
Iran War | అరటి రైతుల నోట మట్టికొట్టిన యుద్ధం, మామిడికి చిక్కులే!
దేశీయ మార్కెట్లో శరణ్యం అంటున్న అధికారులు
రాయలసీమ జిల్లాల్లో ఉద్యానవన పంటలపై ఇరాన్ యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. అరటి, మామిడి తోటలు సాగు చేసే రైతులను విషాదంలోకి నెట్టాయి. హోలీ పండుగకు పది రోజుల ముందు ఢిల్లీ వ్యాపారులు వారి ప్రాంతాలకు వెళ్లిపోవడం, ఇదే సమయంలో యుద్ధం ముంచుకు రావడం వల్ల గల్ఫ్, పశ్చిమాశియా దేశాలకు రోజూ అనంతపురం, కడప జిల్లాల నుంచి రోజుకు 600 టన్నుల అరటి ఎగుమతులు ఆగిపోయాయి. దీంతో రోజూ సగటున రెండు కోట్ల నుంచి మూడు కోట్ల రూపాయల వ్యాపారం ఛిద్రమైంది.
"దేశీయ మార్కెట్ల ద్వారానే రైతులను ఆదుకోవడానికి చర్యలు తీసుకుంటున్నాం" అని ఉద్యానవన శాఖాధికారులు చెబుతున్నారు.
రాయలసీమలోని అనంతపురం, కడప జిల్లా పులివెందుల ప్రాంతానికి ఢిల్లీ నుంచి బయ్యర్లు ముందుకు రాని స్థితిలో కువైట్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యూకే దేశాలకు యుగమతులు ఆగిపోయాయి. అరటి ధరలు పాతాళానికి పడిపోవడంతో రైతులు తల్లడిల్లుతున్నారు. నాయకులు జోక్యం చేసుకుంటేనే మేలు జరుగుతుందని పులివెందుల ప్రాంతానికి చెందిన రైతు హరినాథరెడ్డి అభిప్రాయపడ్డారు.
మామిడి రైతును వీడని విషాదం
రాయలసీమలోని చిత్తూరు జిల్లాలో మామిడి రైతులను మూడేళ్లుగా విషాదం వెంటాడుతోంది. గత ఏడాది ఉక్రెయిన్ పై కమ్ముకున్న యుద్ధమేఘాల నేపథ్యంలో మామిడి గుజ్జు నిల్వలు పేరుకుపోయాయి.
"ప్రధాన ఎక్స్ పోర్టర్ కువైట్ ముందుకు రాని స్థితిలో 100 టన్నులకు పైగానే గుజ్జు గోడౌన్లకు పరిమితమైంది" అని మామిడి గుజ్జు పరిశ్రమల యజమానుల సంఘం అధ్యక్షుడు గోవర్ధన బాబీ చెప్పారు. ఈ సంవత్సరం మామిడి కాపు బాగా ఉందని ఆశపడుతున్న మామిడి రైతులను ఇరాన్ యుద్ధం విషాదంలోకి నెట్టిందని భావిస్తున్నారు. కడప, అనంతపురం జిల్లాల్లో అరటి తోటల సాగు చేసే రైతులను కూడా కోలుకోలేని విధంగా దెబ్బతీసింది.
"జిల్లాలో మామిడి కాపు ఆశాజనకంగా ఉంది. గత ఏడాది జరిగిన నష్టం భర్తీకి అవకాశం ఉంది" అని పులిచర్ల మండలానికి చెందిన రైతు రమేష్ నాయుడు చెప్పారు. సీజన్ ప్రారంభం నాటికి పరిస్థితి అనుకూలిస్తుందనే ఆశాభావం వ్యక్తం చేశారు.
"జిల్లాలో దిగుబడి కూడా బాగుంది. రైతులకు ధర మేలు చేస్తుందనే వాతావరణం కనిపిస్తోంది" అని తిరుపతి మార్కెట్ యార్డులోని వ్యాపారి షెక్ వాహేద్ అభిప్రాయపడ్డారు.
అనంతలో అరటి కడగండ్లు..
