తిరుమల యాత్రికులతో తాతా, మనవడి సందడి..
x
తిరమల మాడవీధుల్లోని గ్యాలరీల్లో యాత్రికులతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, మనవడు నారా దేవాన్ష్.

తిరుమల యాత్రికులతో తాతా, మనవడి సందడి..

12వసారి టీటీడీ అన్నదానానికి రూ.44 లక్షలు విరాళం అందించిన సీఎం చంద్రబాబు.


వారసుడు అంటే ఎవరైనా మురిపెమే. దీనికి పేద, ధనిక అనే తేడా ఏమీ ఉండడు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు తిరుమలలో యాత్రికులతో స్వయంగా కలిసి మాట్లాడారు. ఆయన వెంట ఉన్న మనవడు నారా దేవాన్ష్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచారు. తల్లి నారా భువనేశ్వరి తోకలిసి మంత్రి హోదాను కూడా మరిచి నారా లోకేష్ యాత్రికులతో ఆత్మీయత పంచుకున్నారు.


ముఖ్యమంత్రి నారా చంద్రబాబు మనవడు నారా దేవాన్ష్ పుట్టినరోజు శ్రీవారి ఆశీస్సుల కోసం భార్య భువనేశ్వరి, కొడుకు నారా లోకేష్ తో కలిసి తిరుమలకు వచ్చారు. శనివారం ఉదయం శ్రీవారి దర్శనం తరువాత మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ నిత్యాన్నదాన సత్రానికి శ్రీవారి ఆలయం నుంచి మాడవీధుల్లో నడుస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు బయలుదేరారు. ఇది కాసేపు పక్కన ఉంచితే..
టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు స్టైల్ మారింది. ప్రతి నెలా చివరిలో ఒక నియోజకవర్గానికి వెళుతున్న ఆయన ప్రజావేదికపై నుంచి మాట్లాడడం, ఎంపిక చేసిన కాలనీలో ప్రతి ఇంటినీ సందర్శించడం, రైతులు, మహిళలతో గ్రామ సమస్యలపై ఒంటరిగా మాట్లాడుతూ పరిస్థితిని వాకబు చేయడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు.
తిరుమల పర్యటనలో కూడా గతానికి భిన్నంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అదే పంథా సాగించారు. భద్రతను కూడా పక్కన ఉంచిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు శ్రీవారి పుష్కరిణికి సమీపంలోని వరాహస్వామి ఆలయానికి సమీపంలో గ్యాలరీల్లో ఉన్న యాత్రికుల వద్దకు వెళ్లారు. సమీపంలోని నిలబడిన నారా దేవాన్ష్ ను కూడా యాత్రికులు పలకరించారు. శ్రీవారి దర్శనం, లడ్డూ, అన్నప్రసాదాలపై యాత్రికులతో ముఖ్యమంత్రి చంద్రబాబు వాకబు చేశారు. ఆయనతో కరచాలనం చేయడానికి యాత్రికులు పోటీ పడ్డారు.

మాడ వీధుల్లో వేచి ఉన్న భక్తులతో సీఎం చంద్రబాబు, మనవడు దేవాన్ష్ ఫోటొలు దిగారు. సెక్యూరిటీని పక్కన పెట్టి భక్తుల వద్దకు వెళ్ళి వారితో కరచాలనం చేశారు. ఈ సందర్భంగా చాలా మంది యాత్రికులు దేవాన్ష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

తిరుమల మాడవీధుల్లోని గ్యాలరీల వద్ద ఆగిన చంద్రబాబు మహిళలతో కూడా మాట్లాడారు. పిల్లలను ఎత్తుకుని ఆడించడం ద్వారా సందడి చేశారు. దీంతో పిల్లల తల్లిదండ్రులు సంబరపడిపోయారు.

యువత కేరింతలు...


తిరుమలలో అన్నదాన సత్రానికి సమీపంలో ఉన్న యాత్రికులతో పాటు యువతతో భేటీ అయ్యారు. ముఖ్యమంత్రిని చుట్టుముట్టిన యువకులు ఆయనతో ఆసక్తి చూపించారు. వారితో అనేక విషయాలపై ముఖ్యమంత్రి చంద్రబాటు మాట్లాడిన తీరు గ్రామాలకు వెళ్లినప్పుడు ఎలా వ్యవహరిస్తున్నారో అదే పద్ధతిలో యాత్రికులు, యువతతో భేటీ అయ్యారు.

