సమీక్షల వెనుక ..  జగన్ పక్కా వ్యూహం ఏమిటి?
x

సమీక్షల వెనుక .. జగన్ పక్కా వ్యూహం ఏమిటి?

పార్టీ శ్రేణులకు భరోసా ఇవ్వడానికి మాజీ సీఎం. వైఎస్. జగన్ రంగంలోకి దిగారు. కడప జిల్లాలో ఆయన మూడు రోజులు మకాం వేయడం వెనుక వ్యూహం ఏమిటి? త్వరలో చేపట్టనున్న ఓదార్పు భరోసా యాత్ర వెనుక ఆంతర్యం ఏమిటి?


ఎన్నికల్లో ఓటమి తరువాత రాయలసీమ ప్రాంత నేతలతో ఇడుపులపాయ వేదికగా సమీక్ష నిర్వహించనున్నారు. దీనివెనక అసలు కారణం మరొకటి ఉందని భావిస్తున్నారు. టిడిపి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దాడులకు గురైన వారికి భరోసా ఇచ్చేందుకు " నేను ఉన్నాను. అధైర్య పడకండి" అని భరోసా ఇవ్వడంతో పాటు, రాష్ట్రంలో మళ్లీ "ఓదార్పు భరోసా యాత్ర" ద్వారా ప్రజల్లో ఉండేందుకు కార్యాచరణ సిద్ధం చేయనున్నట్లు వైయస్ఆర్సీపీ వర్గాల ద్వారా తెలిసింది."అక్రమాస్తుల పాత కేసులు" వెంటాడుతున్న నేపథ్యంలో, జనంలోకి వెళ్లడానికి అత్యంత ఆసక్తి చూపిస్తున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. ఇందుకోసం, శనివారం ఆయన కడప విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు పార్టీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికాయి.



...డుమ్మా కొట్టేందుకే
వాస్తవానికి ఈనెల 19వ తేదీ పులివెందులకు వెళ్లడానికి కార్యక్రమం ఖరారైంది. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో అసెంబ్లీ సమావేశం ఉండడం, ప్రమాణ స్వీకార కార్యక్రమం నేపథ్యంలో పులివెందుల పర్యటన వాయిదా వేసుకున్నారు. దీంతో ఈనెల 20వ తేదీ తాడేపల్లిలో వైఎస్ఆర్సిపి విస్తృత సమావేశం నిర్వహించారు. ఇవన్నీ పక్కకు ఉంచితే, ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం తర్వాత, మొదటి రోజే ఆయన అసెంబ్లీ నుంచి సహచర పదిమంది ఎమ్మెల్యేలతో కలిసి వచ్చేశారు. మరుసటి రోజు అంటే శనివారం శాసనసభ స్పీకర్ గా చింతకాయల అయ్యన్నపాత్రుడుని కూటమి ప్రభుత్వం శాసనసభ స్పీకర్ గా ఏకగ్రీవంగా ఎంపిక చేసింది. అసెంబ్లీ సంప్రదాయం ప్రకారం ఆయనను గౌరవంగా స్పీకర్ కుర్చీ వద్దకు తీసుకువెళ్లడం ఆనవాయితీ. ఈ కార్యక్రమానికి డుమ్మా కొట్టిన, వైఎస్. జగన్ అసెంబ్లీకి వెళ్లకుండా పులివెందుల వ్యక్తిగత పర్యటన పెట్టుకున్నారని టిడిపి వర్గాలు కూడా ఆరోపించాయి.
దీనిపై.. వైయస్ఆర్సీపీ నుంచి బయటికి వచ్చి, టిడిపి ఎమ్మెల్యేగా గెలవడమే కాకుండా, మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కొలుసు పార్థసారథి స్పందించారు. " మాజీ సీఎం వైఎస్ జగన్కు ప్రజాస్వామ్యంపై నమ్మకం లేదు. తొలిరోజు అసెంబ్లీలో పట్టుమని గంట కూడా లేరు" అని మంత్రి పార్థసారథి వ్యాఖ్యానించారు.
