
దేశంలోనే తొలి శివాలయం.. ఆ ఐదు వింతల వెనుక కథేంటి?
తిరుపతికి సమీపంలోని గుడిమల్లం వెళదాం.. రండి..
రాయలసీమ ప్రాచీన ఆలయాలకు నిలయం. ఈ ఆలయాల్లో అద్భుతమైన రహస్యాలు నిక్షిప్తం చేసుకున్నాయి. దేశంలోనే మొదటి శివాలయంగా చరిత్రలో నిలిచిన శ్రీపరశురామేశ్వరస్వామి ఆలయంలో ఐదు వింతలు కళ్లముందు కనిపిస్తాయి.
తిరుపతికి 30 కిలోమీటర్ల దూరంలో గుడిమల్లం గ్రామం మ్యాపులో చిన్నదిగా కనిపిస్తుంది. ఇక్కడి శ్రీపరశురామేశ్వరస్వామి ఆలయ చరిత్ర మాత్రం చాలా విశాలమైనది. పరిశోధకులకు కూడా అంతుచిక్కని శిల్పాకళా నైపుణ్యం ఆకట్టుకుంటుంది.
శ్రీకాళహస్తి నియోజకవర్గం ఏర్పేడు మండలం పాపానాయుడుపేటకు సమీపంలో గుడిమల్లం చిన్నగ్రామం. ఈ గ్రామంలోని పరశురామేశ్వరస్వామి ఆలయానికి యాత్రికులను ఆకట్టుకునే విధంగా వసతులు కల్పిస్తున్నట్లు ఆలయ చైర్మన్ గిరినాయుడు చెప్పారు. ప్రభుత్వ సహకారంతో మరిన్ని సదుపాయాలు కల్పించడానికి శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి తో కలిసి ప్రణాళిక సిద్ధం చేశామని ఆయన తెలిపారు.
ఏమిటి చరిత్ర... ప్రత్యేకతలు..
ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన శివలింగం. పురావస్తు శాస్త్రవేత్తల ప్రకారం, ఈ ఆలయంలోని శివలింగం క్రీస్తుపూర్వం ఒకటి లేదా మూడో శతాబ్దానికి చెందినది గుర్తించారు. దేశంలోనే మొదటి శివాలయంగా రెండు వేల సంవత్సరాల చరిత్ర ఉన్న గుడిమల్లం శ్రీపరశురామేశ్వరస్వామి ఆలయంలో వందల సంవత్సరాల తరువాత మహాకుంభాషేకం జరుగుతోంది. స్థల పురాణం ప్రకారం ...
"పరశురాముడు తన తల్లిని చంపిన పాపం నుంచి విముక్తి కోసం ఇక్కడ శివుడిన పూజించాడు. అందుకే పరశురామేశ్వారాలయం అని పేరు వచ్చింది" అని ఆలయ అర్చకుడు యోగేంద్ర పవన్ కుమార్ శర్మ చెప్పారు. ఈ ఆలయం ప్రత్యేకతలకు నిలయంగా కనిపిస్తుంది.
1. దేశంలోనే మొదటి శివాలయం
2.. ఈ ఆలయం గర్భగుడి చతురస్రాకారంలో కాకుండా గజపృష్ఠ (ఏనుగు వెనుక భాగం) ఆకృతిలో నిర్మించబడింది. శాతవాహనులు, పల్లవులు, చోళులు బాణ వంశీయులు ఈ ఆలయ అభివృద్ధికి కృషి చేశారు. ఆలయ గోపురం కూడా ఏనుగు నిలబడి ఉన్నప్పుడు వెనుక చూసినట్లు ఉంటుంది.