దర్శనంపై ఏమన్నారంటే..
తిరుమల మాడవీధుల్లోని గ్యాలరీల్లో ఉన్న యాత్రికులు సమస్యలు చెప్పడంతో పాటు శ్రీవారి దర్శనం త్వరగా చేయించడానికి చర్యలు తీసుకోవాలని ప్రత్యేకంగా గుర్తు చేశారు. గంటల తరబడి నిరీక్షించకుండా, వీలైనంత త్వరగా ఆలయంలోకి వెళ్లే విధంగా చూడాలని అభ్యర్థించారు. దీనికి స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు
"ఐటీ శాఖ మంత్రి లోకేష్ చొరవతో టీటీడీలో కమాండ్ కంట్రోల్ కేంద్రం ఏర్పాటు చేయించాం. భక్తుల సౌకర్యం కోసమే టిటిడి ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ వ్యవస్థను ఏర్పాటు చేశారు" అని ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించారు. ఏఐ టెక్నాలజీతో శ్రీవారి దర్శనం త్వరగా పూర్తి చేయించడానికి టిటిడి చర్యలు తీసుకుంటోందని వివరిం ఆయన వివరించారు.

12వ సారి అన్నదానానికి విరాళం..


తిరుమల శ్రీవారి క్షేత్రంలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ నిత్యాన్నదాన సత్రంలో అన్నదానం చేయడానికి ఒక రోజు ఖర్చు రూ. 44 లక్షలు అవుతుంది. ఆ మొత్తం చెల్లించే వారి పేరు అన్నదాన సత్రంలో ప్రసారం చేయడంతో పాటు అన్నప్రసాదాలు వడ్డించే వెసులుబాటు టీటీడీ కల్పిస్తోంది.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు మనవడు నారా దేవాన్ష్ పుట్టినరోజు తిరుమలలో యాత్రికుల మధ్య సాధారణంగా నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబం దేవాన్ష్ పుట్టినరోజు కావడంతో శనివారం 12వసారి అన్నదాన పథకానికి 44 లక్షల రూపాయలు విరాళం అందించారు.

సందడి.. సందిడిగా...


తరిగొండ వెంగమాంబ నిత్యాన్నదాన సత్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు కుటుంబీకులు యాత్రికుల మధ్య సామాన్యుల్లా కలిసిపోయారు. భద్రతా చర్యలు ఉన్నప్పటికీ వాటన్నింటినీ పక్కన పెట్టారు.
అన్నదాన సత్రంలో యాత్రికులు టేబుళ్ల ముందు కూర్చుని ఉన్నారు. వరుసలో ట్రాలీ స్వయంగా తోసుకుంటూ వచ్చి, ఒకపక్క తాత చంద్రబాబు శనివారం ఉదయం అల్పాహారంగా పొంగలి వడ్డిస్తున్నారు. మరో వరుసలో మనవడు నారా దేవాన్ష్ యాత్రికులకు అల్పాహారం వడ్డించారు. చాలని చెబుతున్నా వినకుండా దేవాన్ష్. ఇంకొంచెం వేయించుకోండి గోవిందా. రుచిగా ఉంది. హాయిగా తినండి అని చెప్పడంతో యాత్రికులు ముచ్చటపడ్డారు.

మేమూ అంతే...


మరోపక్క తల్లి నారా భువనేశ్వరితో కలిసి మంత్రి నారా లోకేస్ కూడా సందడి చేశారు. తల్లి భువనేశ్వరి ఆహార పదార్ధాల ట్రాలీ తోసకుని వస్తుంటే, అరటి ఆకులో నారా లోకేష్ పొంగలి, ఉప్మా వడ్డించారు. నమస్కరించిన వారికి ప్రతి నమస్కారం చేయడం, వారి పిల్లలను ముద్దాడి, కొసరి కొసరి వడ్డించారు. నారా భువనేశ్వరి కూడా మహిళలతో మాట్లాడుతూ, ఆహార పదార్థాలు వడ్డించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.


యాత్రికులందరికీ అన్నప్రసాదాలు వడ్డించిన తరువాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు కుటుంబసభ్యులు కూడా అన్నదాన సత్రంలోనే అందరితో కలిసి అన్నప్రసాదాలు రుచి చూశారు.

Read More
Next Story