పులివెందులలో ఏం చేస్తారు
పులివెందుల నియోజకవర్గంలో వైఎస్. జగన్ మూడు రోజులపాటు ఉంటారు. ప్రధానంగా తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల నియోజకవర్గ నాయకులతో కూడా ఆయన సమావేశం కానున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. 1978 నుంచి దివంగత సీఎం వైయస్సార్ రాజకీయ ప్రస్థానానికి శ్రీకారం చుట్టారు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా, నాలుగు సార్లు కడప ఎంపీగా వైయస్ రాజశేఖర్ రెడ్డి విజయం సాధించారు. ఆయన స్థానంలో పులివెందుల నుంచి సొంత చిన్నాన్న వైయస్ పురుషోత్తం రెడ్డి, సోదరుడు వైయస్ వివేకానంద రెడ్డి, సతీమణి వైయస్ విజయమ్మ ఎమ్మెల్యేలుగా ప్రాతినిధ్యం వహించారు. పులివెందుల నుంచి వైఎస్ జగన్ 2014, 2019, 2024 ఎన్నికల్లో వరుసగా విజయం సాధించారు. మొదటిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసిన 2014 ఎన్నికల్లో వైఎస్. జగన్ 75, 243 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు. 2019 ఎన్నికల్లో 90,110 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు. 2024 ఎన్నికల్లో 61,687 ఓట్లతో విజయం సాధించగలిగారు. ఈ పరిణామాల నేపథ్యంలో..
సీమ నేతలతో ప్రత్యేక సమీక్ష
రాయలసీమ ప్రాంత నాయకులతో ఈ సమావేశంలో ప్రత్యేకంగా వైఎస్. జగన్ సమీక్షిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అందుకు ప్రధానంగా, ఆ పార్టీ అంచనాలను తలకిందులు చేస్తూ, భారీగా గండి పడింది. మెజార్టీ స్థానాల్లో టిడిపి కూటమి అభ్యర్థుల విజయం సాధించడం ద్వారా రాయలసీమ ప్రధానంగా, కడప జిల్లాలో వైయస్సార్ కుటుంబ గుత్తాధిపత్యానికి సవాల్ విసిరినట్లు భావిస్తున్నారు.
రాయలసీమ జిల్లాలోని నాలుగు జిల్లాల్లో 52 నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో కడప జిల్లా పులివెందుల నుంచి వైయస్ జగన్, బద్వేలు రిజర్వుడ్ స్థానం నుంచి డాక్టర్ సుధ, రాజంపేట నుంచి ఆకేపాటి అమర్నాథరెడ్డి మాత్రమే విజయం సాధించారు. మిగతా 7 సెగ్మెంట్లలో జమ్మలమడుగు నుంచి బిజెపి అభ్యర్థి ఆదినారాయణ రెడ్డి, రైల్వే కోడూరు ఎస్సీ రిజర్వ్ స్థానం జనసేన అభ్యర్థి అరవ శ్రీధర్ తోపాటు మిగతా ఐదు నియోజకవర్గాల్లో టిడిపి అభ్యర్థులే విజయం సాధించి, వైయస్సార్ కుటుంబం గుత్తాధిపత్యానికి సవాల్ విసిరారు.
కర్నూలు జిల్లా ఆలూరు నుంచి విరుపాక్షి, మంత్రాలయం నుంచి వై బాలనాగిరెడ్డి మాత్రమే విజయం సాధించారు. మిగతా 12 స్థానాల్లో టిడిపి అభ్యర్థుల విజయం సాధించారు.
చిత్తూరు జిల్లాలో పుంగనూరు నుంచి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తంబళ్లపల్లి నుంచి ఆయన సోదరుడు ద్వారకానాథరెడ్డి మాత్రమే విజయం సాధించారు. మిగతా 12 స్థానాల్లో తిరుపతి నుంచి జనసేన అభ్యర్థి ఆరాణి శ్రీనివాసులు, కుప్పం నుంచి సీఎం ఎన్ చంద్రబాబునాయుడు తో పాటు పదిమంది టిడిపి అభ్యర్థులే విజయం సాధించారు.
