బోర్డు తిప్పేశారు.. ఎవరిదారి వారిదే..
స్థానిక సంస్థల వైఎస్ఆర్ సీపీ ప్రజాప్రతినిధులు ఎవరిదారి వారు చూసుకుంటున్నారు. కుప్పంలో ఆ పార్టీ శిబిరం ఖాళీ అవుతోంది. కార్యాలయ బోర్డు కూడా తిప్పేశారు.
రాష్ట్రంలో అధికారం కోల్పోయిన తరువాత వైఎస్ఆర్ సీపీ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. నియోజకవర్గాల ఇన్చార్జులు అడ్రస్ లేరు. నాయకులు పత్తా లేరు. మిగతా ప్రాంతాల్లో పరిస్థితి పక్కకు ఉంచితే, "వై నాట్ కుప్పం" అని నినదించిన ఆ పార్టీ నేతలు కార్యాలయ బోర్డు తిప్పేశారు. ఆ భవనంలో మళ్లీ హోటల్ ఏర్పాటుకు వీలుగా ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఈ పరిణామంతో వైఎస్ఆర్ సీపీలో కాలరెగరేసిన అడ్రస్ లేరు.
కుప్పం ఇన్చార్జి, చిత్తూరు పార్లమెంట్ అధ్యక్షుడు, ఎంఎల్సీ భరత్ ఎన్నికల తరువాత కుప్పం వీడారు. ఆయన పార్టీని పట్టించుకునే స్ధతిలో లేరు. అధికారంలో ఉన్నప్పుడు జరిగిన ఘటనలకు ఆయనే బాధ్యుడని వైఎస్ఆర్ సీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. ఆయన ఫోన్ కాల్ కు కూడా అందుబాటులో లేకుండా పోయారని వారి వెన్నంటి నడిచిన క్యాడర్ అంటోంది. కుప్పం మున్సిపల్ చైర్మన్ డాక్టర్, సుధాకర్ తో సహా కౌన్సిలర్లు, ఇంకొందరు గత్యంతరం లేని స్థితిలో టీడీపీలో చేరడానికి సీఎం ఎన్. చంద్రబాబునాయుడు వద్దకు వెళ్లడానికి విఫలయత్నం చేశారు. అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ చీఫ్ ఎన్. చంద్రబాబు పర్యటనలో రాళ్లు వేయించిన ఆయనను చేర్చుకోవద్దనే డిమాండ్ ఎక్కువగా ఉంది. కాగా..
కుప్పం మున్సిపాలిటీలోని ఐదుగురు కౌన్సిలర్లు, 15 మంది ఎంపీటీసీ సభ్యులు బుధవారం సీఎం ఎన్. చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. కుప్పం బాధ్యతలు పన్యవేక్షిస్తున్న ఎంఎల్సీ కంచర్ల శ్రీకాంత్ ఈ వ్యవహారం సాగించారు. "అభివృద్ధి కార్యక్రమాలు వైఎస్ఆర్ సీపీ నేతలను ఆకర్షిస్తున్నాయి" అని ఆయన వ్యాఖ్యానించారు.
ఈ పరిస్థితికి కారణం ఏమిటి?
1989: మొదటిసారి సీఎం చంద్రబాబు నాయుడు కుప్పం నుంచి పోటీ చేసి 6,918 ఓట్ల మెజార్టీ సాధించడం ద్వారా తన ఇన్నింగ్ ప్రారంభించారు. అప్పటినుంచి వరుసగా 202 4ఆయన తన ప్రస్థానాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు.
