రాయలసీమ ఎత్తిపోతల పథకం సాధనకు మరో పోరాటానికి సన్నద్ధం కావాలని తిరుపతి వేదికగా బుధవారం నిర్ణయించారు. "రాయలసీమ ఎత్తిపోతల సాధన సమితి" బ్యానర్ కింద భవిష్యత్తు పోరాటాలు సాగించాలని తీర్మానించారు. దీనికిముందే 40 ఏళ్ల కరువుబండ యాత్ర స్ఫూర్తిని రగల్చడానికి పోతిరెడ్డిపాడుకు వెళ్లి రావాలని కూడా సూత్రప్రాయంగా నిర్ణయించారు.
రాయలసీమ జిల్లాల సాగు, తాగునీటి అవసరాలు తీర్చడానికి పోతిరెడ్డిపాడు వద్దకు సాగించిన కరువుబండ యాత్రకు 40 ఏళ్లు నిండాయి. ఆ పోరాట స్ఫూర్తిని రగల్చడం ద్వారా రాయలసీమ ఎత్తిపోతల పథకం సాధన ప్రధాన కర్తవ్యంగా చర్చా గోష్ఠి నిర్వహించారు. సీనియర్ జర్నలిస్టు రామచంద్రారెడ్డి మోడరేటర్ గా వ్యవహరించిన ఈ గోష్టికి "కరువుబండ యాత్ర" రూపకల్పన, ఆ పాదయాత్ర ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన రాయలసీమ అధ్యయన వేదిక అధ్యక్షుడు భూమన్ అధ్యక్షత వహించారు. ఈ సభకు వామపక్షాలతో పాటు, కాంగ్రెస్ పార్టీ, టీటీడీ ఉద్యోగ సంఘ మాజీ నేతలు హాజరయ్యారు.
"రాయలసీమ ప్రజల జీవితాల్లో నీరు ఒక సమస్య మాత్రమే కాదు. అది ఒక పోరాటం, ఒక ఆశ, ఒక నిరంతర ఉద్యమం. ఆ ఉద్యమంలో ఒక చారిత్రాత్మక ఘట్టమే పోతిరెడ్డిపాడు పాదయాత్ర. రాయలసీమకు నీటి హక్కు కల్పించాలనే సంకల్పంతో సాగిన ఈ పాదయాత్ర ముగిసి నేటికి 40 సంవత్సరాలు పూర్తయ్యాయి" అని సభకు అధ్యక్షత వహించిన భూమన్ గుర్తు చేశారు. ఆ సందర్భాన్ని గుర్తు చేయడం ద్వారా రాయలసీమ భవిష్యత్తు నీటి అవసరాలపై రాయలసీమ సాగునీటి అవసరాల ఉద్యమానికి ఐక్య పోరాటాలు అనివార్యమని భావించే "రాయలసీమ ఎత్తిపోతల పథకం పై చర్చా గోష్టి"కి నాంది పలికామని భూమన్ చెప్పారు. వైసీపీ ఎంఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యంతో పాటు, తిరుపతి ఎంపీ మద్దెల గురుమూర్తి, వామపక్ష నేతలు కందారపు మురళీ, వందవాసి నాగరాజు, జనార్థన్, రైతుల సంఘాల నేతలు పాల్గొన్నా ఈ సమావేశంలో..
తీర్మానాలు ఇవీ..
1) రాయలసీమ ఎత్తిపోతల పథక సాధన కోసం "రాయలసీమ ఎత్తిపోతల సాధన సమితి"గా నామకరణం చేశారు. ఈ బ్యానర్ కిందే రాయలసీమ అవసరాల కోసం హక్కుగా రావలసిన నీటిని సాధించే దిశగా ఉద్యమించాలని నిర్ణయించారు.
2) రాయలసీమ నీటి సమస్యలపై ప్రజల్లో అవగాహన పెంపొందించడం
3) గత పోరాటాల నుంచి పాఠాలు నేర్చుకోవడం
4) భవిష్యత్తు విధానాలపై సార్థకమైన చర్చకు వేదిక కల్పించడం అనే తీర్మానాలు చేశారు.
ఈ చర్చా వేదికలో అనేక అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. అందులో రాయలసీమ నీటి సమస్య, ఎత్తిపోతల పథకాల ప్రాధాన్యత, పోతిరెడ్డి పాడుప్రాజెక్టుల చారిత్రక నేపథ్యంపై సింహావలోకనం చేసుకున్నారు. వీటిని సాధించడానికి గతంలో ఎదురైన సవాళ్లు, భవిష్యత్తులో తీసుకోవాల్సిన నిర్ణయాలపై విస్తృతంగా చర్చ జరిగింది.
