జగన్ సేన నిశ్శబ్ధం వెనుక..  వ్యూహం ఏమిటి?..
x

జగన్ సేన నిశ్శబ్ధం వెనుక.. వ్యూహం ఏమిటి?..

ఎన్నికల ఫలితాలు వెలువడిన నెల తరువాత కూడా వైఎస్ఆర్ సీపీ స్తబ్ధతగా ఉంది. కేసులకు భయపడుతున్నారా? రెడ్ బుక్ వెంటాడుతోందా? నాయకుల మౌనం వెనుక వ్యూహం ఉందా?


సంక్షేమ పథకాలతో గత వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం రూ. వేల కోట్లు జనానికి ఉచితంగా పందేరంగా పంచింది. ఇవే తమను గట్టెక్కిస్తాయని మితిమీరిన విశ్వాసంతో ఉన్న మాజీ సీఎం వైఎస్. జగన్ మోహన్ రెడ్డికి ఫలితాలు చూశాక మైండ్ బ్లాంక్ అయింది. ప్రజల నుమచొ ఊహించని తీర్పుతో మాజీ సీఎం వైఎస్. జగన్ తో పాటు ఆ పార్టీ మాజీ ప్రజాప్రతినిధులు నిర్వేదానికి గురయ్యారు. గత ఐదేళ్లలో ఎదురైన అనుభవాలతో రగిలిపోతున్న టీడీపీ శ్రేణులు అక్కడక్కడా జూలు విదిల్చాయి.

రాష్ట్రంలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత నెల తరువాత కూడా వైఎస్ఆర్ సీపీ నేతలు, శ్రేణులు నిశ్శబ్ధంగా ఉన్నారు. ఒకరిద్దరు వైఎస్ఆర్ సీపీ మాజీ ప్రజాప్రతినిధులు రాష్ట్రంలో జరుగుతున్న దాడుల నేపథ్యంలో తీవ్రంగా స్పందించినా, ఆ తరువాత వారి ఉనికి లేదు. మొత్తం మీద ప్రతిపక్ష పార్టీ నాయకులు వ్యూహాత్మకంగానే మౌనం పాటిస్తున్నారా? అనేది ఆసక్తికరంగా మారింది.
సార్వత్రిక ఎన్నికల ఫలితాల తరువాత వైఎస్ఆర్ సీపీ శ్రేణులు నిరాశకు గురయ్యాయి. 2019 ఎన్నికల్లో 151 అసెంబ్లీ, 23 ఎంపి స్ధానాల్లో ఢంకా మోగించిన ఆ పార్టీ అధికారంలో ఉండి కూడా 20204 ఎన్నికలకు వెళ్లిన వైఎస్ఆర్ సీపీ రాష్ట్రంలోని 175 అసెంబ్లీ స్ధానాలకు 11 చోట్ల మాత్రమే విజయం సాధించింది. సొంతగడ్డ కడప జిల్లాలో మాజీ సీఎం వైఎస్. జగన్ మోహన్ రెడ్డికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పది అసెంబ్లీ స్ధానాల్లో మూడు చోట్ల మాత్రమే విజయం సాధించారు.
రాయలసీమలో మితిమీరిన ఆశలు పెట్టుకున్న ఆయనకు ఊహించని పరిస్థితి ఎదురైంది. మొత్తం 52 అసెంబ్లీ స్ధానాల్లో వైఎస్ఆర్ సీపీ ఏడు స్థానాల్లో మత్రమే గెలిచింది. మిగతా సీట్లలో టీడీపీ కూటమి విజయఢంకా మోగించింది.
అనంతపురం జిల్లాలో గత ఎన్నికల్లో 14కు 12 స్ధానాలు సాధించిన వైఎస్ఆర్ సీపీ తాజా ఎన్నికల్లో ఖాతా తెరవలేదు. టీడీపీ క్లీన్ స్వీప్ చేసింది.
కర్నూలు జిల్లాలో 14 అసెంబ్లీ స్ధానాలు ఉండగా గత ఎన్నికలకు భిన్నంగా టీడీపీ కూటమి 12 సీట్లు దక్కించుకుంది. రెండు చోట్ల మాత్రమే వైఎస్ఆర్ సీపీ విజయం సాధించింది.
చిత్తూరు జిల్లాలో వైఎస్ఆర్ సీపీకి కింగ్ మేకర్ గా ఉన్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుప్పంను టార్గెట్ చేసి, వ్యూహం అమలు చేసినా, ఫలితాలతో కంగుతిన్నారు. జిల్లాలో పుంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తంబళ్లపల్లెలో ఆయన సోదరుడు ద్వారకానాథరెడ్డి మినహా మిగతా 11 స్థానాలు, రెండు ఎంపీ సీట్లు టీడీపీ దక్కించుకుంది. ఒక ఎమ్మెల్యే స్థానంలో జనసేన విజయం సాధించింది.
ఊహించని ఫలితాలతో అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి ప్రధాన నేతలు "ప్రతీకార దాడులు ఉండబోవు " అని విస్పష్టమైన ప్రకటన చేశారు. అయితే ఐదేళ్లుగా ఎదురుచూసిన రోజు రానే వచ్చిందనే ఊపుతో వేధింపులు, కేసులతో నలిగిపోయిన క్షేత్రస్థాయి నేతలు ఆగ్రహాన్ని వివిధ రకాలుగా వ్యక్తం చేశారు.
భవనాల ధ్వంసంతో ప్రారంభం
తాడేపల్లి మండలం సీతానగరం వద్ద నిర్మాణంలో ఉన్న వైఎస్ఆర్ సీపీ కార్యాలయ భవనానికి అనుమతి లేదనే కారణంతో నేలమట్టం చేశారు. దీంతో కూల్చివేతలకు శ్రీకారం చుట్టారు. 2019 ఎన్నికల్లో అధికారంలోకి రాగానే అప్పటి వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం ప్రజావేదికను కూల్చివేసిన సంగతి తెలిసిందే. ఇందుకు ప్రతికారంగానే నిర్మాణంలో ఉన్న వైఎస్ఆర్ సీపీ కార్యాలయాన్ని కూడా ధ్వంసం చేశారనే ప్రచారం సాగుతోంది. అంతకుముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వేధింపులు, కేసుల్లో తమను అక్రమంగా ఇరికించారనే ఆగ్రహంతో ఉన్న టీడీపీ శ్రేణులు ముందు ఫలితాలు వెలువడిన నాటి నుంచి అక్కడక్కడా దాడులకు పాల్పడడం ద్వారా ప్రతీకార చర్యలకు పాల్పడ్డారు.
అవి ప్రతీకార దాడులే

