
వారసత్వ పగ్గాలు: హథీరాంజీ మఠం పాలన మళ్లీ అర్జున్ దాస్ చేతికే...
సుదీర్ఘ న్యాయపోరాటం. కాణిపాకంలో బాధ్యతల స్వీకారం.
తిరుపతి హథీరాం బాజీ (హథీరాంజీబాబా) మఠం మహంతు అర్జున్ దాస్ కు మళ్లీ వారసత్వ, పరిరక్షణ పాలక బాధ్యతలు దక్కాయి. సుమారు 1000 కోట్ల రూపాయల ఆస్తుల సంరక్షణ బాధ్యతలు మళ్లీ ఆయన చేట్టనున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంగళవారం ఆ మేరకు ఆదేశాలు జారీ చేసింది. తిరుపతిలోని హథీరాం బాజీ మఠం ఫిట్ పర్సన్ గా ఉన్న కాణిపాకం ఆలయ ఈఓ వద్ద బాధ్యతలు చేపట్టడానికి అర్జన్ దాస్ ఢిల్లీ నుంచి ఆఘమేఘాల మీద బెంగళూరు విమానాశ్రయానికి చేరుకుని, అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ఆయన కాణిపాకం ఆలయం వద్దకు రానున్నారు.
"రాత్రి ఏడు గంటల వరకు అర్జున్ దాస్ కాణిపాకం ఆలయం వద్దకు రాలేదు. ఆయన కోసం వేచిచూస్తున్నాం" అని కాణిపాకం ఆలయ ఈఓ పెంచల్ కిషోర్ క్యాంప్ క్లర్క్ (సీసీ) ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ ప్రతినిధికి చెప్పారు. ఈ వివరాలు తెలుసుకునేందుకు ఈఓ పక్షాన ఆయన సీసీ మాత్రమే మాట్లాడారు.
తిరుమల శ్రీవారి తో పాచికలాడిన పరమ భక్తుడిగా హథీరాం బాజీకి ఆధ్యాత్మిక ప్రపచంలో సుదీర్ఘ చరిత్ర ఉంది. వారసత్వ సంపద పరిరక్షణలో పట్టాభిషేకం నిర్వహించే అరుదైన ఘట్టాలకు వేదికగా రెండుమఠాలు ఉన్నాయి. కడప జిల్లా బ్రహ్మంగారిమఠం వారసడిగా పీఠాధిపతి, తిరుపతిలోని హథీరాం బాజీ వారసుడిగా మహంతుకు మాత్రమే పట్టాభిషేకం జరిగే ఆచారం ఇప్పటికీ ఉంది.
మహంతుల పాత్ర
తిరుమల తోపాటు తిరుపతిలో హథీరాం బాజీ మఠం వారసత్వ బాధ్యతలు నిర్వహణలో మహంతులదే కీలక పాత్ర. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం బాథ్యతల నుంచి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వారు తప్పుకోవాలని భావించారు. ఈ ఆలయ బాధ్యతలు ఎవరికి అప్పగించాలని చర్చ జరిగింది. శ్రీవారి మిత్రుడిగా ఆధ్యాత్మిక సేవలను విస్తృతంగా ప్రచారం చేయడంలో కీలకంగా వ్యవహరించిన హథీరాం బాజీ వారసులకు శ్రీవారి ఆలయ బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించారు.
1843 జూలై 21 తేదీ అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం తిరుమల ఆలయ నిర్వహణ బాధ్యతలు సేవాదాస్ జీ అనే మహంతుకు అప్పగించింది. అప్పటినుంచి హథీరాంజీ మఠం మహంతులు "విచారణకర్త" హోదాలో ఆలయాన్ని పరిపాలించారు. దాదాపు 90 ఏళ్లు పాటు తిరుమల ఆలయం మహంతుల ఆధీనంలోనే నిర్వహించారు. పరిపాలనాపరమైన ఇబ్బందులు, పారదర్శక కోసం టీటీడీ ప్రత్యేక బోర్డు అవసరమని భావించిన అప్పటి మద్రాస్ ప్రభుత్వం కొత్త చట్టాన్ని తీసుకురావడం ద్వారా 1933 ఏప్రిల్ ఒకటో తేదీ చట్టం అమలులోకి తీసుకొని వచ్చింది. దీంతో తిరుమల ఆలయ నిర్వహణలో 1933 సంవత్సరంలో మహంతుల పాలన ముగిసింది.
వెల కట్టలేని ఆస్తులు..
తిరుమల తో పాటు తిరుపతి కేంద్రంగా కూడా హథీరాం బాబా కేంద్ర కార్యాలయం ఉంది. తిరుపతి తో పాటు దేశంలోని అనేక ప్రాంతాలలో ఉన్న వేల కోట్ల రూపాయల ఆస్తులు కూడా ఈ మఠం ఆధీనంలో ఉన్నాయి. తిరుపతిలో ఉన్న భూములు, భవనాలతో పాటు చారిత్రక కట్టడాల ఆస్తుల విలువ వెయ్యి నుంచి 1500 కోట్ల రూపాయలకు పైగానే ఉంటుందినేది అంచనా. తిరుపతిలో 170 ఎకరాలకు పైగా వివిధ రూపాల్లో ఆక్రమణలకు గురైనట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి. దేశంలో హరిద్వా,ర్ రిషికేష్, మహారాష్ట్ర లో కూడా మఠం భూములు ఉన్నాయి.