2004: ఎన్నికలకు ముందు నుంచే మాజీ మంత్రి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుప్పంలో పాగా వేయించాలని ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ ఎన్నికలకు ముందు దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నుంచి ఇచ్చాపురం వరకు పాదయాత్ర సాగిస్తున్న సందర్భంలో.. చిత్తూరు డీసీసీ అధ్యక్షుడిగా ఉన్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుప్పం నుంచి సత్యవేడు వరకు పాదయాత్రతో తన ఆధిపత్యం నిరూపించుకోవడానికి ప్రయత్నం చేశారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. దివంగత సీఎం వైఎస్ఆర్ తో ఉన్న రాజకీయ అంతర్గత విభేదాల వల్ల ఆయన పాచిక పారలేదు. అందుకు ప్రధానంగా జీల్లాలో సీఎం వైఎస్సార్ కోటరీలోనీ సీనియర్ మాజీ మంత్రులు గల్లా అరుణకుమారి, నగరి నుంచి ప్రాతినిధ్యం వహించిన రెడ్డివారి చెంగారెడ్డి తో పాటు, అప్పటి వాల్మీకిపురం తర్వాత పీలేరు ఎమ్మెల్యేగా గెలిచిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి ప్రాధాన్యత ఎక్కువ ఉండేది.
2009: ఎన్నికల్లో మళ్లీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, పుంగనూరు నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కి తగిన ప్రాధాన్యత లేదు. ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సీఎం వైఎస్ఆర్ కు దగ్గర అయ్యారు. మంత్రి పదవి కూడా దక్కింది. అనూహ్య పరిణామాల నేపథ్యంలో సీఎం వైఎస్ఆర్ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన తర్వాత పరిస్థితులు మారిపోయాయి. ఆ సమయంలో కొంతకాలం తన కుమారుడు ప్రస్తుత రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని కుప్పం ఇన్చార్జిగా నియమించి రాజకీయ వ్యవహారాలు సాగించారు.
2014: ఎన్నికల నాటికి పుంగనూరులో వైఎస్ఆర్ సీపీ నుంచి పోటీ చేసిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అప్పటి విపక్ష నేత వైఎస్. జగన్ సారధ్యంలో కుప్పంపై ఫోకస్ పెట్టారు. కుప్పంలో తన కుమారుడదు మిథున్ రెడ్డి తప్పించి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చంద్రమౌళిని రంగంలోకి దించారు. తన ప్రధాన అనుచరుల్లో ఒకరైన మాజీ ఎంపీ ఎన్. రెడ్డెప్పను కుప్పంలో మోహరించారు. అప్పుడు కూడా ఆ ప్రయత్నాలు ఫలించలేదు.
2019: ఎన్నికల్లో పూర్తిస్థాయిలో దృష్టి సారించినప్పటికీ సీఎం ఎన్. చంద్రబాబు హవాలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చంద్రమౌళి తట్టుకోలేకపోయారు. కొంతకాలానికి అనారోగ్యంతో ఆయన మరణించడంతో ఆయన కుమారుడు భరత్ ను తెరపైకి తీసుకువచ్చారు. ప్రొటోకాల్ కోసం ఆయనకు ఎమ్మెల్సీ పదవి కూడా కట్టబెట్టారు. తర్వాత వైఎస్ఆర్ సీపీ చిత్తూరు జిల్లా పార్లమెంట్ అధ్యక్షుడిగా కూడా బాధ్యతలు అప్పగించారు.
కోరి కష్టాలు తెచ్చుకున్నారా?
కుప్పం నియోజకవర్గంలో దృష్టి నిలిపిన వైఎస్ఆర్ సీపీ కోరి కష్టాలు తెచ్చుకున్నట్టు భావిస్తున్నారు. ఒకపక్క ఎమ్మెల్సీ భారత్ ను వైఎస్ఆర్ సీపీ అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేయించారు. మరో పక్క చిత్తూరు నుంచి ఎంపీగా గెలిచిన రెడ్డెప్ప తో కలిసి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుప్పంపై దృష్టి నిలిపారు. కుప్పంలోకి అప్పటి విపక్ష నేత, టీడీపీ అధ్యక్షుడు ఎన్. చంద్రబాబు అడుగు పెట్టనివ్వకుండా అన్ని రకాల ప్రయత్నాలు చేశారు. టీడీపీ శ్రేణులపై లెక్కలేనన్ని కేసులు కూడా నమోదు చేయించారు. ఈ పరిస్థితుల్లో..