పాదయాత్రలో పాల్గొన్న ఉద్యమకారుల పోరాటాన్ని గుర్తు చేస్తూ, ఆ కాలంలో నీటి కోసం నడిచిన అడుగులు నేటి తరానికి ఒక బాధ్యతగా స్పూర్తిగా మారాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడ్డారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం వంటి ప్రాజెక్టులు కేవలం నిర్మాణాలు కాదు, కోట్లాది ప్రజలు ముఖ్యంగా రైతుల జీవనాధారమని స్పష్టం చేశారు.
నీటి కోసం నడిచిన ఆ ఉద్యమాన్ని స్మరిస్తూ, రాయలసీమకు న్యాయం జరగాల్సిన అవసరాన్ని మరోసారి గుర్తు చేసిన ఈ కార్యక్రమం ఒక ఆలోచనాత్మక సందేశాన్ని సమాజానికి అందించింది.
వామపక్షాల సంఘీభావం
రాయలసీమ సాగు, తాగు నీటి అవసరాలపై నిర్వహించే ఐక్య పోరాటాలకు వామపక్షాలు సంఘీభావం ప్రకటించాయి. సిపిఎం రాష్ట్ర నాయకుడు కందారపు మురళి మాట్లాడుతూ ," రాయలసీమ ఎత్తిపోతల పథకాన్నినేనే ఆపించానని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన ప్రకటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సమాధానం చెప్పాలి" అని కందారం మురళి డిమాండ్ చేశారు. జాతీయ అభ్యంతరం చెప్పిన నేపథ్యంలో తాగునీటి పథకం గా మార్చిన రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని సాధించుకునే దిశగా రాయలసీమ ఉద్యమకారులతో కలిసి సిపిఎం పనిచేస్తుందని మురళి స్పష్టం చేశారు. రాయలసీమలో తాగునీటి పథకాలు పూర్తి కావడానికి రెండు లక్షల కోట్లు అవసరమనే విషయాన్ని ఆయన గుర్తు చేశారు. వైసీపీ ప్రభుత్వం లో మూడు టీఎంసీల నీటిని ఎత్తిపోతల పథకం ద్వారా రాయలసీమతో పాటు నెల్లూరుకు ఇవ్వాలని మాజీ ముఖ్యమంత్రి జగన్ సంకల్పించారని, వివాదాలు పక్కన ఉంచితే ఈ పథకం రాయలసీమతో పాటు నెల్లూరు జిల్లాకు కూడా మేలు చూస్తుందనే విషయాన్ని గుర్తు చేశారు.
రాయలసీమలో అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులతోపాటు తాగు నీటి అవసరాలకు అవసరం ఆయన ఎత్తిపోతల పథకం సాధన పోరాటానికి కలిసి వస్తామని సిపిఐ అనుబంధ రైతు సంఘం నాయకుడు జనార్ధన్ స్పష్టం చేశారు. సేద్యపు నీటి ప్రాజెక్టులపై మొదటి నుంచి వామపక్షాలు సాగించిన పోరాటాలను ఆయన ప్రస్తావించారు. దేశంలో కరువు పీడిత ప్రాంతానికి రాయలసీమ గేట్వేగా ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలు అనేదే కాకుండా ఈ ప్రాంత ప్రజలు, రైతాంగ ప్రయోజనాలు కాపాడడానికి పోరాటాలకు కలిసి వస్తామని ఆయన స్పష్టం చేశారు.
రాయలసీమ ప్రయోజనాలు కాపాడాలంటే పార్టీల అస్తిత్వ పోరాటాలకు సెలవు చెప్పాలని సిపిఎం తిరుపతి జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు హితవు పలికారు.
"సాంకేతిక అంశాలతో నీటి ప్రాజెక్టులకు ఆటంకాలు సృష్టించే కేంద్ర ప్రభుత్వ తీరుపై వైయస్ జగన్ కూడా బహిరంగంగా గళం వినిపించాలి"అని నాగరాజు సూచించారు. రైతాంగ సమస్యల పైన ఐక్య ఉద్యమాలు అవసరం. దీనికోసం పార్టీ జెండాలు పక్కనపెట్టి ఒకే అజెండా ఎంచుకోవాల్సిన అవసరాన్ని కూడా నాగరాజు గుర్తు చేశారు. అప్పుడే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ తూముల సామర్థ్యం పెంపుదల కోసం సాగించిన 40 ఏళ్ల కిందటి పోరాట చరిత్రకు అర్థం ఉంటుందని కూడా ఆయన వ్యాఖ్యానించారు.
నాగరికతకు నీరే ప్రాణం.
