
తిరుమలలో వేటకు వెళ్లిన శ్రీవారు..
పార్వేటకు బయలుదేరిన మలయప్పకు మొదట వెన్న సమర్పించిన సన్నిధి గొల్లలు.
తిరుమలలో పార్వేట ఉత్సవం శుక్రవారం వైభవంగా నిర్వహించారు. శ్రీవారిని మొదట దర్శించుకునే సన్నిధి గొల్లలు స్వామివారికి మొదట నివేదనలు సమర్పించారు.
శ్రీకృష్ణస్వామి, శ్రీమలయప్ప పల్లకీలకు పార్వేట మండపం వద్ద తాళ్లపాక అన్నమయ్య వంశస్తులు ఎదురేగి స్వాగతం పలికారు. తిరుమల ఆలయానికి సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న పార్వేట మండపం వద్దకు ఉత్సవమూర్తులు చేరుకోగానే విశేష పూజలు నిర్వహించారు. శ్రీవారి తరపున అర్చకులు వేటను అనుకరిస్తూ మూడుసార్లు వెండి ఈటను బంగారు జింక పైకి స్పందించడం ద్వారా సంప్రదాయబద్ధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
తిరుమల గోగర్భం డ్యాం వద్ద సాగుతున్న ఊరేగింపు
సన్నిధి గొల్ల ప్రాధాన్యం
తిరుమల శ్రీవారి ఆలయం నుంచి శ్రీకృష్ణ స్వామి, శ్రీమయలప్పస్వామి వారి విగ్రహాలను ఆభరణాలతో అలంకరించారు. ఆలయం నుంచి వెలుపలికి రాగానే, ఆలయం ఎదురుగా ఉన్న గొల్ల మండపం వద్ద సన్నిధి గొల్లలు మొదట స్వామివారికి ప్రీతిపాత్రమైన పాలు నివేదించారు. సన్నిధి రమేష్ యాదవ్, సన్నిధి కిషోర్ యాదవ్ తోపాటు వారి వంశస్థులు శ్రీవారికి ప్రీతిపాత్రమైన పాలు, వెన్న సమర్పించారు.
టీటీడీ అదనపు ఈఓ సిహెచ్ వెంకయ్య చౌదరి, పాలకమండలి సభ్యుడు జి. భానుప్రకాష్ రెడ్డి, రాష్ట్ర యాదవ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గొల్ల నరసింహ యాదవ్, వైఎస్. యాదవ్, ఈతమాకుల హేమంత్ కుమార్ యాదవ్ తో పాటు టిటిడి అధికారులు , సన్నిధి వంశస్థులు, పెద్ద సంఖ్యలో యాత్రికులు పాల్గొన్నారు.
పార్వేట మండపం వద్ద
ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగల్లో అంటే కనుమ పండుగనాడు ఈ ఉత్సవాన్ని టిటిడి వైభవంగా నిర్వహిస్తుంది. శుక్రవారం మధ్యాహ్నం కూడా తిరుమల శ్రీవారి ఆలయానికి దాదాపు రెండు కిలోమీటర్ల దూరంలో పాప వినాశనం వెళ్లే దారిలో ఉన్న పార్వేటి మండపం వరకు పల్లకీలపై శ్రీకృష్ణ స్వామి, శ్రీ మల్లయ్య స్వామి వార్ల ఉత్సవ విగ్రహాలను ఊరేగింపుగా పార్వేటి మండపం వద్దకు ఊరేగింపుగా తీసుకుని వెళ్లారు. సర్వభూపాల వాహనంపై శ్రీమలయప్ప స్వామి వారు వేటగాడి వేషంలో ఆయుధాలు ధరించి ఉండటం ఈ వాహనం ప్రత్యేకత. పార్వేటి మండపం వద్దకు చేరుకోగానే ఈ ఉత్సవాన్ని నిర్వహణలో కీలకమైన అన్నమాచార్య వంశస్థులు స్వామివారికి వ్యతిరేకి స్వాగతం పలికారు.