కరువు, వెనుకబడిన ప్రాంతాల జాబితాలో అనంతపురం మొదటి స్థానంలో ఉంది. 2025లో సగటు వర్షపాతం సుమారు 594 మిల్లీమీటర్లు (34 వర్షాకాలం రోజుల్లో) ఉండాలి. మే నెలలో ముందస్తు రుతుపవనాల కారణంగా సాధారణం కంటే, 300 శాతం అధికంగా నమోదైనట్లు రికార్డులు చెబుతున్నాయి. మార్చి నుంచి మే నెల వరకు 185.8 మిల్లీమీటర్ల వర్షం పాతం నమోదైనట్లు రికార్డులు స్పష్టం చేస్తున్నాయి.
అనంతపురం జిల్లాలో బోర్లు ఆధారంగానే కాకుండా, నీటి కుంటలు ఏర్పాటు చేసుకుని డ్రిప్ పధ్దతిలో ఉద్యానవన పంటలు సాగు చేస్తున్నట్లు జిల్లా ఉద్యానవన శాఖాధికారి రాజ్యలక్ష్మి చెప్పారు.
రూ. కోట్ల వ్యాపారం
రాయలసీమలో అనంతపురం జిల్లా నుంచి రోజుకు 300 నుంచి 500 టన్నుల అరటి ఎగుమతులపై ఇరాన్ యుద్ధం తీవ్ర ప్రభావం చూపింది. జిల్లాలో సాగులోని 15,990 హెక్టార్లలోని అరటి తోటల రైతులను తీవ్రంగా దెబ్బతీసింది.
"జిల్లాలో సాగు చేసే అరటిలో 15 నుంచి 20 శాతం ఇరాన్, ఇరాక్, సిరియా తోపాటు అరబ్ ఎమిరేట్స్ దేశాలకు ఢిల్లీ వ్యాపారులు ఎగుమతి చేస్తున్నారు" అని ఉద్యానవన శాఖాధికారి రాజ్యలక్ష్మి తెలిపారు. 12 టన్నుల సామర్ధ్యం ఉన్న కంటైనర్లు రోజుకు అనంతపురం నుంచి తాడిపత్రి ద్వారా 40 వాహనాలు వెళుతుంటాయని ఆమె వివరించారు.
కరువు జిల్లా అనంతపురంలో నార్పల, పుట్లూరు, యల్లనూరు, తాడిపత్రి, యాడికి, కల్యాణదుర్గం మండలాల్లో రైతులు నీటి వనరులు సద్వినియోగం చేసుకుంటున్నారు. ప్రతి రైతు డ్రిప్ పద్ధతిలో నీటిని పొదుపుగా వాడి, ఉద్యానవన పంటలు సాగుచేస్తుంటారని ఉద్యానవన శాఖాధికారి రాజ్యలక్ష్మి వివరించారు.
పడిపోయిన ధరలు
"పది రోజుల కిందట టన్ను అరటికాయలు 22 వేల వరకు పలికాయి. యుద్ధ ప్రభావం వల్ల ప్రస్తుతం టన్ను 13 వేల నుంచి 15 వేలకు తగ్గింది" అని స్పష్టం చేశారు. మహారాష్ట్రలో అరటి సీజన్ ముగిసే సమయంలో అనంత ఉత్పత్తికి గిట్టుబాటు దొరుకుతుందని కూడా ఆమె వివరించారు.