అనంతపురం జిల్లాలో 14 నియోజకవర్గాలు, నెల్లూరు జిల్లాలోని 10 అసెంబ్లీ స్థానాలు టిడిపి అభ్యర్థులు క్లీన్ స్వీప్ చేశారు. ఈ జిల్లాల్లో ఖాతా తెరవలేకపోయింది.
2019 ఎన్నికల్లో కుప్పం నుంచి ఎన్ చంద్రబాబు నాయుడు, అనంతపురం జిల్లా హిందూపురం నుంచి నందమూరి బాలకృష్ణ, ఉరవకొండ నుంచి పయ్యావుల కేశవ్ మాత్రమే విజయం సాధించారు. నెల్లూరులో 10, రాయలసీమలోని 49 స్థానాల్లో వైఎస్ఆర్సిపి స్వీప్ చేసింది. 2024 ఎన్నికల్లో దీనికి ప్రతికూల ఫలితాలను ఎదుర్కొన్న వైఎస్ఆర్సిపి మితిమీరిన విశ్వాసానికి గండి పడింది. ఫలితాలు వెలువడిన తర్వాత రోజుల వ్యవధిలోనే..
కర్నూలు జిల్లా పాణ్యం అసెంబ్లీ స్థానం నుంచి ఐదు సార్లు విజయం సాధించి ఈ ఎన్నికల్లో ఓటమి చెందిన కాటసాని రాంభూపాల్ రెడ్డి గళం విప్పారు.
"నాయకులను కాదు. సమస్యలు వివరిద్దామనుకునే ఎమ్మెల్యేలను కూడా మా అధినేత వైఎస్. జగన్ కలవలేదు. క్షేత్రస్థాయి పరిస్థితి అర్థం చేసుకోలేదు. కార్యకర్తల్లో ఉన్న అసంతృప్తిని పసిగట్టలేదు. ఇసుక విధానం, టైటిల్ డేట్ భారీగా దెబ్బతీసింది" ఇవన్నీ చెబుదామంటే కూడా సమయం ఇవ్వలేదని బాలనాగిరెడ్డి ఘాటుగా ఆరోపించారు. కాగా, ఓటమి నేపథ్యంలో..
భరోసా కోసం..
ఇడుపులపాయలో మూడు రోజులు నాయకులు, ఓటమి చెందిన మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేలతో భేటీలో "నేనున్నాను అధైర్య పడకండి" అనే భరోసాయి ఇవ్వడానికి ప్రయత్నించే అవకాశం ఉందని చెబుతున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, "కక్ష సాధింపుతో దాడులు పెరిగాయని" వైఎస్ఆర్సిపి నాయకులు ఆరోపిస్తున్నారు. ఫలితాలు వెలువడిన రోజుల వ్యవధిలోనే కార్యకర్తలపై భౌతిక దాడులు, తాజా మాజీ ప్రజా ప్రతినిధుల ఇళ్లపై దాడులకు తెగబడ్డారని ఆరోపిస్తున్నారు. వారందరికీ భరోసా ఇవ్వడానికి ఓదార్పు యాత్ర చేపట్టేందుకు కార్యాచరణ తయారు చేయనునట్లు సమాచారం. మొత్తం మీద జనంలో ఉండాలని వైఎస్. జగన్ ప్రగాఢంగా భావిస్తున్నారనే విషయాన్ని పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.
దాడుల వ్యహారాలను ప్రస్తావిస్తూ, ఎన్నికల ఫలితాలు వచ్చాకే.. "ముగ్గురు టీడీపీ కార్యకర్తలను చంపేశారు. దీనికి వైఎస్. జనగ్ ఏమి చెబుతారు"? అని టీడీపీ ఎమ్మెల్యే ఆర్. రఘురామకృష్ణమ రాజు ప్రశ్నించారు. ఓదార్పు యాత్ర ఎందుకు? ఎవరిని ఓదారుస్తారు? అని కూడా నిలదీశారు.