ఆ సమయంలో అన్నమయ్య కీర్తనలు ఆలపిస్తూ ఆ వంశస్థులు స్వామివారికి పార్వేటి మండపం వద్దకు స్వాగతించారు. ఈ కార్యక్రమంలో యాత్రికులు, సిబ్బంది కూడా పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
నేపథ్యం ఇదీ..
తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారు పార్వేట ఉత్సవానికి వెళ్లడం వెనక ఓ చారిత్రక కథనం ఉంది.
"పూర్వకాలం రాజులు వేటకు వెళ్లే సమయంలో అక్కడ విశ్రాంతి తీసుకునేవారు. వేట మండపం అని కూడా పిలుస్తారు. పురాణాల ప్రకారం శ్రీనివాసుడు నారాయణవనంలో ఆకాశరాజు కుమార్తె పద్మావతీదేవిని మొదటిసారి చూసింది, ఆమె వేట కోసం వనవిహారానికి పారేటి మండపం ప్రాంతానికి వచ్చినప్పుడే" అనేది ఓ కథనం.
తిరుమలలోని అనేక ఉత్సవాలు 13వ శతాబ్దం నుంచి పదవ శతాబ్దం మధ్యకాలంలో విజయనగర రాజుల కాలంలో ప్రారంభించినట్లు చరిత్ర చెబుతోంది. పారివేటి మండపం తో పాటు అనుబంధ నిర్మాణాలు కూడా విజయనగర సామ్రాజ్య కాలం నాటి శైలిని పోలి ఉంటాయి.
వేట ఇలా..
పార్వేట మండపం వద్ద శ్రీకృష్ణస్వామి, శ్రీమలయప్ప పల్లకీ నుంచి ప్రత్యేకంగా అలంకరించిన వేదికపై ఆశీనులను చేశారు. స్వామివారి ప్రతినిధులుగా ఆలయ అర్చకులు ప్రధాన ఘట్టం వేట ప్రారంభించారు. వెండి ఈటెను జింక పైకి విసరడానికి పండితులు పరిగెడుతుంటే వారి వెంట టీటీడీ అదన ఈఓ వెంకయ్య చౌదరి, టిటిడి బోర్డు సభ్యుడు భాను ప్రకాష్ రెడ్డి, యాదవ కార్పొరేషన్ చైర్మన్ జి నరసింహ యాదవ్, వేద పండితులు కూడా అనుసరించారు. సమీపంలో ఏర్పాటు చేసిన బంగారు జింకపైకి మూడుసార్లు ఈటె విసరడం ద్వారా పారువేట ఉత్సవాన్ని నిర్వహించారు.
"పురాణాల ప్రకారం దుష్ట శిక్షణ కోసం స్వామి వారు వేటగాడి వేషంలో అడవికి వెళ్ళిన సందర్భాన్ని ఈ ఉత్సవం గుర్తుచేస్తుంది" అని టిటిడి అదన ఈఓ వెంకయ్యచౌదరి వివరించారు. వేటగాడి రూపంలో స్వామి వారు భక్తులను రక్షించడానికి, వెళ్తారనేది నమ్మకం అని కూడా ఆయన తెలిపారు. పురాతన కాలంలో అడవుల్లో సంచరించే జంతువులను వేటాడే సంప్రదాయం ఉండేది. ఆ క్రతువును కొనసాగిస్తూ సాంప్రదాయాలను అనుసరించే విధంగా ఇప్పుడు ఓ ఈటె విసరడం మాత్రమే నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాలు పూర్తయిన తరువాత స్వామి వార్ల పల్లకీలను తిరుమల శ్రీవారి ఆలయానికి ఊరేగింపుగా తీసుకుని వచ్చారు. ఈ కార్యక్రమంలో యాత్రికులు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Next Story