2024: ఎన్నికల్లో "వై నాట్ కుప్పం" అని ఎన్నికల్లో ఎన్నో ఎత్తులు వేశారు. చివరికి కుప్పం నుంచి ఏనిమిదోసారి ఎన్. చంద్రబాబు విజయం సాధించారు. ఆ తర్వాత పరిస్థితి పూర్తిగా తిరగబడింది. తాను గెలిచిన పుంగునూరు నియోజకవర్గంలోకి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అడుగుపెట్టలేని పరిస్థితి ఏర్పడింది. టీడీపీ కార్యకర్తలే తిరగబడ్డారు. దీంతో పెద్దిరెడ్డి పరిస్థితి దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. ఈ ప్రభావం ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని అన్ని అసెంబ్లీ స్థానాలలో ప్రతిబింబిస్తుంది. మాజీ ఎమ్మెల్యేలు బయటకు రావడం లేదు. ఈ నేపథ్యంలో..
ఆత్మ రక్షణలో కుప్పం నేతలు
రాజకీయ వాతావరణం ప్రతికూలంగా మారడంతో కుప్పం నుంచి వైఎస్ఆర్ సీపీ అభ్యర్థిగా రెండుసార్లు పోటీ చేసి ఓటమి చెందిన ఎమ్మెల్సీ భరత్ అడ్రస్ లేరు. గత నెలలో ఢిల్లీలో జరిగిన నిరసన అనంతరం ఆయన హైదరాబాదుకే పరిమితమయ్యారు. ఫోన్ కాల్ కూడా ఆయన టచ్ లో లేరని కుప్పం వైఎస్ఆర్ సీపీ నాయకులు ఆగ్రహంగా ఉన్నారు.
బోర్డు తప్పేశారు..
కుప్పంలో గత కొన్నేళ్లుగా వైఎస్ఆర్ సీపీ కార్యాలయం అద్దె గదిలో నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్సీ భారత్ కూడా అద్దె ఇంట్లో ఉన్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత ఆ పార్టీకి కుప్పంలో దిక్కులేకుండా పోయింది. పార్టీ ఆఫీసు ఖాళీ చేయడంతో మళ్లీ అక్కడ హోటల్ ప్రారంభించడానికి బ్యానర్లు ఏర్పాటు. పార్టీ క్యాడర్ కూడా ఆత్మరక్షణలో పడింది. ఐదుగురు కుప్పం మున్సిపల్ కౌన్సిలర్లు ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ సారధ్యంలో టీడీపీలో చేరారు. ఇంకొందరు అదేబాటలో ఉన్నారు. దీంతో వైఎస్ఆర్ సీపీ కుప్పం నియోజకవర్గంలో శిబిరం ఖాళీ చేసినట్లు తెలుస్తోంది. అధికారంలో ఉండగా, వీరవిహారం చేసిన నేతల పరిస్థితి అగమ్య గోచరంగా మారినట్లు కనిపిస్తోంది.
దీనిపై స్పందించిన ఎమ్మెల్సీ శ్రీకాంత్ "కుప్పంలో వైఎస్ఆర్ సీపీ ఖాళీ అవుతుంది" అని వ్యాఖ్యానించారు. ఇంకొందరు పార్టీలో చేరనున్నట్లు ఆయన వెల్లడించారు. "గత ఐదేళ్లలో ప్రశాంతంగా ఉన్న కుప్పంలో రౌడీయిజాన్ని పెంచారు. అన్ని రకాలుగా నాశనం చేశారు" అని ఆయన వైఎస్ఆర్ సీపీ నేతలపై మండిపడ్డారు. రానున్న రోజుల్లో ఇంకెన్ని పరిణామాలు ఎదురవుతాయనేది వేచిచూడాలి.
Next Story