ఏ దేశ చరిత్ర చూసినా నాగరికత పెరగడానికి నీరు అనేది ప్రధాన వనరు అనే విషయాన్ని గుర్తించాలని తిరుపతి వైసీపీ ఎంపీ మద్దెల గురుమూర్తి వ్యాఖ్యానించారు. లిఫ్ట్ ఇరిగేషన్ తోపాటు నికర జలాలు సాధించుకునే దిశగా పోరాట కార్యక్రమాలు సాగించాల్సిన అవసరాన్ని ఆయన గుర్తు చేశారు.
"రాయలసీమ ఎత్తిపోతల పథకంతో పాటు ఈ ప్రాంత ప్రయోజనాలను కాపాడేందుకు పార్లమెంటు వేదికగా మరింత గట్టిగా గొంతు వినిపిస్తా" అని తిరుపతి ఎంపీ మధ్యలో గురుమూర్తి స్పష్టం చేశారు. నీటి కోసం రాష్ట్రాల మధ్య యుద్ధాలు జరగడం అనేది వాంఛనీయం కాదని ఆయన ప్రభుత్వానికి హితవు పలికారు.
"విజన్ అంటే కళ్ళు మూసుకొని కలలు కనడం కాదు. వాస్తవ పరిస్థితిని అర్థం చేసుకొని ప్రజలు కోరుకునే వనరులను గ్రామాల చెంతకు తీసుకురావాలి" అని ఎంపీ గురుమూర్తి చెప్పారు.
రాయలసీమలో సాగునీటి ప్రాజెక్టులు ప్రధానంగా రాయలసీమ ఎత్తిపోతల పథకం పై రాజకీయ వ్యాఖ్యలతో బురద జల్లడం మానుకోవాలని ఆయన కూటమి ప్రభుత్వానికి హితవు పలికారు. వాస్తవ స్థితిని గమనించి ఎత్తిపోతల పథకం ప్రాధాన్యతను గుర్తించాలని తిరుపతి ఎంపీ మద్దెల గురుమూర్తి సూచించారు.
రాయలసీమను దుర్భిక్ష పరిస్థితుల నుంచి కాపాడడానికి పెండింగ్ ప్రాజెక్టును పూర్తి చేయాల్సిన అవసరం ఉందని మాజీ ఎమ్మెల్సీ ఎడపల్లి శ్రీనివాసులు రెడ్డి కోరారు. హంద్రీనీవా సుజల స్రవంతి కాలువలు వైయస్ రాజశేఖర్ రెడ్డి సీఎం గా ఉన్నప్పుడే పనులను వేగవంతం చేయడం ద్వారా 70 శాతం పూర్తి చేసిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు.
"గుక్కెడ నీరు, సేద్యపు నీటి కోసం రాయలసీమ తల్లడిల్లుతుంటే, రైస్ బౌల్ గా పేరుపొందిన ప్రాంతంలో ఇబ్రహీంపట్నం వద్ద ఎత్తిపోతల పథకం పై అంత ఆసక్తి ఎందుకు" అని మాజీ ఎమ్మెల్సీ ఎడపల్లి శ్రీనివాసులు రెడ్డి ప్రశ్నించారు.
తిరుపతి వైసీపీ సమన్వయకర్త భూమన అభినయరెడ్డి ఈ సభ నిర్వహణకు కీలక పాత్ర పోషించారు.
"రాయలసీమ చారిత్రక పోరాటాలను ప్రజల్లేకి తీసుకువెళ్లే చైతన్యవంతులు చేయాల్సిన అవసరం ఏర్పడింది" అని అభినయ రెడ్డి చెప్పారు. మరోసారి ఉద్యమకారులతో సన్నాహక సమావేశం నిర్వహించి భవిష్యత్ కార్యాచరణ సిద్ధం చేస్తామని ప్రకటించారు. రాయలసీమలో విద్యార్థులు, యువజనులను, అన్ని పార్టీల నాయకులను ఒక వేదిపక ఎక్కి తీసుకురావడం ద్వారా భవిష్యత్ కార్యాచరణ అమలు చేయడానికి త్వరలోనే సన్నాహక సమావేశం జరుగుతుందని ఆయన చెప్పారు.
ఈ సభలో టీటీడీ ఉద్యోగుల సంఘం మాజీ కోశాధికారి టీ దాసు, కాంగ్రెస్ పార్టీ నాయకుడు డిఎంసి భాస్కర్, రాయలసీమ ఉద్యమ నాయకురాలు డాక్టర్ మస్తానమ్మ, రాజారెడ్డి తోపాటు అనేక సంఘాల నాయకులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.