వైఎస్. జగన్ చేపట్టనున్న ఓదార్పు యాత్ర వెనక అసలు అంతర్లీనంగా మరో కారణం లేకపోలేదనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి.
వెంటాడుతున్న కేసులు..
మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై 2014 ముందు ఆదాయానికి మించిన ఆస్తులు, క్విడ్ ప్రోకో కింద నమోదైన అనేక కేసులు పెండింగ్లో ఉన్నాయి. అవన్నీ ప్రస్తుతం విచారణకు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. ఆ కేసుల్లో వైయస్ జగన్ కోర్టుకు హాజరు కావలసిన అనివార్యమైన పరిస్థితి ఏర్పడిందని భావిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఎప్పుడూ ఎలాంటి ఉపద్రవం ఉంచుకొస్తుందో తెలియదు. అందువల్ల దాడులకు గురైన కార్యకర్తల ఓదార్పు ద్వారా జనంలోనే ఉండడం శ్రేయస్కరమని వైయస్ జగన్ భావిస్తున్నట్లు పార్టీ వర్గాల సమాచారం.
మళ్లీ అధికారంలోకి వస్తాం..
తాజా సార్వత్రిక ఎన్నికల ఫలితాల అనంతరం.. ఇటీవల తాడేపల్లిలో ఆయన ఓటమి చెందిన ప్రజా ప్రతినిధులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడారు. "ఈ ఫలితాలతో ఢీలా పడవద్దు. మాది ఇంకా చిన్న వయసే. 2029 ఎలకల్లో మళ్లీ అధికారం చేపడతాం" అని ధైర్యం చెప్పడం గమనార్హం. "మన పార్టీని నమ్ముకొని కోట్లాది కుటుంబాలు, లక్షలాది కార్యకర్తలు, వేలాదిమంది నాయకులు ఉన్నారు. మనకు తగ్గింది 10 శాతం ఓట్లు మాత్రమే. వచ్చే ఎన్నికల్లో మళ్లీ అధికారంలోకి వస్తాం" అని ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి మితిమీరిన విశ్వాసంతో ఉన్నారు. "వాస్తవ పరిస్థితులు అర్థం చేసుకోలేదు. ఇంకా పాత దూరంలోనే దూకుడుతో వ్యవహరిస్తున్నారు" అనే మాటలు వైఎస్ఆర్సిపి నేతల నుంచే వినిపిస్తున్నాయి.
ఈ పరిస్థితుల్లో వైయస్ఆర్సీపీ ఎంపీగా గెలిచి తర్వాత తిరుగుబాటు చేసి, ప్రస్తుతం ఉండి నియోజకవర్గంలో నుంచి టిడిపి అభ్యర్థిగా గెలిచిన రఘురామ ఆర్. రఘురామ కృష్ణంరాజు స్పందించారు.
"రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడమే కాదు. ప్రతిపక్ష నేతలను కూడా వేధించారు. అర్థం చేసుకున్న ప్రజలు ఆయనకు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు" అని వ్యాఖ్యానించారు. "ఐదు సంవత్సరాల తర్వాత మళ్లీ అధికారంలోకి వస్తాం. అని చెబుతున్న మాటల ద్వారా వైయస్ జగన్ ఎక్కువగా ఊహించుకుంటున్నారు" ఇది నిజంగా మితిమీరిన విశ్వాసమే అనే అభిప్రాయాన్ని ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు నిన్న విజయవాడలో అభిప్రాయపడ్డారు.
రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో మాజీ సీఎం వైఎస్. జగన్ గతానికి ఏమాత్రం తేడా లేకుండా, స్పీడ్ మీదే ఉన్నారనే విషయం స్పష్టంగా కనిపిస్తోంది. మూడు రోజుల సమీక్ష అనంతరం ఏమి నిర్ణయాలు తీసుకోనున్నారనేది వేచిచూడాల్సిందే.
Read More
Next Story