స్లీపర్ బస్సులను నిషేధించే యోచనలో ఆంధ్రా సర్కార్... సాధ్యమేనా?
x

స్లీపర్ బస్సులను నిషేధించే యోచనలో ఆంధ్రా సర్కార్... సాధ్యమేనా?

చైనాలో నిషేధం వెనుక కారణం ఏమిటి? ఆ ప్రమాదాలకు కర్నూలు, మార్కాపురం ఘటనలకు పోలిక ఎలా ఉందంటే..


2025 అక్టోబర్ 24 శుక్రవారం: వేకువజామున కర్నూలు జిల్లా శివారులోని చిన్నటేకూరు సమీపంలో జాతీయ రహదారి 44పై వి.కావేరీ ప్రయివేటు ట్రావెల్స్ స్లీపర్ బస్సు దగ్ధం. ఈ ఘటనలో 21 మంది సజీవదహనం.

2026 మార్చి 26వ తేదీ ఉదయం: ప్రకాశం జిల్లా మార్కాపురం సమీపంలోని రాయవరం వద్ద ప్రయివేటు ట్రావెల్స్ బస్సు టిప్పర్ ను ఢీకొంది. ఈ ప్రమాదంలో బస్సు దగ్ధమైంది. బస్సులోని 35 మంది ప్రయాణికుల్లో 13 మంది సజీవదహనం అయ్యారు. 28 మంది గాయపడ్డారు. ఈ రెండు సంఘటనలు రాష్ట్ర ప్రభుత్వాన్ని కలవరానికి గురి చేశాయి.
2012 చైనాలోని రెండు నగరాల్లో జరిగిన రెండు సంఘటనలు ఓల్వో బస్సుల రద్దుకు దారితీశాయి. చైనా, జర్మనీ, వియత్నాం దేశాల తరహాలో రాష్ట్రంలో జరుగుతున్న వరుస ప్రమాదాల నేపథ్యంలో ప్రాణనష్టం నివారణకు ప్రైవేట్ ఓల్వో స్లీపర్ బస్సుల రద్దుకు అడుగులు వేయడానికి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాదరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం స్పందించకుండా, ఇది ఎంతమేరకు సాధ్యం అనేది కూడా చర్చకు తెర తీసింది.
2026 ఏప్రిల్ 8: రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత తో కలిసి రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాదరెడ్డి అధికారులతో సమీక్షించిన అనంతరం..
"రాబోయే కాలంలో అవసరమైతే ఓల్వో బస్సులను పూర్తిగా రద్దు చేస్తాం" అని రవాణాశాఖ మంత్రి రాంప్రసాదరెడ్డి వ్యాఖ్యానించారు. ఇది ఏమేరకు సాధ్యం అవుతుందనేది మిలియన్ డాలర్ల ప్రశ్న ఉత్పన్నం కావడానికి ప్రస్తుతం "వన్ ఇండియా వన్ టాక్స్" విధానం అమలులో ఉంది. దీనివల్ల కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని అధికారులు చెబుతున్నారు.

"కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖ, జాతీయ రహదారుల విభాగాల స్పందన, ఆదేశాలు అవసరం" అని తిరుపతి జిల్లా రవాణా శాఖ అధికారి కొర్రపాటి మురళీమోహన్ అభిప్రాయపడ్డారు.

కేంద్రం స్పందన అనివార్యం

ప్రస్తుతం అంతర్రాష్ట్ర సర్వీసులుగా నడుపుతున్న ప్రయివేటు ఓల్వో బస్సులు, కాంట్రాక్టు క్యారియర్ బస్సుల అంశం మొత్తంగా కేంద్రం ఆధీనంలో ఉన్నట్లు పరిస్థితి మారింది. కాంట్రాక్ట్ క్యారేజ్, స్టేజ్ క్యారేజ్ విభాగాల కింద నమోదు చేయించే బస్సుల వివరాలు ఏపీ రవాణా శాఖ లెక్కల్లో కనిపించవు. అందుకు ప్రధానంగా 2023 నుంచి ప్రయివేటు బస్సుల రిజిస్ట్రేషన్ నిబంధనలు సరళతరం చేయడమే. ఈ పన్నుల విధానం రాష్ట్ర ఆదాయానికి గండి కొట్టడంతో పాటు ప్రయివేటు యాజమాన్యాలకు అడ్డూ అదుపు లేకుండా పోయింది.
ఏపీలో టూరిస్టు, ట్రావెల్ బస్సు రిజిస్ట్రేషన్ చేయించాలంటే... సీటుకు రూ. నాలుగు వేల వంతున మూడు నెలలకు 40 సీట్ల బస్సుకు 1.60 లక్షలు టాక్స్ చెల్లించాలి. ఏడాదికి 6.40 లక్షలు కాంట్రాక్టు సర్వీసు బస్సు నడపడానికి పన్ను చెల్లించాలి.