రాయచోటిలో కూడా కౌన్సిలర్ నివాసంపై దాడి జరిగింది. "ఇంట్లో ఎవరూ లేనప్పుడు వెళ్లి, కుటుంబీకులపై దాడులు చేయడం" దారుణమని మాజీ చీఫ్ విప్ గడికోట శ్రీకాంతరెడ్డి నిరసన వ్యక్తం చేశారు. తెనాలి, సత్తెనపల్లిలో కూడా ఇద్దరు నేతలపై హత్యాయత్నాలు జరిగాయని ప్రతిపక్ష పార్టీ నేతలు ఆరోపించారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పుంగనూరులో కూడా టీడీపీ నేతలు ర్యాలీ నిర్వహించారు. పెద్దిరెడ్డి గోబ్యాక్ అని నినదించడంతో పాటు ఆయన ప్రధాన మద్దతుదారుల్లో ఒకరైన మాజీ జెడ్పీటీసీ సభ్యుడు, న్యాయవాది వెంకటరెడ్డి యాదవ్ నివాసంపై కూడా రాళ్ల దాడి చేశారు. వీటన్నింటి నేపథ్యంలో రాష్ట్రపతికి ఫిర్యాదు చేశాయి. సుప్రీం కోర్టు వరకు వెళ్లడానికి యత్నించినా, హైకోర్టును ఆశ్రయించాలనే సూచనతో ఆ పార్టీ నేతలు వెనుదిరిగారు.
కంటికి కన్ను... పంటికి పన్ను తప్పదు..
అనంతపురం మాజీ ఎంపీ, మాజీ పోలీస్ అధికారి గోరంట్ల మాధవ్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. దీనిపై స్పందించిన ఆయన "నన్ను చంపుతామని కూడా బెదిరింపులు వస్తున్నాయి. ఊరు వదిలి వెళ్లాలని పోలీసులు ఉచిత సలహా కూడా ఇచ్చారని" అని ఆరోపించారు.
తాలిబాన్ల తరహాలో రెచ్చిపోతున్నారు. నాగరిక పద్దతుల్లో వ్యవహరిస్తాం. సహనం నశిస్తే.. "పంటికి పన్ను, కంటికి కన్నులా ప్రతీకారం తీర్చుకుంటాం" అని ఘాటు హెచ్చరిక చేశారు. ఈ సంఘటనలు, అధికారం కోల్పోయిన నేతల స్పందనలు మచ్చుకు ఇవి కొన్ని మాత్రమే.
నేతల మౌనం వెనుక
ఈ సంఘటనల తరువాత ఒకరిద్దరు నేతలు స్పందించినప్పటికీ మెజారిటీ నేతలు నోరుమెదపడం లేదు. అసలు జనజీవన స్రవంతిలో కనిపించకుండా తిరుగుతున్నారు. ఆ కోవలో గెలిచిన ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు.
2023 ఆగష్టు 4వ తేదీ అనంతపురం జిల్లా తరువాత అప్పటి విపక్ష నేత ఎన్. చంద్రబాబు నాయుడు బస్సు యాత్ర మదననల్లె సమీపంలోని అంగళ్లు వద్దకు రాగనే రాళ్లదాడితో కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. పుంగనూరులోకి చంద్రబాబును రానివ్వకుండా అడ్డుకోవాలని మాజీ మంత్రి పెద్దిరెడ్డి వర్గం మొత్తం రోడ్లపైకి చేరింది. "కార్యకర్తల జోలికి వస్తే ఊరుకునేది లేదని" చంద్రబాబు ఘాటు హెచ్చరికలు కూడా చేశారు.
ఈ సీన్ కట్ చేస్తే
ఇప్పుడు పెద్దిరెడ్డి పుంగనేరుకు వెళ్లలేని పరిస్థితి. తంబళ్లపల్లెలో ఆయన సోదరుడు ద్వారకనాథరెడ్డి పర్యటించలేని వాతావరణం. చివరాఖరికి వారు కుమారుడు రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డిని కూడా పోలీసులు కదలనివ్వడం లేదు.

