రౌడీషీటర్ శ్రీకాంత్ పెరోల్ కు మీరు లేఖలు ఇవ్వలేదా?
x

రౌడీషీటర్ శ్రీకాంత్ పెరోల్ కు మీరు లేఖలు ఇవ్వలేదా?

వైసీపీ నేతల పేర్లు వెల్లడించిన నెల్లూరు రూరల్ టీడీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి.


నెల్లూరు జైలులో జీవితఖైదు అనుభవిస్తున్న రౌడీషీటర్ శ్రీకాంత్ పెరోల్ కోసం జారీ చేసిన సిఫారసు లేఖల ప్రకంటనలు మరో మలుపు తిరిగాయి. వైసీపీ అధికారంలో ఉండగా ఆ పార్టీ ఎమ్మెల్యేలు సిఫారసు లేఖలు ఇచ్చిన విషయం తెరమీదకు వచ్చింది. తమ ప్రాంతానికి సంబంధం లేని రౌడీషీటర్ శ్రీకాంత్ కోసం సిఫారసలు లేఖలు ఇచ్చిన వ్యవహారం నెల్లూరు జిల్లా రాజకీయాల్లో మంటలు పుట్టించాయి. టీడీపీ, వైసీపీ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.

రౌడీషీటర్ శ్రీకాంత్ కు పెరోల్ కోసం సిఫారసు లేఖలు ఇచ్చింది వాస్తవమే అని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధరరెడ్డి అంగీకరించారు. ఆ లేఖలను హోంశాఖ తిరస్కరించిందనీ, సరిగ్గా 14 రోజుల తరువాత రౌడీషీటర్ కు పెరోల్ మంజూరు చేయించింది ఎవరు? అని ఆయన ప్రశ్నించారు. అధికారంలో ఉండగా వైసీపీ ఎమ్మెల్యేలు కూడా శ్రీకాంత్ కు ఏడాదిన్నర కిందట లేఖలు ఇచ్చిన విషయాన్నితాజాగా వెల్లడించారు.
అనారోగ్యం కారణం చూపి ఆస్పత్రికి తరలించుకున్న రౌడీషీటర్ శ్రీకాంత్ తన ప్రియురాలు అరుణతో సరసాలు సాగిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడం వల్ల ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. డాన్ గా మారిన అరుణ సచివాలయం స్థాయిలో చక్రంతిప్పి శ్రీకాంత్ కు పెరోల్ మంజూరు చేయించడంలో కీలకంగా వ్యవహరించిందనే వ్యవహారం తీవ్రస్థాయిలో దుమారం రేపింది. దీంతో అరుణను అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్ కు తరలించారు. నెల్లూరు జిల్లా జైలు నుంచి ఆమె ప్రియుడు శ్రీకాంత్ ను విశాఖ జైలుకు తీసుకుని వెళ్లారు. ఇదిలావుంటే..
లేఖ ఇచ్చింది వాస్తవమే..
రౌడీషీటర్ శ్రీకాంత్ కుటుంబం మొదట నెల్లూరు రూరల్ పరిధిలోనే ఉండేదని టీడీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధరరెడ్డి శనివారం ఉదయం తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చెప్పారు.
"శ్రీకాంత్ తండ్రి, సోదరుడు నా వద్దకు వచ్చి సమస్య చెప్పారు. అందువల్ల పెరోల్ కోసం సిఫారసు లేఖ ఇచ్చాను" అని ఎమ్మెల్యే కోటంరెడ్డి స్పష్టం చేశారు. ప్రస్తుతం శ్రీకాంత్ కుటుంబం గూడూరు ప్రాంతంలో నివాసం ఉంటున్న కారణంగా అక్కడి ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ కూడా సిఫారసు లేఖ ఇచ్చిన మాట వాస్తవమే" అని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధరరెడ్డి మీడియాకు చెప్పారు.
2025 జూలై 16వ తేదీ
"భద్రతా కారణాలు, నిబంధనల మేరకు శ్రీకాంత్ కు పెరోల్ ఇవ్వడం సాధ్యం కాదు" అని హోంశాఖ నుంచి తమ సిఫారసును తిరస్కరిస్తూ సమాధానం వచ్చిందని ఎమ్మెల్యే కోటంరెడ్డి స్పష్టం చేశారు. దీనిపై వైసీపీ నేతలు, సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా దుష్ర్పచారం చేయడం దారుణమని ఆయన అభ్యంతరం చెప్పారు. ఇదిలావుంటే..
వైసీపీ చేసింది ఏమిటి?
రౌడీషీటర్ శ్రీకాంత్ కు టీడీపీ ఎమ్మెల్యేలుగా పెరోల్ కోసం సిఫారసు లేఖలు ఇవ్వడాన్ని వైసీపీ ప్రచారాస్త్రంగా మార్చుకుందని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి వ్యాఖ్యానించారు. ప్రజాప్రతినిధుల వద్దకు సమస్యలపై వచ్చే ప్రజలకు లేఖలు ఇవ్వడం పరిపాటి అని రౌడీషీటర్ పెరోల్ కోసం లేఖ ఇవ్వడాన్ని ఆయన సమర్థించుకున్నారు.
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా తమ నియోజకవర్గాలకు సంబంధం లేని వ్యక్తి, ఇదే రౌడీషీటర్ శ్రీకాంత్ కోసం ఇద్దరు ఎమ్మెల్యేలు లేఖలు ఇచ్చారని కోటంరెడ్డి శ్రీధరరెడ్డి వెల్లడించారు
"వైసీపీ ప్రభుత్వంలో చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి, సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య లేఖలు ఎలా ఇచ్చారు" అని టీడీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి నిలదీశారు. అప్పుడు కూడా శ్రీకాంత్ కు పెరోల్ మంజూరు చేయించిన విషయాన్ని చెబుతూనే ఎమ్మెల్యేల వద్దకు సమస్యలపై వచ్చే వారికి లేఖలు ఇవ్వడాన్ని తాను తప్పుపట్టడం లేదని టీడీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి సన్నాయి నొక్కులు నొక్కారు. అప్పట్లో నెల రోజుల పాటు పెరోల్ పై బయట ఉన్న శ్రీకాంత్ మరో పది రోజులు అదనంగా పొడిగించుకున్నాడని చెప్పారు.
ఇక ఇవ్వను
"ఇకపై నేను ఎవరికీ పెరోల్ కోసం సిఫారసు లేఖలు ఇవ్వను" అని ఎమ్మెల్యే కోటంరెడ్డి ప్రకటించారు. కాగా, ఎమ్మెల్యేలు ఇచ్చిన లేఖలను హోంశాఖ తిరస్కరించింది. సరిగా 14 రోజుల తరువాత రౌడీషీటర్ శ్రీకాంత్ కు ఎవరి సిఫారసును పరిగణలోకి తీసుకుని బయటికి పంపించారు? అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఈ ఘటనపై రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే.
Read More
Next Story