తిరుమల లడ్డు మీద నిఘా, స్పెషల్ ఎనాలిసిస్ ల్యాబ్ ప్రారంభం
x

తిరుమల లడ్డు మీద నిఘా, స్పెషల్ ఎనాలిసిస్ ల్యాబ్ ప్రారంభం

హైటెక్ ల్యాబ్ ను ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు


తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదానికి వినియోగించే నెయ్యి కల్తీకి ఇక ఛాన్స్ లేదు. నూనె, పాలు, ముడిసరుకుల్లో సూక్ష్మస్థాయిలో కల్తీ జరిగినా పసిగట్టే పసిగట్టేస్తారు. నెయ్యి మాత్రమే కాదు. నీరు, ఆహార వస్తువుల నాణ్యతా పరీక్షలకు 20 కోట్ల రూపాయలతో అధునాతన ప్రయోగశాల శనివారం ప్రారంభించారు. దేశంలోని ఆలయాల్లో తిరుమలలోనే మొదటిసారి ఆధునిక యంత్రాలతో వాటర్ అండ్ ఫుడ్ అనాలసిస్ లేబొరేటరీ (Water and Food Analysis Laboratory) ఏర్పాటైంది.

తిరుమల తొమ్మిది నెలల వ్యవధిలో అత్యాధునిక యంత్రాలతో 12 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో రెండు అంతస్తుల్లో ఏర్పాటు చేసిన ఫుడ్ అనాలిసిస్ ల్యాబ్‌ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు శనివారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ ప్రయోగశాలలోని ప్రతి పరికరాన్ని పరిశీలించిన ఆయన వాటి పనితీరును అడిగి తెలుసుకున్నారు.

"యాత్రికుల నమ్మకం, విశ్వాసాలకు ఏమాత్రం భంగం కలగకుండా, కాపాడేందుకు నిరంతరం కృషి చేస్తూఉండాలి" అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు టీటీడీ అధికారులను ఆదేశించారు. నాణ్యమైన ప్రసాదం, తాగునీరు అందించేందుకు టెక్నాలజీని వినియోగిస్తూ చిత్తశుద్ధితో పని చేయాలని సూచించారు.

ఇదీ కారణం..

2024 సెప్టెంబర్ 18 తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో నెయ్యి కల్తీ వాడారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఎన్డీఏ ఎమ్మెల్యేల సమావేశంలో ప్రకటించడంలో కలకలం చెలరేగింది.
"తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు, పామోలిన్ వాడారు" అని వ్యాఖ్యానించడంతో రగిలిన రాజకీయ దుమారం ఇంకా చల్లారని స్థితిలో సీబీఐ సారధ్యంలోని సిట్ అధికారులు దర్యాప్తు చేసి, నెల్లూరు ఏసీబీ కోర్టులో ఈ ఏడాది జనవరి 27వ తేదీ చార్జిషీటు దాఖలు చేశారు.
"ఆ నివేదికలో కల్తీ కారకాలు, హవాలా లావా దేవీలపై సీబీఐ సమగ్రంగా దృష్టి సారించలేదు" అని టీటీడీ చైర్మన్ బీఆర్. నాయుడుతో పాటు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు కూడా అభిప్రాయపడ్డారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దినేష్ కుమార్ సారధ్యంలో ఏర్పాటైన ఏకసభ్య కమిషన్ విచారణ చేస్తోంది.
తిరుమలలో 1981లో వాటర్ క్వాలిటీ టెస్టింగ్ ల్యాబరేటరీ ఏర్పడింది. 1988లో దీని స్థాయి పెంచడం ద్వారా, ఆహార పదార్ధాల నమూనాలు పరీక్షించడం ప్రారంభించారు. 2018లో దీనికి ఎన్ బీఎల్ అక్రిడిటేషన్ లభించింది. ఈ ల్యాబ్లో సాధారణ స్థాయిలో పరీక్షలు మాత్రమే నిర్వహించే సామర్థ్యం ఉండేది.
తిరుమలలో కల్తీ నెయ్యి ప్రకంపనలు శ్రీవారి యాత్రికులను కలవరానికి గురి చేశాయి. దీంతో ఎన్డీఏ కూటమిలోని భాగస్వామ్యపక్షంలో ఉన్న బీజేపీ మంత్రులు కూడా స్పందించారు.
2024 అక్టోబర్ 8 వ తేదీ: రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ న్యూఢిల్లీలో ఎఫ్ఎస్ఎస్ఎఐ ( Food Safety and Standards Authority of India FSSAI )తో రాష్ట్ర అధికారులు ఓ ఒప్పందం చేసుకున్నారు. ఆ మరకు తిరుమలలో 12వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ప్రత్యేకంగా ఫుడ్ ల్యాబరేటరీ ఏర్పాటైంది. పలు పుణ్యక్షేత్రాల్లో ల్యాబ్స్ ఏర్పాటుపై ఎఫ్ఎస్ఎస్ఏఐతో కొన్ని రాష్ట్ర ప్రభుత్వాల మధ్య చర్చలు జరిగినా కార్యాచరణ మాత్రం తిరుమలతోనే సాధ్యమైంది.

