదికి పైగానే పంచాయతీల్లో గోబర్ గ్యాస్ వినియోగం ఉంది" అని దామోదర నాయుడు చెప్పారు.
2022 మే నెలలో ఢిల్లీకి చెందిన ఆర్ధికవేత్త సుబోధ్ మాథుర్ ఓ వెబ్ సైట్ లో వనరుల వాడకంపై ఓ వ్యాసంలో ఇలా స్పందించారు.
"దేశానికి సంబంధించిన ఇంధన ప్రాధాన్యతపై నేను ఒక చిన్న వ్యాసం రాశాను. అందులో మొదటిది, దేశం LPG ఆధారపడడం తగ్గించాలి. బయోగ్యాస్, గోబర్ గ్యాస్ రకాలు స్పష్టమైన పరిష్కారాలు. ఇప్పుడు, ఎకోటెక్ సంస్థ, వరి పొట్టు వంటివి అందుబాటులో ఉన్నచోట వాటితో చిన్న తరహా వాణిజ్య వంటలను త్వరగా ఆచరణయోగ్యంగా మార్చాలని చూస్తోంది. మా దృష్టిలో, ఈ సాంకేతికత ఇప్పటికే బాగా అభివృద్ధి చెందింది" అని గుర్తు చేశారు.

40 గడపల గ్రామంలో..


తవణంపల్లె మండలంలో పది గ్రామ పంచాయతీల్లో వందల సంఖ్య నుంచి వేళ్ల మీద లెక్కించే స్థాయిలో పదుల సంఖ్యకు గోబర్ గ్యాస్ తయారీకి ఇంకా మొగ్గు చూపిస్తున్నారు. దీనివల్ల గ్యాస్ భారం కనిపించలేదని తడకర పంచాయతీ గళ్లావాళ్లఊరుకు చెందిన ఆనందనాయుడు చెప్పారు.
"పిల్లలు ఉన్నత చదువులతో పొరుగు ప్రాంతాల్లో ఉన్నారు. ఉన్న మామిడి తోటలతో నష్టపోయినా పాడి ఆవుల వల్ల ఆదాయం కళ్ల చూస్తున్నాం. దీనివల్ల మా ఆడోళ్లు పేడ కలపడం లేదు. లేదంటే బయోగ్యాస్ తయారీ వల్ల ఇబ్బందే ఉండదు" అని ఆనందనాయుడు విశ్లేషించారు.
తవణంపల్లె మండలం దిగువ తడకర పంచాయతీ గళ్లావాళ్లఊరిలో 40 గడపలు ఉన్నాయి. ప్రతి ఇంటిలో కనీసంగా రెండు నుంచి మూడు పాడి ఆవులు ఉన్నాయి. ఇక్కడ ఇంజినీరింగ్ చదువుతున్న మోనిష్ గోబర్ గ్యాస్ ప్లాంటు పనితీరును వివరించారు.
"నా చిన్నప్పుడే మా అమ్మా, నాన్న ఏర్పాటు చేయించారు. సులభంగా బయోగ్యాస్ ఉత్పత్తి చేశాం. ఈ ప్లాంటు పునరుద్ధిస్తున్నాం" అని మోనిష్ చెప్పారు. పది ఆవుల ద్వారా వచ్చే పేడతో మామిడితోటకు సేంద్రియ ఎరువు తయారు చేయడంతో పాటు గోబర్ గ్యాస్ తయారీకి వినియోగించాం అని కూడా మెనిష్ తల్లి కూడా వివరించారు.

వైఫల్యానికి కారణాలు ఇవీ..

తవణంపల్లెలోనే కాదు. చిత్తూరు జిల్లాలో బయోగ్యాస్ ప్లాంట్లలో 90 శాతం నిరుపయోగంగా మారాయి.
1. పేడ కలపడం, స్లర్రీ తొలగించడానికి రైతులు మొగ్గు చూపకపోవడం,
2. ప్లాంట్ల మరమ్మతులకు సాంకేతిక నిపుణులు అందుబాటులో లేకపోవడం.
3. గ్యాస్ సిలిండర్లు సులభంగా అందుబాటులోకి రావడం.
4. ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం.
గ్రామీణ ప్రాంతాలు వ్యవసాయ ఆధారితంగానే జీవిస్తాయి. పంటల ఉత్పత్తికి, ఆ తరువాత వచ్చే దిగుబడి వల్ల వనరులు సద్వినియోగం చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. సుప్రీం కోర్టు న్యాయవాది, క్రీడా మంత్రిత్వ శాఖ జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ ( National Anti Doping Agency (NADA) ప్యానల్ అధ్యక్షుడు సార్ధిక్ చతుర్వేది లోతైన అధ్యయనం ద్వారా వారం కిందట ఆర్థికవేత్త సుబోధ్ మాథుర్ స్పందనీపై ట్వీట్ చేశారు.

ఒక శాతం కూడా వాడలేమా..?