ఇంతజరుగుతున్నా... వారి అనుచరులైన సీనియర్ నేతలు ఎవరూ బయటికి రావడం లేదు. అదే పరిస్థితి రాయలసీమ జిల్లాల్లో కూడా కొనసాగుతోంది. వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్. జగన్ కూడా మూడు రోజులు పులివెందుల ఆ తరువాత బెంగళూరు శ్వేతసౌధానికి పరిమితం అయ్యారు. రెండు రోజుల కిందటే ఆయన కూడా నెల్లూరు జైల్ లో రిమాండ్లో ఉన్న మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కోసం నెల తరువాత బయటికి వచ్చారు. ఇంకొన్ని రోజులు ఇదే తరహాలో శాంతియుతంగానే ఉండాలని అధినాయకత్వం భావిస్తోందని రాయలసీమకు చెందిన నేత ఒకరు వ్యాఖ్యానించారు. కారణం చెప్పడానికి నిరాకరించిన ఆయన అందులో ప్రత్యేకత ఉందని మాత్రం చెప్పారు.
సానుభూతి కోసమేనా..?
అధికారంలోకి వచ్చిన తరువాత వైఎస్ఆర్ సీపీ శ్రేణులపై అధికార టీడీపీ కూటమి నేతలు, ప్రజాప్రతినిధులు వ్యవహరిస్తున్న తీరుపై భరించి, వేచిచూసే ధోరణిలో వ్యవహరించాలని భావిస్తున్నట్లు కనిపిస్తోంది. ఆస్తుల ధ్వంసం, కేసుల నమోదు, పాత సంఘటనలపై కేసుల నమోదు ద్వారా వేధింపులకు పాల్పడుతోందనే విషయాలపై ప్రజల్లోకి తీసుకుని వెళ్లడం ద్వారా సానుభూతి పొందాలనే లక్ష్యంతో ఉన్నట్లు సమాచారం. వైఎస్ఆర్ సీపీ నేతలు పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు కూడా చేస్తున్నారు. కొత్త ప్రభుత్వం కొలువుదీరిన నెల రోజుల తరువాత కూడా ఐపీఎస్ అధికారులు, కొందరు క్షేత్రస్ధాయి అధికారులను మాత్రమే మార్చారు. ఎస్ఐ, సీఐ, డీఎస్పీలు, కానిస్టేబుళ్లు దాదాపు 80 శాతం మంది పాత వారే. గత ప్రభుత్వంలో అనుకూలంగా వ్యవహరించిన వారే ఉన్నారనేది నిష్ఠూరసత్యం. కానీ, వైఎస్ఆర్ సీపీ నేతలు, మాజీ ప్రజాప్రతినిధులు చాలా వరకు ఇళ్ల నుంచి కదలలేని స్థితిలో ఉంటే, చాలా మంది పొరుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, కర్ణాటక రాష్ట్రం బెంగళూరులో తలదాచుకుంటున్నారు. రాయలసీమలోని దాదాపు సీనియర్ నేతలందరికీ ఆ ప్రాంతాల్లో శాశ్వత నివాసాలు, వ్యాపారాలు ఉన్నాయనేది బహిరంగ రహస్యం. అందకు ప్రధానంగా...