నాణ్యత కోసం..

తిరుమలలో శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి వాడు నెయ్యితో పాటు ఆహార వస్తువుల నాణ్యత పరీక్షలు చేయడానికి 1981లో ఏర్పాటు చేసిన క్వాలిటీ టెస్టింగ్ ల్యాబ్ సామర్థ్యం చాలని పరిస్థితి ఏర్పడింది. నెయ్యి నాణ్యతా పరీక్షలకు మైసూరు లేదా గుజరాత్ లోని ఎన్డీడీడీబీ (National Dairy Development Board NDDB, Gujarat ) ల్యాబ్ పై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. కల్తీ నెయ్యి వ్యవహారం నేపథ్యంలో తిరుమలలో ఆధునిక వాటర్ అండ్ ఫుడ్ అనాలసిస్ లేబొరేటరీ ఏర్పాటు అనివార్యంగా భావించారు.

దేశంలోనే మొదట తిరుమలలోనే..


టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత తిరుమలలో కూడా సంస్కరణలకు బాటలు వేశారు. లడ్డూ ప్రసాదాల తయారీకి స్వచ్ఛమైన నెయ్యి, అన్నప్రసాదాల తయారీలో నాణ్యతకు ప్రాధాన్యత ఇచ్చారు. అందులో భాగంగానే కోనుగోలు చేసే వస్తువుల్లో నాణ్యతా ప్రమాణాల పరీక్షకు దేశంలోని ఆలయాల్లో తిరుమలలో మొదటి అధునాతన ల్యాబ్ ఏర్పాటు చేశారు. ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ (FSSAI ), రాష్ట్ర ప్రభుత్వ సహకారం, చొరవతో (కోర్ ల్యాబ్‌కు రూ.25 కోట్లు, ఈ-టంగ్/ఈ-నోస్‌కు రూ.3.5 కోట్లు, పవర్ సెటప్‌కు రూ.1.10 కోట్ల రూపాయల వ్యవయంతో 12వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో రెండు అంతస్తుల్తో అధునాతన ల్యాబ్ ఏర్పాటు చేశారు. ఈ ల్యాబ్‌లో ఆరువేల చదరపు అడుగులు రసాయనాల విశ్లేషణకు, మరో ఆరువేల చదరపు అడుగులు మైక్రో బయాలాజికల్ విశ్లేషణకు కేటాయించారు.

ఇవి ఎలా పనిచేస్తాయి..

తిరుమలలో ఈ అధునాతన ల్యాబ్ ప్రారంభించిన తరువాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ప్రతి పరికరం పనితీరును పరిశీలించారు.
న్యూఢిల్లీ నుంచి వచ్చిన ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పాండా, సిఎఫ్‌టీఆర్‌ఐ డైరెక్టర్ గిరిధర్ ల్యాబ్‌ ల్యాబ్‌లో ఏర్పాటు చేసిన 50కి పైగా పరికరాలను పనితీరును వివరించారు.

