కడప జిల్లా ఒంటిమిట్ట జానకీదేవి, జగదభిరాముడి కల్యాణ వేడుక పున్నమి వెన్నెలలో కనుల పండువగా సాగింది. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల వేళ గరుడోత్సవాన్నే కాదు. ఆలయం నుంచి కల్యోణోత్సవ వేదిక వరకు దేదీప్యమైన కాంతులు విరజిమ్ముతుండగా వేదమంత్రోచ్ఛారణల మధ్య సరిగ్గా సాయంత్రం 6.10 గంటలకు ప్రారంభమైన కల్యాణోత్సవ వేడుక రాత్రి 8.30 గంటల వరకు సాగింది. ఈ ఉత్సవానికి దాదాపు 80 వేల మంది భక్తులు హాజరయ్యారని టీటీడీ ప్రకటించింది. ఈ వేడుకను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఆస్వాదించారు. ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వారి ఆలయం బుధవారం రాత్రి జరిగిన ఉత్సవం ఏర్పాట్లు 2009లో తమిళనాడు రాష్ట్రం కన్యాకుమారి వద్ద జరిగిన శ్రీవారి కల్యాణాన్ని తలపించాయి.
శ్రీవారి కానుక: ఒంటిమిట్ట శ్రీ కోదండరామయ్య కల్యాణం సందర్బంగా తిరుమల నుంచి శ్రీ వేంకటేశ్వర స్వామివారు బుధవారం కానుకలు పంపారు. కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలకు మూలవర్లకు అలంకరించేందుకు ఒక కేజి బరువు ఉన్న స్వర్ణ ముఖ పట్టి, రెండు కేజిల బరువు ఉన్న వెండి బింది కానుకగా అందించారు.
టీటీడీ అనుబంధ ఆలయాల్లో బ్రహ్మోత్సవాల సందర్బంగా తిరుమల శ్రీవారి ఆలయం నుండి కానుకలు పంపడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగానే బుధవారం ఈ ఆభరణాలు సమర్పించారు. ఆలయం ముందు టీటీడీ ఛైర్మన్ శ్రీ బీఆర్ నాయుడు ఆభరణాలకు పూజలు చేసి కోదండరామునికి అందజేశారు.
శ్రీకోందరాముడికి పట్టువస్త్రాలు సమర్పించిన తరువాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, ఆయన భార్య నారా భువనేశ్వరి, మనవడు నారా దేవాన్ష్ కల్యాణ వేదిక వద్దకు చేరుకున్నారు. వారితో పాటు టీటీడీ చైర్మన్ బీఆర్. నాయుడు, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తో పాటు పలువరు మంత్రులు. ఎమ్మెల్యేలు, సీనియర్ ఐఏఎస్ అధికారులు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతుల వెంట ఉన్నారు.
టీటీడీలోని అన్ని విభాగాలు కడప జిల్లా యంత్రాంగాన్ని సమన్వయం చేసుకుని కల్యాణోత్సవం విజయవంతంగా పూర్తి చేశారు. అన్ని శాఖల అధికారులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అభినందించారు. కల్యాణ వేదిక వద్ద ఏర్పాటు చేసిన 121 విశాలమైన గ్యాలరీల్లో కూర్చున్న యాత్రికులు ఆహ్లాదంగా ఉత్సవాలను ఆస్వాదించారు.
చరిత్రలో నిలిచిపోయేలా..
కడప జిల్లా ఒంటిమిట్ట వద్ద శ్రీకోదండరాముడి కల్యాణోత్సవ ఘట్టం చరిత్రలో నిలిచిపోయే విధంగా టీటీడీ ఏర్పాట్లు చేసింది. జానకీదేవి, జగదభిరాముడి కల్యాణోత్సవం పూర్తి కాగానే యాత్రికులకు ప్రసాదాలు పంపిణీ చేశారు. 80 వేల మందికి తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం అందించారు.
ప్రతి యాత్రికుడికి అన్న ప్రసాదాలు, వాటితో పాటు ఓ ముత్యం, కంకణాలు, అక్షింతలు ఉన్న మరో పాకెట్ ప్రత్యేకంగా ప్యాకింగ్ చేయించిన టీటీడీ అధికారులు శ్రీవారి సేవకుల ద్వారా యాత్రికులకు పంపిణీ చేయించారు.
