రాయలసీమ ఉద్యానవన పంటలకు హబ్ (Horticulture Hub)గా మారింది. పండ్ల ఉత్పత్తిలో దేశానికి చిరునామాగా మారిన ఉద్యానవన పంటలకు కూడా పీపీపీ పద్ధతి ( PPP Model for Horticultural Crops) ని ప్రభుత్వం కొత్త కార్యక్రమం అమలు చేయబోతోంది.
"రాయలసీమను ప్రపంచదేశాలకు 'గేట్ వే'గా పరిచయం చేస్తా. దీనికోసం ప్రభుత్వం 30 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంది. మరో 70 వేల కోట్లు ప్రయివేటు భాగస్వామ్యంతో పెట్టుబడులు పెట్టే కొత్త కార్యక్రమం సిద్ధం చేశాం" అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ప్రకటించారు.
అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గం యాడికి మండలం వేములపాడు గ్రామంలో 'జలధార- నీటి భద్రత - సాగునీటి సంఘాల బాధ్యత' పై సోమవారం జరిగిన సభలో మాట్లాడారు.
"రాయలసీమలో 63 శాతం ఉద్యానవన పంటలు మైక్రో ఇరిగేషన్ పద్ధతి వల్ల మంచి లాభాలు, దిగుబడులు సాధించింది. దేశంలో ఎక్కడా ఈ పరిస్థితి లేదు. పండ్లు కూరగాయల ఉత్పత్తిలో అగ్రగామిగా ఉంది. దానికి చిరునామా రాయలసీమ గా మారింది" అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గుర్తు చేశారు. రైతుల ఉత్పత్తులకు మార్కెటింగ్ సదుపాయం కల్పించే విధంగా విదేశాలు ముందుకు వచ్చే విధంగా కార్యాచరణ అమలు చేయబోతున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు వివరించారు.
'అనంత' దశ మార్చాం..
రాయలసీమ ప్రధానంగా అనంతపురం జిల్లా కరువుకు నిలయంగా ఉండేదని, 30 ఏళ్ల కిందటే ఎన్టీరామారావు అమలు చేసిన పథకాలకు తోడు, హంద్రీ నీవా సుజల స్రవంతి, గాలేరు నగరి, తెలుగుగంగ ప్రాజెక్టుల వల్ వ్యవసాయం గాడిన పడిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గుర్తు చేశారు. అదే సమయంలో టీటీడీ ప్రభుత్వంలోనే జిల్లాలో ఇంకుడు గుత్తులు, చెక్ డ్యాములు, తుంపర్ల సేద్యం, సూక్ష్మ సేద్యానికి ప్రాధాన్యత ఇచ్చడం వంటి కార్యక్రమాలకు తోడుగా తుంపర్లసేద్యం, మైక్రో, డ్రిప్ ఇరిగేషన్ ద్వారా ఇరిగేషన్ పథకాలు రైతులను ఆదుకున్నాయని గుర్తు చేశారు.
"అనంతపురం జిల్లాలో డ్రిప్ ఇరిగేషన్ అమలు చేసి, నీటి సద్వినియోగం చేశాం. ఎకరాకు సరపడే నీటిని రెండు ఎకరాలకు విస్తరించడానికి మైక్రో ఇరిగేషన్ తీసుకొచ్చాం. నూటికి 90% సబ్సిడీ. డ్రిప్ ఇరిగేషన్ కూడా అనంతపురం నుంచే ప్రారంభించాం" అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గత పరిస్థితులను గుర్తు చేశారు. జిల్లాలో ప్రారంభించిన మైక్రో ఇరిగేషన్ ( Micro-irrigation) దేశానికి ఆదర్శంగా నిలిచిందని, 1.26 లక్షల ఎకరాల్లో ఈ పద్ధతి అమలు చేయడానికి 1.30 వెయ్యి కోట్లు పెట్టుబడి పెట్టామని వివరించారు.
అన్నమయ్య జిల్లా ఆదర్శం..
రాయలసీమలో గత ఏడాది వేసవికి ముందు ఎనిమిది మీటర్లు, ఆ తర్వాత మూడు మీటర్లు భూగర్భజలాలు ఉన్నయనీ, అనంతపురం జిల్లాలో గతంలో 13 మీటర్ల మేర ఉంటే ఇప్పుడు 11 మీటర్లకే భూగర్భ జలాలు అందుబాటులోకి వచ్చాయని గుర్తు చేశారు. భూ సంరక్షణ చర్యల కారణంగా 2.2 మీటర్ల మేర జలాలు పెరగటం సంతోషం కలిగిస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సంతృప్తి వ్యక్తం చేశారు. అన్నమయ్య జిల్లాల్లో భూ గర్భ జలాల పెంపుదల ఓ ప్రజా ఉద్యమంగా చేపట్టి, విజయం సాధించారని చెప్పారు. దీంతో 5.7 టీఎంసీల నీళ్లు అందుబాటులోకి వచ్చాయని గుర్తు చేసిన ఆయన అన్నమయ్య జిల్లాను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.