తిరుపతిలో రవాణా శాఖ అధికారులు తనిఖీ చేస్తున్న ఓల్వో బస్సు ఇది. ఛత్తీస్గడ్ లో రిజిస్ట్రేషన్ చేయించారు. తిరుపతిలో నడుపుతున్నారు.
దేశంలోని కేంద్ర పాలిత ప్రాంతాల్లో పాండిచ్చేరి, డయ్యూ, డమన్, గోవా తోపాటు ఒడిశా, ఛత్తీస్ ఘడ్, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్ లో నిబంధనలు సరళంగా ఉన్నాయి. ఈ రాష్ట్రాల్లో ఒక సీటుకు 1,500 మాత్రమే పన్ను ఉంది. దీంతో ఆ రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ చేయిస్తున్న కాంట్రాక్టు క్యారియర్ బస్సులు తెలుగు రాష్ట్రాల నుంచి అంతర్రాష్ట్ర సర్వీసులుగా నడుపుతున్నారు. ఆ కోవలో రాష్ట్రంలో 200 నుంచి 300 మంది ఆపరేటర్లు ఓల్వో బస్సులు నడుపుతున్నట్లు రవాణా శాఖ కమిషనర్ మనీష్ కుమార్ సిన్హా ఓ మీడియా సంస్థకు చెప్పారు.

సీఎం లేఖకు స్పందన ఏదీ

కర్నూలు శివారులోని చిన్నటేకూరు వద్ద వి.కావేరీ బస్సు దగ్ధం సంఘటన తరువాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. సత్యసాయి పుట్టపర్తి జిల్లా పర్యటనలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
"టూరిస్టు, కాంట్రాక్టు ప్రయివేటు బస్సులను 'వన్ ఇండియా వన్ టాక్స్ విధానం నుంచి తప్పించండి. ఈ పద్ధతి వల్ల రాష్ట్రాల ఆదాయానికి గండి పడుతోంది. ప్రయాణికుల భద్రతకు ముప్పుగా మారింది'" అని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంపై రాష్ట్రాలకే స్వేచ్ఛ ఇవ్వాలని కోరుతూ లేఖ రాస్తానని చెప్పారు. ఈ తరువాత స్పందన లేదు.

మార్కాపురం ఘటనతో..

ప్రకాశం జిల్లా మార్కాపురం వద్ద ప్రయివేటు బస్సు దగ్ధం కావడంతో 13 మంది సజీవదహనం అయ్యారు. ఈ సంఘటనతో రాష్ట్ర రవాణా శాఖ ప్రయివేటు ఓల్వో బస్సులను దశలవారీగా రద్దు చేయడానికి చర్యలు తీసుకుంటామని ఆ శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రకటించారు.
మొదటి దశలో (Non-factory built): కంపెనీల నుంచి నేరుగా తయారు కాకుండా, విడిగా బాడీలు నిర్మించిన (Modified/Converted) బస్సులను తొలగించాలని భావిస్తున్నారు. వీటిలో ఎమర్జెన్సీ ఎగ్జిట్లు సరిగ్గా లేకపోవడం, ఫైర్ సేఫ్టీ ప్రమాణాలు పాటించకపోవడం ప్రధాన కారణాలుగా గుర్తించారు.

చైనాలో ఏమి జరిగింది..

