
Iran War | ప్రమాదంలో పేద రోగుల ప్రాణాలు..!
ప్రభుత్వ బోధానాస్పత్రుల్లో మందుల కొరత. 20 నుంచి 40 శాతం పెరగనున్న ధరలు.
పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా మందుల కొరత ఏర్పడింది. ప్రభుత్వాస్పత్రుల్లో రోగుల నిశ్శబ్ద రోదనలు ప్రారంభమయ్యాయి. సామాన్య రోగులకు జీవరక్షక మందుల ( Lifesaving medicines) కొరత ప్రారంభమైంది. 70 శాతం మందులు కూడా అందడం లేదు. ఈ పరిస్థితుల్లో ఆపరేషన్ థియేటర్లలో సర్జికల్ కిట్లతో పాటు, ఎంఆర్ఐ స్కానింగ్ కు అవసరమైన హీలియం సిలిండర్లు, అనస్థీషియా కిట్లు కొరత ఏర్పడింది.
ఇరాన్ యుద్ధం కారణంగా హర్మోస్ జలసంధి మూసివేసిన పరిస్థితుల్లో ఔషధాల తయారీకి చైనా, రష్యా, యూఏఈ, ఇరాన్ నుంచి అవసరమైన ముడిసరుకులు దిగుమతి చేసుకునే వీలులేని స్థితిలో ఉత్పత్తిపై తీవ్రంగా ప్రభావం చూపడం వల్ల ప్రజారోగ్యానికి సవాళ్లు ఎదురవుతున్నాయి.
రాష్ట్రంలోని ప్రభుత్వ బోధనాస్పత్రుల్ల్ మందుల కొరత ఏర్పడింది. ఈ ఏడాది జనవరి నాటికి మొదటి క్వార్టర్ మందుల్లో 70 శాతం కూడా అందలేదు. దీనికితోడు పశ్చిమాసియా యుద్ధం కారణంగా ముడిసరుకులు దిగుమతి చేసుకునే అవకాశం లేక, ఫార్మాసుటికల్ రంగంలో సంక్షోభంలోకి వెళుతోంది. దీనివల్ల ప్రాణాధార మందుల ధరలు పెరగడం అనివార్యంగా మారుతోంది.
"మందుల కొరత ఉంది. హెచ్డీసీ నిధులతో సమస్య రాకుండా చూస్తున్నాం" అని తిరుపతి ఎస్వీఆర్ఆర్ రుయా జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ బి. మనోహర్ చెప్పారు. మా ఆస్పత్రిలో 30 శాతం మందుల కొరత ఉందని ఫార్మసిస్టు శశిధర్ కూడా స్పష్టం చేశారు.
440 రకాల మందులే ఉన్నాయి
రాష్ట్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రులకు మందులు సరఫరా చేసే సెంట్రల్ డ్రగ్ స్టోర్స్ ( Central Drug Stores)లో 610 రకాల మందుల్లో సుమారు 440 రకాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం తిరుపతిలోనే చాలా ఔషధాల దుకాణాల్లో ప్రాణాధార మందులపై అనధికారికంగానే అధికంగా వసూలు చేస్తున్నారు. రెండు నెలలు దాటితే మందుల సంక్షోభం తలెత్తడంతో పాటు ధరలు కూడా 20 శాతం పెరిగే అవకాశాలు ఉన్నాయి.
తిరుపతి నగరం అన్నారావ్ సర్కిల్ సమీపంలోని ఓ మందుల దుకాణం యజమాని విశ్వేశ్వరరెడ్డి ఏమంటారంటే..
"పెయిన్ కిల్లర్ అసిక్లోఫినాక్ (Aceclofenac), సర్జికల్ కిట్లు, అనస్థిషియాకు ఉపయోగించే లిగ్నోకైంట్ (Lignocaine) జెల్లీ, ఇంజక్షన్ మందులు మరో రెండు నెలల్లో పెరిగే అవకాశం ఉంది" అని ఆయన అభిప్రాయపడ్డారు. వీటి తయారీకి అవసరమైన ముడిసరుకులను ఫార్మాసుటికల్ కంపెనీలు చైనా, యూఏఈ నుంచి గల్ఫ్ దేశాల మీదుగా దిగుమతి చేసుకుంటుండమే కారణం.
ముందులు ఎక్కడి నుంచి వస్తాయి..?