"నేను ఇక్కడే పుట్టాను. పెరిగాను. టీటీడీ మా ఒంటిమిట్ట ఆలయాన్ని స్వాధీనం చేసుకున్నది. ఈ ఏడాది నిర్వహించిన కల్యాణోత్సవం, ఏర్పాట్లు ఓ అద్భుతం" అని జర్నలిస్టు నారాయణ వ్యాఖ్యానించారు.
2009 కన్యాకుమారి దగ్గర
అది 2009వ సంవత్సరం. డీకే. ఆదికేశవులు నాయుడు టీటీడీ చైర్మన్ గా ఉన్నారు. ఆయన పదవీకాలం ముగుస్తోంది. టీటీడీ చరిత్రలో తిరుమలకు వెలుపల తమిళనాడు లోని కన్యాకుమారి వద్ద బోర్డు మీటింగ్ జరిగింది. తిరుపతి నుంచి మీడియాను తీసుకుని వెళ్లారు. అందులో నా భార్యతో కలిసి నేను వెళ్లా. తిరుపతిలో రెండు కంపార్టుమెంట్లలో జర్నలిస్టులు, టీటీడీ ఉద్యోగుల్లో కొందరు మధ్యాహ్నం బయలుదేరాం. మరుసటి రోజు మధ్యాహ్నానికి కన్యాకుమారి చేరాం. దారిపొడవునా ప్రతి స్టేషన్ లో శ్రీవారి సేవకులు వచ్చారు. ఓ స్టేషన్ లో డీఐజీ స్థాయి అధికారి వచ్చిన ఇప్పటి చీఫ్ పీఆర్ఓ తలారి రవిని పలకరించారు. ఫుడ్ ప్యాకెట్లు, వాటర్ బాటిల్లు అందించారు. వారందరూ పీఆర్ఓ రవి ద్వారా మమ్మలిని అంతలా ఆదరించారు.
సముద్రం ఒడ్డున
ఆ మరుసటి రోజు కన్యాకుమారి ( Kanyakumari ) సముద్రం ఒడ్డున వివేకానంద రాక్ ( Vivekananda Rock) సముద్రపు ఒడ్డున శ్రీవారి కల్యాణోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమం కవర్ చేయడానికి తిరుపతి నుంచి బయలుదేరిన మీడియా 24 గంటల తరువాత కన్యాకుమారి రైల్వే స్టేషన్ కు చేరుకుంది. రైలు దిగగానే... స్టేషన్ కు ఇరుపక్కలా ఇసుక దిబ్బలు కనిపిస్తున్నాయి. ఎదురుగా సముద్రం కనిపిస్తోంది. నా మైండ్ బ్లాంక్. పక్కనే ఉన్న నగేష్ తో మిత్రమా.. అనగానే హ.. హ.. దేశానికి చివరికి వచ్చాం అన్నా అనగానే... నాకు ఏమి అర్థం కాలేదు. స్టేషన్ బయటికి వెళ్లగానే.. కార్లు సిద్ధంగా ఉన్నాయి. నేను, నా భార్య తోపాటు నగేష్, యూఎన్ఐ కరస్పాండెంట్ నాగేశ్వరరావు, ఆయన భార్య స్వాతితో కలిసి వివేకానందుడి సెంటర్ కు చేరుకున్నాం. అక్కడి టీటీడీ పీఆర్ఓ తలారి రవి, చీఫ్ ఫొటో గ్రాఫర్ శేఖర్, పీఆర్ఓ సెక్షన్ లో పనిచేసిన ప్రభాకర్ పలకరించారు. సార్.. రండి ఈ తాళం మీకు.. నాగేశ్వరరావు గారు (యూఎన్ఐ కరస్పాండెంట్) ఈ గది మీకు అని తాళాలు అప్పగించారు. మేమంతా గదులకు చేరుకుని ప్రయాణిక బడలిక నుంచి సేదదీరుతూ నిద్రలోకి జారుకున్నాం. సాయంత్రమైంది. లేచి చూసే సరికి కన్యాకుమారి సముద్రతీరం మొత్తం జనసంద్రంగా కనిపించింది. శ్రీవారి కల్యాణ కనువిందుగా సాగింది. అలా బయటికి వచ్చామో లేదో.. ప్రతి ఒక్కరి చేతిలో ఓ సంచి. అందులో అక్షింతలు. అన్నప్రసాదం ప్యాకెట్, వాటర్ బాటిల్ కనిపించింది. సాయంత్రం వచ్చిన యాత్రికులు నడిరేయి వరకు వారి ప్రాంతాలకు వెళుతే కనిపించారు.