ఓల్వో స్లీపర్ బస్సులు దూర ప్రయాణాలకు క్షేమం కాదనే విషయం కొన్ని దేశాల్లో పదేళ్ల కిందటే గుర్తించారు. ఆ దేశ మీడియా కథనాలతో పాటు చైనా పర్యటనకు వెళ్లిన జర్నలిస్టు కూడా చెప్పారు.
2011, 2012లో చైనాలో జరిగిన ఘోర ప్రమాదాల్లో హెనాన్ ప్రావిన్స్‌లో 41 మంది, షాంగ్సీలో 36 మంది మరణించారు. ఈ విషాధ సంఘటనల నేపథ్యంలో 2012 మార్చి ఒకటో తేదీ నుంచి స్లీపర్ బస్సుల తయారీ, విక్రయాలు, రెజిస్ట్రేషన్లను నిలిపివేసింది. దీనికి ప్రధానంగా ఓల్వో బస్సుల డిజైన్ ప్రమాదకరంగా ఉన్నట్లు గుర్తించారు.
1. స్లీపర్ బస్సుల్లో ఉండే ఇరుకైన దారులు (Aisles) ఉన్నాయి.
2. అత్యవసర ద్వారాలు తక్కువగా ఉన్నాయి. ప్రమాదం జరిగితే ప్రయాణికులు బయటపడడం కష్టం అని చైనా రవాణా శాఖ గుర్తించింది.
2012లోనే కొత్త బస్సుల రిజిస్ట్రేషన్ ఆగిపోయింది. అప్పటికే రోడ్లపై ఉన్న పాత బస్సుల కాలపరిమితి ముగిసిన తర్వాత (సుమారు 2017-2018 నాటికి) అవి కూడా దాదాపుగా రోడ్ల మీద కనిపించకుండా పోయాయి. చైనాలో సుదూర ప్రయాణాల కోసం హై-స్పీడ్ రైళ్లు లేదా అడ్జస్టబుల్ సీట్లు (reclining seats) ఉన్న లగ్జరీ బస్సులను ఉపయోగిస్తున్నారు. జర్మనీ వంటి దేశాల్లో కూడా స్లీపర్ బస్సులపై నిషేధం ఉంది. అక్కడ ప్రయాణికులు కచ్చితంగా సీట్ బెల్ట్ పెట్టుకుని కూర్చునే ప్రయాణించాలి. వియత్నాం కూడా ప్రమాదాల దృష్ట్యా కొన్ని నగరాల్లో వీటిని నియంత్రిస్తోంది.
చైనాలో పది రోజుల పర్యటన అనుభవాలను తిరుపతికి చెందిన సీనియర్ జర్నలిస్టు రాఘవ 'ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్' ప్రతినిధితో పంచుకున్నారు.
"2015లో పది మందితో కలిసి నేను చైనా వెళ్లాను. పది రోజులు అక్కడ గడిపాను. మూడు నగరాల్లో తిరిగాను. ఎక్కడ డీజిల్ బస్సులు కనిపించలేదు. ఓల్వో బస్సుల జాడే లేదు" అని సీనియర్ జర్నలిస్టు రాఘవ చెప్పారు. ఆ దేశంలో బుల్లెట్ రైళ్ల వినియోగం ఉంటుందనీ, భారత కరెన్సీలో రూ. 30 ( మూడు ఇవాన్లు) చెల్లించే టికెట్ కొంటే, రైళ్లలో జాగ్రత్తగా ప్రయాణించవచ్చు అని చెప్పారు. మార్కాపురం బస్సు దగ్ధం ఘటనతో ఏపీ ప్రభుత్వం కూడా ప్రమాదాలకు దారితీస్తున్న పరిణామాలు గుర్తించింది.
బస్సుల నిర్మాణ సంస్థలు తయారు చేయని (Converted) స్లీపర్ బస్సులను మొదటి దశలో రద్దు చేయాలని ఆలోచిస్తున్నారు. అంటే ప్రస్తుతం క్యాబిన్, టైర్లతో ఉన్న ఛాసిస్ కొనుగోలు చేసి, బస్సులు తమకు అనుకూలంగా బాడీ బిల్డింగ్ చేయిస్తున్నారు.
1)స్లీపర్ బస్సులను పూర్తిగా నిషేధించే అంశంపై కేంద్ర ప్రభుత్వానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది
2) కొత్త నిబంధనలు: 300 కిలోమీటర్లకు మించి ప్రయాణించే బస్సుల్లో తప్పనిసరిగా ఇద్దరు డ్రైవర్లు ఉండాలి.
3) బస్సులు గమ్యస్థానానికి నిర్ణీత సమయానికి ముందుగా చేరితే (అతివేగం వల్ల) జరిమానా విధిస్తారు.
4) స్లీపర్ కోచ్‌లపై కేంద్ర ప్రభుత్వానికి కూడా నివేదిక ఇచ్చి, దేశవ్యాప్తంగా వీటిపై నియంత్రణ కోరనున్నారు.
5) దేశంలో ప్రయివేటు ఏసీ ఓల్వో స్లీపర్ బస్సులకు అనుమతి ఇవ్వడంపై తీవ్ర చర్చకు దారి తీశాయి.

బస్సు తయారీ ఎలా..