రాష్ట్రంలోని ప్రభుత్వాస్పత్రులకు మందులు సరఫరా చేయడంలో ఆంధ్రప్రదేశ్ వైద్య సేవలు, మౌలిక సదుపాయాల సంస్థ ( APMSIDC) కీలకపాత్ర పోషిస్తుంది. టెండర్ల ద్వారా ఫార్మాసుటికల్ కంపెనీలు, స్టార్టప్ కంపెనీల నుంచి టెండర్ల ద్వారా కొనుగోలు చేసే ఏపీఎంఎస్ ఐడీసీ రాష్ట్రంలోని 13 సెంట్రల్ డ్రగ్ స్టోర్స్కు పంపిస్తారు. విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, కాకినాడ. కర్నూలు, తిరుపతి, నెల్లూరు, కడప, అనంతపురంలో బోధనస్పత్రుల్లో 7,12 రకాల మందులకు కొన్ని చోట్ల 350 నుంచి 400 రకాల మందులే అందుబాటులో ఉన్నాయి. ఏరియా, జిల్లా ఆస్పత్రుల్లో 350 రకాల మందులకు 160 నుంచి 200 రకాల మందులే అందుబాటులో ఉన్నాయి. చాలా ఆస్రత్రుల్లో బీపీ, షుగర్, పారాసిటామాల్ వంటి ముందులకు కూడా కటకటలాడుతున్నారు. దానికంటే ముందు మూడు రకాలుగా ల్యాబ్ లో పరీక్షలకు పంపిస్తుంది.
"ప్రపంచ ఆరోగ్య సంస్థ (World Health Organization WHO) ప్రమాణాలకు అనుగుణంగా మందుల్లో క్వాలిటీ ఉందని నిర్ధారణ అయిన తరువాతే సెంట్రల్ డ్రగ్ స్టోర్ కు అందుతాయి" అని తిరుపతి రుయా ఆస్పత్రి ఏ గ్రేడ్ ఫార్మసిస్టు శశిధర్ స్పష్టం చేశారు. ఏమాత్రం తేడా ఉన్నా, ఆ బ్యాచ్ మందులన్నీ వెనక్కి పంపడం వల్ల, ఆస్పత్రులకు రావడం ఆలస్యం అవుతుందని ఆయన చెప్పారు.
రాష్ట్రంలో ఈ పరిస్థితి ముందుగానే అంచనా వేసిన జనస్వస్థ్య అభియాన్కు అనుబంధంగా ఉన్న ప్రజా ఆరోగ్య వేదిక (పీఏవీ) ప్రతినిధులు ప్రభుత్వాస్పత్రులు, పీహెచ్సీల్లో నిత్యావసర మందులు కొరతపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ కు గత నెల 18వ తేదీనే ఓ లేఖ రాసింది.
"ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని బడ్జెట్ పెంచండి" అని ఆ సంస్థ ప్రతినిధులు సూచించారు. ఈ పరిస్థితుల్లో మందుల కొనుగోలుకు అవసరమైన అదనపు బడ్జెట్ 112 కోట్ల రూపాయలు విడుదల చేయకపోవడం కూడా ప్రభుత్వాస్పత్రుల్లో మందుల కొరతకు దారితీసిందని ఓ ఫార్మాసిస్టు చెప్పారు.
కొరత ఉంది..
తిరుపతి ఎస్వీఆర్ఆర్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి (SVRR Government General Hospital) ఏ-గ్రేడ్ ఫార్మసిస్టు శశిధర్ మాటల ప్రకారం..
"మా సెంట్రల్ డ్రగ్ స్టోర్ కు 175 రకాల మందులు రావాలి. ఇప్పుడు 615 రకాల మందులు అందాయి. ప్రస్తుతానికి మందుల కొరత లేదు. ఉన్నా, లోకల్ బడ్జెట్ నిధులతో కొనుగోలు చేస్తున్నాం. తద్వారా రోగులకు ఇబ్బంది లేకుండా చూస్తున్నాం" అని ఫార్మసిస్టు శశిధర్ చెప్పారు. తిరుపతి నుంచి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 117 పీహెచ్సీలు, నాలుగు ఏరియా ఆస్పత్రులు, 18 సీహెచ్సీలు, చిత్తూరు, మదనపల్లె జిల్లా ఆస్పత్రులకు బడ్జెట్, రోగుల సంఖ్య ఆధారంగా మందులు కేటాయిస్తున్నట్లు ఆయన చెప్పారు.
"తిరుపతి రుయా ఆస్పత్రి తోపాటు రాష్ట్రంలోని బోధనాస్పత్రులకు హీమో ఫిలియా ఫ్యాక్టర్ 7,8,9 రకాల మందులు, బీపీ రోగులకు టెల్మా మాత్రలు, అనస్థీషియా కిట్ల కొరత ఏర్పడింది" కొన్ని చోట్ల హాస్పిటల్ డెవలప్ మెంట్ కమిటీలు కొనుగోలుకు ఆస్కారం ఉందని ఫార్మసిస్టుల శిశధర్ వివరించారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ ద్వారా 20 శాతం నిధులు వెచ్చించి కొనుగోలు చేస్తున్నారని కూడా ఆయన చెప్పారు.