సాధారణ రోజుల్లో 80 శాతం అరటి ఢిల్లి, పంజాబ్, జమ్మూ, మహారాష్ట్రకు రవాణా అవుతున్నట్లే పూర్తిగా స్వదేశీ మార్కెట్లే ఆదుకోవాల్సిన అనివార్యమైన పరిస్థితి ఏర్పడింది. దీనిపై జిల్లా అధికారులు సమీక్షిస్తున్నారని ఉద్యానవన శాఖాధికారి స్పష్టం చేశారు. ఇరాన్ యుద్ధం సమసిన తరువాత జలరవాణాకు మార్గం సుగుమం అయ్యే వరకు పరిస్థితి ఇలాగే కొనసాగుతుందని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
పులివెందులపై అరటిపై యుద్ధం పంజా
పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా కడప జిల్లా పులివెందులపై తీవ్ర ప్రభావం చూపింది. కడప జిల్లాలో పులివెందుల తరువాత రైల్వే కోడూరు, రాజంపేట, బద్వేలు ప్రాంతాల్లో మామిడి తోపాటు అరటి తోటలు సాగుకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది. పులివెందుల నియోజకవర్గంలోని తొండూరు, వేముల, లింగాల మండలాల్లో మాత్రమే 26,416 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. అరటి కాయలు విదేశాలకు రోజుకు 60 నుంచి 70 టన్నుల ఎగుమతి చేస్తున్నారు. ఢిల్లీ నుంచి వచ్చే వ్యాపారులు కొనుగోలుకు ఈ ప్రాంతంలో నవంబర్ నుంచి ఏప్రిల్ వరకు అరటికాయలకు పీక్ సీజన్ (Peak season ) లో యుద్ధమేఘాలు కమ్ముకున్న పరిస్థితుల్లో ధరలు కుదేలయ్యాయి.
పులివెందులలో శీతలగిడ్డంగి ( Cold storage plant ) కేవలం ఆరు వేల మెట్రిక్ టన్నుల సామర్ధ్యం మాత్రమే ఉంది. ఈ పరిస్థితుల్లో రైతులు ఇంకా ఎక్కువ ఉత్పత్తి నిలువ చేసే సామర్థ్యం లేని స్థితిలో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో
"పది రోజుల కిందట కూడా టన్ను అరటికాయలు 20 వేల నుంచి 25 వేలు పలికాయి. ఇప్పుడు ఏడు నుంచి తొమ్మిది వేల రూపాయలకు పడిపోయింది" అని రైతు శ్రీనివాసులురెడ్డి చెప్పారు. మొదటి కోత కాయలు టన్ను 25 వేల వరకు ఉంటుంది. ఇప్పుడు రెండో కోత జరిగే సమయం సీజన్ ముగింపులో కనీసంగా 13 నుంచి 15 వేలు పలకాల్సిన ధరలు పడిపోవడం రైతులకు తీవ్ర నష్టం కలిగించిందని శ్రీనివాసులు రెడ్డి చెప్పారు.
పులివెందుల అరటిని దేశీయ మార్కెట్లో ఆదుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఉద్యానవన శాఖాధికారి రాఘవేంద్రరెడ్డి చెప్పారు.
"ఈ ప్రాంతం నుంచి ఢిల్లీ నుంచి వచ్చే వ్యాపారులు అనంతపురం జిల్లాతో పాటు పులివెందులలో కూడా అరటికాయలు కొనుగోలు చేస్తుంటారు. రోజుకు కనీసంగా 60 నుంచి 70 టన్నుల ఎగుమతి జరుగుతుంటుంది" అని ఉద్యానవన శాఖాధికారి రాఘవేంద్రరెడ్డి వివరించారు. పులివెందులలో పండించే అరటికాయల్లో 40 శాతం కువైట్, గల్ఫ్ దేశాలు, ఇరాన్, యుఏఈ ( United Arab Emirates UAE) దేశాలకు, మిగతా 60 శాతం దేశీయ మార్కెట్లకు రవాణ జరుగుతున్నదని రాఘవేంద్రరెడ్డి వివరించారు.
"ఇరాన్ యుద్ధం కారణంగా పులివెందుల నుంచి ఎగుమతులు ఆగిపోవడం వల్ల పూర్తి స్థాయిలో ఢిల్లీ, మహారాష్ట్ర, జమ్మూ అండ్ కాశ్మీర్, బెంగళూరు మార్కెట్లు మాత్రమే అరటి దిగుబడి కొనుగోలు చేయాల్సిన పరిస్థితి" ఉందని రాఘవేంద్రరెడ్డి చెప్పారు. దీనిపై జిల్లా అధికారులు కూడా దృష్టి సారించారని ఆయన వివరించారు.