తెరపైకి రెడ్ బుక్
గతంలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ సీపీ నేతలు ప్రధానంగా మాజీ సీఎం వైఎస్. జగన్ ను "రాజారెడ్డి రాజ్యాంగం" అమలు చేస్తున్నారు అని టీడీపీ పదేపదే ఎండగట్టింది. ప్రతిపక్షంలో ఉండగా, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రకటించిన "రెడ్ బుక్" ఇప్పుడు వైఎస్ఆర్ సీపీ నేతల నోళ్లలో నానుతోంది. యువగళం పేరిట నారా లోకేష్ కుప్పం నుంచి ప్రారంభించిన పాదయాత్రలో "మా పార్టీ శ్రేణులను వేధించిన అధికారుల పేర్లను గుర్తించుకుంటా" అని చెప్పడమే కాదు. "అధికారంలోకి రాగానే వారి సంగతి చూస్తా" అని కూడా అనంతపురం సభలో హెచ్చరించారు. "రెడ్ బుక్ లో మొదటి ఇద్దరి పేర్లు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అప్పటి చిత్తూరు ఎస్పీ రిషాంత్ రెడ్డి" అని కూడా ప్రకటించి, సంచలనం రేకెత్తించారు. రెడ్ బుక్పై సీఐడీ కేసు నమోదు చేసిన విషయం కూడా ప్రస్తావనార్హం.
జగన్ మాటలతో స్పష్టం..
అధికారం కోల్పోయిన తరువాత మొదటిసారి వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్. జగన్ రెడ్ బుక్ పై తాజాగా నెల్లూరులో మీడియా ముందు మొదటిసారి స్పందించారు. "గ్రామ స్థాయి నేత, ఎమ్మెల్యే, ఎంపీ, సీఎం వరకు రెడ్ బుక్ తయారు చేసుకున్నారు" దానిని అమలు చేస్తున్నారు. "మా పార్టీ నాయకులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారు. ఆస్తులు ధ్వంసం చేస్తున్నారు. పోలీసులు పట్టించుకోవడం లేదు" అని ఆరోపించారు. "మంత్రి నారా లోకేష్ స్వయంగా రాసుకున్న రెడ్ బుక్ ఆధారంగానే వేధింపులకు పాల్పడుతున్నారు" అని సానూభూతి పొందే వ్యాఖ్యలు చేశారు. "ఇకపై ఇదే పరిస్థితి కొనసాగితే ఊరుకునేది లేదు" అని కూడా హెచ్చరించారు.
ఆయన స్పందన ద్వారా వేచిచూసే ధోరిణితో వ్యవహరించి, మరిన్ని వేధింపులు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామనే మాట చెప్పకనే చెప్పారు. అనంతరం బాధితులను పరామర్శించేందుకు రంగంలోకి దిగడం ద్వారా ప్రజల నుంచి సానుభూతికి యత్నించేందుకు అవకాశం ఉందనే విషయం ఇక్కడ స్పష్టం అవుతోంది. ఈ పరిస్థితుల్లో ఎన్ని పరిణామాలు చోటుచేసుకుంటాయో వేచి చూడాలి.
Read More
Next Story