దిగుమతి ఆస్కారం లేక...
రాష్ట్రంలోని ఫార్మాసుటికల్స్ కంపెనీలు, మందుల తయారీకి అవసరమైన ముడిపదార్థాల కోసం (Active Pharmaceutical Ingredients - APIs) పొరుగు దేశాలపై ఆధారపడ్డాయి. హోర్ముజ్ జలసంధి (Strait of Hormuz), ఎర్రసముద్రం (Red Sea) మార్గాల్లో నౌకల రాకపోకలు నిలిచిపోవడం లేదా మళ్లించడం వల్ల సరఫరాలో తీవ్ర జాప్యం జరుగుతోంది.
1) గల్ఫ్ దేశాల నుంచి అమ్మోనియా, ఇథలీన్, గ్లిజరిన్ వంటి పెట్రో ఉత్పత్పలకు ముడిసరుకులే ఆధారం.
2) చైనా, యూరోపియన్ దేశాలు, చైనా నుంచి ప్రాణాధార మందుల కోసం ఏపీఐస్ కోసం దిగుమతి చేసుకుంటున్నాయి. ఈ పదార్థాలతో పారాసిటమల్, షుగర్ రోగుల కోసం మెట్ ఫార్మిన్, అమాక్సిలిన్ (యాంటీబయాటిక్స్ మందులు) మాత్రల తయారీకి ముడిపదార్థాలు అవసరం.
3) మందుల స్ట్రిప్స్, సిరంజీల తయారీకి అల్యూమినియం, మెడికల్ గ్రేడ్ ప్లాస్టిక్ అంటే ప్యాకేజింగ్ మెటీరియల్ కూడా దిగుమతి చేసుకోవాలి.
ఇవన్నీ చైనా, యూరోపియన్ దేశాల నుంచి యూఏఈ (United Arab Emirates UAE), గల్ఫ్ దేశాలు ( (సౌదీ అరేబియా, యూఏఈ, ఖతార్) కీలకంగా మారాయి. ఈ దేశాల నుంచి చెన్నై హార్బర్, ఏపీలోని విశాఖపట్టణం హార్బర్ ద్వారా దిగుమతి జరుగుతోంది. తద్వారా విశాఖ, హైదరాబాద్ లోని ఫార్మాసుటికల్స్ సంస్థలకు అందే ముడిసరుకులను మందుల తయారీకి వాడుతున్నారు.
"ఆ దేశాల నుంచి షిప్పింగ్ లేకపోవడం వల్ల ఔషధరంగం ప్రమాదంలో పడినట్టు సమాచారం ఉంది" అని తిరుపతిలోని మందుల సరఫరా చేసే ఏజెన్సీ నిర్వాహకుడు కృష్ణంరాజు అభిప్రాయపడ్డారు.
"అనస్థీషియా వంటి కీలక మందుల కొరత ఏర్పడితే అత్యవసర ప్రాతిపదికన జరగాల్సిన శస్త్రచికిత్సలు వాయిదా పడే ప్రమాదం ఉంది" అని ఓ డాక్టర్ అభిప్రాయపడ్డారు.
ధరల ప్రభావం..
పశ్చిమాసియా యుద్ధం వల్ల కొన్ని మందులపై అప్పుడే ప్రమాదం పడిందనే సంకేతాలు కనిపిస్తున్నాయి. యుద్ధం కారణంగా 150 నుంచి 200 శాతం ధరలు పెరగడం వల్ల ప్రాణాధార మందులపై ఆ ప్రభావం కనిపిస్తోంది. రానున్న కొన్ని రోజుల్లో ఆ పరిస్థితి ఇంకా ఎక్కువగా మారుతుందనే విశ్లేషణలు వినిపించాయి.
ప్రస్తుతం పారాసిటామల్ 500-ఎంజీ ఉత్పత్తి ఆగింది. 65ల ఎంజీ మాత్రలే ఉన్నాయి. బీపీ రోగులు వాడే ఆమ్లాంగ్ 5 ఎంజీ (Amlong 5 mg)కి బదులు టెల్మా, అమ్లోడిపెన్ (Amlodipine) ఉత్పత్తి జరుగుతోంది.
"APMSIDCలోని వైద్యరంగంలోని నిపుణులు కొన్ని నెలలకు ఒకసారి సమీక్షిస్తారు. ప్రజలు తీసుకుంటున్న ఆహారం, మారుతున్న వాతావరణ పరిస్థితులను అధ్యయనం చేసిన తారువాత ఏ మందులు ఉపయోగం అనేది నిర్ధారించిన తరువాత ఈ నిర్ణయాలు తీసుకుంటుంటారు" తిరుపతి రుయా ఫార్మసిస్టు శిశధర్ వివరించారు. అందులో భాగంగానే పారాసిటామల్ 500 ఏంజీ ఉత్పత్తి తగ్గిందని ఆయన చెప్పారు. ఇదే సమయంలో పశ్చిమాసియా యుద్ధం వల్ల ముడిసరుకుల కొరత కారణంగా ధరల పెరుగుదలకు దారి తీసింది.