"అన్నమయ్య జిల్లాలో భూ గర్భ జలాల పెంపుదలకు తీసుకున్న చర్యల వల్ల 20 వేలకు పైగా బోర్లలో నీరు అందుబాటులోకి వచ్చింది. జిల్లాలో 96 కోట్ల మేర విద్యుత్ ఆదా అయ్యింది. హరిత ప్రాంతం పెరిగింది. ఇవన్నీ సానుకూలమైన అంశాలు అని గుర్తు చేశారు.
వంద రోజుల కార్యాచరణ
రాష్ట్రంలో భూ గర్భ జలాల పెంపుదలకు యాడికి మండలం వేములపాడు గ్రామంలో 'జలధార- నీటి భద్రత - సాగునీటి సంఘాల బాధ్యత' పై వంద రోజుల కార్యాచరణకు ముఖ్యమంత్రి చంద్రబాబు లాంఛనంగా శ్రీకారం చుట్టారు. ఈ విధానంలో
"వర్షాకాలం కంటే ముందు ఆరు మీటర్ల లోతు, ఆ తర్వాత మూడు మీటర్ల కంటే తక్కువగా భూగర్భ జలాలు అందుబాటులో ఉండేలా చూడాలి ఇలా చేయగలిగితే రాష్ట్రంలో నీటి ఎద్దడి అనేది ఉండదు" అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. రిజర్వాయర్లలో నీళ్లు నిండుగా ఉంటే ఎప్పటికప్పుడు మనం వినియోగించుకునే అవకాశం ఉంటుందని రైతులు, నీటి సంఘాల ప్రతినిధులకు బాధ్యత గుర్తు చేశారు.
ఎత్తిపోతలకు ఆస్కారం లేకుండా..
ప్రభుత్వం నిర్దేశించిన వంద రోజుల కార్యాచరణకు సహకారం అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. రాయలసీమ పరిస్థితిపై ఆయన ఏమన్నారంటే..
"శ్రీశైలం నీటిని వేర్వేరు చోట్ల ఎత్తిపోతల పథకాలు ఏర్పాటు చేసి నీరు తెచ్చుకుంటున్నాం. రాష్ట్రంలోనూ, రాయలసీమలోనూ ప్రతీ ఎకరాకూ నీరు ఇచ్చే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది" అని ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ఖరీఫ్‌కు 547 టీఎంసీలు, రబీకి 343 టీఎంసీలు, పరిశ్రమలకు 28, తాగునీటికి 158 టీఎంసీల నీరు అవసరమని అన్నారు.
"ఈ ఏడాది 74 టీఎంసీల నీరు అనంతపురం వరకూ తీసుకువచ్చాం. పట్టిసీమ నుంచి కృష్ణా డెల్టాకు తీసుకువచ్చి రబీకి, ఖరీఫ్‌కు ఇచ్చే నీటిని ఆదా చేసి శ్రీశైలం నుంచి రాయలసీమకు తరలించాం. దేశంలోనే అతితక్కువ వర్షపాతం పడే అనంతపురం జిల్లా కూటమి ప్రభుత్వం చూపిన చొరవ కారణంగా ఎక్కువ పండ్ల తోటలతో సంపన్నమైన ప్రాంతంగా మారింది" అని ముఖ్యమంత్రి ప్రోగ్రెస్ రిపోర్టు వివరించారు. ఈ పరిస్థితుల్లో ఉద్యానవన పంటలకు కేంద్రంగా మారిన రాయలసీమ ప్రాంత రైతుల ఉత్పత్తులు విదేశీ మార్కెట్టుకు చేరడానికి వీలుగా పీపీపీ విధానం అమలు చేయడానికి రానున్న రెండు, మూడేళ్లలో కార్యాచరణ అమలు చేయడానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు వెల్లడించారు.
విద్యుత్ భారం పడదు..
రాష్ట్రంలో టీడీపీ కూటమి వచ్చిన తరువాత ప్రజలు ప్రధానంగా రైతులపై విద్యుత్ చార్జీల భారం పడకుండా చేశామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గుర్తు చేశారు. "వైసీపీ పాలనలో విద్యుత్ ఛార్జీలు పెంచుతూనే ఉన్నారు. రూ.1.24 లక్షల కోట్ల మేర అప్పులు చేశారు. కూటమి వచ్చాక వారు పెంచిన రూ.4,600 కోట్ల భారాన్ని కూడా ప్రజలపై వేయకుండా ప్రభుత్వమే భరిస్తోంది. తొలిసారి విద్యుత్ ఛార్జీల ట్రూ డౌన్ చేసిన ఘనత కూటమి ప్రభుత్వానిదే" అని వివరించారు.
"భూమినే జలాశయంగా మార్చుకుని వినియోగించు కోవడం ద్వారా మెరుగైన నీటి నిర్వహణ చేపట్టవచ్చని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సూచించారు. రబీ, ఖరీఫ్ పంటలు పూర్తి అయ్యాక కూడా ప్రస్తుతం రిజర్వాయర్లలో 65 శాతం నీటి నిల్వ ఉందనీ, జలం మనకు ఓ సంపద. దానిని ఎంత పొదుపుగా వాడుకుంటే అంత సంపద సృష్టిస్తుంది" అని రైతులకు ధైర్యం చెప్పారు.