3. ఈ ఆలయంలోని శివలింగం మిగతా ఆలయాలకు బిన్నంగా ఉంటుంది. ఐదు అడుగుల ఎత్తులో శివలింగం, అది కూడా పురుషలింగ ఆకృతి ( Phallic shape) లో కనిపిస్తుంది. ఇందులో కూడా ప్రత్యేక ఉంది. ఈ శివలింగంపై శివుడు మానవరూపంలో కనిపించడం, శివుడిపై ఓ యక్షుడు (కుబ్జుడు) భుజాలపై నిలబడి ఉంటాడు. అదికూడా చేతిలో గండ్రగొడ్డలి, మేకపిల్ల, పాత్ర పట్టుకుని కనిపిస్తాడు.
4. శ్రీకాకుళం జిల్లా అరసవిల్లి, తిరుపతి జిల్లా నారాయణవనంలోని వేదనారాయణస్వామి ఆలయంలో మాత్రమే సూర్యకిరణాలు మూలమూర్తిని స్పర్శించడం తెలిసిందే. గుడిమల్లంలోని శ్రీపరశురామేశ్వరస్వామి ఆలయంలోని పురషలింగాకార శివలింగాన్ని సూర్యకిరణాలు ఏడాదికి ఒకసారి స్పర్శించడం కూడా ఓ ప్రత్యేకత.
5. గుడిలోపలికి ప్రవేశించాక, శివలింగం నాలుగు అడుగుల లోతులో చుట్టూర ప్రహరీ రెండు అడుగుల ప్రహరీ ఉంటుంది. దీనికి సమీపంలోని రెండు అడుగుల చిన్నబావి. సన్నదిలోని గోడకు ఉన్న రంధ్రం నుంచి సహజంగా నీరు రావడం, శివలింగాన్ని అభిషేకం చేయడం, కొన్ని గంటల తరువాత పూర్తిగా అదృశ్యం అయ్యే సంఘటన 60 సంవత్సరాలకు ఓసారి మాత్రమే కనిపించడం ఇక్కడి ప్రత్యేకత. 2005లో ఈ అరుదైన దృశ్యం కనిపించింది. మళ్ళీ... 2065 వరకు వేచి ఉండాలని ఆ ఆలయ చరిత్రను వివరిస్తున్నారుు.
ఈ శివలింగం ఒకే రాతితో (రాలి రాయి/Sandstone) తయారు చేశారు. ఇది పురావస్తు శాఖ ఆధీనంలో ఉండటం వల్ల, 2009 వరకు ఇక్కడ నిత్య పూజలు జరిగలేదు. ప్పుడు ఆగమ శాస్త్రం ప్రకారం పూజలు నిర్వహిస్తున్నారు.
అత్యంత పురాతన గుడిమల్లం శ్రీపరశురామేశ్వరాలయానికి మరింత ప్రాచుర్యం కల్పించే దిశగా చర్యలు తీసుకున్న ఆర్కిలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (Archaeological Survey of India ASI) డైరెక్టర్ (మైసూర్ సర్కిల్) కే. మునిరత్నంరెడ్డి చెప్పారు.
"ఈ ఆలయంలో వందల సంవత్సరాల తరువాత మహా కుంభాభిషేకం నిర్వహణ, ఆలయ పరిసరాల అభివృద్దికి" మంజూరు చేశామని ఏఎస్ఐ డైరెక్టర్ మునిరత్నంరెడ్డి వివరించారు.
ఎలా వెళ్లవచ్చు..
తిరుపతి నుంచి ఏర్పేడు మీదుగా పాపానాయుడుపేట నుంచి గుడిమల్లం వరకు బస్సు సదుపాయం ఉంది. వడమాలపేట నుంచి కూడా గుడిమల్లం వరకు రోడ్డు మార్గం ఉంది.
తిరుపతి నుంచి లేదా విజయవాడ నుంచి రైలు మార్గంలో శ్రీకాళహస్తి తరువాత వెళితే.. ఏర్పేడు స్టేషన్ లో దిగినా, రోడ్డు మార్గంలో గుడిమల్లం గ్రామానికి చేరవచ్చు.
రేణిగుంట విమానాశ్రయం ముందు నుంచి వెళ్లే మార్గంలో పాపానాయుడుపేట మీదుగా గుడిమల్లం చేరుకోవచ్చు.
Next Story