"పారాసిటామాల్, నొప్పులకు వాడు నైమసులైడ్ (Nimesulide), ఆస్పరిన్ (Aspirin), గ్లిజరిన్ తయారీకి వినియోగించే ముడిసరుకుల ధర 27 శాతం పెరిగినట్లు ఫార్మాసుటికల్ కంపెనీల ప్రతినిధులు చెబుతున్నారు.
వీటికి తోడుగా..
మారుతున్న వాతావరణం, ఆహార అలవాట్ల నేపథ్యంలో షుగర్, బీపీ తోపాటు క్యాన్సర్ కూడా విస్తరిస్తోంది. దీంతో Life-saving medicines రవాణాకు కూడా అదనపు భారం పడుతోంది. దీంతో ఇన్సులిన్, వాక్సిన్‌లు, క్యాన్సర్ థెరపీకి అవసరమైన మందుల తో పాటు సర్జికల్ వస్తువుల ధరలకు కూడా రెక్కలు రానున్నాయి.
"స్పిరిట్ టూ ఎంఎల్ (Spirit 2 ml) ధర రూ. పది నుంచి 16కు, సర్జికల్ గ్లౌజులు ( 50 పెయిర్స్) ప్రస్తుతం ఉన్న రూ. 300 నుంచి 450కి, నొప్పి నివారణ మాత్ర అసిక్లోపిన్ రూ. ఏడు నుంచి 11కు పెరిగే అవకాశం లేకపోలేదు" అని మెడికల్ షాప్ నిర్వాహకుడు కృష్ణారెడ్డి సూచనప్రాయంగా విశ్లేషించారు. దీనికి తోడు ఆపరేషన్ థియోటర్లో రోగికి మత్తు మందు ఇవ్వడానికి లిగ్నోకైన్-30gr ( Lignocaine) సూదిమందు రూ.38 నుంచి 45కు, జెల్లీ పది ఎంఎల్ రూ.30 నుంచి 45కు పెరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయని అంచనా వేస్తున్నారు.
ప్రమాదంలో ప్రాణాలు..
ఉచిత సేవలకు వచ్చే రోగులకు ప్రభుత్వాస్పత్రుల్లో కష్టాలు మెల్లమెల్లగా ప్రారంభమైతే, ప్రయివేటు ఆస్పత్రుల్లో వైద్యం ఖరీదుగా మారుతోంది. గుండె సంబంధిత వ్యాధులు, క్యాన్సర్, కిడ్నీ వ్యాధులకు సంబంధించిన 'లైఫ్ సేవింగ్ డ్రగ్స్' తయారీకి అవసరమైన ముడిసరుకుల కొరత ప్రమాదంలో పడేసింది. ఇది కాస్తా ధరలకు సూచికగా మారింది. ప్రస్తుతం 2ఎంల్ఎల్ స్పిరిట్ రూ. పది. ఇంకొన్ని రోజుల్లో రూ.15 నుంచి రూ.16కి పెరిగే అవకాశం ఉంది. మెట్ ఫార్మిన్ 500 ఎంజీ ( Metformin) టాబ్లెట్ ఫార్మాసుటికల్స్ కంపెనలు రూ.1.90 నుంచి 2.60 కి పెంచే అవకాశాలు ఉన్నాయనే విశ్లేషణ మెడికల్ షాపుల నుంచి వినిపిస్తున్న మాట.
హీలియం కొరత
సాధారణ రోగికి రోగం నిర్ధారణ చేయాలంటే రక్త పరీక్షలు, శరీర అంతర్భాగంలో సమస్య తెలుసుకునేందుకు ఎంఆర్ఐ స్కానింగ్ ( MRI Scan) చేయడం అనివార్యం. దీనికి హీలియం సిలిండర్లు అవసరం. ముడిసరుకు దిగుమతికి ఆస్కారం లేకపోవడం ఓ కారణమైతే, ఆ యూనిట్లు ప్రయివేటు సంస్థలు నిర్వహిస్తున్నాయి. ఇరాన్ నుంచి హీలియం నిలిచిపోవడం కూడా ప్రభుత్వాస్పత్రుల్లనే కాకుండా, ప్రయివేటు రంగంలో కూడా ప్రాణాలకు ముప్పు ఏర్పడింది. రానున్న రోజుల్లో ఇది మరింత తీవ్రరూపం దాల్చే అవకాశం లేకపోలేదని అంచనా వేస్తున్నారు.
Next Story