ఇరాన్ యుద్ధం నేపథ్యంలో అరటి రైతుల పరిస్థితిపై కడప జిల్లా అధికారులు రంగంలోకి దిగారు. జిల్లా ఉద్యానవన శాఖాధికారి సతీష్ పులివెందుల, వేముల మండలాల్లో రైతులతో మాట్లాడారు. టన్ను అరటికాయల గెల 12 వేలు, బాక్సుల్లో నింపితే రూ. 14 వేల నుంచి రూ. 17 వేల వరకు వ్యాపారులు చెల్లిస్తున్నారని ఉద్యానవన శాఖాధికారి సతీష్ మీడియాకు చెప్పారు.
హోలీ పండుగ తెచ్చిన విషాదం
ఢిల్లీ నుంచి వచ్చే వ్యాపారులు హోలీ పండుగకు పది రోజుల ముందు వారి ప్రాంతాలకు వెళతారు. ఈ పరిస్థితి రైతులకు శాపంగా మారింది. దళారులు ధరలు తగ్గించి కోనుగోలు చేయడం ద్వారా నష్టాలు తప్పలేదని అమ్మకపల్లెకు చెందిన రైతు హరినాథరెడ్డి వేదన చెందారు.
"నేను పది ఎకరాల్లో అరటి తోటలు సాగు చేస్తున్నా, ప్రస్తుతం టన్నుకు రూ. ఎనిమిది నుంచి తొమ్మిది వేలు కూడా రైతుకు దక్కడం లేదు" అని హరినాథరెడ్డి చెప్పారు. ఈయన ఏమంటున్నారంటే..
"మా ప్రాంతంలో జనవరి నుంచి సీజన్ ప్రారంభం అవుతుంది. నా అరటి తోట నెల తరువాత కోతకు వస్తుంది. ప్రస్తుతం కోత దశలో ఉన్న తోటల రైతులు తల్లడిల్లుతున్నారు. ధరల విషయంలో నాయకులు జోక్యం చేసుకుని, చర్చలు జరిపితే మినహా మేలు జరగదు" అని హరినాథరెడ్డి స్పష్టం చేశారు.
20 కంపెనీల నుంచి కొనుగోళ్లు..
ఢిల్లీ నుంచి వచ్చి అనంతపురంలో మకాం వేసే వ్యాపారులు పులివెందులలో కూడా అరటి కొనుగోలుకు మధ్యవర్తులను ఏర్పాటు చేసుకున్నారు. వ్యాపారుల కంటే దళారుల పాత్రే కీలకంగా మారిందనేది రైతుల ఆరోపణ. సుమారు 20 కంపెనీలు (ఏజెన్సీలు) వ్యాపారులు ఈ ప్రాంతంలో కొనుగోలు చేసే అరటి కాయలు తాడిపత్రి వద్ద కంటైనర్లకు చేర్చడానికి కేంద్రంగా ఏర్పాటు చేసుకున్నారు. 32 గంటల ప్రయాణం తరువాత ముంబైలోని తెంబుర్తి వద్ద కోల్డ్ స్టోరేజీ ప్లాంట్ లో నిలువ ఉంచి, జవహర్ లాల్ నెహ్రూ పోర్టు వద్దకు చేర్చడం ద్వారా షిప్పింగ్ కోసం నిరీక్షిస్తారు. అక్కడి నుంచి ఓడ సిద్ధంగా ఉందనే పోర్టు అధికారుల అనుమతితో సముద్రమార్గంలో పశ్చిమాసియా దేశాలతో పాటు గల్ఫ్, యూఏఈ దేశాలకు కూడా రవాణా చేస్తున్నారు.
"అనంతపురం, పులివెందుల ప్రాంతాల్లో సాగు చేసే జీ-9 ( Gra 9 ) రకం అరటి 15 రోజుల నుంచి 20 రోజుల పాటు నిలువ సామర్థ్యం ఉంటుంది" అని పులివెందుల ఉద్యానవన శాఖాధికారి రాఘవేంద్రరెడ్డి చెప్పారు.