అదే.. సీన్...
కడప జిల్లా ఒంటిమిట్ట శ్రీకోదండరాముడి ఆలయం వద్ద బుధవారం మధ్యాహ్నం నుంచి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి లక్షకు పైగానే యాత్రికులు చేరుకున్నారు. కల్యాణోత్సవం తరువాత ప్రతి మహిళ, పురుషుడి చేతిలో మోయగలినంత శ్రీవారి ముఖచిత్రంతో సీతా సమేత శ్రీకోదండరాముడి ఫోటొలు చిత్రంచిన గుడ్డ సంచి కనిపించింది.
"ఆ బ్యాగులో చిన్న కవర్ లో ఓ ముత్యం, పసుకుదారంతో తయారు చేసిన కంకణాలు, అక్షింతలు. వాటితో పాటు ఇంటికి వెళ్లే ప్రతి యాత్రికుడికి ఓ బాక్సులో చిత్రాన్నం, వాటర్ బాటిల్, తీపి పదార్థాలు నింపి అందించాం" అని టీటీడీ చైర్మన్ బీఆర్. నాయుడు చెప్పారు. అందులో తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం కూడా వేరుగా అందించామని ఆయన తెలిపారు.
వీటన్నింటిని ఓ సంచిలో నింపడానికి 600 మంది శ్రీవారి సేవకులు పనిచేశారని టీటీడీ చీఫ్ పీఆర్ఓ తలారి రవి చెప్పారు.
దేవలోకాన్ని తలపించిన దృశ్యం..
ఒంటిమిట్ట వద్ద 16వ శతాబ్దం నాటి శ్రీకోదండరామాలయం, ఆ ఊరు దేదీప్యమానంగా మారింది. కల్యాణవేదిక వరకు ఇసుక వేస్తే రాలనంతగా జనం హాజరయ్యారు. ఎన్ హెచ్-40 ( National Highway 40) కి పక్కనే ఉన్న ఆలయంతో పాటు దాదాపు 15 కిలోమీటర్ల వరకు దేవతామూర్తుల కటౌట్లు, ఆధ్యాత్మిక వాతావరణం నిజంగా దేవలోకాన్ని తలపించిందని సీనియర్ జర్నలిస్టు కొప్పా రమేష్ బాబు వ్యాఖ్యానించారు.
సీతారాముల వారి కల్యాణం ఇలా సాగింది..
ఒంటిమిట్ట కోదండరామాలయం వద్ద ఆద్యంతం సీతారాములవారి కల్యాణం ఆద్యంతం కనుల పండువగా సాగింది. రెండు గంటల పాటు యాత్రికులు కూర్చున్న చోటి నుంచి కదలలేదు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, ఆయన భార్య నారా భువనేశ్వరి, మనవడు నారా దేవన్ష్ కూడా వేడుకను ఆసక్తిగా తిలకించారు.
టీటీడీ ద్వారా తిరుమల నుంచి అధికారులు తీసుకుని వచ్చిన బంగారుకానకను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు , ఆయన భార్య, మనవడు ముత్యాలు వెండిపాత్రల్లో అర్చకులకు సమర్పించారు.
సీతారాములవారి కల్యాణ ఘట్టాన్ని ప్రారంభించిన టీటీడీ వేదపండితులు.
రాములోరికి యజ్నోపవీత ధారణ చేయడానికి ముందు యాత్రికుల దర్శనం చేయిస్తున్న పండితులు.
దేవేరులకు సమర్పించే పుష్పమాలలను యాత్రికులకు చూపించారు. ఈ క్రతువు సుమారు అర్ధగంట పాటు సాగింది. వేదమంత్రాల మధ్య సాగిన ఈ వేడుకలో చివరగా
అమ్మవారికి మాంగల్యధారణ చేయించడానికి ముందు మంగళసూత్రాలను ప్రదర్శించే సమయంలో జైశ్రీరం, గోవింద నామ స్మరణలతో కల్యాణ వేదిక ప్రతిధ్వనించింది. కల్యాణోెత్సవం ఆసాంతం గ్యాలరీల్లోని యాత్రికులు తనివితీరా చూశారు. ఈ కార్యక్రమాలు కడప జిల్లా యంత్రాంగం సహకారంతో నిర్వహించడంపై టీటీడీ అధికారులు సంతృప్తి వ్యక్తం చేశారు.