"దేశంలో ఏడాదికి 62 మిలియన్ టన్నుల (MMT) బయోగ్యాస్ ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉంది. ప్రస్తుతం అందులో ఒక శాతానికి తక్కువే వాడుతున్నాం. రాజస్థాన్ లో సమోసాలు, ముంబైలో దోసేలు మనూ నుంచి అదృశ్యమయ్యాయి. జనం ఒక సిలిండర్ కోసం తెల్లవారుజామున మూడు గంటలకే గ్యాస్ పంపిణీ కేంద్రాల బయట బారులు తీరారు. దీని ద్వారా బయోగ్యాస్ ప్రాధాన్యతను గుర్తించారు" అని సార్ధిక్ చతుర్వేది అభిప్రాయపడ్డారు. ఎల్‌పిజిలో 60%, సహజ వాయువులో 50% పైగా దిగుమతి చేసుకుంటున్నాం.
"పశువుల పేడ, వ్యర్థాలు, తడి సేంద్రియ వ్యర్థాల నుంచి లభించే 62 మిలియన్ టన్నుల (MMT) వార్షిక బయోగ్యాస్ ఉత్పత్తిని మరిచి పోతున్నాం" అని సార్ధిక్ చతుర్వేది గుర్తు చేశారు. మన సహజ వాయువులో కేవలం 20 శాతాన్ని దేశీయంగా ఉత్పత్తి చేసిన బయోగ్యాస్‌తో భర్తీ చేయడం ద్వారా 2030 నాటికి దిగుమతి బిల్లులలో 29 బిలియన్లు ఆదా చేయవచ్చని కూడా ఆయన విశ్లేషించారు.

నెల భారం రూ. ౩౦ లక్షలు

చిత్తూరు జిల్లా పరిస్థితి పక్కకు ఉంచితే.. తవణంపల్లె మండలంలో పది వేల ఎల్పీజీ కనెక్షన్లు ఉన్నట్లు తహసీల్దార్ కార్యాలయం ఉద్యోగి హేమకుమార్ చెప్పారు. ఐదేళ్ల కిందట వెలిగిన బయోగ్యాస్ పొయ్యిల్లో 90 శాతం మండడం లేదు. దీనివల్ల మండలంలో రోజుకు రూ.1.40 లక్షలు గ్యాస్ సిలిండర్ల భారం పడుతోంది.
మండలంలోని మిట్టపల్లె వద్ద ఉన్న హెచ్పీ గ్యాస్ ఏజెన్సీ ( HP Gas Agency) ద్వారా రోజూ 60 నుంచి 70 సిలిండర్లు సరఫరా చేస్తున్నట్లు గ్యాస్ సిలిండర్ల డెలిరీ బాయ్ మురుగేష్ చెప్పారు. పది కిలోమీటర్ల దూరంలోని చిత్తూరు నుంచి కూడా తవణంపల్లెకు రోజూ 80 నుంచి 90 సిలిండర్లు డెలివరీ చేస్తున్నారని కూడా ఆయన చెప్పారు.

మాకు సిలిండర్ బాధ లేదు..

టి. పూత్తూరు పంచాయతీ చిగురాకులపల్లెలో 40 ఇళ్లు ఉంటే, ప్రతి ఇంటికీ సగటున రెండు పాడి ఆవులు ఉన్నాయి. వాటి పేడ ద్వారా నాలుగేళ్ల కిందటి వరకు కూడా 20 గోబర్ గ్యాస్ ప్లాంట్లు పనిచేయించారు. దీనివల్ల ఎల్పీజీ గ్యాస్ లేకున్నా, ఇబ్బంది పడలేదని ఆ గ్రామస్తులు చెప్పారు. మాకు గ్యాస్ వల్ల ఇబ్బంది లేదని గ్రామానికి చెందిన పట్టుభద్రుడు లవకుమార్ చెప్పారు.
"నాలుగు తట్టల పేడ, రెండు బిందెల నీళ్లు కలిపితే చాలు. ఆ ద్రావణం గుంతలో పోస్తే, సులభంగా ఒక రోజుకు సరిపడ గ్యాస్ ఉత్పత్తి జరుగుతోంది. మూడు పూటలా వంటలు తయారు చేస్తున్నాం" అని లవకుమార్ వివరించారు. వాళ్ల ఇంటిలోకి వెళితే, గోబర్ గ్యాస్ కనెక్షన్ కనిపించింది. స్టౌ ( Stove) ముట్టించగానే ఎల్పీజీ ( LPG) గ్యాస్ కు మించి మంట వచ్చింది. అలాగే నీరు కాచి మరీ లవకుమార్ భార్య సుధా వంటలు ఎలా తయారు చేస్తున్నారనేది ప్రయోగాత్మకంగా చూపించారు.
"వీధి పక్కనే బయోగ్యాస్ ప్లాంట్ వల్ల గ్రామస్తులు ఇబ్బందిగా ఉందంటే, ఉత్పత్తి ఆపేశాం. ఇంకా, ప్లాంట్ ఇలాగే ఉంది చూడండి" అని రాజశేఖరరెడ్డి అనే రైతు వివరించారు. ఆవులతో పాటు మేకలు కూడా పెంచుతున్నాం అని ఆయన చెప్పారు. మళ్లీ ఈ ప్లాంటు పునరుద్ధరిస్తామని ఆయన చెప్పారు.
Read More
Next Story