వారసత్వ బాధ్యతలు
తిరుమల, తిరుపతిలో కేంద్రీకృతంగా ఉన్న హతీరం బాజీ వారసత్వ బాధ్యతలను అర్జున్ దాసు 31వ మహంతుగా 2005 లో అప్పగిస్తూ అంగరంగ వైభవంగా పట్టాభిషేకం నిర్వహించారు. అంతకుముందు వరకు ఉన్న శివరాందాస్ జి మరణం తర్వాత ఆ బాధ్యతలు అర్జునదాసుకు దక్కాయి. ఈయన సుదీర్ఘ పదవీకాలంలో రెండుసార్లు సస్పెన్షన్ కు గురయ్యారు.
తిరుపతి, తిరుమలలో హథీరాంజీ మఠం ఆస్తుల దుర్వినియోగం, భూముల అమ్మకాలు, ఆర్థిక అవకతవకల ఆరోపణల నేపథ్యంలో అర్జున్ దాసును 2014- 15 సంవత్సరాల మధ్య ఒకసారి అర్జునదాసును బాధ్యతలు నుంచి తప్పించారు.
"మఠం భూములు ప్రైవేట్ వ్యక్తులకు లీజుకు ఇచ్చారు. హథీరాంజి మఠం, ప్రభుత్వనిబంధనలు ఉల్లంఘించారు" అనేది రాష్ట్ర దేవాదాయ శాఖ చేసిన ఆరోపణ. అర్జున్ దాసును బాధ్యతలనుంచి సస్పెండ్ చేసి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ను నియమించింది.. దీన్ని సవాల్ చేసిన మహంతు అర్జున దాస్ హైకోర్టు నుంచి స్టే తెచ్చుకోవడంతో మళ్ళీ ఆయన బాధ్యతలు చేపట్టారు.
రెండోసారి... సుదీర్ఘ సస్పెన్షన్
తిరుపతి హాతి రాంజీ మొత్తం మహంతుగా ఉన్న అర్జున్ దాసును 2021 జూన్ నెలలో దేవాదాయ శాఖ మరోసారి బాథ్యతల నుంచి తప్పించింది. ఆ బాధ్యతలను దేవాదాయ శాఖ కాణిపాకం ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అప్పగిస్తూ ఫిట్ పర్సన్ గా నియమించింది.
16 ఆరోపణలు..
హథీరాంజీ మఠం మహంతు అర్జున్ దాస్ పై రాష్ట్ర దేవాదాయ శాఖ చట్టం 13 ఆబ్లిక్ 1987 ప్రకారం ఆంధ్రప్రదేశ్ ధార్మిక పరిషత్ విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. మఠం ఆస్తులు, పరిపాలన వ్యవహారాలకు సంబంధించి విచారణ చేసిన ధార్మిక పరిషత్తు అర్జున్ దాస్ పై 16 ఆరోపణలు చేసింది.
"అర్జున్ దాసు వైవాహిక జీవితం సాగిస్తున్నారు. మఠం, ఆస్తులు అన్యాక్రాంతం చేశారు. నిధుల వినియోగం జరిగింది" వంటి అనేక ఆరోపణలతో సస్పెండ్ చేసి, దేవదాయ శాఖ ఈఓను ఫిట్ పర్సన్ గా నియమించారు. అదే సమయంలో మఠం ఆస్తులు, భూముల పరిరక్షణ బాధ్యతలు రాష్ట్ర దేవాదాయ శాఖ ఆధీనంలోకి తీసుకుంది. దీనిపై మహంతు అర్జున్ దాస్ సుదీర్ఘకాలం న్యాయపోరాటం సాగించారు.
"తనపై వచ్చిన ఆరోపణలు నిరాధారమైనవి. మఠం సంప్రదాయాల ప్రకారం ప్రభుత్వం నేరుగా జోక్యం చేసుకోవడం చెల్లదు" అని మహంతు అర్జున్ దాస్ న్యాయస్థానంలో పోరాటం చేశారు. సుప్రీంకోర్టులో కూడా సుదీర్ఘ విచారణ అనంతరం అర్జున్ దాస్ ను సస్పెండ్ చేస్తూ గతంలో ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేసింది. "సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా విచారణ జరిగింది" అని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. అత్యున్నత న్యాయస్థానం తీర్పు నేపథ్యంలో రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ జారీ చేసిన ఆదేశాల నేపథ్యంలో హథీరాంజీ మఠం మహంతుగా బాధ్యతలు స్వీకరించడానికి కాణిపాకం ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు.
"మహంతు అర్జునదాస్, మఠం అధికారుల రాక కోసం నిరీక్షిస్తున్నాం" అని కాణిపాక ఆలయ అధికారులు చెప్పారు.
Next Story