"ఈ పరిశోధనశాలలో టీటీడీ వాటర్ అండ్ ఫుడ్ అనాలిసిస్ చేస్తుంది. వివిధ వనరుల నుంచి నమూనాలను సేకరించి పరీక్షలు చేస్తారు. యాత్రికులకు మరింత సురక్షితమైన నీరు, ఆహారం అందించడానికి కూడా దోహదం చేస్తుంది" అని ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పాండా, సిఎఫ్‌టీఆర్‌ఐ డైరెక్టర్ గిరిధర్ వివరించారు.
వారు ఇంకా ఏమి చెప్పారంటే..
"శ్రీవారికి ప్రసాదం, అన్నప్రసాదం తయారీలో ఉపయోగించే ముడి పదార్థాలను పరీక్షిస్తారు. ప్రతి నెల వెయ్యి నుంచి 1,500 నమూనాలు పరీక్షలు నిర్వహించడానికి సిబ్బంది అందుబాటులో ఉంటారు" అని ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పాండా ముఖ్యమంత్రికి చెప్పారు
ఏ పరికరం ఎలాంటి పరీక్షలు చేస్తుందంటే..
తిరుమలలో నెయ్యి, నూనెలు, ఆహార ముడిసరుకుల్లో నాణ్యత పరీక్షలకు ప్రాన్స్ లో తయారు చేసిన ఈ-టంగ్, ఈ-నోస్ యంత్రాలు ఏర్పాటు చేశారు. దేశంలోని తక్కువ సంఖ్యలోని పరిశోధనశాల్లో మాత్రమే ఈ తరహా యంత్ర పరికరాలు అందుబాటులో ఉన్నాయి. వాటికి మించిన స్థాయిలో తిరుమల ల్యాబ్ లో అందుబాటులోకి తెచ్చారు.
"మనిషి ముక్కు ద్వారా వాసన, నోటితో వాసన ఎలా చూడగలరో.. ఆ తరహాలోనే ఈ యంత్రాల ద్వారా ప్రసాదాలు, ఆహార పదార్థాలు, వాటి తయారీకి వాడే ముడి సరుకులను కూడా పరీక్షించే సామర్థ్యం ఉంది" అని పరిశోధనశాల నిపుణులు వెల్లడించారు. ఈ-నోస్ యంత్రాలకు అవసరమైన గ్యాస్ సిలిండర్లు కూడా ఫ్రాన్స్ నుంచి తెప్పించే అవకాశాలు ఉన్నట్టు టీటీడీ అధికారవర్గాల సమాచారం.

పరికరాలు పనితీరు ఇలా...


1) GC/GC-MS : కొవ్వు ఆమ్లాలు, పురుగుమందులు, వాయువీయ పదార్థాల పరీక్షలు.

2) HPLC/LC-MS : మైక్రోటాక్సిన్లు, ఔషధాలు, యాడిటివ్‌ల పరీక్షలు
3) AAS/ICP-MS : ఆహారం, నీటిలో భారీ లోహాల గుర్తింపు.
4) ఇతర పరికరాలలో ఫైబర్/ప్రోటీన్/ఫ్యాట్ అనలైజర్లు, బ్యూటిరో రిఫ్రాక్టోమీటర్, యూవీ-విజిబుల్ స్పెక్ట్రోఫోటోమీటర్ ఉన్నాయి.

"తిరుమల పరిశోధనశాలలో e-tongue, e-nose వంటి అత్యాధునిక సౌకర్యాలు ఉన్నాయి. ఇవి ఆహార పదార్థాల రుచి, వాసనను డిజిటల్ పద్ధతిలో ఖచ్చితంగా విశ్లేషించగలవు" అని ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పాండా ఇచ్చిన వివరణకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సంతృప్తి వ్యక్తం చేశారు. 2024 నవంబరులో NDDB సంస్థ విరాళంగా అందించిన ఆధునిక GC/HPLC యంత్రాల ద్వారా నెయ్యి స్వచ్ఛతను అత్యంత శాస్త్రీయంగా ఇక్కడే నిర్ధారించవచ్చని అధికారులు వెల్లడించారు.

2025 జూలై నుంచి నెయ్యి నాణ్యతపై విస్తృత స్థాయిలో పరీక్షలు నిర్వహిస్తున్నామని, దీనివల్ల కల్తీకి ఏమాత్రం అవకాశం ఉండదని ముఖ్యమంత్రి చంద్రబాబుకు వివరించారు.
"ముడి పదార్థాల్లో ఉంటగలిగే పురుగు మందుల అవశేషాలు, యాంటీ బయోటిక్స్, లెడ్, ఆర్సినిక్ వంటి హెవీ మెటల్స్ కనుగొనే సామర్థ్యం పరికరాలు పసిగడతాయి" అని ఈ ల్యాబులో ఏర్పాటు చేసినట్లు అధికారులు స్పష్టం చేశారు.

అభినందనీయమే.. జాగ్రత్తగా ఉండాలి


శ్రీవారి యాత్రికుల మనోభిప్రాయాలు ప్రామాణికంగా నాణ్యతకు ప్రాధాన్యత ఇవ్వండి అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ల్యాబ్ సైంటిస్టులు, అధికారులకు దిశానిర్దేశం చేశారు. నిరంతరం అప్రమత్తంగా పరీక్షలు సాగించి, లడ్డూ ప్రసాదాలు, ఆహార పదార్థాల తయారీలో రుచికి ప్రాధాన్యం ఇచ్చే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన టీటీడీ అధికారులకు కూడా సూచన చేశారు.