ప్రయివేటు వ్యక్తులు బస్సులను రెండు పద్ధతుల్లో కొనుగోలు చేసే విధానం ఉంది. అందులో ప్రధానంగా ఓల్వో బస్సు తయారీ ప్రక్రియ (Chassis to Body Building), నేరుగా ఓల్వో కంపెనీ నుంచే బాడీతో సహా పూర్తిగా తయారు చేసిన బస్సు (Fully Built Unit ఖరీదుతో కూడినా, నాణ్యత ఉంటుందని చెబుతున్నారు.
"ఇంజిన్, టైర్లు, ఛాసిస్ కొనుగోలుకు 1.2 కోట్ల రూపాయల నుంచి 1.5 కోట్ల రూపాయలు ఉంటుంది. లగ్జరీ బాడీ కట్టించడం, సీటింగ్ లేదా స్లీపర్ సీట్లు అమర్చడానికి అదనంగా 35 నుంచి 40 లక్షల వరకు ఖర్చు అవుతుంది" అని ఓ ప్రయివేటు ట్రావెల్స్ నిర్వాహకుడు చెప్పారు. బస్సును స్లీపర్ కోచ్ గా మార్చడానికి ప్రత్యేక బాడీ బిల్డర్ వర్కర్లు ఉన్నారు. అప్పర్, లోయర్ బెర్తులు, రీడింగ్ లైట్లు, చార్జింగ్ పాయింట్లు ఏసీ అడ్జస్ట్ మెంట్సు, టీవీ స్క్రీన్ ఏర్పాటు చేయడంలో విజయవాడలోని ఆటోనగర్, హైదరాబాద్, బెంగళూరు, జలంధర్, జైపూర్ నగరాల్లో ప్రత్యేక బాడీ బిల్డింగ్ యూనిట్లు ఉన్నట్లు మదనపల్లె ప్రాంతానికి చెందిన చలపతి చెప్పారు.
ఛాసిస్ ను బస్సుగా తయారు చేయడంపై హైదరాబాద్ జీడిమెట్ల పారిశ్రామికవాడలోని శ్రీసాయి అంబా కోచ్ బిల్డర్స్ ప్రతినిధి సమ్మయ్య ఏమన్నారంటే...
"ఛాసిస్, టైర్లు, ఇంజిన్ తో కూడిన ఛాసిస్ బస్సు బాడీ బిల్డింగ్ కు 36 లక్షల నుంచి 45 లక్షల వరకు ఖర్చు అవుతుంది. పాత బస్సు ను ఏసీగా మార్చడానికి కూడా దాదాపు అంతే ఖర్చు అవుతుంది" అని సమ్యయ్య చెప్పారు.
"జీడిమెట్ల పారిశ్రామికవాడలో 30 వరకు కంపెనీలు ఉన్నాయి. మేమంతా టీఎస్ఆర్టీసీ ( TSRTC), , ఏపీఎస్ఆర్టీసీ (APSRTC) నుంచి సూపర్ లగ్జరీ బస్సులకు బాడీ బిల్డింగ్ చేస్తాం. ప్రయివేటు బస్సుల కాంట్రాక్టు పది శాతం మాత్రమే ఉంటాయి. వాటికి కూడా ఆర్టీసీ ప్రమాణాలకు అనుగుణంగానే బస్సును సిద్ధం చేస్తాం " అని సమ్మయ్య వివరించారు. బెంజ్, ఎంజీ వంటి పేరెక్కినగన్న ఓల్వో బస్సులు 1.50 కోట్ల నుంచి రెండు కోట్ల రూపాయల వరకు ఉంటుంది. ఛాసిస్ కొనుగోలు చేయడం వల్ల ఆ ఖర్చు తగ్గుతుందని సమ్మయ్య వివరించారు.

ఏసీగా మారే... పాత బస్సు

రాష్ట్రంలో పాత బస్సులు కొనుగోలు చేసి, ఏసీ కోచ్ గా మార్చడానికి కూడా ప్రత్యేకంగా ఖర్చు చేస్తున్నారు. మార్కాపురం వద్ద దగ్ధమైన బస్సుపై అదే ఆరోపణలు వచ్చాయి. పాత బస్సు కొనుగోలు చేసే యజమానులు లోపల ఇంటీరియర్ డెకరేషన్ తో పాటు ఏసీ సదుపాయం, సీటింగ్ మార్చడం ద్వారా ఆకర్షణీయంగా తయారు చేస్తున్నారు. దీనికోసం 20 లక్షల నుంచి 30 లక్షలు ఖర్చు చేయడానికి సాహసిస్తున్నారని తిరుపతికి చెందిన ట్రావెల్స్ నిర్వాహకుడు మల్లికార్జునరావు వివరించారు.