పశ్చిమాసియా దేశాల మధ్య యుద్ధం ముగిసే వాతావరణం కనిపించని స్థితిలో రాయలసీమ ప్రాంతంలోని అరటి, త్వరలో ప్రారంభమయ్యే మామిడి రైతులను గత ఏడాదికి మించి నష్టాల్లోకి నెట్టే పరిస్థితి కనిపిస్తోంది.
ఆశలు మొలక
చిత్తూరు జిల్లాలో ఈ ఏడాది 1.65 హెక్టార్లలో మామిడి తోటలు సాగులో ఉన్నాయి. పూత, కాయ దశను చూసిన రైతుల్లో ఆశలు చిగురించాయి. గత ఏడాడి నష్టపోయిన రైతులు ఈ సంవత్సరం మార్కెట్ ధరలు బాగుంటాయని ఆశాజనకంగా ఉన్నారు. మనో నెలలోపే దిగుబడి మార్కెట్కు రానున్న నేపథ్యంలో ఇరాన్ యుద్ధ మేఘాలు కమ్ముకోవడంపై ఆందోళన చెందుతున్నారు. గత ఏడాది గణనీయంగా దిగుబడి పెరిగినా ధర దక్కక రైతులు నష్టపోయారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం రంగంలోకి దిగి కిలో తోతాపురి రకం మామిడికి రూ.12 మద్దతు ధర ప్రకటించింది. ప్రభుత్వం నాలుగు రూపాయలు, మామిడి గుజ్జు పరిశ్రమలు రూ. ఎనిమిది చెల్లించే విధంగా చర్యలు తీసుకున్నారు.కానీ, గుజ్జు పరిశ్రమల వద్ద కనీస ధర రెండు రూపాయలు కూడా దక్కలేదని రైతులు కన్నీటిపర్యంతం అయ్యారు.
"గత ఏడాది యూరోపియన్ యుద్ధం కారణంగా 2025లో ఉత్పత్తి చేసిన గుజ్జు విక్రయించే పరిస్థితి లేక నష్టపోయాం. 2026 సీజన్ లో కొనుగోలు చేసిన మామిడికి ప్రభుత్వం నిర్ణయించిన ధర చెల్లించడం శక్తికి మించిన భారమైంది" అని చిత్తూరు జిల్లా మామిడి గుజ్జు పరిశ్రమల సంఘం అధ్యక్షుడు గోవర్ధనబాబీ చెప్పారు. అయినా, 95 శాతం రైతులకు బకాయిలు చెల్లించామని బాబీ 'ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్' ప్రతినిధికి చెప్పారు.
చిత్తూరు జిల్లాలో గత సీజన్ లో కిలోకు నాలుగు రూపాయల సబ్సిడీ 31,929 మంది మామిడి రైతులకు 146.84 కోట్ల రూపాయలు చెల్లించింది. అదనపు సబ్సిడీ 154 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో జమ చేసింది.
"మళ్లీ సీజన్ ప్రారంభం కాబోతోంది. గత ఏడాది ఉత్పత్తి చేసిన లక్ష టన్నుల గుజ్జు నిలువలు పేరుకుపోయాయి" అని చిత్తూరు జిల్లా మామిడి గుజ్జు పరిశ్రమల సంఘం అధ్యక్షుడు గోవర్ధనబాబీ తెలిపారు. గత ఏడాది యూరోపియన్ యుద్దం ప్రతిబంధకంగా మారితే, ఇప్పుడు ఇరాన్ యుద్ధం రూపంలో దురదృష్టం మాకే కాదు. రైతులను వెంటాడింది" అని బాబీ ఆవేదన చెందారు. ఈ యుద్ధం రాకుండా ఉంటే, గుజ్జు ఎగుమతి పూర్తయ్యేదని ఆయన అభిప్రాయపడ్డారు. ఇరాన్ యుద్ధం ముగిస్తే కానీ, మార్కెట్ ను అంచనా వేయలేమని ఆయన తేల్చి చెప్పారు.
Next Story