"ల్యాబ్ లో బ్యాక్టీరియా గుర్తింపు కోసం ప్రత్యేకంగా క్లీన్ రూం, ఎయిర్ హ్యాండ్లింగ్ సిస్టమ్ వంటి భద్రతా ప్రమాణాలు బాగున్నాయి" అని ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందించారు. శ్రీవారి ప్రసాదాల పట్ల భక్తులకు ఉన్న అపారమైన నమ్మకాన్ని కాపాడటమే తమ ప్రభుత్వ ప్రథమ కర్తవ్యంగా అధికారులు పని చేయాలని స్పష్టం చేశారు. కేవలం ల్యాబ్ పరీక్షలకే పరిమితం కాకుండా, అన్నప్రసాద కేంద్రాల్లోని వంటశాలల శుభ్రతపై నిరంతర తనిఖీలు నిర్వహించి పరిశుభ్రతను నిర్ధారించాలని ఆదేశించారు. భక్తుల ఆరోగ్య రక్షణకు మాత్రమే కాకుండా, తిరుమలలో చేపట్టిన ఫుడ్ సేఫ్టీ చర్యలు దేశానికే ఒక ఆదర్శంగా నిలుస్తాయని ముఖ్యమంత్రి కొనియాడారు.

సత్యకుమార్ పాత్ర కీలకం..

తిరుమలలో ఫ్యాప్సీతో కుదుర్చుకున్న ఒప్పందంలో మంత్రి సత్యకుమార్ యాదవ్ కూడా కీలకపాత్ర పోషించారు. శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీ ఘటన నేపథ్యంలో ఆయన స్పందించారు. ఈ మిషన్ కొనుగోలుకు అవసరమైన 3.5 కోట్ల రూపాయలకు అదనంగా కూడా నిధులు ఇవ్వడానికి కేంద్రం అంగీకరించింది.
2024 జూన్ ఒకటో తేదీ ప్రారంభమైన ల్యాబ్ ఏర్పాటు పనులు టీటీడీ సహకారం, రాష్ట్ర ప్రభుత్వం చొరవ వల్ల ఇవన్నీ తొమ్మిది నెలల్లో సాధ్యమయ్యాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖామంత్రి సత్యకుమార్ యాదవ్ చెప్పారు.
"కల్తీ నెయ్యి ఘటన నేపథ్యంలో ప్రత్యేకంగా తిరుమలలో ల్యాబ్ కు సుమారు రూ.25 కోట్ల వరకు ఖర్చయిందనీ, టీటీడీ స్థలం కేటాయించడంతో కేంద్ర ప్రభుత్వం నిధులు సమకూర్చింది" అని రాష్ట్ర మంత్రి సత్యకుమార్ చెప్పారు.
"చిన్న పెద్దా కలిపి 50 పరికరాలు/యంత్రాలు ఉన్నాయి. ఆహార పదార్థాల్లో సేకరించిన ఒక్కో నమూనాలు పదుల సంఖ్యలో పరీక్షించే సామర్థ్యం ల్యాబ్ కు ఉంది. ముడి సరుకులు, ఇతర నమూనాల విషయాల్లోనూ ఇలాగే పరీక్షలు జరుగుతాయి. గరిష్టంగా ఒక నమూనా ద్వారా 50 రకాల పరీక్షలు చేయడానికి వీలుoది.
దినుసులు కూడా...
తిరుమలలో ఏర్పాటైన ప్రయోగశాలలో ప్రసాదాలు, వాటికి వినియోగించే ముడిసరకుల్లో పురుగు మందుల అవశేషాలు, భారలోహాలు, క్రిమికీటకాలు, వంటి వాటి గురించి నమూనాలు పరీక్షించడం ద్వారా తెలుసుకుంటారు. ప్రసాదాల తయారీకి ఉపయోగించే నెయ్యి, జీడిపప్పు, క్రిస్మిస్, బాదంపప్పు, శనగలు, చక్కెర, యాలకులు, పసుపు కారం వంటి నమూనాలను ఈ ల్యాబ్లో పరీక్షిస్తారు. నెయ్యి, నూనెలో ఉండాల్సిన కొవ్వుల శాతం, వెజిటబుల్ ఆయిల్, జంతువుల కొవ్వు వంటివాటిని సులువుగా గుర్తిస్తారు లడ్డూల్లో ఎనర్జీ లెవల్స్, వాడిన నెయ్యిని, ఆహారంలో బ్యాక్టీరియా ఉందా? లేదా? కూడా ఈ ల్యాబ్లో పరీక్షిస్తారు. దీంతో ఇకపై కల్తీకి ఏమాత్రం ఆస్కారం ఉండబోదనే విశ్వాసం వ్యక్తం అవుతోంది.
Read More
Next Story