ఆర్టీసీకి దీటుగా..

రాష్ట్రంలో ప్రయివేటు ట్రావెల్స్ బస్సులు ఏపీఎస్ఆర్టీసీని మించిపోయినట్లు రికార్డులు చెబుతున్నాయి. నాలుగు జోర్ల పరిధిలోని 130 డిపోల్లో బస్సుల వివరాలు ఇవి. APSRTCలో ఏసీ స్లీపర్ 'వెన్నెల' ( AC Sleeper 'Vennela') 29, అమరావతి (Volvo AC Seater): 53, డాల్ఫిన్ క్రూయిజ్ (Multi-axle): 14 బస్సులు, వెన్నెల (AC Sleeper): 29 బస్సులు. డాల్ఫిన్ క్రూయిజ్ మల్టీయాగ్జిల్ ( 2ప్లస్ 2 సీటర్) బస్సులు 14, నైట్ రైడర్ ఏసీ సీటర్, స్లీపర్ 12, ఇంద్ర బస్సులు 178, మెట్రో లగ్జరీ బస్సులు 21, గ్రీన్ సప్తరిగి (ఎలక్ట్రిక్ బస్సులు 100, స్టార్ లైనర్ నాన్ ఏసీ స్లీపర్ 58, సూపర్ లగ్జరీ బస్సులు 1,267, అల్ట్రా డీలక్స్ సర్వీసులు 548, ఎక్స్ ప్రెస్ బస్సులు 1,743 ఉన్నట్లు ఆర్టీసీ అధికారిక లెక్కలు స్పష్టం చేస్తున్నాయి.

పోలిక ఎక్కడ?

రాష్ట్రంలో ప్రయివేటు బస్సులు సుమారు 80 వేల వరకు ఉన్నట్లు ఓ అంచనా. వాటిలో లగ్జీరీ, ఓల్వో బస్సుల్లో ఓల్వో, స్కానియా, మెర్సిడజ్ బెంచ్ వంటి లగ్జరీ బస్సులు దాదాపు 1,600 నుంచి 2,600 వరకు ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. ఈశాన్య రాష్ట్రాలు, కేంద్ర పాలిత రాష్ట్రాల్లో కాంట్రాక్టు, లేదా టూరిస్టు, స్టేజి కేరేజ్ విభాగాల కింది ఈ బస్సులు రిజిస్ట్రేన్ చేయిస్తున్నారు. దీంతో ఏపీలో వాటి రిజిస్ట్రేషన్ లేదా పర్మిట్ పై రాష్ట్ర ప్రభుత్వం చర్యలకు ఆస్కారం లేకుండా పోయింది.
"నిబంధనలు, భద్రతా ప్రమాణాలు, వేగనింయత్రణకు చర్యలు తీసుకుంటున్నాం" అని తిరుపతి డీటీఓ మురళీమోహన్ చెప్పారు.
ఏపీఎస్ఆర్టీసీలో అమరావతి, డాల్ఫిన్ క్రూయిజ్ పేర్లతో దాదాపు వంద వరకు ఓల్వో, లగ్జరీ బస్సులు ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి.
తిరుపతి- హైదరాబాద్ మధ్య ప్రయివేటు బస్సులు 42 ఏసీ బస్సులు, తిరుపతి-బెంగళూరు మధ్య 104 ఏసీ, 19 నాన్ ఏసీ బస్సులు, విజయవాడకు 76 ప్రయివేటు బస్సులు నడుస్తున్నాయి. తిరుపతి ఆర్టీసీ రీజనల్ మేనేజర్ జగదీష్ కథనం ప్రకారం..
తిరుపతి నుంచి రాష్ట్రంలోని జిల్లాలు, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల మధ్య ఏసీ స్లీపర్ బస్సులు 201, స్లీపర్ బస్సులు మాత్రమే 20, సీటర్ బస్సులు 30 మొత్తం 326 బస్సులు నడుస్తున్నాయి. ఇక విజయవాడ నుంచి హైదరాబాద్ మధ్య రోజూ 750 బస్సుల్లో ఓల్వో బస్సులు దాదాపు 120 వరకు ఉన్నట్లు అధికారిక సమాచారం.
రాష్ట్రంలో ప్రయివేటు ఓల్వో బస్సుల వరుస ప్రమాదాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం చైనా తరహాలో దశలవారీగా రద్దు చేసేందుకు చేస్తున్న ఆలోచనలకు కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుంది.



Read More
Next Story